ఈ రోజే తెలిసింది బ్లాగూ నీ విలువ… అని పాడుకోవాలనిపిస్తుంది.
సాధారణంగా నేను రాసేవాటిని నా బ్లాగులో ప్రచురిస్తాను. వేరే ఏ సైటుకి పంపను. క్రిందటి ఆదివారం తెలుగుబ్లాగ్ సభ్యులతో కలిసి తెలుగు సాహితీ ప్రేమికుల సమావేశానికి వెళ్ళాను. అక్కడ తెలుగు పీపుల్ డాట్ కామ్ గురించి విన్నాను. అక్కడ సమావేశమైన వాళ్ళు చాలా మంది అందులో సభ్యులట. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఆలోచించాను; సరదాగా ఏదన్నా తెలుగుపీపుల్స్ లో ప్రచురించడానికి పంపించాలనుకున్నాను. అసలు టీపీ ఎలా ఉందోనని చూసా; చిన్న కథలని, నవలలని, కవితలని రకరకాలు. అమ్మో ఎన్ని విభాగాలో! మనం బ్లాగులో రాసేవి మనకు ఇష్టం వచ్చినట్టు రాస్తాం. ఏదన్నా అనుభవం గానీ, అనుభూతి గానీ పొందినప్పుడు లేదా పాతది ఏదన్నా గుర్తుకు వచ్చినప్పుడు, దానిని మనకి ఏ రూపంలో వీలుగా ఉంటే అలా రాసి బ్లాగులో పెట్టేస్తాం. దానికి పరిమితులు ఉండవు. కానీ ఏవైనా సైట్స్ కి పంపాలంటే కొన్ని పాటించాల్సి వస్తుంది. నా బ్లాగులో నుండి పాతది ఏదైనా తీసుకుని పంపిద్దామని వెతికా. కానీ ఏ విభాగానికి పంపించాలో సందిగ్ధత. చివరికి చిన్నకధల విభాగంకి నా నిజ సౌందర్యం ని పంపిచాను. అది వెళ్ళిందో లేదో అని ఒక చిన్న సందేహం. ఈసారి నా రాతి హృదయం ని పంపించాను. ఓ రెండు రోజుల తర్వాత నిజ సౌందర్యం ప్రచురించామని టీపీ నుండి మెయిల్ వచ్చింది. http://telugupeople.com/discussion/article.asp?id=45793 .
దాన్ని చూసాను, పరవాలేదు ఏదీ మార్చకుండా ఉన్నది ఉన్నట్టే దించేసారు. ఓ రోజు తర్వాత ఎవరో తమ అభిప్రాయాన్ని రాసారు అని మెయిల్ వచ్చింది. వెంటనే వెళ్ళీ చూసా. సాదారణంగా బ్లాగులో అయితే బాగుందనో లేక బాగోలేదనో తెలుపుతారు. అక్కడ రాసింది చూస్తే నాకు నవ్వొచ్చింది. నేను రాసింది చాలా చిన్నదన్నారు గానీ అసలు బాగుందో లేదో చెప్పలేదు. ఇంకా మిగిలినవారు రాసింది చూస్తే అబ్బో వెటకారం. ఇంకా సంతోషం ఏదన్నా కవితని పంపించలేదు; అది కవిత కాదని పచ్చిగా తిట్టినా తిట్టగలరు. బతికిపోయా!
ఇలాంటి అనుభవమే నాకొకసారి ఇంతకు ముందు ఎదురైంది. రెండు సంవత్సరాల క్రితం ఓ రెండు రోజులు ఫిల్మ్ నగర్ లో తిరిగి తిరిగి ఓ నిర్మాతను పట్టుకున్నాం. ఓ రెండు కధలు వినిపించాను. అబ్బే తనకి ఇవి నచ్చలేదన్నాడు ఆ నిర్మాత. ఏదన్నా యాక్షన్ కధని వెంకటేష్ కి రాసి తీసుకురమ్మన్నాడు. మళ్ళీ నేను అటు వైపు చూడలేదు. పాపం మా బావ(ఆర్కుట్ బంధం) ఇందుకూరికి కూడా అలానే జరిగింది. తాను రాసింది ఈనాడుకి పంపిస్తే 50 శాతం కి పైగా మార్చేసారంట! ఎదేమైనా బ్లాగు బాగేనండీ. మనసారా రెండు ముక్కలు రాయొచ్చు, లేదా వ్యాసాలకు వ్యాసాలు రాయొచ్చుస్వేచ్ఛగా.
