ఎన్ని వేల వర్ణాలో…

Archive for January, 2008


నేనొక శిల… తానొక అల…

Jan 27, 2008 Author: శ్రీనివాస | Filed under: కవితలు, స్వగతం

నేనొక శిలలా ఉంటే ఒడ్డున…
తానొక అలలా చేరెను చెంతన

ఆ పరిచయం ఓ ఉలిలాగ నన్నే తడిమింది…
ఈ రాయినే ప్రాణమున్న శిల్పంగా మలచింది

నాలో చలనం కలిగే వేళ తానెళ్లిపోయింది…
మరుపే ఎరుగని గురుతులు వదిలి మాయమయ్యింది

అది స్నేహమో… అనురాగమో… మమకారమో…
తెలియనితనమో… తేలనితనమో… కాలం చేసే మాయాజాలమో

తన కోసం ఈ ఎదురుచూపులు…
నా చిన్ని గుండెలో వేల నిట్టూర్పులు

RTS Perm Link

శ్రీ శోధన ప్లగ్‌ఇన్

Jan 23, 2008 Author: శ్రీనివాస | Filed under: సాంకేతికం

మీలో ఎవరైనా thefreedictionary.com సైటుకు వెళ్లుంటే అక్కడ ఉన్న ఒక వెసులుబాటు తెలుసుంటుంది. ఆ వెబ్‌పేజీ మీద కనిపించే ఏ పదాన్నయినా డబుల్‌ క్లిక్ చేసినప్పుడు ఆ పదానికి అర్థం ఉన్న వెబ్‌పేజీ తెరచుకుంటుంది. దాన్ని చూసినప్పుడు కలిగిన ఆలోచనకు ప్రతి రూపమే ఈ శ్రీ శోధన ప్లగ్‌ఇన్. ఇది పూర్తిగా జావాస్క్రిప్ట్‌లో రాయబడింది. యూనీకోడ్ సపోర్టు ఉంది. జావాస్క్రిప్ట్ కోడ్ జోడించడానికి వీలున్న ఏ వెబ్‌పేజీలోనయినా దీనిని ఉపయోగించవచ్చు. మీరు చెయ్యవలసిందల్లా…

<script src=”http://harivillu.org/plugins/srisodhana.js”></script> ని మీ వెబ్‌పేజీలో ఉంచడమే.  ( ప్రస్తుతం దీన్ని పాటిస్తే మంచిది; ఎందుకంటే దీనిని మరింత క్రియాత్మకంగా చేయవలసి ఉంది. కాబట్టి ముందు ముందు ఏమన్నా మెరుగుపరిస్తే అది మీ సైట్‌లలో వెంటనే ప్రతిఫలిస్తుంది ).

లేదా

srisodhana.js ఫైలును మీ సైటులోకి ఎగుమతి చేసుకుని దానిని ఉపయోగించుకోవచ్చు.

ప్రస్తుతం ఇది ఐఈ, ఫైర్‌ఫాక్స్, నెట్‌స్కేప్‌లలో పనిచేస్తుంది. ఒపేరాలో డబుల్‌క్లిక్ ఈవెంట్‌ని స్వంత పాప్‌అప్ కోసం ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇది పనిచేయదు.

srisodhana-ss01.gif

ఈ ప్లగిన్ వలన ఉపయోగమేమంటే మీరు ఏదన్నా పదం మీద డబుల్‌క్లిక్ చేసినప్పుడు ఒక చిన్న పాప్‌అప్‌ని చూపిస్తుంది. దానిలో మీకు తెవికీ, గూగులమ్మ, బ్రౌను అని మూడు ఎంపికలు కనిపిస్తాయి.  వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. వాటి కింద మీరు డబుల్‌క్లిక్కిన పదానికి అక్షరాలు తగ్గిస్తూ ఉన్న మరికొన్ని పదాలకు లింకులు కనిపిస్తాయి. మీకు కావలసిన పదం మీద క్లిక్కితే మీరు పైన ఎంచుకున్న సైటులో ఆ పదం తాలూకు పేజీని తెరుస్తుంది.

ఈ బ్లాగులోనే మీరు డెమో చూడొచ్చు. ఏదన్నా పదం మీద డబుల్‌క్లిక్ చెయ్యండి మరి.

RTS Perm Link

అందమె ఆనందం కాదు సుమా!

