కిరికెట్టు వీరుడు…
రాసినవారు శ్రీనివాస on Monday, 12 of March , 2007 at 1:01 pm
అదో క్రీడా మైదానం. అక్కడ ఓ పదిహేను మంది తెగ ఆడేస్తున్నామని ఫీలయిపోతుంటే ఓ పాతికవేలమంది దాకా పోగయి చూస్తుంటారు. చప్పట్లు, కేరింతలు, గోలగోల. పేడ్ హెల్మెట్ గ్లోవ్స్ కవచ ధారుడైన శ్రీమాన్ తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. తను తప్పకుండా జట్టులో ఉండాలని పట్టు బట్టి తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసిన కెప్టెన్ ఓ పక్క; తనంటే పడని కోచ్ ఓ పక్క. చుట్టూ చూసాడొక్కసారి. పిచ్చి జనం తెగ గెంతుతున్నారు అని అనుకుంటూ ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు.
“అయ్యో అనవసరంగా ఆ కాంట్రాక్టు మీద సంతకం పెట్టేసానే! 150 కోట్లు కనిపించేసరికి ఇంకేమీ ఆలోచించలేదీ ఎదవ బుర్ర. మళ్ళీ ఐదేళ్ళ వరకూ అలాంటి కాంట్రాక్టు ఒప్పుకోకూడదు ఎలాగబ్బా. ఆ 250 కోట్లది ఏదో ముందే వస్తే బాగుండేది కదా! రేపటి గురించి ఆలోచిస్తుంటే ఒళ్ళు జలదరించిపోతుంది. పైగా ఒంట్లో ఎక్కడ కీలుంటే అక్కడ ఆపరేషన్ చేసి పడేసారు ఈ డాక్టర్లు. మేచ్ ఫిక్సంగ్ చెయ్యడానికి కూడా ఎవడూ ఒప్పుకోవడం లేదిప్పుడు” అని లోపల్లోపల బాదపడిపోతున్నాడు.ఇంతలో దూరంగా ఓ కూల్‌డ్రింక్ కటౌట్ కళ్ళబడింది. “హమ్మయ్య. ఇదొకటుంది కదా. ఈసారి ఎక్కువ రాబట్టుకోవాలి వీళ్ల దగ్గర్నుంచి. కొన్ని రోజుల క్రితం వరకు జనం హడావిడి చేశారు దీనిలో ఏదో పురుగుల మందు కలుపుతున్నారని. వీళ్ళకి దాహం వేస్తే నీళ్ళు తాగొచ్చుగా… ఇది తాగి నా కడుపెందుకు కొడుతున్నట్టో…” అని అనుకుంటుండగా జనాల కేకలు మరీ ఎక్కువవడంతో మైదానంలోకి చూసాడు. ఎవడో ఔటయి వచ్చేస్తున్నాడు. అబ్బో తన వంతు వచ్చిందిప్పుడు. బద్దకంగా లేచాడు. కేప్టెన్ వచ్చి భుజం తట్టి పంపించాడు.
వెర్రాభిమానుల కోలాహలం మద్య రంగ ప్రవేశం చేసాడు. హెల్మెట్ దగ్గర నుండి బూట్ల వరకు అన్నింటి మీదా రకరకాల కంపెనీల లోగోలు. ఇప్పుడు తను ఓ ఆటగాడు కాదు. వివిధ రకాల ఉత్పత్తులకు ప్రకటనదారుడు. రకరకాలుగా వాటిని ప్రదర్శిస్తూ అప్పుడప్పుడూ ఒకటీ అరా పరుగులు తీస్తూ ఇంక ఓపిక లేక ఔటయిపోయాడు. అభిమానుల ఆశలను నీరగార్చానన్న భాద ఏ కోశానా కనిపంచడం లేదు శ్రీమాన్ ముఖంలో.
వచ్చి కుర్చీలో చతికిలపడిపోయాడు. హమ్మయ్య ఓ పనైపోయిది బాబూ అనుకుంటూ పక్కనే ఉన్న సెల్‌ఫోన్ అందుకున్నాడు. అందులో ఓ ‘మిస్’డ్ కాల్ కనిపించింది. టైం చూసాడు. ఇంత క్రితమే వచ్చినట్టుంది. “డామిట్! నగ్మా కాల్ చేసింది. ఛ మిస్సయ్యానే. ఆడు పట్టుకున్న కేచేదో ముందే పట్టేసుకుని ఉండొచ్చుకదా.” అని అనుకుంటూ బుర్రపట్టుకున్నాడు దిగులుగా.
అభిప్రాయాలు (3)
వర్గములు: వ్యంగ్యం
- ఈ టపాను వీటికి జతచేయండి
- Del.icio.us -
- Meneame -
- Digg
అది స్మయిలా లేక మదనుడు వదిలిన మిస్సయిలా… నా హార్టే మిస్సయిపోయిందే చెలియా…

పేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం