తలకట్టు, వట్రువసుడి, తీయదనమూ…
ఎవరినీ మెప్పించలేకపోతున్నాయ్!
నేటి కాలపు గందరగోళాన్ని వర్ణించలేక పోతున్నాయ్!
అందుకేనేమో సాలార్జంగు మ్యూజియంలో  ఓ గది …
తెలుగక్షరాల్ని నింపుకోవడానికి ఆబగా ఎదురుచూస్తూంది.

నా మనవడు… చాలా ఎదిగిపోయాడు…
ఉగాది రోజు బారెడు పొద్దెక్కినా లేవలేదు…
స్నేహితుల దినాన ఓ వెయ్యినోటు చేతబట్టుకుని…
ఉదయాన్నే హుషారుగా  పోయాడు  తిరుగుళ్ళకి…

ఇక మునుముందు తరాలన్నీ అనాథలమయం…
ఎవరికీ అమ్మానాన్నలుండరు…
వాళ్ళే పిల్లలకి నూరిపోస్తున్నారు మమ్మీడాడిలంటూ…
వాళ్ళకి సవతులు వాళ్ళే!

అందమైన అమ్మాయి; చేతిలో పుస్తకాలు…
కనిపించకుండా తాళి; కాళ్ళకేమో మట్టెలు…
మధ్యాహ్నమాటకి ఐమాక్స్‌కి వచ్చింది…
పక్కనుంది మొగుడా లేక బాయ్‌ఫ్రెండా?

పక్కింటి సుబ్బారావుగారు…
దగదగా మెరిసే పట్టు వస్రాలతో వెలిగిపోతుంటారు…
కొడుకు సంపాదన ఇంట్లోకి ఒంట్లోకి  అన్నీ కొనిపెడుతుంది…
మనసులో వెలితిని మాత్రం నింపలేకపొతుంది…
వాడెప్పుడొస్తాడో మరి అమెరికా నుండి!

ఆ రోజుల్లో అయితే… చిన్నపిల్లల్లా బయట అందరమూ చేరి…
దీపావళి రోజున పటాసులు గట్రా కాలుస్తూ తెగ ఆనందపడిపోయేవాళ్ళాం…
ఇప్పూడేమో రోజూ బయట ఎవడేం పేలుస్తాడో అని ఇంట్లోనే మగ్గిపోతున్నాం.

RTS Perm Link