Jan 20, 2008 Author: శ్రీనివాస | Filed under: స్వగతం

అంతర్ సౌందర్యంఅందమె ఆనందం అని అంటారు. ముఖ్యంగా ఎవరినన్నా అందమైన ఆడవారిని చూసినప్పుడు ఈ మాట గుర్తుకొస్తుంది. నేనూ ఇలానే అనుకునేవాడిని. కొన్ని సార్లు ఏ టీవీలోనో, సినిమాలోనో అందాలను చూసి దాసోహమైన క్షణాలూ ఉన్నాయి. ఒకసారి ఈ టపాలో స్నేహితుడి మనసులో మాటకి తన అభిప్రాయంగా అమ్మాయిలో చూడాల్సింది వ్యక్తిత్వం, అత్మాభిమానం అని జేప్స్ అనుకుంట రాసారు. అప్పుడు నేను ఇలా సినిమా కబుర్లు చెప్పేవారు తమ ఇళ్ళల్లో పూల మొక్కలకు బదులు బ్రహ్మజెముడు, తుమ్మ చెట్లను పెంచుకుంటారేమోనని సరదాగా అనుకున్నాను. ఏదైనా అనుభవమైతే గానీ విషయం ఒంటబట్టని నాలాంటి వాళ్లకి కాలమే తాయితీగా సమాధానం చెబుతుంటుంది. చెప్పేసింది కూడా.

మనకు పరిచయం కాని వారిని మనం చూసినప్పుడు ముందుగా వాళ్ల రూపం మన మీద ప్రభావం చూపుతుంది. అది సహజాతమైనదని నేననుకుంటాను. వాళ్లతో పరిచయ భాగ్యం కలిగి కాస్త చనువు పెరిగిన తర్వాత గానీ వాళ్ళేంటో మనకు తెలియదు. అప్పుడు మాత్రమే మనం ఓ మామూలు రూపంలో ఒదిగిన అనూహ్య మానసిక సౌందర్యాన్ని చూడగలం (వీళ్ళు మన వ్యక్తిగత జీవితంలో ఒక భాగమైతే ఎంత బాగుండునో అనిపిస్తుంది), అప్పుడు మాత్రమే ఓ కోమలిలో దాగిన కాఠిన్య హృదయాన్నో లేదా  పసిడి వన్నెచాటున పొంచి ఉన్న నీలినీడలనో చూడగలం (వీళ్ల గురించి అసలు ఆలోచించకూడదనిపిస్తుంది).

మంచుపొర అడ్డు ఉన్నన్నాళ్ళూ కళ్ళ ముందు ఉన్నది ఎడారో.. పూలవనమో.. సంద్రమో.. తెలియదు కదా! ఇదీ అంతే.

చివరిమాట: ఇంతకు ముందు నేను రాసిన నిజసౌందర్యం ఊహించి రాసింది; కానీ ఇది మాత్రం అనుభవైక వేద్యమైనదే.

RTS Perm Link

బస్సులకు రెక్కలొస్తాయ్…

Jan 2, 2008 Author: శ్రీనివాస | Filed under: మనోగతం

ఏదన్నా పండగొస్తే చాలు.. ఎవరు ఎలా చేసుకున్నా, ఈ ప్రవేటు బస్సువాళ్ళు నిజంగా పండుగ చేసుకుంటారు. ఆ కొన్ని రోజులూ వాళ్ళ బస్సులకు (అంటే రేట్లకు) రెక్కలొస్తాయ్. విశాఖపట్నం వెళ్లాలంటే ఓ వెయ్యి నోటు వదులుకోవాల్సిందే. ఆర్టీసీ బస్సులకు ముందే అయిపోతాయి. ఈ ప్రవేట్ వాళ్లు లేవు లేవంటూనే బ్లాకులో వెయ్యికి పైనే గుంజుతారు (అసలు రేటు 600 చిల్లర). ఆ సమయంలో ఏమీ చేయలేక కొనాల్సొస్తుంది. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. ఆర్టీసీ వాళ్ళు కూడా తెలివిగా టిక్కెట్టులన్నీ బ్లాక్ చేసేసారు. ఇక ప్రవేటు వాళ్లు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఆన్‌లైన్‌లోనే రెట్టింపు రేట్లతో విక్రయిస్తున్నారు. ధనుంజయ, కేశినేని ట్రావెల్స్ సైట్లకెళ్లి 11 వ తారీఖున టిక్కెట్టు వెల చూడండి. 1200/1300 రూపాయలు ఉంటుంది. అయినా మొత్తం అమ్ముడైపోయాయి. ఒకొక్కసారి ఆవేశమొచ్చి ఈ సైట్లను హ్యాక్ చేసిపడెయ్యాలని ఆవేశమొస్తుంది గానీ మనకింకా అంత సీను లేదని తెలుసుకుని మిన్నకుండిపోతాను.

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం