తమసోమా…
రాసినవారు శ్రీనివాస on Tuesday, 15 of April , 2008 at 11:28 am
బారులో లీలగా సంగీతం వినబడుతుంది… చాలా మంది గుంపుగా మందు కొడుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు… వేణు మాత్రం ఒంటరిగా తాగుతున్నాడు. జీవితంలో చివరిసారి మనసారా తాగుతున్నాడు. వెయిటర్ వచ్చి టైమ్ అయ్యిందని చెప్పేదాకా ఏవో ఆలోచనలు… నెమ్మదిగా బయటికి వచ్చి చుట్టూ చూసాడు. దగ్గరగా డబ్బా ఫోన్ కనిపించింది. జేబులో తడిమితే రెండు రూపాయి కాసులు తగిలాయి. ఇంటి నెంబరు గుర్తుకు తెచ్చుకుంటూ డయల్ చేస్తున్నాడు… తన ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నట్టు ఎవరో ఫోన్ ఎత్తారు.
“హలో” అంటూ వేణూ మౌనంగా ఉండిపోయాడు.
“ఆ నాన్నా చెప్పరా ఎక్కడున్నావు. ఫోను ఇంట్లో వదిలేసి వెళ్ళావు. అర్థరాత్రయ్యింది… ఇంటికి రావచ్చు కదరా… ఇంట్లో అందరూ నీ కోసమే చూస్తున్నారు… ఈ టైంలో ఎక్కడున్నావురా. ” పెద్దాయన గొంతులో కొడుకు మీద ఉన్న దిగులు స్పష్టంగా వినిపిస్తుంది.
“నాకు ఏమీ కాదు నాన్నా. అమ్మకి ఫోనివ్వు.”
“వేణూ ఎక్కడున్నావమ్మా. ఇంటికిరా. నువ్వేమీ ఆలోచించకమ్మా, నీకోసం మంచి సంభందాలొస్తున్నాయి; అంతకన్నా మంచి అమ్మాయి నీకు వస్తుందమ్మా. ఇంటికొచ్చెయ్యమ్మా.” అంటూ అమ్మ మాటలు వినేసరికి ఏడుపొచ్చేసింది వేణుకి.
“అమ్మా, నాకేమన్నా జరగకూడనిది జరిగితే, నువ్వూ నాన్నా చెల్లి దగ్గరకి వెళ్ళిపోండి” అంటూ ఇంకేదో చెప్పబోయాడు. రెండో నిమిషమూ పూర్తయ్యి ఫోన్ కట్టయ్యింది.
పద్దూకి ఫోన్ చేద్దామంటే డబ్బులు లేవు; చివరిసారి తనతో మాట్లాడాలన్న కోరిక కూడా తీరలేదు. ‘ ఛీ ఏంటీ బతుకు’ అని అనుకుంటూ వెనుతిరిగాడు.
అప్పుడే వానజల్లు మొదలయ్యింది.
*****************************
వేణు, పద్మ ఇద్దరూ ఒకే డీటీపీ సెంటర్‌లో పనిచేసేవారు. పక్కపక్కనే కూర్చోవడం వలన ఇద్దరి మధ్యా చనువు కాస్త పెరిగింది. మామూలుగా అమ్మాయిలకి దూరంగా ఉండే వేణుకి ఇప్పుడు పద్దూ చాలా దగ్గరైపోయింది. ఒకరోజు కనిపించకపోతే చాలు ఏమీ తోచదు వేణుకి. ఆ అనుభూతికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియనితనం. ఓ సంవత్సరం అలా గడిచిపోయింది.
పద్దూ అంత అందగత్తేం కాదు; కాని ఆమెలో తనకు నచ్చిన గుణాలున్నాయి. ‘తనని పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది కదా!’ అని అనుకున్నాడు. ఒకసారి ఆమె తనకు కులం పట్టింపు లేదని చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు. తనకీ ఇంట్లో సంభందాలు చూస్తున్నట్టు ఒకసారి చెప్పింది కూడా. వేణుకి కూడా ఇంట్లో ఓ రెండు మంచి సంభందాలు చూస్తే ఏదో కారణం చెప్పి దాటేసాడు. ఇక ఆలస్యం చెస్తే లాభం ఉండదని ఆ విషయం పద్దూ దగ్గర ప్రస్తావనకు తెచ్చాడు.
“పద్దూ, నేను నీలాంటి గుణాలున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళూ నువ్వూ నేను ఒకరికి గురించి ఒకరం తెలుసుకున్నాం. నేనూ నీకు బాగానే అర్థం అయ్యుంటాను. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటి?” సంశయిస్తూ అడిగాడు.
“వద్దు వేణు” తడుముకోకుండా సమాధానమిచ్చింది పద్దూ.
“పద్దూ నేను నేను నీకు నచ్చలేదా?” నిర్వేదంగా పలికింది వేణు గొంతు.
“నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు వేణూ…” చెప్పాలా వద్దా అన్నట్టు సమాధానమిచ్చింది పద్దూ.
“నాకు మంచి అమ్మాయి వస్తుందని నువ్వనేదానివి. ఆ అమ్మాయివి నువ్వే ఎందుకు కాకూడదు. నీకు కేస్ట్ ఫీలింగ్ కూడా లేదన్నావు. నీకు ఇంట్లో గానీ పర్సనల్‌గా గానీ ఏమన్నా ప్రాబ్లంస్ ఉన్నాయా పద్దూ?”
“ఏమీ లేవు వేణు… కొన్ని వాటి గురించి మనం ఆలోచించకూడదు… నువ్వు మీ ఇంట్లో చూసే అమ్మాయిని చేసుకో…”
“సరే నా మీద ఏ ఫీలింగ్ లేదంటున్నావు. నీకు ఇంట్లో ఎవరో ముక్కూ మొకం తెలియనోడిని తీసుకొస్తే మరి చేసేసుకుంటావా? ఇది చెప్పు…”
“ఆ… నువ్వు స్నేహితుడివి మాత్రమే వేణు; నిన్ను పెళ్ళి చేసుకోవడమంటే కష్టం…” నిర్భయంగా వచ్చింది జవాబు.
“అంటే నేను భర్తగా పనికిరానా… పద్దూ”
“అది నేను చెప్పలేను వేణు”
గుండెల్లో రానురాను బరువు పెరిగిపోతుంది వేణుకి… ఇక అక్కడ ఉంటే నిలబడే ఓపిక కూడా పోతుంది… ఆ జవాబులకి.
“మంచిది పద్దూ; నేను స్నేహితుడిగా మాత్రమే పనికొస్తానని తేల్చేసావ్. నువ్వు జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకు మంచిదే జరగేలా కోరుకుంటున్నాను… బై” అంటూ ఇంటికి బయలుదేరాడు.
*****************************
“ఏరా అన్నం తినరా, ఇప్పటికే చాలా టైం అయ్యింది” అంటూ పళ్ళెంతో అమ్మ గదిలోకొచ్చింది.
వేణు రెండురోజుల నుండి సరిగ్గా భోంచెయ్యడం లేదు. ఎప్పుడు మనసుకి భాద కలిగినా ఆకలీ ఓపికా చచ్చిపోతాయి. పద్దూ ఆఫీసుకి రావడం మానేసింది. ఎవరికీ కారణం చెప్పలేదు. ఆమెకి ఇంట్లో అమెరికా సంభందం చూస్తున్నట్టు ఎవరో చెప్పారు.
మనసు ముక్కలైతే మగాడు ఆడదాని కన్నా ఎక్కువ భాదపడతాడని వేణుని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది.
అమ్మను భాద పెట్టడం ఇష్టం లేక ఓ నాలుగు ముద్దలు తిన్నాడు. మళ్ళీ పద్దూ ఆలోచనలు… పద్దూతో మళ్ళీ మాట్లాడాలనిపించింది.
“హలో పద్దూ.. నీతో మాట్లాడవచ్చా…”
“మొన్న మాట్లాడినవి కాకుండా ఏవైనా మాట్లాడు వేణు”
ఇక మౌనమే సమాధానమయ్యింది… ఏం మాట్లాడలేక ఫోన్ పెట్టేసాడు.
*****************************
పార్కులో ఫ్రెండ్స్‌తో తిరుగుతున్న రవికి ఓ పక్కగా సెక్యూరిటీ నిద్రపోతున్న ఎవరినో లేపడానికి తడుతున్నట్టు కనిపించింది. ఎవడో మనవాడిలా ఉన్నాడే అనుకుంటూ అటు వెళ్ళాడు. వెనక్కి తిరిగి తన ఫ్రెండ్స్‌తో “మీరు వెళ్ళండి… నేను తర్వాత వస్తాను…” అని అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాకా సెక్యూరిటీతో “అతను నా ఫ్రెండే, మీరెళ్ళండి. నేను చూసుకుంటాను” అని వేణు పక్కన కూర్చుని చేతిలో ఉన్న బాటిల్ నీళ్ళని ముఖం మీద చిలకరించాడు.
ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళుతెరిచాడు వేణు. అంతా అయోమయంగా ఉంది. అంతలోనే తేరుకుని లేచి మౌనంగా కుర్చుండిపోయాడు. ” ఏరా మీ ఆఫీసుకి ఉదయం వచ్చాను; నువ్వు రావడంలేదని చెప్పారు. మీ ఇంటికి ఫోన్ చేస్తే బయటికి వచ్చేసావని అమ్మ చెప్పింది. ఇక్కడేం చేస్తున్నావ్రా” ఓ పక్క కనిపిస్తున్న విస్కీ బాటిల్‌ని చూస్తూ అడిగాడు. ఏం చెప్పాలో తెలియడం లేదు వేణుకి.
“ఏరా నేను విన్నది నిజమేననిపిస్తుంది… నిన్నిలా చూస్తుంటే, ఇలా మందుకొట్టి పడుకుంటే నీ భాధలు తీరిపోతాయ” మీద చెయ్యివేస్తూ అడిగాడు రవి.
“నీకు తెలుసు కదరా; నేను ఏ విషయాన్నీ అంత పట్టించుకోను. కానీ నా జీవితంలో ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా కావాలనుకున్నాను. తను నా మనసుని పూచిక పుల్లలా విరిచేసింది. నేను ఫ్రెండులా మాత్రమే పనికొస్తానని చెప్పింది. ఎవడో ముక్కూమొహం తెలియనోడిని తెస్తే ఇష్టపడుతుందంట గానీ నన్ను ఇష్టపడదట.” వేణు కళ్ళలో నీళ్ళ మెరుపు కనిపించింది రవికి.
“అలా పిల్లోడిలా ఏడుస్తున్నావేంట్రా. ఎవత్తో మనసు లేని దాని కోసం; నీ గురించి ఆలోచించని దాని కోసం, ఇక్కడ కుర్చుని భాదపడుతున్నావా. ఏరా! మేము, మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోయామురా! ఇన్నాళూ చెప్పలేదు కనీసం. ఆ విషయాలు మర్చిపో. ఇంటికెళదాం పద” సముదాయిస్తూ అన్నాడు రవి.
“నేను దాని అందం చూసి ముచ్చట పడితే అంతకన్నా అందమైన దాన్ని చూసి దీన్ని మరచిపోవచ్చేమో అని అనుకోవచ్చురా. నువ్వూ చూసావు కదా దాన్ని. ఎందుకో దానిలో కొన్ని గుణాలు నచ్చాయిరా. నేను తనని ఎంతలా ఇష్టపడుతున్నానో దానికి తెలుసురా; నేను తనతో తప్ప ఏ అమ్మాయితోనూ అంత చనువుగా లేను కదరా. ఎవరైనా తనని సరదాగా కొడుతున్నా కూడా నేను వాళ్ళని మందలించేవాడిని. దాన్ని ఎవరూ ఏ మాటా అననిచ్చేవాడిని కాదు. నేను కూడా కనీసం ఎప్పుడూ దాన్ని తాకను కూడా తాకలేదు. అన్ని విషయాలూ దానికి తెలుసు. నేను ఏం తప్పు చేసానో నాకు తెలియడం లేదు; అసలు ఏ అమ్మాయి కనిపించినా తనే గుర్తుకొచ్చి ఒళ్ళు పట్టుతప్పిపోతుందిరా “ నీరసంగా చెప్పాడు వేణు.
“లేదు మామా. ఎప్పటి నుండో నీకు చెబుతున్నా. అలా సత్తెకాలమోడిలా ఉండకురా అని. అలా ఉంటే ఈ కాలమమ్మాయిలెలా ఇష్టపడతార్రా. అదిగో అటు చూడు; వాళ్లకి చిలిపివంశీకృష్ణలు, మన్మథులు కావాలి. పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళు వీళ్ళ కంటికి ఆనరు. నీ చుట్టు ఉన్న ప్రెండ్స్ కూడా ఈ అమ్మాయిల దగ్గర గుడ్‌విల్ కొట్టెయ్యడానికి చూస్తుంటారు; నీతో అన్ని విషయాలూ చెప్పరు. ఎవర్ని పడితే వాళ్లని గుడ్డిగా నమ్మెయ్యకూడదురా. నువ్వు ఇలా రామానుజంలా ఉంటే ఎప్పటికీ ఫ్రెండులానే ఉండాల్సొస్తుంది. నువ్వు తనని అంత జాగ్రత్తగా చూసినందుకే నువ్వు అలుసైపోయావు. రఫ్పాడించాలి; రెమోలా మారాలి మామా; అప్పుడే జింకలు కావాలని వచ్చి చేతికి చిక్కుతాయి. అయినా నీకేంటిరా! దాని బ్యాడ్‌లక్: వదిలెయ్ ఇంక ఆ విషయాన్ని…” గీతలా భోదన ముగించాడు రవి.
రవి చెప్పింది వింటున్నా పద్దూ తన కళ్ళల్లో మెదులుతూనే ఉంది వేణుకి.
వేణుకి నచ్చచెప్పి నెమ్మదిగా ఇంటికి తీసుకు వచ్చాడు. ఎందుకన్నా మంచిదని అమ్మకి విషయం చెప్పాడు. “జాగ్రత్త ఆంటీ; వాడ్ని నేను ఎప్పుడూ అలా చూడలేదు; మళ్ళీ రేపు వస్తాను” అంటూ వెళ్ళిపోయాడు రవి.
ఓ వారం రోజులు ఎలా గడిచాయో తెలియదు… మెదడుని తొలిచేస్తున్న ఆలోచనలు… గుండెను మెలిపెడుతున్న పద్దూ ఊహలు… జీవితం మీద నిరాశ… ఒక క్షణం తనవాళ్ళు గుర్తొస్తుంటే కాస్త ఊరడింపుగా ఉంటుంది… మరుక్షణం పద్దూ గుర్తుకొచ్చి ఈ లోకంలో తన ఉనికిని ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంది…
గడియారం వంక చూసాడు. పది దాటింది. ఇంట్లో అందరూ పెళ్ళికి వెళ్ళారు. ఇంకేం ఆలోచించకుండా ఇంట్లోంచి బయటకొచ్చాడు. ఇప్పుడు ఎక్కడికెళ్ళాలో తనకు బాగా తెలుసు…
*****************************
దూరంగా రైలు వెళుతున్న శబ్ధం వినిపిస్తుంది. వడివడిగా నడవడం మొదలు పెట్టాడు.
వాన ఎక్కువైంది. దారి పక్కన ఉన్న చెట్టు కిందకి చేరాడు. చేతులు తుడుచుకుని జేబులో చెయ్యిపెట్టాడు. ‘హమ్మయ్య ఇంకా తడిసిపోలేదు’ అనుకుంటూ నెమ్మదిగా సిగరెట్టు పెట్టె తీసి ఒకటి వెలిగించాడు. ఇప్పుడు కాస్త చలి తగ్గినట్టనిపించింది. జేబులో నుండి ఈసారి పద్దూ ఫొటో తీసి అలా చూస్తూ ఉండిపోయాడు.
కుక్కలు మొరగడంతో ఈ లోకానికొచ్చాడు వేణు. వాన తగ్గినట్టనిపించింది. ఈసారి కుక్కపిల్ల మూలుగు వినిపించింది. దూరంగా ఓ గోతి చుట్టూ ఓ కుక్క ఏమీ చేయలేక లోపలికి చూస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. వేణు అటుగా వెళ్తూ అనుమానం వచ్చి లోపలికి చూసాడు. కుక్కపిల్ల ఒకటి లోపల సగం వరకు మునిగిపోయి మూలుగుతూ కనిపించింది. వెంటనే లోపలికి దిగి దాన్ని పైకి తీసి చెట్టు కిందకి తెచ్చాడు. కొంతసేపు అక్కడే ఉండి ఆ కుక్కపిల్ల తేరుకున్నాకా దాన్ని వదిలి బయటికొచ్చాడు.
మొత్తానికి రైలుపట్టాలను చేరుకున్నాడు. అంతా తడితడిగా ఉంది. తాకి చూస్తే జిల్లుమంటుంది. వస్తున్న వణుకును అదుపుచేసుకుంటూ పట్టామీద మెడపెట్టి పడుకున్నాడు. తన వాళ్లందరూ ఒక్కసారి కళ్ళ ముందు కదులుతున్నారు. అందరికీ క్షమాపణలు చెప్పుకున్నాడు. ఆకాశంలో చంద్రుడు మబ్బుల మధ్య నుండి అప్పుడే భయటకొచ్చాడు. ఆ వెలుగులో పద్దూ ఫొటోని తనివి తీరా చూడటం మొదలుపెట్టాడు. ‘వచ్చే జన్మలోనైనా నీకు నచ్చేలా ఉండలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’ అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. మెదడులోకి ఇంకేం ఆలోచనలు రానివ్వకుండా రైలు కోసం ఎదురు చూస్తున్నాడు.
ఏదో తన పక్కకొచ్చినట్టు అనిపించి అటు తిరిగిచూసాడు. ఇందాకా తను కాపాడిన కుక్కపిల్ల తన పక్కకు వచ్చి షర్టుని పట్టుకు లాగుతుంది. దాని తలని సుతారంగా నిమిరి పట్టాల పక్కన నిలబడ్డ కుక్కపిల్ల తల్లి పక్కన ఉంచాడు. తోక ఊపుతూ అది వేణుని చూస్తూ నిలబడింది.
దూరంగా రైలు వస్తున్న శబ్ధం…
వేణు ఇంకేం ఆలోచించకుండా పట్టాల మీద మళ్ళీ తలపెట్టి పడుకుని కళ్ళుమూసుకున్నాడు.
రైలు దగ్గరకొస్తుంది… తన పక్క ఎవరో పడుకున్నట్టు అనిపించింది… మనసాగక పక్కకు చూసాడు… ఆ కుక్కపిల్లే తనలా పట్టాపై తలపెట్టి పడుకుంది… తల్లి పాపం దాన్ని లేపటానికి మొరుగుతుంది.
రైలు దగ్గరకొచ్చేయడంతో ఇంకేం చెయ్యలేక ఆ కుక్కపిల్లని పట్టుకుని పట్టాల పక్కకి దొర్లిపోయాడు. ఎక్కడలేనీ ఆవేశం… ఆ కుక్కపిల్ల మీద చెప్పలేనంత కోపం వచ్చేస్తుంది…
“ఏం బుద్దిలేదా! ఎందుకు నన్ను చావనివ్వడం లేదు. నేనేం చేసాను; నిన్ను గోతిలోంచి బయటకు తీసాను అంతే కదా! ఈ మాత్రం దానికే నాతో చావాలనుకుంటున్నావా. అక్కడ నీ అమ్మ ఉంది చూసావా అది ఏమైపోతుంది…” మనిషితో మాట్లాడుతున్నట్టు మాటలు బయటకొచ్చేసాయి. ఒక్కసారిగా అంతరంగంలో ఏదో చైతన్యం… ఒక్కసారి మనస్సాక్షి ప్రశ్నించింది… ‘ నువ్వు చేస్తున్నది ఏంటి?…’
కళ్ళ ముందు తెరలు కట్టిన మబ్బులేవో కరిగిపోతున్న అనుభూతి… తన దగ్గర జవాబు ఉంది… అది తలచుకుంటే తన మీద తనకే సిగ్గూ జాలీ కలిగాయి. ‘ఒక మనసులేని దాని కోసం నా జీవితాన్ని నాశనం చేసుకుందామనుకున్నానా?!! నా వాళ్లను కన్నీట ముంచుదామనుకున్నానా?!! నన్నింత కష్టపడి పెంచిన అమ్మానాన్న గురించి నేనెందుకాలోచించలేకపోయాను?!! ‘ తనలో చీకటిని చీల్చుకుంటూ ఏవో ఆలోచనలు…
పద్దూ ఫొటో వేణు చేతి వేళ్ల నుండి జారిపోయి పక్కనున్న ముళ్ళపొదల్లోకి ఎగిరిపోయింది…
ఆకాశం ఇప్పుడు ప్రశాంతంగా… నిర్మలంగా… నిండు చంద్రుడితో కనిపిస్తుంది…
వేణు ఇంటి వైపు వడివడిగా నడవడం మొదలు పెట్టాడు… గాయపడ్డ మనసు ఇప్పుడు బాదంటే ఏంటో మర్చిపోయింది… ఈ ఘడియలో వేణు మళ్ళీ పుట్టాడు…
బ్రహ్మ ముహూర్తం అప్పుడే మొదలయ్యింది.
- ఈ టపాను వీటికి జతచేయండి
- Del.icio.us -
- Meneame -
- Digg
కొత్తపాళీ యొక్క అభిప్రాయము
Made Tuesday, 15 of April , 2008 at 1:05 pm
Beautiful.
radhika యొక్క అభిప్రాయము
Made Tuesday, 15 of April , 2008 at 5:02 pm
కధలా బాగుంది కానీ కొన్ని జనరల్ డౌట్స్ వున్నాయి.చనువుగా వుంటే ప్రేమేనా?ఒకళ్ళకి ప్రేమపుడితే రెండవ వాళ్ళు ప్రేమించి తీరాల్సిందేనా?తెలిసినవాళ్ళని/స్నేహితులని భర్తగా ఊహించడం కొందరికి కష్టమే. మా అత్త కొడుకులు[4] అందరితోనూ నేను చాలా సరదాగా,చనువుగా,స్నేహంగా వుండేదానిని.పెద్దయ్యాకా ఒక బావని పెళ్ళి చేసుకోమని అంటే అసలు ఏమీ అర్ధం కాలేదు.చివరికి చేసుకోలేనని చెప్పేసాను.ఏ కల్మషం లేకుండా ఆడా,మగా స్నేహం చెయ్యడమే వుండదా?
Ravi యొక్క అభిప్రాయము
Made Tuesday, 15 of April , 2008 at 10:57 pm
Mr Daatla mee ee madanam manasunna pratiokkarini kadilistundi ……….. endukante adi kaalpanikam kaadu kaabatti
ee…………. kaalapu aadapillaliki kaavalisindi better choice venu laanti ammayakulu chaalamandi ee… nijaani chivarakaina telusukunnaduku santosham……………
జ్యోతి యొక్క అభిప్రాయము
Made Wednesday, 16 of April , 2008 at 12:20 am
శ్రీనివాసా ఇది కథ మాత్రమేనా లేక వాస్తవమా ?
వేణు లాంటి అబ్బాయిలకు నా సలహా ఇది..
