హకూనా మటాటా

రాసినవారు శ్రీనివాస on Tuesday, 25 of March , 2008 at 11:28 am

హకునా మటాటా బొమ్మ 01జల్సా పాటలు బాగానే ఉన్నాయి. కొన్ని పాటల్లో తెలుగు సరిగ్గా వినిపించకపోయినా ట్యూన్ పరంగానో అర్థం పరంగానో నచ్చాయి. వాటిలో ఈ పాటొకటి. దేవిశ్రీ ప్రసాద్ ఇలాంటి పాటల్ని అద్నాన్ సమీ తో పాడిస్తారు. ఈ పాటని దేవిశ్రీనే పాడటం వలన ఆ కొంత తెలుగయినా వినబడగలిగింది. ఇక పాట రాసిన సిరివెన్నెల గురించి చెప్పక్కరలేదు :-) .

ఈ పాటలో వినిపించే “హకూనా మటాటా” అనే పదానికి అర్థం “దిగులేమీ లేదు/ఇబ్బందేమీ లేదు”. ఇంగ్లీషులో చెప్పాలంటే “no problem” అని. ఈ పాటకి పరమార్థం కూడా అదే. ఇది తూర్పు ఆఫ్రికాలో మాట్లాడే స్వాహిలి అనే భాషాపదం. “ది లయన్ కింగ్” అనే ఆంగ్ల చిత్రంలో ఈ పేరు మీద ఉన్న పాట అప్పట్లో ప్రాచుర్యం పొందింది.

ఇక జల్సా సినిమాలో పాట ఇది

( ఈ పాట కాపీరైటు హక్కులు అన్నిన్నూ జల్సా సినిమాకు సంభందించిన వాళ్ళకే చెందుతాయని ఈ బ్లాగ్ ముఖంగా తెలియజేసుకుంటున్నాను :-) )

పల్లవి:
ఏ జిందగీ నడవాలంటె హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే,
హిరోషిమా ఆగిందా ఆటంబాంబేదో వేస్తే
చల్ చక్‌దే చక్‌దే అంటే, పడినా లేచొస్తామంతే
హకూనా మటాటా అనుకో తమాషగ తల ఊపి
వెరైటిగా శభ్ధం విందాం అర్థం కొద్దిగ సైడుకి జరిపి
అదే మనం తెలుగులొ అంటే డోన్ట్ వరీ బీ హేపీ
మరో రకంగా మారుద్దాం కొత్తదనం కలిపి

You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle

ఏ జిందగీ నడవాలంటె హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే,
హిరోషిమా జీరో ఐందా ఆటంబాంబేదో వేస్తే
చల్ చక్‌దే చక్‌దే అంటే పడినా లేచొస్తామంతే

చరణం:
ఎన్నో రంగుల జీవితం, నిన్నే పిలిచిన స్వాగతం
విన్నా నీలో సంశయం పోదా…
ఉంటే నీలో నమ్మకం, కన్నీరైనా అమృతం
కష్టం కూడా అద్భుతం కాదా…
బొటానికల్ భాషలో పెటల్సు పూరేకులు
మెటీరియల్ సైన్సులో కలలు మెదడు పెట్టు కేకలు
మెకానికల్ శ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరిభాషలో మధురమైన కధలు

|| You and I ||

|| ఏ జిందగీ ||

చరణం:
పొందాలంటే విక్టరీ, పోరాటం కంపల్సరీ
రిస్కంటే ఎల్లా మరి… బోలో…
ఎక్కాలంటే హిమగిరి, ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే హిస్టరీ… లిక్‌నా…
ఉటోపియా ఊహలో అటో ఇటో సాగుదాం
యుఫోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం
అనాటమీ ల్యాబులో మనకు మనము దొరకం

|| You and I ||

ఈ పాటలో నాకు నచ్చినవి:
హిరోషిమా జీరో ఐందా ఆటంబాంబేదో వేస్తే
చల్ చక్‌దే చక్‌దే అంటే, పడినా లేచొస్తామంతే
కాలం మొక్కే హిస్టరీ… లిక్‌నా…
అనాటమీ ల్యాబులో మనకు మనము దొరకం

