రాసినవారు శ్రీనివాస on Monday, 21 of April , 2008 at 7:58 am

తెలుగుబ్లాగు గుంపులో చావాకిరణ్ ఇచ్చిన ఈ వారం బ్లాగ్ విషయం మీ దగ్గరలోని గ్రంథాలయాలు కు నా స్పందన
మా కాలనీలో ఒక గ్రంథాలయం ఉండేది. అన్ని తెలుగు నవలలూ అక్కడ ఉండేవి. అవే కాకుండా అన్ని ప్రముఖ వీక్లీలు మంత్లీలు ఉండేవి. ఏదన్నా పుస్తకంలో గడి కనిపిస్తే సాధ్యమైనంతవరకూ నింపెయ్యడం అలవాటు. స్వాతి, మయీరి అక్కడ ఎక్కువ తిరగేసేవాడిని. ముఖ్యంగా తెలుగుకు సంభందించినవి కనిపిస్తే వదిలేవాడిని కాదు. రీడర్స్ డైజెస్ట్‌ని అప్పుడప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని.
ఇక మా ఇంట్లో విషయం చెప్పాలి. మా నాన్న ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెచ్చేవారు. మా కోసం చందమామ తెచ్చేవారు. నేను పత్రికను కూడా చదివేవాడిని. దానిలో నేను పూర్తిగా చదివిన సీరియల్ రావినూతల సువర్ణాకన్నన్ రాసిన మంజీరనాదం. అది నాకు ఫ్యాంటసీగా అనిపించి చివరిదాకా చదివేసాను. ఏదన్నా సీరియల్ పూర్తైతే ఆ సీరియల్ ఉన్న అన్ని వారాల పేజీలనీ మా నాన్న ఒక పుస్తకంగా బైండ్ చేసేవారు ( ఆయన పనిచేసే కంపేనీలో మన చేపలను, రొయ్యలను, మామిడిపండ్లను విదేశాలకు ఎగుమతి చెయ్యడానికి మైనపు పూత పూసిన అట్టపెట్టెలు తయారయ్యేవి; మా పుస్తకాలకు అట్టలు వేసుకోవడం మాకు అప్పుడు బాగా సులువు అయ్యేది ). దాదాపు ఓ పాతిక దాకా పోగయ్యాయి. వాటిని మా కాలనీలో ఉండేవాళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు. వాటిలో చివరికి ఏమీ మిగలలేదనుకోండి!
చందమామ చదివీ చదివి బోర్ కొట్టింది. ఎక్కడో బాలమిత్ర, బాలజ్యోతి, బొమ్మరిల్లు కనిపించాయి. అన్నీ నచ్చేసాయి. ఇక నేనే పుస్తకం కొనుక్కుంటానని చెప్పి డబ్బులు అడిగి తీసుకుని మరికొంత పోగేసి బాలమిత్ర, బాలజ్యోతి కొనేవాడిని. కొనడానికి దూరం వెళ్ళవలసి వచ్చినా ఆలోచించేవాడిని కాదు. ఒకచోట లేకపోతే ఇంకోచోట వెతికి కొనుక్కునేవాడిని.
అంతే కాకుండా ప్రతీ ఆదివారం ఈనాడు తెచ్చేవారు. ఈనాడు మేగజైన్‌లో పదకేళీ నింపడం అప్పుడు ఓ సరదా. మేగజైన్ చివర కనిపించే బూదరాజు గారి తెలుగు పదాలకి సంభందించిన శీర్షికని వదిలేవాడిని కాదు. ఇంట్లో పుస్తకాలు ఎక్కువై అమ్మెయ్యవలసి వస్తే ఆ పేజీలు చింపి దాచేవాడిని. ఇప్పటికీ అవి నా దగ్గర ఉన్నాయి.
మా పక్కింట్లో ఉండే ఆంటీ ఎంతెలా నవళ్ళు చదువుతారంటే; పవర్ పోయినా కొవ్వొత్తి ముందు చేతిలో పుస్తకంతో కనిపించేవారు. ఆవిడ దగ్గరనుండి కాంచనద్వీపం, కీర్తికిరీటాలు, దాంపత్యవనం, కన్యాశుల్కం ఉంటే దసరా సెలవులకి తెచ్చుకుని చదివాను.
నర్శిపట్నంలో డిప్లొమా చదివే రోజుల్లో లైబ్రరీకి వెళ్ళడం తక్కువే కానీ విపులని మాత్రం క్రమం తప్పకుండా కొని చదివేవాడిని. ఇంజనీరింగ్‌లో అది కూడా లేదు.