వేణు , అసలు నీది వన్ సైడ్ లవ్. నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడ్డావు, జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకున్నావు మంచిదే. కాని ఆ అమ్మాయి ఎప్పుడన్నా నిన్ను ప్రేమిస్తున్నాను అందా? నీతో చనువుగా ఉన్నంత మాత్రాన నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటుందని ఎలా అనుకున్నావు. నీ ఫ్రెండ్ రవి చెప్పినట్టు నేటి అమ్మాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద పెద్ద కోరికలతో ఉంటారు. అందుకే నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోలేదేమో. అది ఆ అమ్మాయి ఇష్టం. తప్పేముంది.ఐనా ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చావడానికి పూనుకోవడం చాలా తప్పు. ఐదు నిమిషాల ముందు నువ్వు కాపాడిన కుక్కపిల్ల గురించి ఆలోచించావ్. సంవత్సరం క్రింద పరిచయమైన ఆ అమ్మాయి కాదందని చావాలనుకున్నావ్. కాని పాతికేళ్ళకు పైగా నీ గురించి ఆలోచించే , నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రులు, చెల్లి ఏమవుతారో అని ఒక్కసారి ఆలోచించలేదా? అలాగే ఆ అమ్మాయిని కాని, నీ స్నెహితులను కాని నమ్మి మోసపోయావ్. ఇలా జరిగినందుకు బాధ కలుగుతుంది. నిజమే. కాని నిన్ను నువ్వు నిలదొక్కుకోవాలి. తప్పదు. నీ కోసం, నీవారి కోసం. ఐనా ప్రపంచంలో ఆ అమ్మాయి ఒక్కతే ఉందా. నిన్ను నిన్నుగా ప్రేమించే అమ్మాయి తప్పకుండా నీ జీవిత భాగస్వామిగా వస్తుంది. శంకర్ దాదా M.B.B.S చెప్పినట్టు ఒక రోజు రాత్రి ఫుల్లుగా తాగు, మనసులోని భారం దిగిపోయేదాకా ఏడ్చేయ్. మళ్ళీ పొద్దున్నే పాతవన్నీ తుడిచేసి, మామూలుగా లైఫ్ ని ఎంజాయ్ చేయి. ఇంకా చాలా జీవితం ఉంది. నీ జీవితానికి నువ్వే రాజువి . సో.. జల్సా చేయి.. ఈ రోజు నీదే, రేపు నీదే. ..మధ్యలో వచ్చినవారు మధ్యలో పోతారు.
నేను ఈ మాటలు సినిమాలు చూసి, నవళ్ళు చదివి చెప్పటంలేదు. ప్రేమించిన అమ్మాయి దూరమైందని చావాలనుకుని, ఒక స్నేహితుడి వల్ల బ్రతికిన అబ్బాయి తెలుసు. అతను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్ళి చేసుకోలేక పెళ్ళి ముందు రోజే ఆత్మహత్య చేసుకుంది. అలాగే ప్రేమించిన ఎంతో మంది పెద్దల నెదిరించి పెళ్ళి చేసుకున్నారు. కాని అందులో ఇద్దరు ప్రేమలో పడ్డారు . ఒకరి కొకరు అన్నారు.
Dont Worry !! Be Happy !!… yehi hai zindagi …
Kiran యొక్క అభిప్రాయము
Made Wednesday, 16 of April , 2008 at 1:11 am
Baavundi! Really a nice one!
Madhav యొక్క అభిప్రాయము
Made Wednesday, 16 of April , 2008 at 3:26 am
Heart touching..if every one feels like venu..there ‘ont be suicides and murders..we should feel the responsibility of taking care of our parents. How can they survive at that age?? How can they digest the news?? Few people used to do stupid things by getting suicide and murdering the person who rejects them…even news papers used to write news like committing suicide or murdering the gal…no news paper will write that venu is fine…though he got refused..but we can’t blame them too..
I guess in that situtation we need good support from friends..so trust in them..
Friends please try to forward as many your friends and well wishers too..keep smiling..
Thanks to the person who wrote this…
చక్రవర్తి యొక్క అభిప్రాయము
Made Wednesday, 16 of April , 2008 at 3:45 am
అంతా బాగానే ఉంది కానీ.. ఒక్క చోట, పద్దు గురించి మీరు వర్ణించిన తీరు నాకు సుతారామా నచ్చలేదు. పద్దు గురించిన వర్ణన మీ మాటలలో .. “ఒక మనసులేని దాని కోసం ..”
మనసు ఉందో లేదో మీరు ఎలా నిర్ణయించేయ్యగలరు.. ఎదైనా ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతీ ఆడవాళ్ళు మనసు లేనట్టేనా??
ప్రతిపాదన చేసే హక్కు, స్వాతంత్ర్యయం ప్రతీ మగవాడికీ ఉంది.. అలాగే.. వచ్చిన ప్రతిపాదనను అంగీకరించే స్వాతంత్ర్యయంగానీ, తిరస్కరించే హక్కుగానీ అట్టి స్త్రీకి లేదా..
తిరస్కరించిన ప్రతీ వనితా మనసు లేనిదా.. వారికి ఆ స్వాతంత్ర్యం లేదా..
ఏది ఏమయినా తమరు ఈ వాక్యాన్ని క్రింద సూచించిన విధంగా మార్చిన యడల సంతసించెదను ..
“నీ మనసును, దానిలోని భావనను అర్దం చెసుకోలేని దాని కోసం ..”
అయితే బాగుంటుందని నా సలహా..
ఇట్లు,
భవదీయుడు,
చక్రవర్తి
నల్లమోతు శ్రీధర్ యొక్క అభిప్రాయము
Made Wednesday, 16 of April , 2008 at 6:39 am
దాట్ల శ్రీనివాస రాజు గారు.. గాఢమైన ప్రేమని గ్రహించగల, స్వీకరించగల పరిపక్వత చాలామందిలో ఉండదు. వేణు మనసు అనుబంధాల చిక్కుముడులు విప్పగలగడం గొప్ప మలుపు. లేదంటే ఎందరో ఆత్మీయులు వేదన పడవలసి వచ్చేది. ప్రేమ, జీవితం, అనుబంధాలు వీటి వెనుక సహజంగా జరిగే తంతుని వాస్తవానికి చాలా దగ్గరగా స్పృశించారు. హ్యాట్సాఫ్. మీరు రాసినది మనసుని కదిలించివేసినా నా స్పందనను తెలియజెయ్యడానికి మాటలే రావట్లేదు.
Chilakapati Srinivas యొక్క అభిప్రాయము
Made Wednesday, 16 of April , 2008 at 9:45 am
మీ కథ ఉద్దేశం బావుంది కానీ పాత్ర చిత్రణ బొత్తిగా బాలేదు.
“నేను దాని అందం చూసి ముచ్చట పడితే అంతకన్నా అందమైన దాన్ని చూసి దీన్ని మరచిపోవచ్చేమో అని అనుకోవచ్చురా. నువ్వూ చూసావు కదా దాన్ని. ఎందుకో దానిలో కొన్ని గుణాలు నచ్చాయిరా. నేను తనని ఎంతలా ఇష్టపడుతున్నానో దానికి తెలుసురా;”
నిజంగా ప్రేమించినవాడి నోటి నుండి వచ్చే మాటలు కావివి. గౌరవం లేని ప్రేమ ఉండదు. “దాని” అని అతడు ఆమెను ఉద్దేశించి పదే పదే అనడం ఎంత సంస్కారవంతమో మీరే చెప్పాలి. ఇంత చవకబారయిందా యువతరం?
శ్రీనివాస యొక్క అభిప్రాయము
Made Wednesday, 16 of April , 2008 at 9:52 am
అందరికీ నెనరులు.
@రాధిక గారూ ఇది కధలా బాగోవడమేమిటండీ! ఇది కధేనండీ ![]()
ప్రేమించి తీరాల్సిందేనా ? అని అడిగారు - వేణు అలా అనుకుని ఉంటే రైల్వే ట్రాకు వైపు అడుగులు వేసేవాడు కాదు; ఏ యాసిడ్ బాటిల్‌కో, కత్తికో పని చెప్పి అప్పుడు తను చచ్చిపోయేవాడు. ఎవరి వ్యక్తిత్వం వారికుంటుంది. అలా అని ఏ కారణమూ చెప్పకుండా ఒకరిని తిరస్కరిస్తే ఎలా?
స్నేహితులని భర్త/భార్యగా ఊహించుకోవడం అంటే అది వాళ్ల మధ్య ఉన్న అన్యోన్యత అవగాహన బట్టి ఉంటుంది.
భార్యాభర్తలు స్నేహితుల్లా ఉండాలంటారు. మరి స్నేహితని జీవితభాగస్వామిని చేసుకోవాలనుకోవడం తప్పుకాదుకదండీ.
