అతన్ని మృత్యువు తరుముతుంది. ఎంత దూరం పరిగెడుతున్నా ఒక్క క్షణమైనా ఆపకుండా తరుముతూనే ఉంది. తనవాళ్ళకు దూరమైపోతున్నాననే దిగులు ఒకవైపు… జీవితంలో ఎంతో సాధించాల్సింది ఉందే అనే బాద మరోవైపు… తనలాగే ఎందరినో అదే మృత్యువు తరుముకుంటూ వస్తోంది… తనలాగే పాపం ఎంతో మంది యవ్వనంలోనే బలైపోతున్నారు… తన ఒంటిని ఇప్పుడిప్పుడే నిస్సత్తువ ఆక్రమించుకుంటుంది… ఎక్కడో దూరంగా ఉంటూ శోకిస్తున్న తనవాళ్ళని ఒక్కసారి తనివితీరా చూసాడు… ఏ క్షణంలోనైనా తన మెడకి యమపాశం చుట్టుకోవచ్చని అతను తెలుసుకున్నాడు… ఇంతలో కళ్ళ ముందు మరో దృశ్యం ప్రత్యక్షమయ్యింది… ఎందరో అభాగ్యులు కళ్ళులేక, గుండె సరిగ్గా కొట్టుకోలేక, ఎన్నో అవయవాలు సరిగ్గా పనిచేయలేక… భవిష్యత్తు వైపు నిస్తేజంగా కదులుతున్నారు…అకస్మాత్తుగా అతనిలో ఏదో మార్పు… పరిగెడుతూనే తన దేహంలో ఒక్కో భాగాన్ని త్యజించడం మొదలుపెట్టాడు… చివరికి చిధ్రమైన దేహాన్ని మృత్యువుకు అర్పించుకున్నాడు. ఆకాశంలో కలిసిపోతూ ఒకసారి నేలవైపు చూసాడు… ఒకరి కళ్ళలో, వేరొకరి గుండెలో మరొకరి రుధిరంలో అతను సజీవుడై కనిపించాడు… వాళ్ళ తల్లిదండ్రుల దీవెనలతో వర్ధిల్లుతూ కనిపించాడు… ఇంతకీ అతడిని మృత్యువు జయించలేకపోయింది కదూ!
– శ్రీనివాస స్వీయరచన

RTS Perm Link