ఎన్ని వేల వర్ణాలో…

Archive for October, 2006


పాట – మాట – 1

Oct 5, 2006 Author: శ్రీనివాస | Filed under: పాట - మాట

నేను ఎక్కువగా సీతరామశాస్త్రి గారి పాటలు వింటుంటాను. ఆయన రాసే చాలా పాటలు అలాంటివి మరి. అది ఎలాంటి సందర్భమైనా మనసుని స్పృశించేలా రాస్తారు ఆయన. నేను నా జీవితంలో కొన్న తొలి కేసెట్ ఆయన మొదటి సినిమాదే. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన పాటలు నన్ను అలరిస్తూనే ఉన్నాయి. నాకు బాగా నచ్చిన ఆయన పాటల్లో ఒక పాటను నిన్ననే విన్నాను. ఆ పాటను మీతో పంచుకోవాలనిపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నువ్వే నువ్వే అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో పాటలన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏ చోట ఉన్నా నీ వెంట లేనా అన్న పాట మాత్రం నన్ను కట్టిపడేసింది. ఇటువంటి సందర్భోచిత గీతాలు రాయడంలో శాస్త్రి గారు దిట్ట.

ఈ సినిమాలో కధానాయిక అంజలికి ఆమె తండ్రికి మధ్య అనుభందం చాలా గాఢమైనది. అంజలి ప్రేమించేవాడు ఆమె తండ్రికి నచ్చడు. కానీ ఇద్దరినీ వదులుకోలేదు తను. సినిమా చివరలో ఈ సందర్భానికి తగ్గట్టు అంజలి మనోవేదన ఈ పాట రూపంలో మనకి వినిపిస్తుంది.

పాట పల్లవిలో ప్రియుడి కోసం తను ఎంత మధన పడుతుందో, తను ఎంత నిరాశతో ఉందో చెబుతుంది. చరణాలే ఈ పాటకు అలంకారం. తండ్రీ కూతురి సంభందాన్ని చాలా బాగా చెప్పారు.

మొదటి చరణంలో మబ్బు చినుకులా వర్ణించారు. చినుకు అంటేనే మబ్బును వదిలేసింది కదా! దాని గమ్యస్థానం మరి నేలే కదా. ఇక మబ్బు లాంటి తండ్రి తనను నిందించకూడదని ఆమె అభిప్రాయం. మల్లెపువ్వుని తీగ పట్టుకుని ఉంచుతుంది; కానీ దాని సుగంధాన్ని (ఇక్కడ ప్రేమ/మనసు) గాలిలో కలవకుండా ఆపలేదుకదా!

మొదటి చరణంలో కాస్త కవితాత్మకంగా సాగినా రెండవ చరణంలో అది వాస్తవంలోకి వచ్చింది. తన తండ్రి తనని ఎంత ఆప్యాయంగా చూస్తున్నారో చెబుతూనే; అలా అయితే తను కోరిన తీరం చేరుకోలేనని చెబుతుంది. తన కోసం తన తండ్రి ఎన్నో చేస్తున్నా తన కోరుకుంటున్నది తనకు ఎలా దక్కుతుందని బాదపడుతుంది. తన మనసులో తనకే స్థానం లేదంటుంది. చివరికి ప్రేమనే తనకు దారిచూపించమంటుంది.

కోటి కూర్చిన బాణీ సాధారణంగా ఉన్నా చిత్ర చాలా భావయుక్తంగా పాడారు.

పల్లవి:
ఏ చోట ఉన్నా నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే
రేపులేని చూపు నేనై శ్వాసలేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం ||ఏ చోట ఉన్నా||

చరణం 1:
నేల వైపు చూసే నేరం చేసావని నీలిమబ్బు నిందిస్తుందా వానచినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లితీగ బందిస్తుందా మల్లెపువ్వుని
ఏమంత పాపం ప్రేమా ప్రేమించడం – ఇకనైనా చాలించమ్మా వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవా క్షణమై కరిగే కలవా ||నువ్వే నువ్వే||

చరణం 2:
వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా; నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా; కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటే లేని నా మనసులో – నిన్నుంచగలనా ప్రేమా ఈ జన్మలో
వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా ||నువ్వే నువ్వే||

RTS Perm Link

పాపం చిట్టిబాబు

Oct 3, 2006 Author: శ్రీనివాస | Filed under: చిట్టిబాబు

చిట్టిబాబు కాలేజీలో చేరాడు. తను చిన్నప్పటి నుండీ తెలుగు మీడియమే. ఇప్పుడేమో ఇంగ్లీష్ మీడియమాయె! అదో పెద్ద తలనొప్పి. కాలేజీ తొలి రోజులలో ఎదో ఓ మూల నక్కి నక్కి కూర్చునేవాడు. కొన్ని రోజులకు తన లాంటి వాళ్ళు అక్కడ కొంత మంది ఉన్నారని తెలుసాకా కాస్త ధైర్యం వచ్చింది చిట్టిబాబుకి. నెమ్మది నమ్మదిగా అందరూ పరిచయం అయ్యారు. ఇక విజృంభించడం మొదలుపెట్టాడు. ఖాళీ దొరికినప్పుడల్లా కేంటిన్ లో ఓ గుంపుతో కనిపించేవాడు. అసలే అందగాడు; పైగా మాటకారి. అందరినీ మాటలతో మైమరిపించేవాడు. అందుకే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు అతడికి స్నేహితులైపోయారు.