మీరు మీ బావలలో ఒకరితో ఎక్కువ చనువుగా ఉండి ఆ తర్వాత అతనే మిమ్మల్ని పెళ్ళిచేసుకుంటానంటే మీరు ఆలోచించి ఉండేవారేమో! మనల్ని కావాలనుకునే వాళ్ళని కాకుండా ఎవరో కొత్తవాళ్ళు/పరిచయంలేనివాళ్లను ఇంట్లోవాళ్ళు చూపించి పెళ్ళి చేసుకోమంటే కాస్తయినా ఆలొచిస్తారుకదా! ఒకవేళ అలా ఆలోచించకపోయి ఉంటే బహుశా మీరు కాబోయే భర్తని వేరేలా ఊహించుకుని ఉండొచ్చు; మీ బావలు చదువుకోకపోతే, మీరు చదువుకున్నవాడ్ని కావాలనుకుని ఉండొచ్చు, లేదా ఎవరైనా NRIని ఇంట్లోవాళ్ళు తెస్తారని ఎదురుచూస్తుండొచ్చు. దేనికైనా ఒక కారణం ఉంటుంది కదా!
కల్మషం అంటే? వేణు ప్రేమించి వదిలేస్తానన్నాడా? జీవితంలో ఒక వ్యక్తిని (ఒకే వ్యక్తిని) ఇష్టపడి పెళ్ళిచేసుకోవాలనుకోవడం కల్మషమనుకోను.
ఈ కధలో వేణు పద్దూల మధ్య అన్యోన్యతను, జరిగిన సంభాషణను తగ్గించి రాసాను అసలు పాయింట్ పక్కకి వెళ్ళకుండా.
పైన కధని పక్కన పెట్టి మీకొక యదార్థ సంఘటన చెబుతాను… ఇది నా స్నేహితుడికి జరిగింది.
నా స్నేహితుడికి ఒక సంభందం వచ్చింది. మావాడు BTech; ఆ అమ్మాయి MTech. వాళ్ళే కుటుంభం మంచిదని కావాలని వచ్చారు. మావాడు ఆ అమ్మాయితో అన్ని విషయాలూ మాట్లాడాడు… ఆమె తనకన్నా ఎక్కువ చదివింది కదా; ఆమెకి తనను చేసుకోవడం ఇష్టమో కాదో అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి చదువులో తేడా ఏముంది మనుషులు మంచివాళ్లైతే అని సమాధానమిచ్చింది. ఇరు కుటుంభాలలో అందరికీ ఆమోదం కుదిరింది. మావాడు ఆ అమ్మాయితో గుడికీ, సినిమాకీ తిరిగాడు కూడా! తీరా నిశ్చితార్దానికి ముందు ఆమె బంధువెవరో అమెరికా నుండి వచ్చి ‘అమ్మాయిది పెద్ద చదువు. ఇంకా మంచి సంభందం వస్తుంది; వీడు మనకెందుకు’ అని చిచ్చుపెట్టాడు. అంతే! వాళ్ళు మావాడి ఇంట్లో తమకు ఈ సంభందం ఇష్టం లేదని చెప్పారు. ఆమె అంత చదువుకున్నది కదా? ఆమె అయినా ఆలోచించి ఉండవచ్చుకదా? ఆమె అప్పటినుండి మిన్నకుండిపోయింది.
మా స్నేహసమూహంలో ఎవరికీ అమ్మాయిలని ముగ్గులోకి దించి, జల్సాలు చేసే అలవాటు లేదు. అయినా చివరికి ఏమయింది? ఇంట్లో చూపించిన అమ్మాయినే నమ్ముకుని మావాడు పాపం బాదపడ్డాడు.
@చక్రవర్తి గారూ పై వాస్తవం చదివాకా కధలో ‘ఒక మనసులేని దాని కోసం’ అని అనడంలో తప్పులేదని అనుకుంటున్నాను. కనీసం నా స్నేహితుడి స్వీయానుభవం రగిల్చిన వేదనని మన్నిస్తారనుకుంటున్నాను
@జ్యోతిగారూ మీ సలహా ఆహ్వానించదగ్గది.
అయినా ఇదేం లోకమండీ! గాయపడ్డవాడు కత్తిపట్టుకుని మేధానికి దిగినా విమర్శిస్తారు. మధనపడి భాధను వెళ్ళగక్కినా విమర్శిస్తారు ![]()
JALLIPALLIK KRISHNA RAO యొక్క అభిప్రాయము
Made Wednesday, 16 of April , 2008 at 10:28 am
వేణు ని ప్రేమిస్తే పద్మ చాలా చాలా మంచిది, sweet heart, better half, అతిలోక సుందరి, దివి నుండి భువి కి దిగివచ్చిన దేవత etc. etc. కానీ … తిరస్కరిస్తే.. పనిమనుషులను సంబోదించినట్లు .. ‘అది’ ‘దాన్ని’ … wow.. whateeee calculated love.
శ్రీనివాస యొక్క అభిప్రాయము
Made Wednesday, 16 of April , 2008 at 11:34 am
@చిలకపాటి వారూ, పాత్ర చిత్రణ రచయితదే కాబట్టి సమధానం చెప్పక తప్పదు. భాష లొకాల్టీని బట్టీ ఉంటుంది. భాషను చూసి వేణు వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యటం సరైనదేనా? ఇది మీ వ్యక్తిత్వమా
సంభాషణలోని ఇద్దరికీ తాము మాట్లాడుకునే మూడో వ్యక్తి బాగా తెలిసినప్పుడు,తమ తోటివారైనప్పుడు దాని/అది అని సంభోదించడం సంస్కారహీనమా? ఆ ఒక్క పేరాలో కాకుండా ఆమె గురించి చెబుతున్నప్పుడు ఆమె అని రాసాను గానీ అది/దాని అని మీకు ఎక్కడైనా కనిపించిందా? అంతే కాకుండా నేను పైన రాసిన కామెంటులో నా స్నేహితుడిని మావాడు అని అన్నాను కానీ ఆ అమ్మాయి నాకు తెలియదు కాబట్టి ఆమె అని సంభోధించాను, గమనించగలరు. దీనికే యువతరం చవకబారైందా అని అంటున్నారు. అంటే మరి మీరు ఛాందసులా
@జల్లిపల్లి వారూ, మీరు ఇలానే ఆలోచిస్తారనుకుంట! అతిలోక సుందరి దివి నుండి భువి కి దిగివచ్చిన దేవత అని అనుకోవడానికి పద్దూ అంత అందగత్తేం కాదు అని కధ మొదట్లో రాసింది చదవలేదా? calculated love అని అన్నారు! అసలు ప్రేమ అనే పదం నేనెక్కడన్నా వాడానా ఈ కధలో? ఓ నాలుగు లైనులు చదివి ఇలా కామెంటు రాయడం ఏం బాగోలేదండీ ![]()
ప్రవీణ్ గార్లపాటి యొక్క అభిప్రాయము
Made Wednesday, 16 of April , 2008 at 11:54 am
దాట్ల,
నువ్వు రాసిన విధానం బాగుంది. నిజానికి ఇలాంటి నిజ జీవిత కథలు ఎన్నో. కనీసం ధైర్యంగా ఆ అమ్మాయికి చెప్పగలిగాడు వేణు. అలా చెప్పలేని వారే ఎందరో.
కనీసం నేను ప్రయత్నించలేదు అని ఎప్పుడూ అనుకోడు.
అయితే మనం కోరుకున్నవన్నీ జరిగేది జీవితం కాదు. “Life takes its own turns”.
అన్నీ సవ్యంగా జరగవు. కొన్నిటికి కారణాలు ఉండవు.
అనుబంధాలు అంత తేలిక కావు. నువ్వు నాకు నచ్చావు, నేను నీకెందుకు నచ్చలేదు అనే సిద్ద్హాంతం కుదరదు.
నువు చెప్పిన కథలో వేణుకీ, ప్రేమించలేదని ఇతరులని చంపే రాక్షసులకీ పెద్ద తేడా లేదు. ఇద్దరూ ప్రాణం తీయాలనే అనుకుంటున్నారు.
