జై జన్మభూమి

రాసినవారు శ్రీనివాస on Wednesday, 6 of September , 2006 at 11:00 pm


ఆపాత మధుర జ్ఞాపకాల నెమరు; ఆరిపోబోయే గతస్మృతీదీపాలకు పోసే చమురు


నాకు దినచర్యలు రాసే అలవాటు లేదు. జరిగిన సంఘటనలు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోతాయి; కొన్ని మస్తిష్కంలో నిలిచిపోతాయి; మరి కొన్ని నా గుండెల్లో ఒదిగిపోతాయి. అలా గుర్తున్న వాటిలో కొన్ని ఇలా మీతో…


అవి నేను నర్సీపట్నంలో డిప్లోమో చదువుతున్న రోజులు. జనవరి నెలలో మా కళాశాలలోని అబ్బాయిలను కొంతమందిని జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చిన్నచిన్న పల్లెలకు పంపించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మేము ఎనిమిది మంది ముందుకు రావడంతో ఓ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని మూడు ప్రదేశాలకు పంపించడానికి సిద్ధపడ్డారు. నర్సీపట్నం అంటేనే ఏజెన్సీ ప్రదేశం; మరి అక్కడకు 10 కిలోమీటర్లు లోపలి పల్లెలు అంటే ఎలాగుంటాయో మీరే ఊహించుకోండి ఒకసారి! మమ్మల్ని అందరినీ ఓ జీపులో అక్కడ దించి మళ్ళీ వెళ్ళేటప్పుడు వస్తామంటూ అన్ని జాగ్రత్తలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ కాలక్షేపానికి ఓ పేకల కట్ట, ఓ టేప్ రికార్డర, ఓ బేటు-బాలు తీసుకెళ్ళాం.


మొదటి పల్లెలో మా బస ఓ ప్రాధమిక పాఠశాలలో. మాకోసం పాపం వాళ్ళు బాగా శుభ్రం చేసి ఇచ్చారు. తీరా చూస్తే ఆ గదికి విద్యుత్ సౌకర్యం లేదు. మా స్నేహితుడొకడు ఓ రెండు తీగలు సంపాదించి గది పక్కనే ఉన్న స్తంభం నుండి ఎలాగోలా విద్యుత్ ని రప్పించి గదిని సంగీతమయం చేసాడు. అప్పుడప్పుడు పేకాట ఆడేవాళ్ళం; ఇంకా బోర్ కొడితే అక్కడి పిల్లలను పోగుచేసి క్రికెట్ ఆడేవాళ్ళం. ఓ రెండు గంటల పాటు వెళ్ళిన పని చేసే వాళ్ళం. ఇళ్ళిల్లూ తిరుగుతూ వాళ్ళ వివరాలను - అంటే ఇంటి జనాభా; వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని మా దగ్గర ఉన్న ఫారంలో నింపేవాళ్ళం. ఉదయం నిద్రలేచి బయటకు వస్తే అంతా మంచు. ఓ ఐదడుగులు ఆవల ఏముందో కనిపించేది కాదు. అక్కడ పుట్టిన వణుకు నాకు మరెక్కడా అనుభవంలోకి రాలేదు! నాకేమో సాయంత్రం టీ తాగడం అలవాటు; కానీ అక్కడ 6 గంటలకే స్మశాన నిశ్శబ్దం. గుడ్డి దీపం రెపరెపలాడుతూ ఓ పాక మాత్రమే తెరచి ఉండేది ఆ సమయంలో. అదే నాకప్పుడు 5 నక్షత్రాల పూటకూళ్ళమ్మ ఇల్లు.



మూడు రోజులు సరదాగా గడిచిపోయాయి. మళ్ళీ వేరే పల్లెకు ప్రయాణం. ఉదయమే ఆ ఊళ్ళోకి అడుగుపెట్టాము. ఓ అరకిలోమీటరు నడక. మా గుంపులో దాదాపు అందరూ చమత్కారులే.అప్పుడు మేము కాలవ గట్టు మీదుగా వెళుతున్నాము. ఒకరు చెంబు పట్టుకుని మా పక్క నుండి వెళుతున్నాడు. నేను వెంటనే ‘అదేంటో తెలుసా’ అని అన్నాను. మా వాళ్ళు వెటకారంగా నవ్వారు. నేను వెంటనే ‘దాన్ని చెంబు షికార్ అంటారు’ అని అన్నాను. అందరూ నవ్వుకున్నారు. మావాడు మాలో ఒకడిని ‘నీకు ఈత వచ్చురా?’ అను అడిగాడు. దానికి వెంటనే వాడు ‘ఆ గునపం ఈత వచ్చురా’ అని అన్నాడు. ‘అదేం రకం ఈత’ అని అడిగేసరికి వాడు వెంటనే ‘గునపాన్ని ఈ కాలువలో పాడేస్తే అది ఎలా ఈత కొడతాదో అలగే నాకు వచ్చు’ అన్నాడు. ( పడ్డ వెంటనే మునిగిపోవడం అన్న మాట! ). ఈ సారి మాకు అక్కడి యమ్.పీ.టీ.సీ ఇంట్లో విడిది. అక్కడ చెప్పుకోవడానికి ఏమీలేవు గానీ ఓ ఎండు చేప కథ మాత్రం ఉంది.