ఇహ ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ఇక ఏది రాసినా నా మానసపుత్రిక అయిన బ్లాగులోనే రాద్దామని.
స్విష్ మాక్స్ ఉపయోగించి టెక్స్ట్ అఫెక్ట్స్‌ను చాలా సులభంగా చెయ్యొచ్చు. అదే మేక్రోమీడియా ఫ్లాష్ లో అయితే చాలా సమయం తీసుకుంటుంది. ఇక్కడ నేను రూపోందించినది స్విష్ లో సిద్ధంగా ఉన్న, నాకు నచ్చిన అఫెక్ట్స్ తో చేసినది. ఇది చూడడానికి తప్ప చదవడానికి ఇందులో పెద్ద విషయమేమీ లేదనుకోండి! ఓ చూపు చూడండి. ఓ సారి రాయి విసిరి చూడండి.
గమనిక: దీనిని కూడలిలో మీరు చూడలేకపోతే నేరుగా నా బ్లాగ్ లో చూడండి.
Sep 20, 2006
Author: శ్రీనివాస | Filed under: గత స్మృతులు
నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. తలచుకుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియదు. తరగతిలో నేనెప్పుడూ చివరి వరుసలోనే కుర్చుంటాను. సాదారణంగా ఉపాధ్యాయులెవరైనా ముందు ఉన్న వాళ్ల మీదే దృష్టి పెడతారు. ఎక్కువ వాళ్ళనే అన్నీ అడుగుతుంటారు. నాకు అవన్నీ అంటే తలపోటు. అందుకే ముందు వరుసలో కుర్చోవడమంటే భయం!. అలాగని మొద్దుని కూడా కాదు. గణితంలో నాకు మంచి పట్టు ఉంది.
మీకు త్రికోణమితిలో ఒక పట్టిక గుర్తుండే ఉంటుంది. సైను, కొసైను అంటూ నాలుగు పాదాలు ఉన్న ఒక చిత్రం ఉంటుంది. దానిని ఆధారం చేసుకుని వాటికి ఒక పట్టికను తయారు చెయ్యాలి. మా గణితోపాధ్యాడు మాకు ఆ రోజు ఇదే ఇంటిపనిగా ఇచ్చారు. దానిని ఆ రోజు నేను చేయలేదు. కానీ మర్నాడు సాయంత్రం చూపించాల్సి ఉండటంతో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గుర్తుకు వచ్చి గబగబా రాసేసాను. నా ముందున కుర్చున్న ఓ ఎనిమిది మంది నా పుస్తకం తీసుకుని మక్కిక్కిమక్కి దించేసారు.
ఇక సమయం రాగానే మా ఉపాధ్యాయుడు వచ్చి అందరూ రాసారా లేదా అని ముందు వరుస నుండి అందరి పుస్తకాలను పరిశీలించడం మొదలు పెట్టారు. ఆయనకు వెనుకన ఉన్న వాళ్ళంటే కాస్త చిన్నచూపు. నా దగ్గరకు వచ్చి కాస్తంత తీక్షణంగా పరిశీలించారు. నేనొక చోట ఏదో తప్పు రాసాను; అది చూపించి నా చెంపను చెళ్ళుమనిపించారు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ముందు కుర్చున్న వాళ్ళందరూ నా వంక అయోమయంగా చూసారు. నేనేమీ మాట్లాడలేదు. నా పుస్తకంలో నుండి కాపీ కొట్టిన వాళ్ళు బతికిపోయారు. నేను దోషిలా నిలబడ్డాను. టైమ్ బాగోకపోవడం అంటే ఇదేనేమో!