నా స్నేహితుడొకడు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి గ్రాండ్‌బే హోటల్ లో ట్రైనీగా చేరాడు. సాధారణంగా విశాఖపట్నంలో సినిమా షూటింగులేవైనా ఐతే సినీ సిబ్బందిలో ముఖ్యమైనవారు ఏదన్నా ఐదు నక్షత్రాల పూటకూళ్ళ ఇంటిలో దిగుతారు. అలా ఓ సారి నటి సిమ్రాన్ మావాడూ పనిచేసే గ్రాండ్బే లో దిగింది. ఆవిడ లేనప్పుడు మావాడిని ఆమె గదిలోకి వెళ్ళి అన్నీ సర్ది రమ్మని చెప్పాడు మేనేజరు. మావాడు వెళ్ళి చెప్పిన పనులన్నీ చేసి వచ్చేటప్పుడు టేబుల్ మీద కనిపించిన ఒక జడ బ్యాండుని జేబులో వేసుకున్నాడు.

నేను మా వాడిని కలిసినప్పుడు తను చేసిన ఘనకార్యం చెప్పాడు. ఆ బ్యాండులోంచి ఓ వెంట్రుకని తీసి నాకు ఇచ్చాడు. నాకు దాన్ని ఏక్కడ దాచాలో తెలియలేదు. చివరికి నా దగ్గర ఉన్న రేనాల్డ్స్ పెన్ తెరచి ఓ కొసని రీఫిల్‌లో ఉంచి మిగిలిన దాన్ని రీఫిల్ చిట్టూ చుట్టాను.

ఆ మర్నాడు మా క్లాస్‌లో ఏదో బోరు కొట్టించే పాఠం చెబుతున్నారు. నేను సరదాగా మా సహ విద్యార్దులకు ఆ కుంతలాన్ని చూపించాలనుకున్నాను. సిమ్రాన్‌ది అని చెబితే మావాళ్ళు వెటకారమాడతారని దాన్ని నా ప్రేయసి తల వెంట్రుక అని చెప్పి వాళ్ళకి చూపించాను. ఇంతలో మావాడొకడు దాన్ని లాక్కున్నాదు. అది కింద పడిపోయింది. ఇంకెందుకని వాళ్ళతో నిజం చెప్పేసాను. వాళ్ళూ నేల మీద వెతకారు; కనిపించలేదు. క్లాస్ అయిపోగానే ల్యాబ్‌కి వెళ్ళాలి. ఇంక చేసేదిలేక అందరూ ల్యాబ్‌కి వెళ్ళిపోయాం. తర్వాత ఆ సంగతి మర్చిపోయా. నిన్న ఆ గ్రాండ్‌బే స్నేహితుడికి ఫోన్ చేసినప్పుడు ఈ విషయం గుర్తొచ్చి, చాలా రోజులకి మళ్ళీ ఇలా సమయం కలిసొచ్చి ఇది రాస్తున్నాను. మా ఆంధ్రా యూనివర్సిటీ చుట్టుపక్కల ఎక్కడ దాగిపోయెనో ఆ కాంతా కుంతలం.

RTS Perm Link