నేను చివరిసారిగా చదివిన పూర్తి నవల ది డావిన్సీ కోడ్.
స్మృతిలో మెదిలినవి ఇలా రాసేసాను…
RTS Perm Link
వర్గములు: ఈ వారం బ్లాగ్ విషయం, గత స్మృతులు
రాసినవారు శ్రీనివాస on Tuesday, 15 of April , 2008 at 11:28 am
బారులో లీలగా సంగీతం వినబడుతుంది… చాలా మంది గుంపుగా మందు కొడుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు… వేణు మాత్రం ఒంటరిగా తాగుతున్నాడు. జీవితంలో చివరిసారి మనసారా తాగుతున్నాడు. వెయిటర్ వచ్చి టైమ్ అయ్యిందని చెప్పేదాకా ఏవో ఆలోచనలు… నెమ్మదిగా బయటికి వచ్చి చుట్టూ చూసాడు. దగ్గరగా డబ్బా ఫోన్ కనిపించింది. జేబులో తడిమితే రెండు రూపాయి కాసులు తగిలాయి. ఇంటి నెంబరు గుర్తుకు తెచ్చుకుంటూ డయల్ చేస్తున్నాడు… తన ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నట్టు ఎవరో ఫోన్ ఎత్తారు.
“హలో” అంటూ వేణూ మౌనంగా ఉండిపోయాడు.
“ఆ నాన్నా చెప్పరా ఎక్కడున్నావు. ఫోను ఇంట్లో వదిలేసి వెళ్ళావు. అర్థరాత్రయ్యింది… ఇంటికి రావచ్చు కదరా… ఇంట్లో అందరూ నీ కోసమే చూస్తున్నారు… ఈ టైంలో ఎక్కడున్నావురా. ” పెద్దాయన గొంతులో కొడుకు మీద ఉన్న దిగులు స్పష్టంగా వినిపిస్తుంది.
“నాకు ఏమీ కాదు నాన్నా. అమ్మకి ఫోనివ్వు.”
“వేణూ ఎక్కడున్నావమ్మా. ఇంటికిరా. నువ్వేమీ ఆలోచించకమ్మా, నీకోసం మంచి సంభందాలొస్తున్నాయి; అంతకన్నా మంచి అమ్మాయి నీకు వస్తుందమ్మా. ఇంటికొచ్చెయ్యమ్మా.” అంటూ అమ్మ మాటలు వినేసరికి ఏడుపొచ్చేసింది వేణుకి.
“అమ్మా, నాకేమన్నా జరగకూడనిది జరిగితే, నువ్వూ నాన్నా చెల్లి దగ్గరకి వెళ్ళిపోండి” అంటూ ఇంకేదో చెప్పబోయాడు. రెండో నిమిషమూ పూర్తయ్యి ఫోన్ కట్టయ్యింది.
పద్దూకి ఫోన్ చేద్దామంటే డబ్బులు లేవు; చివరిసారి తనతో మాట్లాడాలన్న కోరిక కూడా తీరలేదు. ‘ ఛీ ఏంటీ బతుకు’ అని అనుకుంటూ వెనుతిరిగాడు.
అప్పుడే వానజల్లు మొదలయ్యింది.
*********************************************
వేణు, పద్మ ఇద్దరూ ఒకే డీటీపీ సెంటర్‌లో పనిచేసేవారు. పక్కపక్కనే కూర్చోవడం వలన ఇద్దరి మధ్యా చనువు కాస్త పెరిగింది. మామూలుగా అమ్మాయిలకి దూరంగా ఉండే వేణుకి ఇప్పుడు పద్దూ చాలా దగ్గరైపోయింది. ఒకరోజు కనిపించకపోతే చాలు ఏమీ తోచదు వేణుకి. ఆ అనుభూతికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియనితనం. ఓ సంవత్సరం అలా గడిచిపోయింది.
పద్దూ అంత అందగత్తేం కాదు; కాని ఆమెలో తనకు నచ్చిన గుణాలున్నాయి. ‘తనని పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది కదా!’ అని అనుకున్నాడు. ఒకసారి ఆమె తనకు కులం పట్టింపు లేదని చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు. తనకీ ఇంట్లో సంభందాలు చూస్తున్నట్టు ఒకసారి చెప్పింది కూడా. వేణుకి కూడా ఇంట్లో ఓ రెండు మంచి సంభందాలు చూస్తే ఏదో కారణం చెప్పి దాటేసాడు. ఇక ఆలస్యం చెస్తే లాభం ఉండదని ఆ విషయం పద్దూ దగ్గర ప్రస్తావనకు తెచ్చాడు.
