ఓ ప్రియా… నువ్వెవరివి …నువ్వెవరివి …
May 12, 2006
Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
————- శ్రీనివాస స్వీయ రచన ————-
ఓ ప్రియా…
వెన్నెల వాకిట నిలచిన నన్ను చీకటి మాటుకు చేర్చావు
నందనవనమున వేచిన నన్ను శిశిరపుజ్వాలై కమ్మావు
నీ తనువువిరికి హృదయతావి లేనప్పుడు నువ్వు అప్సరసవు కాదు
నీ కంటిచూపులో కరుణకాంతి లేనప్పుడు నువ్వు దేవతవూ కాదు
మరి నువ్వెవరివి ; నువ్వెవరివి…
నా జీవనరాగంలో దేవుడు పలికించిన అపశృతివి నీవు
నా ప్రణయయాగంలో ఎదను బలిగా కోరిన క్షుద్రిణివి నీవు
నా యవ్వనరాజ్యంలో నిశ్శబ్దమేలే మరుభూమివి నీవు
నా ఆశలసంద్రంలో కల్లోలిత సుడిగుండానివి నీవు
నా ఆశయమార్గంలో నీడనివ్వని టేకు చెట్టువు నీవు
నా ఊహలఊయలలో నిదురనివ్వని జోలపాటవు నీవు.
RTS Perm Link
2 Responses for "ఓ ప్రియా… నువ్వెవరివి …నువ్వెవరివి …"
వెన్నెల వాకిట నిల్చిన నిన్ను చీకటి మాటుకు చేర్చింది ‘ప్రియా’ ఎలా అయింది?!
“నా ఊహలఊయలలో నిదురనివ్వని జోలపాటవు నీవు” నిదుర నిచ్చేదే జోల పాట అనుకుంటాను. బహుశా మీరు మరో పదం వాడాలేమో ఇక్కడ.
మీ కవితా సారాంశము బాగుంది. ప్రియురాల్ని పొగిడే వారే కానీ, మీరు మాత్రం బాగా తెగిడారు.
– ప్రసాద్
ధన్యవాదములు ప్రసాద్ గారూ.
ఒకప్పుడు ప్రేమలో మాధుర్యాన్ని గ్రోలిన ప్రియుడు, తన ప్రేయసి నిర్దయగా వదిలి వెళ్ళిపోతే ఆ చేదుని రుచిచూసిన వాడి మనసు ఇలా అనుకుంటుందేమోనని ఇలా రసాను. ఒక విధంగా చెప్పాలంటే నేను తెలుగావేశం, కవితావేశం ఉన్న వాడిని కానీ కవిని కాదు. మీరు అప్పుడప్పుడూ నా హరివిల్లుని స్పృశిస్తూ మీ అభిప్రాయాలను తెలుపుతూ ఉండండి.
Leave a reply