చిట్టిబాబు ఏదో ఆలోచిస్తున్నాడు. ఎప్పటి నుండో ఒకటి అనుకుంటున్నాడు. రోజూ కంపెనీలో చాకిరి చేసి రావాలి; తన ఇంటి పనులు,సొంత పనులు చూసుకోవాలి;బయటివాళ్ళు ఎవరైనా సాయం అడిగితే చేసిపెట్టాలి.రోజూ సతమతమైపోతున్నాడు.శనాదివారాలు కూడా క్షణం ఖాళీ ఉండడం లేదు.ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాడు.చిట్టిబాబుకి రోజుకి 24 గంటలు సరిపోవనిపించింది. అయ్యో! రోజుకి 48 గంటలు ఉంటే బాగుండేది కదా!’ అని బాదపడుతున్నాడు. ఓ రోజు టీవీలో వచ్చే జీడిపాకం సీరియల్ లో ఏదో సన్నివేశంలో ఒకడు తపస్సు చేస్తూ కనిపించాడు. అంతే! చిట్టిబాబుకి ఆలోచన, ఆవేశం, ఆనందం ఒక్కసారి పొంగుకొచ్చేసాయి. ఆ క్షణమే తన పెళ్ళాంతో తను ఏమనుకున్నాడో చెప్పాడు. ఆవిడ గారు విస్తుపోయింది. బాద్యతలన్నీ ఆమెకి అప్పజెప్పి అడవికి బయలుదేరాడు.

ఓ ప్రశాంతమైన చోటు చూసుకుని తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. నెలలు గడుస్తున్నాయి… కానీ పట్టువదలకుండా అలా చేస్తూనే ఉన్నాడు. చివరికి దేవుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు.
“భక్తా! నీ తపోదీక్షతో నన్ను మెప్పించావు. నీ ముందుకు రప్పించుకున్నావు. నేను తీర్చగల కోరికయేదైనా కోరుకో; కానీ సతీ సావిత్రి కోరినటువంటివి మాత్రం దయచేసి అడగకు నాయనా.” అని అన్నాడు.
“అబ్బే అదేమీ లేదు స్వామీ, నాకు ఎన్నో చెయ్యాలనుంది, కానీ ఏమీ చెయ్యలేకపోతున్నాను. నాకు రోజుకి 24 గంటలు సరిపోవడం లేదు. నాకు రోజుకి 48 గంటలు ఉండేలా వరమివ్వండి దేవా.” అంటూ తన కోరికని విన్నవించుకున్నాడు.
దేవుడికి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. ‘ఏంటో ఈ మనుషులు ఇలాంటి కోరికలు కోరుకుంటున్నారు ‘ అని మనసులో విసుక్కుంటూ “అది కష్టం నాయనా. సృష్టి దర్మాన్ని మార్చలేం. వేరేదేమైనా కోరుకో. మణులా, మాణిక్యాలా…, నీ ఇష్టం” అంటూ బదులిచ్చాడు.
” కుదరదు స్వామీ. నేను ఇంత కష్టపడీ, ఇన్ని నెళ్ళు తపస్సు చేసింది ఎందుకనుకున్నారు. మీరు మీ మాటను నిలబెట్టుకోవాలి.” అంటూ భీష్మించుకు కూర్చున్నాడు.
దేవుడికి ఏం చెయ్యాలో తోచలేదు. ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇద్దరి మద్య కాసేపు మౌనం. చివరికి దేవుడికి ఓ ఆలోచన వచ్చింది. చిట్టిబాబు వైపు చూస్తూ ఇలా అన్నాడు.
“చూడు భక్తా. సృష్టి ధర్మాన్ని కాదనలేం.సమతౌల్యం పాటించకపోతే అనర్ధాలు జరుగుతాయి కదా. అందుకే ఇంకే మానవుడూ నీలా కోరకుండా ఉండాలని నేనో నిర్ణయానికొచ్చాను.అందుకే నీ కోరికను ఓ తర్కంతో తీరుస్తున్నాను. నీకు రోజుకి ఇక నుండి 48 గంటలు; అయితే ఇప్పటి నుండి నీ ఆయుష్షుని సగానికి తగ్గిస్తునాను “.
చిట్టిబాబుకి గుండెల్లో రాయి పడ్డట్టయింది. తేరుకునేలోగా దేవుడు మాయమైపోయాడు. కోపంగా ఆకాశం వైపు చూసాడు.

“ఓరీ మానవుడా. ఎంతో గొప్పవాళ్ళు, మహామహులే కాలధర్మం కాదనలేక కాలం చేసారురా. నువ్వెంత అల్పుడివి కదా. ఏదో
సాధించాలనుకునేవాడివి ఇన్ని నెళ్ళు వ్యర్థం చేసుకోకూడదురా.” అంటూ అటు నుండి ఆకాశవాణి వినిపించింది.
పాపం చిట్టిబాబు చేసేదేమీ లేక ఇంటికి బయలుదేరాడు.

RTS Perm Link