ఓ ప్రియా! నువ్వెవరో నాకు తెలియదు. ఎప్పుడో కంటి ముందు కదిలిన నీ రూపు ఇంకా అస్ఫష్టమే!

కానీ స్వప్నసీమలలో నన్ను తాకిన నీ అలౌకిక స్పర్శ నాకు సుపరిచితమే…

ఇప్పుడేమి జరిగిందో తెలుసునా…

నీ తలపుల రథం నన్నో పూలతోట ముందుకు చేర్చింది నిన్ను చూపిస్తానంటూ…

నేను వడివడిగా ఆ వనద్వారం దాటుకుంటూ లోనికి వెళ్ళిపోయాను…

అబ్బో! ఎక్కడ చూసినా రంగు రంగుల పూలు; అందమైన పూలు. ఏ పువ్వులో నువ్వు దాగున్నావో తెలియదు…

ఆత్రంగా ఒక్కో పువ్వునూ తాకుతున్నాను… అమ్మో! ప్రతీ పువ్వుకీ కనిపించని ముళ్ళు…

ఆ తోట అంతా తడిమి చూసేసరికి నా కళ్ళు అలసిపోయాయి… నా చేతులు రక్తమయమైపోయాయి… కానీ ఏదీ నిన్నటి ఆ అలౌకిక స్పర్శ…

నిస్తేజుడనై, నిర్వేదుడనై వనం బయటకి చేరుకున్నాను…

అడుగులు తడబడుతూ నడుస్తున్న నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది…

అహా! అదే స్పర్శ అదే అనుభూతి కదా నువ్వు నిన్న కనుకగా ఇచ్చినది… తలవంచి చూసాను

ఓ గడ్డిపువ్వు నా పాదాగ్రాన్ని సున్నితంగా మీటుతుంది. అంతే ఒక్కసారిగా నా మనసుకు చుట్టుకున్న అజ్ఞానపు సంకెళ్ళు పటాపంచలైపోయాయి…

ఓ చెలీ! నిన్ను పోల్చుకోలేకపోయిందుకు క్షమించవూ…
- శ్రీనివాస స్వీయరచన

RTS Perm Link