
అది ఓ ఉద్యానవనం. అందులో ఒక చోట ఓ పూలచెట్టు. అందమైన పువ్వులు నవ్వుతూ… త్రుళ్ళుతూ… వీచే గాలికి వయ్యారంగా ఊగుతూ… అటు వైపు వెళ్ళేవారికి పరిమళాన్ని పంచుతూ… ఓ రోజుకే జన్మ చాలిస్తున్నాయి. ఆ పూలచెట్టుకి ఓ వైపు ఒక బండరాయి. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటుందో తెలియదు. పాపం కదలలేదు. ఎండకి రగులుతూ, వానకి తడుస్తూ, చలికి వణుకుతూ ఎవరి ఉపయోగానికీ నోచుకోని వ్యర్థ జీవి అయిపోయింది. చూసే వారికి ఏ కదలికా కనిపించకపోయినా ఆ రాయిని ఆర్తిగా తడిమితే విలపించే హృదయమొకటి కనిపిస్తుంది.
ప్రతిరోజూ నరక వేదన పాపం దానికి! ఆప్యాయంగా పలకరిస్తూ కేరింతలు కొడుతున్న పూలను చూస్తూ ఆనందిస్తుంది. ఇంతలో ఎటుంచో గాలి వీస్తుంది. పాపం లేలేత రేకులు ఒక్కసారిగా వణికిపోతుంటాయి; అప్పుడప్పుడూ వేడి గాడ్పులకు కమిలిపోతాయి. చివరికి పట్టుతప్పి రాలిపోతాయి. ఏమన్నా సాయపడదామంటే స్పందన ఉన్నా చలనం లేని జన్మ. కొన్ని రాలుతూ తన మీద పడుతుంటాయి. అయ్యో అందులోనూ తన శరీరం కఠినం. ఏమి చేయలేక కళ్ళు మూసుకుంటుంది. కొంతసేపటికి కళ్ళ తెరచి చూస్తే తన ముందు పడి విలవిలలాడుతున్న నేస్తాలు… వీడ్కొలు చెబుతూ తిరిగిరాని లోకాలకు…
ఇది కాకుండా ఇంకో సంఘటన తనని బాగా కలచివేసింది. ఒకసారి ఎవడో పసిపిల్లవాడు పరిగెత్తుతూ పట్టుతప్పి తనమీద పడిపోయాడు. ఆ పసికూన తలకి గాయమై తన నుదుటికి ఆ రక్తం అంటుకుంది. ఇక చూడాలి తన బాద! ఆ మరక పోవాలంటే వర్షం పడేదాకా ఆగాలి మరి. “ఓ భగవంతుడా, ఏమిటీ జన్మ. ఎందుకు నాకింత ఆయుష్షు. నేనేం పాపం చేసానని. నాకు విముక్తి కలిగించవా.” అంటూ ఓ రోజు మొరపెట్టుకుంది.
కొన్ని రోజులు గడిచాయి. ఓ ప్రభాతాన ఇద్దరు పలుగూ పారా పట్టుకుని తన వద్దకు రావడం ఆ రాయి చూసింది. ఒక్కసారి తనలో ఏదో తెలియని సంతోషం. వచ్చిన వాళ్ళు తనని ముక్కలు చెయ్యడం మొదలుపెట్టారు. చివరిగా ఈ లోకాన్ని ఒకసారి తనివితీరా చూసి కళ్ళు మూసుకోబోయింది. ఇంతలో ఓ పిల్లాడి కేరింతలు వినిపిస్తే అటు చూసింది. ఆహా! తన మీద పడిన చిన్నవాడు క్షేమంగా కనిపించాడు. పట్టలేని ఆనందంతో కళ్ళు మూసుకుంది.
- శ్రీనివాస స్వీయరచన
RTS Perm Link
8 Responses for "రాతి హృదయం"
శ్రీనివాస్ గారూ,
రాయిలా కఠినం, నీ గుండె బండరాయి అంటాం గానీ దాని మనసు అది పడే బాధ భలే వర్ణించారండోయ్.
– ప్రసాద్
http://charasala.wordpress.com
బావగారు.. చాలా బాగుందండీ… నిజంగా.. హృదయంచలించింది.. కొన్ని అక్షరాలకు..
ఆఖరున.. నేనేం ఊహించానంటే.. ఆ రాయిని.. ఒక ప్రతిమగా చెక్కి పూజలందించడమో లేక ఆ సౌందర్యాన్ని అందరూ పొగడమో చేస్తారేమో అని అనుకున్నా?
ధన్యవాదములు ప్రసాద్ గారు, బావ గారు.
ఆత్రేయగారు కూడా “రాయీరప్పను కానూ, మానూమాకును కానూ, మామూలు మనిసిని నేనూ” అన్నారు మూగమనసుల్లో. ఆ రాతిలోని మూగమనసు పడే మౌనవేదనను వినగలగడం నిజంగా అద్భుతం.
very senstive baassu
Oka raayaki manasuni prasadincharu mi rachanatho…
very nice
రాయిని ఆడది చేసినది రాముడైతే, రాతికి (పాషాణానికి) కూడా మనసుంటుందని మరోసారి ఋజువు చేసింది మీ కధ. కంగ్రాట్స్. ఇంకా రాస్తూ ఉండండి. నిజంగా మీ e-పాళీ విన్యాసాలు బాగున్నాయి.
–కామేశ్వర రావు
http://chittellas.blogspot.com/
caalaa touching gaa vumdandi.mee racanaa saili kudaa chaala abagumdi.
Leave a reply