RTS Perm Link

వర్గములు: పాటలు

21 అభిప్రాయాలు

Chilakapati Srinivas యొక్క అభిప్రాయము

Made Tuesday, 25 of March , 2008 at 4:01 pm

ఒక పసలేని పాట. అన్ని భాషల కలగాపులగం అవసరమా? హస్తే హస్తే జిందగీ నడవాలంటే నదిలో దిగి మరీ ఎదురీదడమెందుకో తెలియదు. స్వాగతం పిలిచిందా లేక పలికిందా?
ఇదే భావాన్ని ఇంతకుముందు చాలా పాటల్లో ఇంతకంటే మెరుగ్గా చెప్పిన గుర్తు. సిరివెన్నెల ఇక పాటలు రాయకుండా ఉండడమే మేలేమో!

chavakiran యొక్క అభిప్రాయము

Made Tuesday, 25 of March , 2008 at 6:31 pm

బాగుందండీ, హకూనా మటాటకి నేను కూడా ఫ్యాన్ నే.

Anonymous యొక్క అభిప్రాయము

Made Tuesday, 25 of March , 2008 at 9:14 pm

I fully agree with Chilakapati Srinivas

నవీన్ గార్ల యొక్క అభిప్రాయము

Made Tuesday, 25 of March , 2008 at 10:19 pm

@Chilakapati Srinivas
జనాలు సిరివెన్నెల గురించి చాలా పొరపడుతున్నారు.
దర్శకుడి సృజనాత్మకత తరిగిపోయినంత సులభంగా కవి కలం అరిగిపోదు. 30,000+ పాటలు వ్రాసిన సిరివెన్నెలనా మీరు ఈ మాటన్నది? దర్శకుడు ఎలా కావాలంటే అలా వ్రాస్తాడు కవి. స్వర్ణకమలంలో ఒక్కో పాటకి వంద వర్షన్ల పైనా వ్రాశాడంట. కావల్సిన భావం వచ్చేంత వరకు దర్శకుడు విశ్వనాథ్ వదల్లేదు సిరివెన్నెలను. సందర్భం చక్కగా వివరించి, పాత్రలను బాగా పరిచయం చెయ్యాల్సిన బాధ్యత దర్శకుడిదే. “ఈ కాలం యువతకు నచ్చే మంచి trendyగా ఉండే ఒక జాలీ జల్సా పాట కావాలండి” అని దర్శకుడు చెబితే ఏ కవైనా ఇలాగే వ్రాస్తాడు. పైగా ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ ఫింగరింగ్ ఉంటుందాయె. అతనికి హిందీ పాటలు, మాటలు జొప్పించడం ఒక మోజు. ఇదే సినిమాలో పాటలను బాగానే వ్రాశాడు. “టీ స్పూను టన్ను బరువయ్యిందే…సెల్ఫోన్ స్టెన్ గన్నులా పేలిందే” అని గమ్మత్తుగా ఉన్నాయ్. సందర్భం అర్థం లేని గాలి పాటను వ్రాయడం సినిమా రంగంలో ఏ కవికైనా తప్పదు…అంత మాత్రనా అతన్ని వ్రాయడం మానెయ్యమంటే ఎలా?

శ్రీనివాస యొక్క అభిప్రాయము

Made Tuesday, 25 of March , 2008 at 11:06 pm

@ శ్రీనివాస్ గారూ, అవునండీ ఈ పాట కలగాపులగమే :-) . “ఏ జిందగీ” ని “ఈ జీవితం” అనొచ్చు కానీ దానికి మిగిలిన వారి ఆమోదముద్ర కూడా కావాలి కవికి. వాళ్ళూ మనలాగ నచ్చినవే రాయాలంటే బ్లాగులు మొదలు పెట్టాలి. అప్పుడు వాళ్ళ చెయ్యి నోట్లోకి పోదు కదండీ :-) . కవికి తప్పని వాటి గురించి మనం ఆ కవినే నిందిస్తే ఎట్లా! నవీన్ చెప్పినట్టు మిగిలిన పాటలు బాగున్నాయి కానీ ఎందుకో ఆ ప్రేమ పాటల్ని ఇక్కడ రాయాలనిపించలేదు. ఈ పాటలో నాకు ఎందుకో కొన్ని లైన్లు నచ్చాయి. అందునా “హకూనా మటాటా” అంటే నాకు ఇష్టం కూడా. ఇలాంటిదే ఒకటి ఆటలో పాట కూడా తాట తీస్తుంది.

yogendra యొక్క అభిప్రాయము

Made Wednesday, 26 of March , 2008 at 3:04 am

సిరివెన్నెల లాంటి వారే పాటలు రాయటం మానెయ్యాలంటే, తెలుగు సినెమాల్లో పాటలు అనే ప్రక్రియను పూర్తిగా తొలగించెయ్యొచ్చు.

Chilakapati Srinivas యొక్క అభిప్రాయము

Made Wednesday, 26 of March , 2008 at 9:49 am

@naveen, Srinivas, Yogendra

సిరివెన్నెల మంచి పాటలు రాయలేదని కాదు, రాయలేడనికాదు. ఇలాంటి పాటలు సిరివెన్నెలే రాయక్కర్లేదు, చంద్రబోస్ దగర్నుంచి రామజోగయ్య దాకా ఎవరయినా రాయగలరు. ఈ స్థితికి దిగజారవలసిన అవసరం సిరివెన్నెలకి లేదనే అనుకుంటున్నాను.

రాజేంద్ర యొక్క అభిప్రాయము

Made Wednesday, 26 of March , 2008 at 10:16 am

సిరివెన్నెల ప్రతిభాపాటవాల గురించి ఎవరికీ అనుమానాలు లేవు గానీ,నవీన్ గార్ల గారు,మీరన్నట్లు 30,000+మీద నాకు కాస్త సందేహం.1986లొ వచ్చిన సిరివెన్నెల సినిమాతో ఆయన చిత్రగీతాలు రాయటం ప్రారంభించారు.ఈ ఇరవై రెండేళ్ళలో కనీసం ఆరువేల సినిమాలకు సినిమాకు అయిదు పాటల చొప్పున రాసినా మీరన్న అంకె అందటం లేదు నాకు.అసలు ఆరువేల సిన్మాలు ఈ సమయంలొ వచ్చాయా?వచ్చినా అన్ని సినిమాల్లోనూ ఆయనొక్క్డడే రాశారా?బాగా తీస్తే సంవత్సరానికి 150 సినిమాలనుకున్నాఇరవై రెండేళ్ళలో ఎన్నవుతాయి?వాటిలో ఆయనవి ఎన్ని?మీరు ఆయనకు ఎంత వీరాభిమాని అయినా లెక్కలు చూడకుండానా??

నవీన్ గార్ల యొక్క అభిప్రాయము

Made Wednesday, 26 of March , 2008 at 9:21 pm

@రాజేంద్ర గారు,
ఆయన సినిమాల్లో వాడుకోని పాటల్ని కూడా కుప్పలు తెప్పలుగా వ్రాశారంట.
ఆ ముప్పై వేల నంబరును గ్రేటాంధ్రాలో చదివా (http://www.greatandhra.com/ganews/viewnews.php?id=6091&scat=4).
అసలు పాటల వర్షన్లు కూడా కలిపితే నంబరు అంతకన్నా చాలా ఎక్కువే అని చెప్పాడు.
(మీరు చెప్పిన తరువాత లింకులోని న్యూసు మళ్ళీ చూశా. మూడు వేలు, మూడు లక్షలు చెప్పాడు..నేనే దాన్ని చూసి ముప్పై వేలనుకొని ఉన్నా. ఏమైనా మీ సందేహాన్ని, విశ్లేషణను వ్రాసినందుకు నెనర్లు :) )