ఒకరు తనదే ఇంకొకరు ఇతరులది. (Both are extreme thoughts)
చావొకటే అన్ని సమస్యలనూ తీర్చజాలదు. ఉదా: నే పరీక్ష ఫెయిలయానని చస్తే పరీక్ష పాసవుతానా ? ఇంకోసారి పట్టుదలతో రాస్తే పాసవుతానా ?
నాకు తెలుసు ఇలాంటి వాటిలో లాజిక్కులు వెతకకూడదని, ఇది మనసుకు సంబంధించినదనీ, కానీ ఓ నిముషం మనసుని అదుపులోకి తెచ్చుకుని వేణు చివరికి ఆలోచించినట్టు ఆలోచించగలిగితే మన జీవితంలో ఎన్నో సమస్యలకు అంత కష్టం కాని పరిష్కారాలు లభిస్తాయి.
Chilakapati Srinivas యొక్క అభిప్రాయము
Made Wednesday, 16 of April , 2008 at 2:28 pm
వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి మన మాటా, చేతా కాక మరేమున్నాయో నాకు తెలియదు. కథానాయకుడి చేతల్లో ఎటూ తేటతెల్లమవుతుంది అతని మనస్తత్వం - కోరుకున్నది స్వంతం అయితీరాలి, అవతలి వ్యక్తి ఇష్టానిష్టాలతో పనిలేకుండా. అతని మాటల్లో నాక్కనిపించింది ప్రేమ కాదు, ఒక చులకన భావం. ఆమె ఒక వస్తువు అన్న అభిప్రాయం. (ఇక్కడ మనం వేణు గురించి మాట్లాడుతున్నాం, మీ గురించి కాదు) మరెక్కడా అది/దాన్ని అనలేదన్నారు గానీ, ఇక్కడ ఒక్క చోటే కదా ఆమె గురించి వేరొకరితో ప్రస్తావించింది!
తెలిసిన అమ్మాయిని అది/దాన్ని అంటే సంస్కారహీనమవుతుందా అని ప్రశ్నించారు. అవతలి మనిషికి అందునా ప్రాణసమానంగా ప్రేమిస్తున్నానంటున్న మనిషికి గౌరవమివ్వడం సంస్కారంలో భాగమనే అనుకుంటూ వచ్చాను. “అది” ఇప్పుడు గౌరవ వాచకమయిందేమో నాకు తెలియదు.
ఒక చిన్న పరీక్ష చేసుకున్నాను; నా భార్యను గురించి మా ఇద్దరి స్నేహితుడితో అలా ప్రస్తావిస్తానా? మీ పరీక్ష ఏమిటి?
వేణు లాంటివారికి పథ్యంగా చదివించదగిన, నాకు నచ్చిన కథ ఒకదానికి లంకె ఇస్తున్నాను.
chavakiran యొక్క అభిప్రాయము
Made Thursday, 17 of April , 2008 at 1:23 am
Beautiful
శ్రీనివాస యొక్క అభిప్రాయము
Made Thursday, 17 of April , 2008 at 3:48 am
ప్రవీణ్, కిరణ్ నెనర్లు,
అవును ప్రవీణ్, మనసే కీలకమైనది. దానిని అదుపులో ఉంచడం కొంచెం కష్టమే మరి!
@చిలకపాటి వారూ, మీ వయసెంతో నాకు తెలియదు. మీరెక్కడివారో నాకు తెలియదు. మీరు ఒక రకమైన ఆలోచనా విధానానికే అలవాటుపడినట్టున్నారు. అందుకేనేమో మీరూ మరోవ్యక్తి ఈ సంభోదనల విషయంలో విమర్శించారు. నేను విశాఖలో పెరిగాను; ఒకసారి తూగోలో మా తాతయ్యగారి ఇంటికి వెళితే అక్కడ ఆయనతో ‘మీరు పెళ్ళికి వస్తారా రారా’ అని అడిగితే ఆయన నన్ను ‘రా అంటున్నావా? తూర్పు భాష నీకు అబ్బేసింది” అని చీవాట్లు పెట్టారు. తరాల అంతరాలు అని సరిపెట్టుకున్నాను. అందుకే సంభోదనల విషయంలో నేనింక మాట్లాడదలచుకోలేదు.
పార్కులో వేణు మధ్యం మత్తులో తూగుతున్నాడు కదా! అది గమనించలేదా? తాగి ఆమెను పచ్చిభూతులు తిట్టలేదే? తనలో బాధను వెళ్లగక్కుకున్నాడు అంతే!
ఇక మీరు కధ మొత్తం మనసు పెట్టి చదవలేదనుకుంట!
‘మంచిది పద్దూ; నేను స్నేహితుడిగా మాత్రమే పనికొస్తానని తేల్చేసావ్. నువ్వు జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకు మంచిదే జరగేలా కోరుకుంటున్నాను… బై’ అని వేణు అన్నాడు చదివారా?
కోరుకున్నది స్వంతం అయితీరాలి అని అనుకుని ఉంటే ఎలాగన్నా దక్కించుకుందామనుకునేవాడు గానీ ఇలా చద్దామనుకునేవాడు కాదు!
అసలు ప్రేమ అన్న పదం నేను కధలో వాడానా? ఆ అనుభూతికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియనితనం అన్న వాక్యం చదవలేదా?
తను నిర్భయంగా తన మనసులో సంగతి చెప్పాడు… కాని ఆమె ఇచ్చిన సమాధానం; తను కేవలం స్నేహితుడిలానే పనికొస్తాడనే ఆమె అభిప్రాయం; తను అడిగిన విషయాన్ని దాటవేసిన నైజం వేణుని కలిచివేసాయి. ‘ఆమె నాకు కావాలి; నన్నే పెళ్ళి చేసుకుని తీరాలి’ అన్న భావం ఎక్కడైనా ఉందా?
మీరిచ్చిన ఈమాట లంకె బాగుంది. ఆ తరహాలో నేనూ రాసాను.
నిజ సౌందర్యం
మరీ యువతరం అంటే చులకనైపోతుంది.
నూతిలో ఉన్న కప్పకి ఎన్ని చేదలు తోడుతున్నారో తెలుస్తుంది గానీ మోటర్ ద్వారా నీరు తోడుతున్నప్పుడు లెక్కపెట్టడం చేతకాదులెండి.
జ్యోతి యొక్క అభిప్రాయము
Made Thursday, 17 of April , 2008 at 4:59 am
శ్రీనివాస,
ఇక్కడ నువ్వు చెప్పిన కథ ప్రకారం, ఇది వేణు వైపు కథే!..అతని భావాలు, ప్రతిస్పందనలు అన్నీ కరెక్టే. కాని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని మనసులేనిది ఎలా అవుతుంది. ఒకటి చెప్పు.
మీ ఆఫీసులో నీకు బాగా తెలిసిన అమ్మాయి వచ్చి పెళ్ళి చేసుకో అంటే ఒప్పుకుంటావా? నీకు అస్సలు ఆ అమ్మాయి మీద అలాంటి ఆలోచనే రాలేదు. ఐనా అడగితే ఒప్పుకుంటావా? ఇది ఓన్లీ స్నేహంకాదు, జీవితాంతం కలిసి ఉండాలనే విషయం. ఆలోచించి చెప్పు.
శ్రీనివాస యొక్క అభిప్రాయము
Made Thursday, 17 of April , 2008 at 5:19 am
@ జ్యోతిగారూ
నాకు బాగా తెలిసిన అమ్మాయి అంటే నాతో బాగా చనువుగా ఉండే అమ్మాయి; నేను తనతో, తను నాతో వ్యక్తిగతమైన విషయాలు పంచుకున్న అమ్మాయి; నేనంటే అభిమానం చూపించే అమ్మాయి వచ్చి చేసుకుంటానంటే తప్పకుండా ఒప్పుకుంటాను :-). ( ఈ కధలో వారిద్దరి మధ్యా ఇంతే దగ్గరితనం ఉండేది. కధని అంతలా వర్ణించుకుంటూ పోతుంటే కధ పెద్దదైపోతుంది అసలు విషయం నీరుగారి పోతుందని వాళ్ల గతం గురించి ఎక్కువ రాయలేదు )
నిషిగంధ యొక్క అభిప్రాయము
Made Thursday, 17 of April , 2008 at 6:12 am
శ్రీనివాస్ గారూ, కధ బావుందండీ.. ముఖ్యంగా మీ శైలి.. కళ్ళు అక్షరాల వెనక అలా పంచకళ్యాణిలా చివరివరకూ ఆగకుండా పరిగెట్టాయి..
