గతమది… వర్తమానమిది…అవి విజయవాడ కృష్ణవేణిలో ECET కోచింగ్ తీసుకుంటున్న చివరి రోజులు… ఆ సంస్థకు అంత మంచి పేరుంది అప్పట్లో… జనాలు కూడా అలానే ఉండేవారు… అక్కడ ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిర్వహించే పరీక్ష కన్నా ముందు వీళ్ళు ఒక పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మంచి ర్యాంకు వస్తే అసలు పరీక్షలోనూ అలానే వస్తుందని అందరి నమ్మకం. ఆ సంవత్సరమూ జనం బాగానే రాసారు. ఫలితాలు చెబుతునప్పుడు క్యాంపస్ మధ్యలో ఉన్న ఖాళీ స్థలం నిండిపోయింది. కార్యక్రమమంతా అయిపోయాకా పెద్దాయన వరప్రసాద్ గారు అబ్బాయిలని మాత్రమే ఉండమని చెప్పి అమ్మాయిలని బయటికి పంపించి గేట్లు మూయించేసారు. ఎందుకు ఉండమన్నారో అర్థం కాలేదు మాకు.

పెద్దాయన చెప్పడం మొదలుపెట్టారు. అందరూ బాగా చదివి పరీక్ష బాగా రాయాలని చెప్పారు. ఇలా చెబితే ఎవరి బుర్రకెక్కుతుందన్నట్టు ఆయన ధోరణిలో విషయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు చదువులోను ఉద్యోగాలలోను అమ్మాయిలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకన్నా వాళ్ళు చలాకీగా చదువుతున్నారు. వాళ్ళకీ రేపు ఇంజనీరింగ్ పూర్తి చేస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి. మీరూ పెద్ద చదువులు చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకోకపోతే మిమ్మల్ని ఏ అమ్మాయీ పెళ్ళి చేసుకోదు. తర్వాత బాధ పడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. బాగా చదవండి అని హితభోద చేసారు. ఆ సంగతి ఎప్పటిదో…. అప్పుటికి IT పరిశ్రమ దేశాన్ని అంతగా కబళించలేదు. అంతే కాకుండా మనవాళ్ళకి విదేశాలలో ఇంతిలా ఉద్యోగాలూ లేవు. అప్పుడు ఉద్యోగమంటే గవర్నమెంటు ఉద్యోగమే. డబ్బుంటే ఓ లక్షో రెండు లక్షలో పాడేస్తే జీవితంలో సెటిలైపోవచ్చు; ఆ రాజకుమారుడికి ఇక యువరాణి దొరకడం ఎంతసేపు చెప్పండి :-).

ఇక ఇప్పటి విషయానికొస్తే మొన్న పేపరులో ఒక వార్త చదివాను. అమ్మాయిలెవరూ గవర్నమెంటు ఉద్యోగులని పెళ్ళిచేసుకోవడానికి ఇష్టపడడం లేదట పాపం. దాని గురించి అంత ఆలోచించలేదు గానీ, ఈ మధ్య నా స్నేహితురాలి ఆలోచనా విధానాన్ని తెలుసుకుని జీర్ణించుకోలేకపోయాను. ఇక్కడ తనను ఇష్టపడేవాళ్ళున్నా ఇంట్లో వాళ్ళు చూస్తున్న అమెరికా ( వాళ్ళు ముద్దుగా Aliens అంటుంటారు) వాడి కోసం ఎదురు చూస్తున్నాదట. బహుశా అందరూ అలా ఉండకపోవచ్చు; కానీ అలా ఉండరనుకునేవాళ్ళు కూడా అలా ఆలోచిస్తుంటేనే కాస్త బాదగా ఉంటుంది. ఇప్పుడు మా పెద్దాయన మాటలు పాతబడిపోయాయని అనిపిస్తుంది. రాజ్యాంగాన్ని సవరించినట్టు మనమే సవరించుకోవాలి.

నిన్నలా… నేడిలా… మరి రేపెలా ఉంటుందో… (మూన్ మీదకి హనీమూన్‌కి తీసుకెళ్ళేవాడి కోసం వెతుకుతారేమో…)

RTS Perm Link