Anonymous యొక్క అభిప్రాయము

Made Thursday, 27 of March , 2008 at 6:49 am

-సిరివెన్నల చెయ్యి నోట్లో కి పోవటానికి సినిమా పాటలు పత్తుకోలెదు, కడుపు లొ చల్ల కదలకుండా తపాలాశాఖ లొ ఉద్యొగం ఉంటే, వదిలి, ఎడమచేతి వేల్ల మధ్య కాలే సిగిరెట్టు, కుది చేతివేల్ల మధ్య కదిలే కలమూ ఉంటే కాని నాకు మనశ్శంతి ఉండడు అని “విపంచినై వినిపించితినీ” అంటూ విశ్వనాథ ని ఒప్పింఛి, జన హృదయాలను మెప్పించి వచ్చారు.
ఒక్కోక్కపాటకి అన్ని “వర్షనులు” వర్షింప చేయగలిగిన ఆయన, ఓ సారి ఆయన పాటలని ఆయనే “రివ్యూ” చేసుకుంటే బావుంటుంది.
విధాత తలపులని నెత్తినపెట్టుకున్నవాళ్లకి, జగమంత గందరగోళాన్ని విమర్శించే హక్కు కూడా ఉండలి కదా
అనేది మంచి మాట, ఇంకో గమనించ వలసిన విషయం ఏమీటి అంటే మనం ఈ దిశగా నే సాగుతున్నాం, పాటలోని పదాలని చిత్తు చిత్తుగా ఓడింఛి, ఓ దశాబ్దం క్రితమే పాటలోని “మ్యూజిక్” గెలిచింది. ఇప్పుదు వచ్చే పాటాలన్ని, “మ్యూజిక్” కోసమో, హిరోహీరోయిన్లు ఎగరటానికో వచ్చేవే కాని, సన్నివేశాన్ని బట్టి కాదుకదా.అంతే కాదు, మిరు ఏ సినీ సమీక్షని కాని, ఆడియో రివ్యూని కానీ చూడండి, (సినీ పత్రికలతో సహా)ఒక్కడూ పాటల గురుంచి మాట్లాడదు, మహా ఐతే “సాహిత్యం బావుంది” అనొ ‘సాహిత్యం సో సో’ అనో అంటాడు. శ్రిరాం గారు, కొత్తపాలీ గరు, వికటకవిగారు, ఇక్కడ స్రినివాస గారు, “సిని సాహిత్య మెరుపలు” బ్లాగరి గారు, మంచి సాహిత్యన్ని కొనియాడటం, బాగాలేని దాన్ని బాగాలేదు అని చెప్పటాం ఆనందించతగ్గ, అభినందిచవలసిన, ఆహ్వానింవలసిన, ఆశాహాఅహ పరిణామం. బహుశః నవతరంగం వారు కూడా.

శ్రీనివాస్ గారు చెప్పినట్టు చంద్ర బోసి పొయ్యే పాటకి సిరివెన్నెల ఎందుకు?

శ్రీనివాస యొక్క అభిప్రాయము

Made Thursday, 27 of March , 2008 at 9:57 am

Anonymous గారూ, ఇక్కడ ఎవ్వరి అభిప్రాయమైనా ఆహ్వానించదగినదే. మీరు మీ పేరుతో అభిప్రాయం రాస్తే ఒక సాహితీ మిత్రుడి పరిచయం దొరికుండేది మాకు :-)

నవీన్ గార్ల యొక్క అభిప్రాయము

Made Thursday, 27 of March , 2008 at 10:03 pm

@Anonymous,
>> చంద్ర బోసి పొయ్యే పాటకి సిరివెన్నెల ఎందుకు?
నిజమే…ఆ బుద్ది దర్శకుడికి ఉండాలి లేదా ఇలాంటివి వ్రాయను అని చెప్పే సాహసం శాస్త్రికైనా ఉండాలి. ఐనా మన ఈ-తెలుగు సంఘానికి ఈ పాట నచ్చకపోవచ్చు కానీ బయట జనాల్ని అడగాలి ఎలా ఉంది పాట అని :)

chavakiran యొక్క అభిప్రాయము

Made Friday, 28 of March , 2008 at 3:16 am

ఆర్యా!