ఇక కధా విషయానికి వస్తే, పెళ్ళికి కాదన్నదన్న ఒక్క రీజన్ తోనే పద్మ మీద మంచి అభిప్రాయం లేకుండా ఉండేలా చూశారు.. ఆ అమ్మాయి అభిప్రాయాలు ఇంకాస్త ఇంకొన్ని చెప్పి ఉంటే బావుండుననిపించింది..
తర్వాత స్నేహం, ప్రేమ, పెళ్ళి విషయాలకొస్తే రాధిక గారితో పూర్తిగా ఏకీభవిస్తాను.. ఎంత మంచి స్నేహితులైనా, ఎంత అవగాహన ఉన్నా జీవిత భాగస్వామిగా ఊహించుకోలేము.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే! స్నేహితుడైనా, ప్రేమికుడైనా పెళ్ళయ్యాక భర్త గానే మిగులుతారనేది నా ఈక్వేషన్
:-)
మీరు చెప్పిన బి.టెక్, ఎం.టెక్ అనుభవం మా దగ్గర చుట్టాల్లో ఒకబ్బాయికి జరిగింది.. ఇక్కడ అమ్మాయిది చాలా మంచి ఉద్యోగం అబ్బాయి కన్నా.. మా అమ్మతో సహా ఆ అమ్మాయిని ఆడిపోసుకున్నారు.. ఒకప్పుడు అబ్బాయిలు ఎక్కువ కట్నం అనో, ఇంకా అందగత్తె అనో ఇలానే ఒక సంబంధం నించి ఇంకో సంబంధానికి జంప్ చేసేవాళ్ళు.. ఇప్పుడు అమ్మాయిలు కూడా మనసు గట్రాలతో పనిలేకుండా better qualities ఉన్నవాళ్ళ కోసం జంప్ చేస్తున్నారు.. ఔరా! అనుకోవడం తప్ప ఏం చేయలేం..
ఏది ఏమైనా మీ కధ వల్ల నా స్కూల్ రోజులనించీ అందరు స్నేహితులు (అబ్బాయిలు) గుర్తొచ్చారు.. పండు గాడిని చేసుకునుంటే ఎలా ఉండేదో.. చింకూ గాడు పెళ్ళైనా నాకు భయపడేవాడా.. రికార్డ్స్ రాయడంలో ఎప్పుడూ హెల్ప్ చేసేదాన్నని బక్క రమేష్ పెళ్ళయ్యాక కూడా పనంతా నాతోనే చేయించేవాడా!?!? ఇలా అన్న మాట
:-)
JALLIPALLIK KRISHNA RAO యొక్క అభిప్రాయము
Made Thursday, 17 of April , 2008 at 6:48 am
‘ఓ నాలుగు లైనులు చదివి ఇలా కామెంటు రాయడం ఏం బాగోలేదండీ’
…. ఏమీ బాగా లేకపొతే ok అండి. ఇకనుండి మీ టపాలకి comments రాయనులెండి. చదవడమే మానేస్తే పోలా…
radhika యొక్క అభిప్రాయము
Made Thursday, 17 of April , 2008 at 7:19 am
కధలా బాగుంది అంటే కధ చెప్పిన తీరు,బిగువు,శైలి బాగున్నాయని.కధావస్తువు మాత్రం బాగోలేదు.ఈ కధలో ప్రేమని ఒప్పుకోకపోవడం తప్పు,అబ్బాయిలు ఇలా బాధపడిపోతారు అన్నట్టుగా వుంది.వేణు మరే అమ్మాయితోను అలా చనువుగా లేదు,ఇప్పటి వరకు అమ్మయి మొహమే ఎరుగడు అన్న విషయం వేణూకి తెలుసు గానీ పద్దూ కి తెలియదుకదా.వేణూ కీ పద్దూ నచ్చడానికి పెద్దగా కారణాలు ఏమీ కనపడట్లేదు[అందంగా లేదన్నారు,పెద్దగా క్వాలిటీస్ లేవన్నారు]అలాగే పద్దూకి వేణూ నచ్చకపోవడానికి కూడా పెద్దగా కారణాలుండి వుండకపోవచ్చు.ఆమె అతనిని ఆ భావంలో చూసి వుండకపోవచ్చు.అయినా పద్దు గొప్పతనం కూడా కధలోనే చెప్పారు.వేణూ ఫోన్ చేసినప్పుడు ప్రేమ విషయం తప్పించి ఇంకేమయినా మాట్లాడమంది అంటే ఇప్పటి కూడా అతన్ని మంచి ఫ్రెండ్ లానే అనుకుంటుందని కదా. వేణూ,పద్దూని సుఖం గా వుండు అన్నాడు, మరి అంత డైలాగు కొట్టీ ఎందుకు చావడానికి బయలుదేరాడు.ఈ కాలం లో ఇలాంటి చావులు,ఏడుపులు ఎక్కువయిపోయాయి.మీలాంటి మంచి రచయితలన్నా అసలు విషయాన్ని వివరిస్తూ రెండు వైపులా ఆలోచించి కధ రాసుంటే బాగుండేది.మీ కధలో వేణూదీ పెద్దగా తప్పు లేదు.అలాగే పద్దూ తప్పు కూడా ఏమీ లేదు.కేవలం ప్రేమ కాదందని అంత సన్నిహితురాలిని వేరేవాడి దగ్గర అది,ఇది అనిపించడం బాగోలేదు.ఇవే సంఘటనలు రోజూ బోలెడు మంది జీవితం లో జరుగుతున్నాయి.దానిని మీరు కధగా మలచారు.మంచిది.కానీ అమ్మాయిని విలన్ గా చేసేసారు.అదే బాగోలేదు.ఒక్కసారి అమ్మయి తరపున కూడా ఆలోచిందండి.ఇలాంటి బర్నింగ్ ప్రోబ్లం మీద రాసినప్పుడు చదివేవారు ఆలోచించే విధం గా వుంటే బాగుంటుంది.
మీ స్నేహితుడికి జరిగిన సంఘటన నిజం గా బాధపడవలసిన విషయం.ఆ అమ్మాయి తరపువాళ్ళు చేసిన వని హర్షించదగినది కాదు.ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి ఏమన్నా సెక్షన్ వుంటే బాగుండును.ఇదే అబ్బాయి వాళ్ళు చేసి వుంటే ఈపాటికి పేపర్లలో,టీవీల్లో చావగొట్టేవాళ్ళు.కానీ మీరు రాసిన కధలో అమ్మాయికి,,మీ స్నేహితుడి విషయం లో అమ్మాయికి సంబంధం లేదు.కానీ ఆ కధే నేను రాసాను అంటారా అయితే మీరు సరిగా రాయలేదు:)
శ్రీనివాస యొక్క అభిప్రాయము
Made Friday, 18 of April , 2008 at 12:23 am
@జల్లిపల్లి గారూ, సద్విమర్శలైతే మంచివేనండీ. ఒకొక్కరూ ఒకొక్క పాయింట్ ని పట్టుకుని లాగుతుంటే అలా అనవలసి వచ్చింది. మీకు సదా స్వాగతం
@రాధిక గారూ, మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు ![]()
ఈ కధలో సంఘటన నా చిన్ననాటి స్నేహితుడికి జరిగింది. మరీ ఎక్కువ రాస్తే వాళ్లకి; ముఖ్యంగా ఆ అమ్మాయి ప్రైవసీకి భంగం కలుగుతుంది. అందుకే ఇక్కడ ఆ పార్ట్ ఎక్కువ రాయకుండా మావాడి వైపే వివరించాను. ఒక స్త్రీగా మీకిది మరోలా అనిపించవచ్చు, కానీ ఒక మనిషిగా నేను అక్కడితో ఆగిపోయాను. ఈ కధలోని చెరుకురసం తాగి పిప్పిని వదిలెయ్యండి ![]()
– THE END –
కొత్తపాళీ యొక్క అభిప్రాయము
Made Friday, 18 of April , 2008 at 7:09 am
జనాలూ - ఒక మాట: శ్రీనివాస ఏమీ యెకాడమీ యెవార్డు కోసం రాయలేదు కద, కథ? ఔత్సాహిక రచయిత, తన దృష్టికి వచ్చిన కథని తనకి చాతనైనట్టు రాశాడు. అంత మాత్రానికి చీల్చి చెండాడెయ్య నక్కర్లేదు. బాగుందీ, బాలేదన్న విషయాలు కాస్తంత మృదువుగానే చెప్పొచ్చు.