“పద్దూ, నేను నీలాంటి గుణాలున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళూ నువ్వూ నేను ఒకరికి గురించి ఒకరం తెలుసుకున్నాం. నేనూ నీకు బాగానే అర్థం అయ్యుంటాను. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటి?” సంశయిస్తూ అడిగాడు.
“వద్దు వేణు” తడుముకోకుండా సమాధానమిచ్చింది పద్దూ.
“పద్దూ నేను నేను నీకు నచ్చలేదా?” నిర్వేదంగా పలికింది వేణు గొంతు.
“నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు వేణూ…” చెప్పాలా వద్దా అన్నట్టు సమాధానమిచ్చింది పద్దూ.
“నాకు మంచి అమ్మాయి వస్తుందని నువ్వనేదానివి. ఆ అమ్మాయివి నువ్వే ఎందుకు కాకూడదు. నీకు కేస్ట్ ఫీలింగ్ కూడా లేదన్నావు. నీకు ఇంట్లో గానీ పర్సనల్‌గా గానీ ఏమన్నా ప్రాబ్లంస్ ఉన్నాయా పద్దూ?”
“ఏమీ లేవు వేణు… కొన్ని వాటి గురించి మనం ఆలోచించకూడదు… నువ్వు మీ ఇంట్లో చూసే అమ్మాయిని చేసుకో…”
“సరే నా మీద ఏ ఫీలింగ్ లేదంటున్నావు. నీకు ఇంట్లో ఎవరో ముక్కూ మొకం తెలియనోడిని తీసుకొస్తే మరి చేసేసుకుంటావా? ఇది చెప్పు…”
“ఆ… నువ్వు స్నేహితుడివి మాత్రమే వేణు; నిన్ను పెళ్ళి చేసుకోవడమంటే కష్టం…” నిర్భయంగా వచ్చింది జవాబు.
“అంటే నేను భర్తగా పనికిరానా… పద్దూ”
“అది నేను చెప్పలేను వేణు”
గుండెల్లో రానురాను బరువు పెరిగిపోతుంది వేణుకి… ఇక అక్కడ ఉంటే నిలబడే ఓపిక కూడా పోతుంది… ఆ జవాబులకి.
“మంచిది పద్దూ; నేను స్నేహితుడిగా మాత్రమే పనికొస్తానని తేల్చేసావ్. నువ్వు జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకు మంచిదే జరగేలా కోరుకుంటున్నాను… బై” అంటూ ఇంటికి బయలుదేరాడు.
*********************************************
“ఏరా అన్నం తినరా, ఇప్పటికే చాలా టైం అయ్యింది” అంటూ పళ్ళెంతో అమ్మ గదిలోకొచ్చింది.
వేణు రెండురోజుల నుండి సరిగ్గా భోంచెయ్యడం లేదు. ఎప్పుడు మనసుకి భాద కలిగినా ఆకలీ ఓపికా చచ్చిపోతాయి. పద్దూ ఆఫీసుకి రావడం మానేసింది. ఎవరికీ కారణం చెప్పలేదు. ఆమెకి ఇంట్లో అమెరికా సంభందం చూస్తున్నట్టు ఎవరో చెప్పారు.
మనసు ముక్కలైతే మగాడు ఆడదాని కన్నా ఎక్కువ భాదపడతాడని వేణుని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది.
అమ్మను భాద పెట్టడం ఇష్టం లేక ఓ నాలుగు ముద్దలు తిన్నాడు. మళ్ళీ పద్దూ ఆలోచనలు… పద్దూతో మళ్ళీ మాట్లాడాలనిపించింది.
“హలో పద్దూ.. నీతో మాట్లాడవచ్చా…”
“మొన్న మాట్లాడినవి కాకుండా ఏవైనా మాట్లాడు వేణు”
ఇక మౌనమే సమాధానమయ్యింది… ఏం మాట్లాడలేక ఫోన్ పెట్టేసాడు.
*********************************************
పార్కులో ఫ్రెండ్స్‌తో తిరుగుతున్న రవికి ఓ పక్కగా సెక్యూరిటీ నిద్రపోతున్న ఎవరినో లేపడానికి తడుతున్నట్టు కనిపించింది. ఎవడో మనవాడిలా ఉన్నాడే అనుకుంటూ అటు వెళ్ళాడు. వెనక్కి తిరిగి తన ఫ్రెండ్స్‌తో “మీరు వెళ్ళండి… నేను తర్వాత వస్తాను…” అని అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాకా సెక్యూరిటీతో “అతను నా ఫ్రెండే, మీరెళ్ళండి. నేను చూసుకుంటాను” అని వేణు పక్కన కూర్చుని చేతిలో ఉన్న బాటిల్ నీళ్ళని ముఖం మీద చిలకరించాడు.
ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళుతెరిచాడు వేణు. అంతా అయోమయంగా ఉంది. అంతలోనే తేరుకుని లేచి మౌనంగా కుర్చుండిపోయాడు. ” ఏరా మీ ఆఫీసుకి ఉదయం వచ్చాను; నువ్వు రావడంలేదని చెప్పారు. మీ ఇంటికి ఫోన్ చేస్తే బయటికి వచ్చేసావని అమ్మ చెప్పింది. ఇక్కడేం చేస్తున్నావ్రా” ఓ పక్క కనిపిస్తున్న విస్కీ బాటిల్‌ని చూస్తూ అడిగాడు. ఏం చెప్పాలో తెలియడం లేదు వేణుకి.
“ఏరా నేను విన్నది నిజమేననిపిస్తుంది… నిన్నిలా చూస్తుంటే, ఇలా మందుకొట్టి పడుకుంటే నీ భాధలు తీరిపోతాయ” మీద చెయ్యివేస్తూ అడిగాడు రవి.
“నీకు తెలుసు కదరా; నేను ఏ విషయాన్నీ అంత పట్టించుకోను. కానీ నా జీవితంలో ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా కావాలనుకున్నాను. తను నా మనసుని పూచిక పుల్లలా విరిచేసింది. నేను ఫ్రెండులా మాత్రమే పనికొస్తానని చెప్పింది. ఎవడో ముక్కూమొహం తెలియనోడిని తెస్తే ఇష్టపడుతుందంట గానీ నన్ను ఇష్టపడదట.” వేణు కళ్ళలో నీళ్ళ మెరుపు కనిపించింది రవికి.
“అలా పిల్లోడిలా ఏడుస్తున్నావేంట్రా. ఎవత్తో మనసు లేని దాని కోసం; నీ గురించి ఆలోచించని దాని కోసం, ఇక్కడ కుర్చుని భాదపడుతున్నావా. ఏరా! మేము, మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోయామురా! ఇన్నాళూ చెప్పలేదు కనీసం. ఆ విషయాలు మర్చిపో. ఇంటికెళదాం పద” సముదాయిస్తూ అన్నాడు రవి.
“నేను దాని అందం చూసి ముచ్చట పడితే అంతకన్నా అందమైన దాన్ని చూసి దీన్ని మరచిపోవచ్చేమో అని అనుకోవచ్చురా. నువ్వూ చూసావు కదా దాన్ని. ఎందుకో దానిలో కొన్ని గుణాలు నచ్చాయిరా. నేను తనని ఎంతలా ఇష్టపడుతున్నానో దానికి తెలుసురా; నేను తనతో తప్ప ఏ అమ్మాయితోనూ అంత చనువుగా లేను కదరా. ఎవరైనా తనని సరదాగా కొడుతున్నా కూడా నేను వాళ్ళని మందలించేవాడిని. దాన్ని ఎవరూ ఏ మాటా అననిచ్చేవాడిని కాదు. నేను కూడా కనీసం ఎప్పుడూ దాన్ని తాకను కూడా తాకలేదు. అన్ని విషయాలూ దానికి తెలుసు. నేను ఏం తప్పు చేసానో నాకు తెలియడం లేదు; అసలు ఏ అమ్మాయి కనిపించినా తనే గుర్తుకొచ్చి ఒళ్ళు పట్టుతప్పిపోతుందిరా “ నీరసంగా చెప్పాడు వేణు.