అనవసరంగా ఈ తెలుగు సంఘాన్ని ఇందులోకి లాగకండి :)

అది ఒక నాన్ ప్రాఫిటబుల్ నాన్ గొడవలబుల్ సంష్థ :)

సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలతో దానికి నిమ్మితం లేదు, ఏదైతే ఈతెలుగు డాట్ ఆర్గ్ పై ఉన్నదో అదే అఫిషియల్ పాలసీ అని మనవి.

కొత్తపాళీ యొక్క అభిప్రాయము

Made Friday, 28 of March , 2008 at 8:46 am

ఒక్కోసారి, అసలు టపాకన్నా వ్యాఖ్యలు చాలా గొప్ప రుచిగా ఉంటాయ్ .. అట్లాంటి వ్యాఖ్యలు పుట్టడానికి కారణమైనందుకు ఆ టపా రచయితల్ని అభినందించాలి.
శ్రీనావాసా .. అభినందనలు!!
పైన యనానిమస్సుగారి వ్యాఖ్య మెరిసే చమత్కారాలతో అద్భుతంగా ఉంది, దారుణమైన ముద్రారాక్షసాలని మినహాయిస్తే - పేరు లేకుండా రాయడమే నచ్చలేదు. ఒక సాహితీ మిత్రుడి పరిచయం కోల్పోయామన్ని నీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా.
యనానిమహాశయా - పాప్యులర్ సెంటిమెంటుకి వ్యతిరేకమైన అభిప్రాయం విలిబుచ్చినంత మాత్రాన ఇక్కడ మిమ్మల్నెవరూ కొట్టరు! ధైర్యంగా మీ పేరిటే రాయండి.

Anonymous2 యొక్క అభిప్రాయము

Made Friday, 28 of March , 2008 at 8:51 pm

ఇక్కడి వ్యాఖ్యలని చదివాక, నాకూ ఒక వ్యాఖ్య వ్రాయాలనిపించింది.
తెలుగు బ్లాగుల్లో సిరివెన్నెలకి కొంత మంది వీర భక్తులున్నారు. భక్తులు అంటే నా ఉద్దేశ్యంలో అభిమానుల స్థాయిని దాటిన వాళ్ళు అని.
వీళ్ళు ఆ సిరివెన్నెల ఏమి కిలికాడు అన్నది చూడరు…ఆయనేమి వ్రాసినా అదిరింది, సూపరో సూపరు…అబ్బో అమ్మో అయ్యో వామ్మో వార్నాయనోయ్ అంటూ వుంటారు. ఆయన్నొక దేవుని కింద ఆరాధిస్తూ, ఆయన మీద ఈగ కూడా వాలకుండా చూస్తూ కాలం వెళ్ళదీసేవారు ఈ బ్లాగుల్లో బాగానే ఉన్నారు. అభిమానించడం లో తప్పులేదు. కాని వాళ్ళు అభిమానించే వాళ్ళను, మిగిలిన వాళ్ళు కూడా అదే స్థాయిలో అభిమానించాలని ఆశించడంలోనే అసలు చిక్కు!
ఆయన ఒక మానవ మాత్రుడని, మిగిలిన సినిమా (మామూలు) కవుల మాదిరిగా చెత్త వ్రాస్తాడని, వ్రాసాడని, వ్రాస్తున్నాడని ఒప్పుకోరు (ఆయన బాగా వ్రాసిన పాటలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో సందేహం లేదు. అందుకు ఆయన అభినందనీయుడు).
భారత దేశానికి పట్టిన చీడల్లో, ఇలాంటి వ్యక్తి పూజలు మొదటి వరసలో చేరేవి, కీడు చేసేవి కూడాను!

