
చిట్టిబాబు కాలేజీలో చేరాడు. తను చిన్నప్పటి నుండీ తెలుగు మీడియమే. ఇప్పుడేమో ఇంగ్లీష్ మీడియమాయె! అదో పెద్ద తలనొప్పి. కాలేజీ తొలి రోజులలో ఎదో ఓ మూల నక్కి నక్కి కూర్చునేవాడు. కొన్ని రోజులకు తన లాంటి వాళ్ళు అక్కడ కొంత మంది ఉన్నారని తెలుసాకా కాస్త ధైర్యం వచ్చింది చిట్టిబాబుకి. నెమ్మది నమ్మదిగా అందరూ పరిచయం అయ్యారు. ఇక విజృంభించడం మొదలుపెట్టాడు. ఖాళీ దొరికినప్పుడల్లా కేంటిన్ లో ఓ గుంపుతో కనిపించేవాడు. అసలే అందగాడు; పైగా మాటకారి. అందరినీ మాటలతో మైమరిపించేవాడు. అందుకే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు అతడికి స్నేహితులైపోయారు.
అందరి ముందు తనకున్న తెలుగు పాండిత్యాన్నంతా చూపించేవాడు. ఎవరన్నా ఏదైనా మాట్లాడితే చాలు, వెంటనే అక్కడి సన్నివేశానికి తగ్గ వేమన పద్యమో, మరేదైనా సెటైరో వేసేస్తాడు. ఎవరితో ఎలా ఉన్నా రజనితో మాత్రం చాలా అణకువగా ఉండేవాడు.తన స్నేహితులు కొందరికి రజనిని తను తెగ ప్రేమించేస్తున్నట్టు గొప్పగా చెప్పేవాడు . కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. రజని మాట్లాడితే చాలు అన్నీ ఇంగ్లీషు ముక్కలే. అందుకే భయపడి ఆమె ముందు ఏమీ మాట్లాడడని అందరూ లోపల అనుకుంటారు.
ఇలా అందరూ కూర్చుని ఉన్నప్పుడు రజని కోసం ఒకడు వచ్చేవాడు . కొత్తలో ఒకసారి ‘
హి ఈజ్ మై కజిన్‘ అని పరిచయం చేసింది అందరికీ. మనోడు ఎప్పుడూ బైక్ మీద వచ్చేవాడు. అందరి వంక చూసి ‘
మై కజిన్ హేజ్ కం; అయామ్ లీవింగ్. బై‘ అంటూ వెళ్ళిపోయేది. చిట్టిబాబు మాత్రం ‘
ఎంటో బామ్మరిది ఎప్పుడూ సీరియస్ గా ఉంటాడు. మనికిలాంటివి పడవు కదా, అందుకే తనకి పరిచయం చెయ్యడం లేదేమో‘ అని మనసులో అనుకునేవాడు. ఎప్పుడు రజనికి తన ప్రేమ సంగతి చెబుదామా అని తెగ ఆలోచించేవాడు
వేలంటైన్స్ డే వచ్చింది. రజనితో ఆ విషయం చెప్పడానికి చిట్టిబాబు ముహూర్తం పెట్టాడు. ఆ రోజు సాయంత్రం అందరూ క్లాస్ బయటకు రాగానే జంట కుదురిన వాళ్ళు బై చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇక టైమ్ వేస్ట్ చెయ్యడం ఎందుకని చిట్టిబాబు రజనితో ‘
నీతో పర్సనల్ గా మాట్లాడాలి; ఇప్పుడు మాట్లాడుకుందామా‘ అని అన్నాడు. ‘
ఆ‘ అని రజని అన్నాదో లేదో గానీ, ఓ బైక్ వచ్చి పక్కనే సడన్ బ్రేక్ వేస్తూ ఆగింది. కజిన్ ని చూడగానే రజని ముఖం వెలిగిపోయింది. ‘
వీడొకడు పానకంలో పుడకలాగ. బామ్మరిదిని వెళ్ళిపొమ్మను. నేను డ్రాప్ చేస్తాలే‘ అని విసుక్కున్నాడు చిట్టిబాబు. ‘
బామ్మరిది కాదు ఆయన మా బావ‘ అంటూ బైక్ మీద కుర్చుని బావని (కజిన్) గట్టిగా పట్టుకుంది. వాడు గేర్ మార్చి వెళ్ళిపోయాడు. ఒక్కసారి చిట్టిబాబు గుండె గుబేలుమంది. అయినా అందరి ముందు గంభీరంగా కనిపించాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఓ మూలన బూజు పట్టి ఉన్న డిక్షనరీలో కజినంటే ఏంటో వెదికడు. తను ఇప్పటి వరకు
కజిన్ అంటే అన్నో తమ్ముడో లేక అక్కో చెల్లో అవుతారని అనుకున్నాడు. ‘
వార్ని! పిల్ల జెల్ల కొట్టి పోయిందని అనుకున్నాను. ఇప్పుడు నేను ఎదవనయ్యాను. ప్చ్. నేను తెలుగులో అందరినీ అదరగొడుతుంటే ఇది నన్నే ఇంగ్లీషుతో బురిడీ కొట్టించింది. ఈ ఇంగ్లీష్ వరసలేంటో‘ అంటూ మంచంమీద కూలబడ్డాడు. పాపం చిట్టిబాబు!
RTS Perm Link
3 Responses for "పాపం చిట్టిబాబు"
చాలా బాగా వ్రాశారు. ఇలాంటి కథలు మీనుండి మరిన్ని ఆశిస్తున్నాను.
chaala baagundi..
naakkuda ilanti samasye vachindi
nenu CAT ki prepare avutunnanu andulo blood relations problems untay..
pichi naayallu yem relations oo yento
తెలుగు మాధ్యమంగా చదివి, కాలేజి కి వచ్చె విధ్యార్ధులు, అలవాటు లేని ఆంగ్లంలో, పాఠం అర్థం కాక పడే తిప్పలు చెప్పనలవి కాదు. కజిన్ అంటే అర్థం తెలియక వచ్చే గందరగోళంతో పాటుగా ఉద్యోగార్ధమై interview కి వచ్చినప్పుడు ఆంగ్లంలో జవాబు చెప్పలేక కళ్లనీళ్ల పర్యంతం అవుతుంటారు. తెలుగు మాధ్యమంగ చదివే వారికి ఆంగ్లం లో ఒక bridge course ఆవశ్యకత ఎంతో ఉంది. ఒక గంభీరమైన విషయాన్ని ఎంతో సరళంగా, హాస్యభరితంగా రాసి అందరి ద్రిష్టి కీ ఈ సమస్యను బాగా project చేశారు.
Leave a reply