నేనే రాజును… యువరాజును…
తాతకుండక రాజ్యము… తండ్రికొసగక భాగ్యము… తల్లి మరిచెను సౌఖ్యము…
ఇంట మిగిలెను పాత మకుటము… పదును పోయిన ఖడ్గము… పరుగుతీయని అశ్వము…
నన్ను చదివింపనెంచిన నా తండ్రికొచ్చెను కష్టము…
మా బాగోగులు చూడడానికే గడిచిపోయెను తల్లి జీవితం…
బడికి పంపగ నన్ను పాపం హారతాయెను తండ్రి జీతము…
కళాశాలలో నన్ను చేర్చగ ఇల్లు మారెను ఖడ్గము…

పట్టభద్రుడినవ్వగా మరి కరిగిపోయెను మకుటము…

మాకు భారము ఎందుకంటూ మట్టినొదిగెను అశ్వము…

పదిలమ్ముగా దాచుకోగా చివరికి మిగిలెనే ఈ కలం…

అమ్మనాన్నల ఆశ తీరే క్షణమెప్పుడో… ఇంకెప్పుడో…

వాళ్ళ ఋణమును తీర్చుకునే తరుణం ఇంకెన్నడో…

- శ్రీనివాస స్వీయరచన

RTS Perm Link