అందరి ముందు తనకున్న తెలుగు పాండిత్యాన్నంతా చూపించేవాడు. ఎవరన్నా ఏదైనా మాట్లాడితే చాలు, వెంటనే అక్కడి సన్నివేశానికి తగ్గ వేమన పద్యమో, మరేదైనా సెటైరో వేసేస్తాడు. ఎవరితో ఎలా ఉన్నా రజనితో మాత్రం చాలా అణకువగా ఉండేవాడు.తన స్నేహితులు కొందరికి రజనిని తను తెగ ప్రేమించేస్తున్నట్టు గొప్పగా చెప్పేవాడు . కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. రజని మాట్లాడితే చాలు అన్నీ ఇంగ్లీషు ముక్కలే. అందుకే భయపడి ఆమె ముందు ఏమీ మాట్లాడడని అందరూ లోపల అనుకుంటారు.

ఇలా అందరూ కూర్చుని ఉన్నప్పుడు రజని కోసం ఒకడు వచ్చేవాడు . కొత్తలో ఒకసారి ‘హి ఈజ్ మై కజిన్‘ అని పరిచయం చేసింది అందరికీ. మనోడు ఎప్పుడూ బైక్ మీద వచ్చేవాడు. అందరి వంక చూసి ‘మై కజిన్ హేజ్ కం; అయామ్ లీవింగ్. బై‘ అంటూ వెళ్ళిపోయేది. చిట్టిబాబు మాత్రం ‘ఎంటో బామ్మరిది ఎప్పుడూ సీరియస్ గా ఉంటాడు. మనికిలాంటివి పడవు కదా, అందుకే తనకి పరిచయం చెయ్యడం లేదేమో‘ అని మనసులో అనుకునేవాడు. ఎప్పుడు రజనికి తన ప్రేమ సంగతి చెబుదామా అని తెగ ఆలోచించేవాడు

వేలంటైన్స్ డే వచ్చింది. రజనితో ఆ విషయం చెప్పడానికి చిట్టిబాబు ముహూర్తం పెట్టాడు. ఆ రోజు సాయంత్రం అందరూ క్లాస్ బయటకు రాగానే జంట కుదురిన వాళ్ళు బై చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇక టైమ్ వేస్ట్ చెయ్యడం ఎందుకని చిట్టిబాబు రజనితో ‘నీతో పర్సనల్ గా మాట్లాడాలి; ఇప్పుడు మాట్లాడుకుందామా‘ అని అన్నాడు. ‘‘ అని రజని అన్నాదో లేదో గానీ, ఓ బైక్ వచ్చి పక్కనే సడన్ బ్రేక్ వేస్తూ ఆగింది. కజిన్ ని చూడగానే రజని ముఖం వెలిగిపోయింది. ‘వీడొకడు పానకంలో పుడకలాగ. బామ్మరిదిని వెళ్ళిపొమ్మను. నేను డ్రాప్ చేస్తాలే‘ అని విసుక్కున్నాడు చిట్టిబాబు. ‘బామ్మరిది కాదు ఆయన మా బావ‘ అంటూ బైక్ మీద కుర్చుని బావని (కజిన్) గట్టిగా పట్టుకుంది. వాడు గేర్ మార్చి వెళ్ళిపోయాడు. ఒక్కసారి చిట్టిబాబు గుండె గుబేలుమంది. అయినా అందరి ముందు గంభీరంగా కనిపించాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఓ మూలన బూజు పట్టి ఉన్న డిక్షనరీలో కజినంటే ఏంటో వెదికడు. తను ఇప్పటి వరకు కజిన్ అంటే అన్నో తమ్ముడో లేక అక్కో చెల్లో అవుతారని అనుకున్నాడు. ‘వార్ని! పిల్ల జెల్ల కొట్టి పోయిందని అనుకున్నాను. ఇప్పుడు నేను ఎదవనయ్యాను. ప్చ్. నేను తెలుగులో అందరినీ అదరగొడుతుంటే ఇది నన్నే ఇంగ్లీషుతో బురిడీ కొట్టించింది. ఈ ఇంగ్లీష్ వరసలేంటో‘ అంటూ మంచంమీద కూలబడ్డాడు. పాపం చిట్టిబాబు!

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం


Warning: fsockopen(): php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: fsockopen(): unable to connect to udp://whois.happyarts.net:8000 (php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known) in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: stream_set_timeout() expects parameter 1 to be resource, boolean given in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 125