“లేదు మామా. ఎప్పటి నుండో నీకు చెబుతున్నా. అలా సత్తెకాలమోడిలా ఉండకురా అని. అలా ఉంటే ఈ కాలమమ్మాయిలెలా ఇష్టపడతార్రా. అదిగో అటు చూడు; వాళ్లకి చిలిపివంశీకృష్ణలు, మన్మథులు కావాలి. పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళు వీళ్ళ కంటికి ఆనరు. నీ చుట్టు ఉన్న ప్రెండ్స్ కూడా ఈ అమ్మాయిల దగ్గర గుడ్‌విల్ కొట్టెయ్యడానికి చూస్తుంటారు; నీతో అన్ని విషయాలూ చెప్పరు. ఎవర్ని పడితే వాళ్లని గుడ్డిగా నమ్మెయ్యకూడదురా. నువ్వు ఇలా రామానుజంలా ఉంటే ఎప్పటికీ ఫ్రెండులానే ఉండాల్సొస్తుంది. నువ్వు తనని అంత జాగ్రత్తగా చూసినందుకే నువ్వు అలుసైపోయావు. రఫ్పాడించాలి; రెమోలా మారాలి మామా; అప్పుడే జింకలు కావాలని వచ్చి చేతికి చిక్కుతాయి. అయినా నీకేంటిరా! దాని బ్యాడ్‌లక్: వదిలెయ్ ఇంక ఆ విషయాన్ని…” గీతలా భోదన ముగించాడు రవి.
రవి చెప్పింది వింటున్నా పద్దూ తన కళ్ళల్లో మెదులుతూనే ఉంది వేణుకి.
వేణుకి నచ్చచెప్పి నెమ్మదిగా ఇంటికి తీసుకు వచ్చాడు. ఎందుకన్నా మంచిదని అమ్మకి విషయం చెప్పాడు. “జాగ్రత్త ఆంటీ; వాడ్ని నేను ఎప్పుడూ అలా చూడలేదు; మళ్ళీ రేపు వస్తాను” అంటూ వెళ్ళిపోయాడు రవి.
ఓ వారం రోజులు ఎలా గడిచాయో తెలియదు… మెదడుని తొలిచేస్తున్న ఆలోచనలు… గుండెను మెలిపెడుతున్న పద్దూ ఊహలు… జీవితం మీద నిరాశ… ఒక క్షణం తనవాళ్ళు గుర్తొస్తుంటే కాస్త ఊరడింపుగా ఉంటుంది… మరుక్షణం పద్దూ గుర్తుకొచ్చి ఈ లోకంలో తన ఉనికిని ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంది…
గడియారం వంక చూసాడు. పది దాటింది. ఇంట్లో అందరూ పెళ్ళికి వెళ్ళారు. ఇంకేం ఆలోచించకుండా ఇంట్లోంచి బయటకొచ్చాడు. ఇప్పుడు ఎక్కడికెళ్ళాలో తనకు బాగా తెలుసు…
*********************************************
దూరంగా రైలు వెళుతున్న శబ్ధం వినిపిస్తుంది. వడివడిగా నడవడం మొదలు పెట్టాడు.
వాన ఎక్కువైంది. దారి పక్కన ఉన్న చెట్టు కిందకి చేరాడు. చేతులు తుడుచుకుని జేబులో చెయ్యిపెట్టాడు. ‘హమ్మయ్య ఇంకా తడిసిపోలేదు’ అనుకుంటూ నెమ్మదిగా సిగరెట్టు పెట్టె తీసి ఒకటి వెలిగించాడు. ఇప్పుడు కాస్త చలి తగ్గినట్టనిపించింది. జేబులో నుండి ఈసారి పద్దూ ఫొటో తీసి అలా చూస్తూ ఉండిపోయాడు.
కుక్కలు మొరగడంతో ఈ లోకానికొచ్చాడు వేణు. వాన తగ్గినట్టనిపించింది. ఈసారి కుక్కపిల్ల మూలుగు వినిపించింది. దూరంగా ఓ గోతి చుట్టూ ఓ కుక్క ఏమీ చేయలేక లోపలికి చూస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. వేణు అటుగా వెళ్తూ అనుమానం వచ్చి లోపలికి చూసాడు. కుక్కపిల్ల ఒకటి లోపల సగం వరకు మునిగిపోయి మూలుగుతూ కనిపించింది. వెంటనే లోపలికి దిగి దాన్ని పైకి తీసి చెట్టు కిందకి తెచ్చాడు. కొంతసేపు అక్కడే ఉండి ఆ కుక్కపిల్ల తేరుకున్నాకా దాన్ని వదిలి బయటికొచ్చాడు.
మొత్తానికి రైలుపట్టాలను చేరుకున్నాడు. అంతా తడితడిగా ఉంది. తాకి చూస్తే జిల్లుమంటుంది. వస్తున్న వణుకును అదుపుచేసుకుంటూ పట్టామీద మెడపెట్టి పడుకున్నాడు. తన వాళ్లందరూ ఒక్కసారి కళ్ళ ముందు కదులుతున్నారు. అందరికీ క్షమాపణలు చెప్పుకున్నాడు. ఆకాశంలో చంద్రుడు మబ్బుల మధ్య నుండి అప్పుడే భయటకొచ్చాడు. ఆ వెలుగులో పద్దూ ఫొటోని తనివి తీరా చూడటం మొదలుపెట్టాడు. ‘వచ్చే జన్మలోనైనా నీకు నచ్చేలా ఉండలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’ అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. మెదడులోకి ఇంకేం ఆలోచనలు రానివ్వకుండా రైలు కోసం ఎదురు చూస్తున్నాడు.
ఏదో తన పక్కకొచ్చినట్టు అనిపించి అటు తిరిగిచూసాడు. ఇందాకా తను కాపాడిన కుక్కపిల్ల తన పక్కకు వచ్చి షర్టుని పట్టుకు లాగుతుంది. దాని తలని సుతారంగా నిమిరి పట్టాల పక్కన నిలబడ్డ కుక్కపిల్ల తల్లి పక్కన ఉంచాడు. తోక ఊపుతూ అది వేణుని చూస్తూ నిలబడింది.
దూరంగా రైలు వస్తున్న శబ్ధం…
వేణు ఇంకేం ఆలోచించకుండా పట్టాల మీద మళ్ళీ తలపెట్టి పడుకుని కళ్ళుమూసుకున్నాడు.
రైలు దగ్గరకొస్తుంది… తన పక్క ఎవరో పడుకున్నట్టు అనిపించింది… మనసాగక పక్కకు చూసాడు… ఆ కుక్కపిల్లే తనలా పట్టాపై తలపెట్టి పడుకుంది… తల్లి పాపం దాన్ని లేపటానికి మొరుగుతుంది.
రైలు దగ్గరకొచ్చేయడంతో ఇంకేం చెయ్యలేక ఆ కుక్కపిల్లని పట్టుకుని పట్టాల పక్కకి దొర్లిపోయాడు. ఎక్కడలేనీ ఆవేశం… ఆ కుక్కపిల్ల మీద చెప్పలేనంత కోపం వచ్చేస్తుంది…
“ఏం బుద్దిలేదా! ఎందుకు నన్ను చావనివ్వడం లేదు. నేనేం చేసాను; నిన్ను గోతిలోంచి బయటకు తీసాను అంతే కదా! ఈ మాత్రం దానికే నాతో చావాలనుకుంటున్నావా. అక్కడ నీ అమ్మ ఉంది చూసావా అది ఏమైపోతుంది…” మనిషితో మాట్లాడుతున్నట్టు మాటలు బయటకొచ్చేసాయి. ఒక్కసారిగా అంతరంగంలో ఏదో చైతన్యం… ఒక్కసారి మనస్సాక్షి ప్రశ్నించింది… ‘ నువ్వు చేస్తున్నది ఏంటి?…’
కళ్ళ ముందు తెరలు కట్టిన మబ్బులేవో కరిగిపోతున్న అనుభూతి… తన దగ్గర జవాబు ఉంది… అది తలచుకుంటే తన మీద తనకే సిగ్గూ జాలీ కలిగాయి. ‘ఒక మనసులేని దాని కోసం నా జీవితాన్ని నాశనం చేసుకుందామనుకున్నానా?!! నా వాళ్లను కన్నీట ముంచుదామనుకున్నానా?!! నన్నింత కష్టపడి పెంచిన అమ్మానాన్న గురించి నేనెందుకాలోచించలేకపోయాను?!! ‘ తనలో చీకటిని చీల్చుకుంటూ ఏవో ఆలోచనలు…
పద్దూ ఫొటో వేణు చేతి వేళ్ల నుండి జారిపోయి పక్కనున్న ముళ్ళపొదల్లోకి ఎగిరిపోయింది…
ఆకాశం ఇప్పుడు ప్రశాంతంగా… నిర్మలంగా… నిండు చంద్రుడితో కనిపిస్తుంది…
వేణు ఇంటి వైపు వడివడిగా నడవడం మొదలు పెట్టాడు… గాయపడ్డ మనసు ఇప్పుడు బాదంటే ఏంటో మర్చిపోయింది… ఈ ఘడియలో వేణు మళ్ళీ పుట్టాడు…
బ్రహ్మ ముహూర్తం అప్పుడే మొదలయ్యింది.
RTS Perm Link
వర్గములు: కథలు, స్వగతం