అప్పుడెప్పుడో సరదాగా చంధస్సులో రాద్దామని అనిపించింది. కాస్త సులువుగా ఉంటుందని తేటగీతిని జీర్ణం చేసుకుని ఇలా త్రేన్చాను 🙂

చంధస్సులో దోషాలుంటే మన్నించండి.

పలుకుజెలి పదముల పంచనె నిలిపెద
నే రచించు కవిత ఏదయినను
సాహితీప్రియులొకపరి చదివిన చాలు
నపుడె నాదు జన్మ ధన్యమగును

విరులు కురిసేటి మధుమాస వేళలోన
కన్నెకోయిల కూసేటి గడియలోన
హాయిగొలిపేటి చల్లని క్షణములోన
ఆమె తొలి దివ్యదర్శనం గలిగె నాకు

సుదలొలుకు కులుకుల ఎల సుమము నీవు
హాయిగొలుపు చంద్రకిరణ కాంతి నీవు
సిరిని మించు తళుకులొల్కు చెలువు నీవు
నిర్మలమగు హృదయమున్న ప్రియవు నీవు

ఎందరతివలు కనబడ్డ నింతవరకు
కనులు సంతసించెనుగాని మనసు కాదు
ఇపుడు జూచితిని చెలియా నిన్ను నేను
మనసు పొంగుతున్నది గాని తనువు కాదు

గంగ ఒడ్డున నా చెలి అడుగుపెడితె
అలలు మెల్లగ ఆమె పాదాల్ని తాకె
తనలొ కలుపుకున్నట్టి పాతకములన్ని
ఇటులె తొలగేనని తలచెనేమొ గంగ!

పూజకై వెలిగించు కర్పూరమసలు
బాదపడదు ప్రియా తాను మండుతుంటె
అటులనే నా మనసును హారతిగజేసి
నిన్ను పూజించు నీ వాడిని కనికరించు

కాంతినీయని ప్రమిదని కాంచనేల
తావినీయని పూవుని తాకనేల
సడియె ఎరుగని వీణను మీటనేల
ప్రేమ పంచని మనసుపై ప్రీతి ఏల?

RTS Perm Link