నన్ను బ్రతికిస్తున్నది ఎవరు? నన్ను నడిపిస్తున్నది ఎవరు? ఆ భగవంతుడి దీవెనలా ; నా తండ్రి అనురాగమా; నా తల్లి మమకారమా; నా స్నేహితుల అభిమానమా! ఏమో నాకివేమీ తెలియవు అప్పటి వరకు. నాలోని నాతో ఎప్పుడూ తర్జన భర్జనలే. నేను ఒకటి మంచిగా తలిస్తే వాడు చెడు అంటూ వెనుకాడతాడు; అదే నా మనసు కీడు ఉందని వెనుకాడుతుంటే వాడు మేలు ఉందని ముందుకు తోస్తుంటాడు. అనునిత్యం పెద్ద చిక్కొచ్చింది వాడితో. ఇక తట్టుకోలేక పోయాను. ఒక నిర్ణయానికి వచ్చాను. ఓ ప్రభాత వేళ వాడి కన్నా ముందే నేను మేల్కొన్నాను. వాడు గాఢ నిద్రలో ఉన్నాడు; బహుశా నాతో కలలో గొడవపడుతున్నట్టున్నాడు. వాడు లేవక ముందే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ ముందురోజు రాత్రే నిర్ణయించుకున్నాను. నాలో ధైర్యాన్ని మొత్తం కూడగట్టాను. నాలోని దృడ నిశ్చయాన్ని కత్తిగా మలచుకున్నాను. అంతే మనసారా కసాకసా నరికి పాడేసాను నాలోని వాడిని. రక్తం చిందించకుండా వాడిని పరలోకానికి పంపించేసాను.


అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. నాకప్పుడు లోకం అంతా కొత్తగా కనిపించసాగింది. అందరూ నవ్వుతూ పలకరిస్తున్నారు. నా జీవితమెందుకో నాకర్దమైంది. అమావాస్య రాతిరిలో కూడా వెలుగుని కాంచే చిత్తం నా వశమైంది.నా ప్రశ్నలకు జవాబు దొరికింది. నన్ను ముందుకు నడిపించేది నా ఆశయమని… రేపటి దారుల వైపు ఆశతో పయనం సాగించాలని… పక్కవాడితో కాకుండా నాతో నేనే పోటీ పడాలని… ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పాలంటే! ఈ జవాబులకి ప్రతిరూపాలేనేమో ఆ భగవంతుడి దీవెనలు; నా తండ్రి మమకారం; నా తల్లి అనురాగం; నా స్నేహితుల అభిమానం.
– శ్రీనివాస స్వీయరచన

RTS Perm Link