నవీన్ గార్ల యొక్క అభిప్రాయము

Made Monday, 31 of March , 2008 at 1:29 am

>> ఆయనేమి వ్రాసినా అదిరింది, సూపరో సూపరు…అబ్బో అమ్మో అయ్యో వామ్మో వార్నాయనోయ్ అంటూ వుంటారు.
అలా అని మీరు అర్థం చేసుకొన్నారు అంతే. ఇక్కడ ఆయన వ్రాసిన దాన్ని కత్తి అని ఎవ్వరూ అనలేదు. ఇలా వ్రాశిన దానికి ఆయన మాత్రమే భాధ్యత వహించాలి అనడం సబబు కాదు అని అంటున్నారు. కవి అలా వ్రాయడంలో దర్శకుని బాధ్యత కూడా ఉంటుదని మనవి చేశారు అంతే.

>>కాని వాళ్ళు అభిమానించే వాళ్ళను, మిగిలిన వాళ్ళు కూడా అదే స్థాయిలో అభిమానించాలని ఆశించడంలోనే అసలు చిక్కు!
ఇలాంటి భావం స్ఫురించే వ్యాఖ్యలు ఇక్కడ ఎవ్వరూ చేశినట్టు కనపడదు. సందర్భానుసారంగా మీ అభిప్రాయం వెలిబుచ్చారనుకొంటాను.

>>భారత దేశానికి పట్టిన చీడల్లో, ఇలాంటి వ్యక్తి పూజలు మొదటి వరసలో చేరేవి, కీడు చేసేవి కూడాను!
100% అంగీకరిస్తాను. వ్యక్తి పూజ మంచివి కానే కావు.

(http://gsnaveen.wordpress.com)

[…] సిరివెన్నెల రాసిన ఒక పాటపై హరివిల్లు బ్లాగులో జరిగిన చర్చ చదివారా? ఆసక్తికరమైన ఆ చర్చలో చక్కటి వ్యాఖ్యలు రాసిన ఆ ఎనానిమస్సులెవరో గ్రహించారా? […]

కామేశ్వర రావు యొక్క అభిప్రాయము

Made Tuesday, 1 of April , 2008 at 6:47 am

నేను సిరివెన్నెలకి వీరాభిమానిని కాను. కానీ నాకీ పాటమరీ బోసిగా అనిపించలా.
“అనాటమీ ల్యాబులో మనకు మనము దొరకం” ఇది సిరి వెన్నలసంతకం.

అలానే తన కడుపుమంటని (బహుశా దర్శకులకి తెలియకుండా) చురకల్లా అంటించారు:
వెరైటిగా శభ్ధం విందాం అర్థం కొద్దిగ సైడుకి జరిపి
అదే మనం “తెలుగులొ” అంటే డోన్ట్ వరీ బీ హేపీ

షరా: ఈ పాటని నేను వినలేదు. వినదలుచుకోలేదు:-)

RSG యొక్క అభిప్రాయము

Made Tuesday, 1 of April , 2008 at 9:41 am

>> చంద్ర బోసి పొయ్యే పాటకి సిరివెన్నెల ఎందుకు?
నిజమేనండి. కానీ పదాలు ఆయన శైలిలో లేకపోయినా భావంలో మాత్రం ఆయన సిగ్నేచర్ కనిపించింది. సిరివెన్నెలగారు నిజంగా పాటలు రాయడం మానేస్తే మన తెలుగు సినిమా పాటల్లో ఈమాత్రం స్టాండర్డ్స్ కూడా ఉండవేమో!

Anonymous యొక్క అభిప్రాయము

Made Wednesday, 9 of July , 2008 at 10:02 pm

vruddula sabha lo laaga unnayi mi abhi praayaalu, modernism nu entha baaga raasaaarani ippati yuva drukpadam tho alo chinchi coodandi oka saari thatwam bodha paduddi.

koresh యొక్క అభిప్రాయము

Made Wednesday, 9 of July , 2008 at 10:04 pm

nuthana yuvaka drusti tho aaloochinchandi

అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

My Photoపేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం

చైత్రం నాది, శిశిరం నాది, వెలుగు నాది, చీకటి నాది, కష్టం నాది, సుఖం నాది, నవ్వు నాది, ఏడుపు నాది, అచ్చ తెలుగులో ప్రతి అనుభూతీ నాది.