ఇంకోటి నాకెప్పుడూ అర్థం కాదు - ఒక యండమూరి ఒక కథ రాశాడంటే .. ఆహా యెంత గొప్ప యిమాజినేషన్ అనుకుంటాం. అదే ఒక ఔత్సాహిక రచయిత రాస్తే .. అలా యెందుకు అనుకోము? ఆ కథలో జరిగిన సంఘటన ఆ రచయితకో, లేక రచయిత సన్నిహితులకో జరిగిందని ఎందుకు అనుకోవాలి? ఏ రచనా కూడా పూర్తిగా గాలిలో పుట్టాదు. ఆఖరికి హేరీ పోటర్ లాంటి అభూత కల్పన కూడా.అలాగని ఏ రచనా పూర్తిగా అనుభవం కాదు, ఎంత కొత్త రచయిత ఐనా కూడా.
శ్రీనివాసా - నీ రచన ని ఎప్పుడూ సమర్ధించుకోవాలని ప్రయత్నించకు. అది వృధా యాతన. ఎవరన్నా ఈ పాయింటు అర్ధం కాలేదు అంటే కొద్దిగా వివరించొచ్చు కానీ .. అంతకంటే సమర్ధన అనవసరం. వారి విమర్శ నీకు పనికొస్తుందంటే స్వీకరించు. పనికి రాదు అనుకుంటే వెంటనే మరిచిపో. వర్ధమాన రచయితలకీ కవులకీ ఈ విచక్షణ చాలా అవసరం.
శ్రీనివాస యొక్క అభిప్రాయము
Made Friday, 18 of April , 2008 at 12:17 pm
కొత్తపాళీ గారూ అలాగేనండీ ![]()
radhika యొక్క అభిప్రాయము
Made Friday, 18 of April , 2008 at 5:37 pm
శ్రీనివాస గారూ కధ ని కధ లాగా చూడకుండా ఇంతటి చర్చని చేసినందుకు క్షమించండి.మామూలూ పరిస్థితులలో చదివి వుంటే నా కామెంటు ఇలా వుండకపోదును.బ్లాగు లోకం లో ఇప్పూదు వేడి వేడి చర్చ జరుగుతుంది ఆడవాళ్ల గురించి.ఈ సమయం లో ఈ కధ వచ్చేసరికి మీ కధలో కూడా ప్రముఖంగా ఆ విషయాలే కనిపించాయి.ఇలా జరిగినందుకు క్షమించమని అడుగుతున్నాను.నేను ముందే చెప్పినట్టు కధనం,బిగువు,శైలి అన్నీ చాలా బాగున్నాయి ఎప్పటిలానే.
శ్రీనివాస యొక్క అభిప్రాయము
Made Saturday, 19 of April , 2008 at 1:33 am
@రాధిక గారూ, మన మధ్య క్షమాపణలెందుకండీ ![]()
@అందరికీ, రాధిక గారు అన్నీ చాలా బాగున్నాయి ఎప్పటిలానే అని అన్నారు కదూ
. ఇక్కడ ఒక సందేహాన్ని నివృతి చెయ్యాలి/చేసుకోవాలి. ఇందుకూరి శ్రీనివాసరాజు అని వేరొక బ్లాగరు పడమటి గోదావరి రాగం అనే బ్లాగు రాస్తుంటారు. ఆయన నాకు ఆర్కుట్ (ద్వారా పరిచయమయిన) బావ. ఆయన తన బ్లాగులో ఎక్కువగా కధలు/సంఘటనలు మంచిగా రాస్తుంటారు. నేను (దాట్ల శ్రీనివాసరాజు) నా హరివిల్లు బ్లాగులో కవితలు, పాటలకు సంబంధించిన విషయాలు, స్వగతాలు, సాంకేతిక విషయాలు, అప్పుడప్పుడూ రేర్‌గా ఇలా కధలు రాస్తుంటాను. ఒంటిపేర్లు ఒకటైనా ఇంటిపేర్లు వేరని గమనించగలరు. నన్ను ఆయనగా పొరబడ్డారేమోనని ఇది చెబుతున్నాను ![]()
radhika యొక్క అభిప్రాయము
Made Saturday, 19 of April , 2008 at 7:09 am
నిజమేనండి.నేను అలాగే అనుకున్నాను.మీరు చెప్పాకా గానీ నాకు తేడా తెలియలేదు.నా ముందు కామెంటు లో కూడా “మీలాంటి మంచి రచయితలు ఇలా రాయడం బాగోలేదు”అని ఆయన కధల ప్రభావంతో అన్నమాటే.కానీ కధనం,శైలి అంటూ చెప్పిన మాటలు మాత్రం నిజం గా మీ ఈ కధను ఉద్దేశించి అన్నవే.
ఊకదంపుడు యొక్క అభిప్రాయము
Made Saturday, 19 of April , 2008 at 10:59 am
మన్నించండి, నేను సినిమాలు ఆటే చూడను, పోకిరి సినిమాలో బ్రహ్మానందం వృత్తి ఏమిటి?
- ఊకదంపుడు
శ్రీనివాస యొక్క అభిప్రాయము
Made Saturday, 19 of April , 2008 at 11:12 am
ఊకదంపుడు గారూ ![]()
సాఫ్ట్‌వేర్ ఇంజనీరండి
JALLIPALLIK KRISHNA RAO యొక్క అభిప్రాయము
Made Sunday, 20 of April , 2008 at 3:19 am
నమస్తీ శ్రీనివాస్ గారు.. మీ స్వాగాతానికి అభినందనలు. అలా ఉండాలి sportivness అంటే.
lalitha యొక్క అభిప్రాయము
Made Sunday, 20 of April , 2008 at 4:16 am
అయితే కథని “కథ” లాగానే చదవాలన్నమాట:-)
నవీన్ గార్ల యొక్క అభిప్రాయము
Made Monday, 21 of April , 2008 at 1:05 am
పవన్ కళ్యాణ్ రెండేండ్లకో సినిమా తీసినట్టుగా ఇందుకూరి శ్రీనివాసరాజు గారు మూడు నెలలకు ఒక టపా వ్రాస్తూ నా లాంటి అభిమానులను తీవ్ర నిరాశకు లోను చేస్తున్నారు. బాబ్బాబు….కాస్త నెలకొకటైనా రాద్దూ ![]()
upendra యొక్క అభిప్రాయము
Made Tuesday, 29 of April , 2008 at 7:54 pm
kadha chaala baagundi, chinna questions andi premantee aasinchadameena ivvadam kaada, aasinchadamee aitee adi dakkaka potee jivitam lo nirasee untundi, kani premanteee ivvadamee aitee nirasaki chooteee ledu emantaaru.
yedo rasesanandi nachakapotee kshaminchandi.
Prathap యొక్క అభిప్రాయము
Made Monday, 2 of June , 2008 at 12:29 am
సోదరా.. అద్భుతం అని అనను గాని, జీవితాన్ని చూపెట్టారు. ఇలాంటి సంఘటనే ఒకటి నా జీవితంలో జరిగింది. కాని ప్రతి ఒక్కరు వేణులా మాత్రం అలోచించలేరు అనేది నా అభిప్రాయం. నా పర్సనల్ అభిప్రాయం మాత్రం, “ఆకాశాన్ని, _______ నమ్మొద్దు. ఏ క్షణాన ఎలా వుంటారో వారికే తెలీదు”. ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. ఎవరినన్నా నొప్పించి ఉంటే మన్నించగలరు.
పేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం