దసరాకి చిట్టిబాబు తన స్నేహితులతో మందుపార్టీ పెట్టుకుందామన్నాడు . అందరూ సరేనన్నారు. ఓ బ్యాచిలర్ స్నేహితుడికి వాడి రూంలో ఆ రోజు రాత్రి అన్నీ సిధ్ధం చెయ్యమని ఓ వెయ్యినోటు ఇచ్చేసాడు. ‘ఒరేయ్ రాత్రి 10 అయ్యేసరికి అందరం మన శేఖర్ గాడి రూంలో కలుద్దాం, ఈ లోగా మనవాడు అన్నీ ఎరేంజ్ చేసేస్తాడు’ అని తన మిగిలిన ప్రెండ్స్ అందరికీ చెప్పాడు.

అనుకున్న ప్రకారం రాత్రి 10 దాటిందో లేదో అందరూ శేఖర్ గాడి రూంలో తీర్థప్రసాదాల చుట్టూ రౌండ్ టేబుల్ సమావేశానికి కుర్చుండిపోయారు. అక్కడ సరంజామాని చూసిన చిట్టిబాబు ఒక్కసారి అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. విషయం అర్థమైపోయింది శేఖర్ కి. ‘సారీ రా. మర్చిపోయా, ఉండు ఓ ఐదు నిమిషాల్లో పట్టుకొస్తా’ అంటూ బయటికి వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు విషయం తెలుసుకుని నవ్వేసారు. ‘మనోడికి మందులోకి ముక్క, సోడా లేకపోయినా పర్వాలేదు గానీ నిమ్మకాయ రుచి తగలకపోతే అసలు ముట్టుకోడు కదా. పాపం చాలా డిసప్పాయింట్ అయాడురా మనోడు’ అంటూ జాలిగా వెటకారమాడాడు పక్కనే కుర్చున్న శీను గాడు. ఇంతలో శేఖర్ తలుపు సందులోంచి శీనుగాడికి సైగ చేసాడు. నెమ్మదిగా లేచి బయటికి వచ్చాడు. ‘ఒరేయ్ ఎక్కడా షాపులు తెరచి లేవురా. ఇప్పుడేం చేయమంటావురా. ఆడు నన్ను చంపేస్తాడు.’ అంటూ లబోదిబోమన్నాడు. ‘ఓసారి కాలనీ అంతా తిరిగితే ఎక్కడన్నా ఓ చెట్టు కనిపిస్తుందేమో. వెళ్ళి ట్రైలేసి చూడు’ అని ధైర్యం చెప్పి పంపించాడు శీనుగాడు.

కొంతసేపటికి గాబరాగా తలుపు తీసుకుంటూ లోపలికి వచ్చి తలుపేసేసాడు శేఖర్. వాడి చేతిలో ఓ రెండు నిమ్మకాయలు నిగనిగలాడిపోతున్నాయి. ‘ఎక్కడివిరా’ అన్న శీనుగాడితో ‘ఇప్పటీకే టైమ్ వేస్టయింది, ఇక కానీయండి ‘ అంటూ దాటేసాడు. అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పీకలదాకా తాగి వాలిపోయారు.

ఉదయమే చిట్టిబాబుకి మెలకువ వచ్చేసింది. పక్కనున్న శీనుగాడిని లేపి పోయి టీ తాగొద్దామన్నాడు. ఇద్దరూ ఒళ్ళు విదిలించుకుంటూ రూం బయటికి వచ్చారు. పక్కనే ఉన్న ఇంటి బయట ఒకడు అదే పనిగా ఎవళ్ళనో తిడుతూనే ఉన్నాడు. ‘ఎదవ కుక్కలు. దిష్టికి కట్టిన నిమ్మకాయల్ని కూడా పీక్కు పోవాలా. మళ్ళీ అయి నా కంట పడాలి, ఈ ఆటోకి కట్టేస్తాను, పీడా వదిలిపోద్ది’ అంటూ ఆవేశపడుతున్నాడు. చిట్టిబాబుకి ఏం అర్థం కాలేదు.కానీ విషయం అర్థం చేసుకున్న శీనుగాడు మాత్రం లోపల నవ్వునాపుకోలేక పోయాడు.

RTS Perm Link