నేను ఎక్కువగా సీతరామశాస్త్రి గారి పాటలు వింటుంటాను. ఆయన రాసే చాలా పాటలు అలాంటివి మరి. అది ఎలాంటి సందర్భమైనా మనసుని స్పృశించేలా రాస్తారు ఆయన. నేను నా జీవితంలో కొన్న తొలి కేసెట్ ఆయన మొదటి సినిమాదే. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన పాటలు నన్ను అలరిస్తూనే ఉన్నాయి. నాకు బాగా నచ్చిన ఆయన పాటల్లో ఒక పాటను నిన్ననే విన్నాను. ఆ పాటను మీతో పంచుకోవాలనిపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నువ్వే నువ్వే అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో పాటలన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏ చోట ఉన్నా నీ వెంట లేనా అన్న పాట మాత్రం నన్ను కట్టిపడేసింది. ఇటువంటి సందర్భోచిత గీతాలు రాయడంలో శాస్త్రి గారు దిట్ట.

ఈ సినిమాలో కధానాయిక అంజలికి ఆమె తండ్రికి మధ్య అనుభందం చాలా గాఢమైనది. అంజలి ప్రేమించేవాడు ఆమె తండ్రికి నచ్చడు. కానీ ఇద్దరినీ వదులుకోలేదు తను. సినిమా చివరలో ఈ సందర్భానికి తగ్గట్టు అంజలి మనోవేదన ఈ పాట రూపంలో మనకి వినిపిస్తుంది.

పాట పల్లవిలో ప్రియుడి కోసం తను ఎంత మధన పడుతుందో, తను ఎంత నిరాశతో ఉందో చెబుతుంది. చరణాలే ఈ పాటకు అలంకారం. తండ్రీ కూతురి సంభందాన్ని చాలా బాగా చెప్పారు.

మొదటి చరణంలో మబ్బు చినుకులా వర్ణించారు. చినుకు అంటేనే మబ్బును వదిలేసింది కదా! దాని గమ్యస్థానం మరి నేలే కదా. ఇక మబ్బు లాంటి తండ్రి తనను నిందించకూడదని ఆమె అభిప్రాయం. మల్లెపువ్వుని తీగ పట్టుకుని ఉంచుతుంది; కానీ దాని సుగంధాన్ని (ఇక్కడ ప్రేమ/మనసు) గాలిలో కలవకుండా ఆపలేదుకదా!

మొదటి చరణంలో కాస్త కవితాత్మకంగా సాగినా రెండవ చరణంలో అది వాస్తవంలోకి వచ్చింది. తన తండ్రి తనని ఎంత ఆప్యాయంగా చూస్తున్నారో చెబుతూనే; అలా అయితే తను కోరిన తీరం చేరుకోలేనని చెబుతుంది. తన కోసం తన తండ్రి ఎన్నో చేస్తున్నా తన కోరుకుంటున్నది తనకు ఎలా దక్కుతుందని బాదపడుతుంది. తన మనసులో తనకే స్థానం లేదంటుంది. చివరికి ప్రేమనే తనకు దారిచూపించమంటుంది.

కోటి కూర్చిన బాణీ సాధారణంగా ఉన్నా చిత్ర చాలా భావయుక్తంగా పాడారు.

పల్లవి:
ఏ చోట ఉన్నా నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే
రేపులేని చూపు నేనై శ్వాసలేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం ||ఏ చోట ఉన్నా||

చరణం 1:
నేల వైపు చూసే నేరం చేసావని నీలిమబ్బు నిందిస్తుందా వానచినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లితీగ బందిస్తుందా మల్లెపువ్వుని
ఏమంత పాపం ప్రేమా ప్రేమించడం – ఇకనైనా చాలించమ్మా వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవా క్షణమై కరిగే కలవా ||నువ్వే నువ్వే||

చరణం 2:
వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా; నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా; కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటే లేని నా మనసులో – నిన్నుంచగలనా ప్రేమా ఈ జన్మలో
వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా ||నువ్వే నువ్వే||

RTS Perm Link