అక్కడ మాకు తయారు చేసే భోజనాలు గురించి మేము ముందుగానే అడిగి తెలుసుకునే వాళ్ళం. ఎందుకంటే మాలో ఒకడు బ్రాహ్మణుడు; మరో ఇద్దరు విశ్వబ్రాహ్మణులు. కానీ మా శుద్ధ బ్రాహ్మణుడు మాత్రం మాంశాహారమంటే పడి చస్తాడు. మిగిలిన ఇద్దరూ కనీసం గ్రుడ్డును కూడా తినరు. అందుకే చాలా జాగ్రత్త తీసుకునేవాళ్ళం. కానీ ఒకసారి తేడా జరిగిపోయింది. ఓ పూట వేరే వాళ్ళు వంట చేసారు. వంకాయ కూర వండుతామంటే సరే అన్నాము. ఆ తర్వాత అందరూ కూర్చుని భోంచేస్తున్నాము. నేను తింటున్న కొంతసేపటికి నాకు ఎండుచేప ముక్క ఒకటి నోటికి తగిలింది. నేను తల పైకెత్తి చూసాను. అందరూ కుమ్మేస్తున్నారు. అప్పుడు ఆలోచిస్తే ఒక విషయం గుర్తుకు వచ్చింది; కొంత మంది వంకాయ కూరలో రుచి కోసం ఎండుచేప ముక్కలు వేస్తారని. ఇంకెవరికీ ఆ ముక్కలు రాకూడదని అనుకుని గుట్టుగా తినసాగాను. ఇంతలో మా శుద్ధ బ్రహ్మణుడు గట్టిగా అరిచాడు. ‘నాకు చేప దొరికింది, నాకు చేప దొరికింది’ అని. అంతే మిగిలిన ఇద్దరు విశ్వబ్రాహ్మణులు ఒక్కసారిగా అందరి వంక చూసారు.పాపం వెంటనే లేచి వెళ్ళి చెయ్యి కడిగేసుకున్నారు. ఇది తలచుకున్నప్పుడల్లా నవ్వొస్తూ ఉంటుంది.
ఆరో రోజుకల్లా ఓ ముగ్గురు అనారోగ్యంతో తిరిగి వెళ్ళిపోయారు. చివరిరోజు మానవహారం అనే కార్యక్రమం ఉంటుంది దానికి నాయకులొస్తారు ఉండమని కబురు పంపారు మా ఉపాద్యాయుడు. కానీ మాకు ఎవరూ సహకరంచకపోవడంతో మూడో పల్లెకు వెళ్ళకుండానే మా ఊరుకి తిరిగి వెళ్ళిపోయాం.

RTS Perm Link

వర్గములు: కలగూరగంప

3 అభిప్రాయాలు

kamesh యొక్క అభిప్రాయము

Made Thursday, 7 of September , 2006 at 3:01 am

బాగుందండీ, మీ జన్మభూమి జ్ఞాపకాల దొంతర.

cbrao యొక్క అభిప్రాయము

Made Thursday, 7 of September , 2006 at 4:21 am

కాలేజి రోజులు,అప్పటి స్నేహాలు ఎప్పటికీ మథుర స్మ్రుతులే. ఇంతకాలం తర్వాత కూడా కళ్లకు కట్టినట్లు రాశారంటే, ఆ జ్ఞాపకాలు సజీవం కావటమే.

Nagaraja యొక్క అభిప్రాయము

Made Thursday, 28 of September , 2006 at 11:17 am

చాలా బాగా రాసారండి…

అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

My Photoపేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం

చైత్రం నాది, శిశిరం నాది, వెలుగు నాది, చీకటి నాది, కష్టం నాది, సుఖం నాది, నవ్వు నాది, ఏడుపు నాది, అచ్చ తెలుగులో ప్రతి అనుభూతీ నాది.