బ్రాండ్ 01దీని ముందు టపాలోని నేను రాసిన విషయం ఒకటి; అక్కడ జరిగిన చర్చ మరోకటి. నేను కేవలం నాకు నచ్చిన హకూనా మటాటా పదం గురించి ఇంకా కొన్ని వాక్యాల గురించి రాస్తే ఆ ప్రస్తావన కాస్తా పక్కదోవ పట్టి ఆ రచయిత మీదకి మళ్ళింది. అక్కడే అభిప్రాయం రాద్దామనుకుని విరమించి ఇక్కడ రాస్తున్నాను.

మనం సినిమాలో ప్రతీ అంశానికీ బ్రాండ్ అంబాసిడర్స్‌ని ఊహించుకుంటున్నాం. మిగిలిన విభాగాల గురించి ఏమోగానీ పాటల రచయితల విషయంలో ఇలాంటి పాట ఈయనే రాయాలి; అలాంటి పాట ఆయనే రాయాలి అని రచయిత సృజనాత్మకతని ఒక అంశానికే పరిమితం చేస్తున్నాం. మిగిలిన వాళ్ళ సంగతి ఏమో గానీ ఇది మంచి పద్దతి కాదని నా అభిప్రాయం. “నువ్వొస్తావని” సినిమాలో “కలలోనైన కలగనలేదే…” పాటను వేరొకరు రాసుంటే ఇంకా బాగుంటుందో లేదో అన్న సంగతి పక్కన పెడితే; చంద్రబోస్ ఆ పాటకు న్యాయం చేకూర్చారనే అనిపిస్తుంది కదా!  “ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి…“, “ఎదిగేకొద్దీ ఒదగమని…” సంగతీ అంతే కదా. వీటిని ఏ సిరివెన్నెలకో వేటూరికో ఇస్తే ఎలా ఉంటుంది అని అనుకోకూడదు. అలాగే ఏదన్నా యూత్ సాంగ్‌ని చంద్రబోస్ తప్ప వేరెవరైనా రాస్తే  అది వాళ్ళ తప్పిదంలా భావిస్తారు.  భువనచంద్ర ద్వందార్థం స్ఫురించే పాటలు ఎన్ని రాసినా, వినగలిగే కొన్ని ట్యూన్లకు బాగానే రాసారు. ఆయన రాసే అనువాదపాటల్లో కూడా మాతృకలోని అర్థం మనకు నప్పకపోతే కొన్ని లైన్లు తెలుగులో మార్చి రాసినట్టు గుర్తు. వెన్నెలకంటి “తపస్సు”లో పాటలు బానే ఉంటాయి కదా!.  ఈ మధ్యన వెలుగులీనిన వనమాలి “ఇక సెకనుకెన్ని నిమిషాలో…” అని అంటే ఆ ట్యూనుకి ఎంత బాగా ఒదిగిపోయిందది. ఇంతకు ముందు చాలా మంది “యుగమొక క్షణములా… క్షణమొక యుగములా…”  అని అర్థం వచ్చేలా రాసినా, ఇప్పుడు వనమాలి రాసింది ఎంత ఫ్రెష్‌గా ఉంది అని అనిపించింది!

సుద్దాల అశోక్‌తేజ గురించి చెప్పుకునే ముందు విప్లవ సాహిత్యం గురించి చెప్పుకోవాలి. ఈ విప్లవ గీతాలు, సినిమా పాటలకు కొంచెం విభిన్నం. వీటిని కొందరు అనుభవైకవెద్యమైన వాళ్ళో, ఆ వాతావరణాంలో పెరిగిన వాళ్ళూ ఆ మాండలికం ఎరిగిన వాళ్ళో తప్ప మిగిలిన వాళ్ళు రాసినా మట్టి వాసనలోని కమ్మదనం, చెమట బొట్టులోని ఉప్పదనం కనిపించవు. అశోక్‌తేజ అటు ఆ పాటలు రాస్తూ మిగిలిన రకాల పాటలు కూడా బాగానే రాస్తున్నారు. ఇక భక్తి పాటల విషయానికొస్తే ఇవి రాసేవాళ్ళకు పురాణాలతో, సంస్కృత భాషతో కాస్త పరిచయం ఉండాలి. ముఖ్యంగా బ్రాహ్మణ కవులు (కవులకి కులం అంటగడుతున్నానని అనుకోకండి; ఇక్కడ పురాణాలతో బాగా పరిచయం ఉన్నవాళ్ళుగా అర్థం చేసుకోండి) వీటికి సరిపోతారు. వేటూరి, సిరివెన్నెలని పక్కన పెడితే, జొన్నవిత్తులని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అందుకే పాట రాయడంలో కవికి ఉన్న సృజనాత్మకత విషయంలో విప్లవ గీతాలు, భక్తి గీతాలను మినహాయించాలి. ఇక భాస్కరభట్ల, కందికొండ, రామజోగయ్య శాస్రి, అనంత శ్రీరాం, పెద్దాడ మూర్తి తదితరుల గురించి నాకు అంత తెలియదు.

నేను సినిమా పాటకు దాసోహం అయ్యింది వేటూరి చలవ వలనే గానీ, సిరివెన్నెల సినిమాతో మాత్రం సినిమా పాటలలోనూ మనకు అర్థం అయ్యే సాహిత్యం ఉందనే అభిప్రాయం బలపడింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబోస్ లాంటి వారి పాటలూ ఏమీ తీసిపోవు. ఉగాది పచ్చడిలో వివిధ రుచులున్నాట్లు సినీపాటలలో కూడా వివిధ నేపథ్యాలకు తగ్గట్టు పాటలు కావాల్సొస్తాయి. అది యుగళమో మెలోడీనో కావొచ్చు; మాస్, మషాలా కావొచ్చు; విషాదమో విప్లవమో కావచ్చు. మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుందో గానీ నేను మాత్రం ఎవ్వరు రాసినా ఎవ్వరు పాడినా ఏ భేషజాలూ లేకుండా ప్రతీ పదాన్ని ఆస్వాదిస్తాను.  ప్రతీ పాటా ఏ శంకరాభరణంలానో ఏ సిరివెన్నెలలానో ఉండాలని ఆశ పడను. ప్రతీదీ ఏ వేటూరో, సిరివెన్నెలో రాయలేదని భాదపడను. ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. నాకు గుర్తుకొచ్చిన వ్యక్తులను/పాటలను మాత్రమే ఇక్కడ ఉదహరించాను, ఏమన్నా వదిలేసి ఉంటే అన్యదా భావించకండి.  మరీ మాస్‌గా చెప్పాలంటే నాకు బ్రాండ్‌తో పనిలేదు; కిక్కెక్కాలంతే 🙂

RTS Perm Link