ముందుమాట:
ఒక పెద్దాయన ఓ గంటసేపు చేసిన హితబోధ, ఓ స్నేహితురాలితో జరిగిన చిన్న సంభాషణ ఈ ఊహకి కారణాలు…
చదివి మర్చిపోండే 🙂

రాత్రి పది దాటింది..
నిర్మానుష్యంగా ఉన్న రాదారి…
అప్పుడే క్యాబ్ దిగి సందులో ఉన్న తన రూం వైపు అడుగులు వేస్తున్నాడు మధు.
జేబులోంచి సిగరెట్ తీసి వెలిగిస్తున్నాడు… అకస్మాత్తుగా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యింది ఓ రూపం.
పెరిగిన గడ్డంతో ఆకలితో ఉన్న పులిలా ఉన్నాడు.
“ఏరా నువ్వు సాఫ్ట్‌వేర్ ఉద్యోగివా?” గంభీరమైన స్వరం గద్దిస్తూ అడిగింది.
“అవును! ఎవరు నువ్వు? ఏం?” చిన్నగా వణుకుతూ వచ్చింది సమాధానం.
“ఏదీ ఐడీ కార్డు చూపించు?”
మఫ్టీలో ఉన్న పోలీసేమోనని వెంటనే జేబులో నుండి తీసి చూపించాడు మధు.
ఆ ఐడీ కార్డు చూసాకా అతను చుట్టూ చూసాడు. కనుచూపు మేరలో ఎవరూ కనిపించడం లేదు.  వెంటనే చేతిలో ఉన్న సంచిలోంచి నెలవంక లాంటి వస్తువేదో బయటకు లాగాడు…
అది కొడవలిలా అనిపించి తేరుకునే లోపే మధు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఆ అపరిచితుడు ఆ ట్యాగ్‌ని లాక్కుని చీకటిలో కలిసిపోయాడు.

***************************

“ఈ పేపర్ వాళ్ళని, టీవీ వాళ్ళని తట్టుకోలేకపోతున్నాం సార్! సందు ఇవ్వకపోయినా దూసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు అంత ప్రముఖమైన వార్తలేమీ లేకపోవడంతో మన చుట్టూ తిరుగుతున్నారు” అసహనంగా అన్నాడు కానిస్టేబుల్ కనకయ్య ఎదురుగా ఉన్న ఎస్‌ఐ ప్రవీణ్‌తో.
“వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే బురదలో రాయేసినట్టు అవుతుంది.” కూల్‌గా చెప్పాడు ప్రవీణ్
“ఇంతకీ ఎవడయ్యా వీడు. ఒకడా లేక ఏదన్నా ముఠానా?! ఓన్లీ సాఫ్ట్‌వేర్ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు.” ఫైల్‌ని చేతిలోకి తీసుకుని చూడటం మొదలుపెట్టాడు.
ఇంతకు ముందు ఎస్‌ఐ బదిలీ అయ్యి ఆ స్థానంలోకి ప్రవీణ్ వచ్చాడు.
“అందరూ కంఠాలు తెగి చచ్చిపోయినవాళ్ళే. వాళ్ల దగ్గర ఉన్న డబ్బు, విలువైన వస్తువులు ఏమీ మాయమవ్వడం లేదు. ఆఫీస్ ట్యాగ్‌లు మాత్రం మాయమవుతున్నాయి…” అంటూ ఫైల్లోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు.
“ఓ మై గాడ్! ఒకవేళ ఐటీ ఇండస్ట్రీస్‌ని టార్గెట్ చెయ్యడానికి ఏ పాకిస్తాన్ వాళ్ళో పన్నాగం పన్నారేమో? ఎందుకన్నా మంచిది మాయమైన అన్ని ట్యాగ్‌లను ఆ కంపెనీలకు చెప్పి నిర్వీర్యం చెయ్యించండి” గట్టిగా అరిచాడు ఏదో సాధించేసానన్న ఉత్సాహంలో.

***************************

నర్సాపురంలో చిట్టివరం గ్రామం. సర్పంచ్ రామయ్య గారి ఇంటిని విషాదం ఆవరించింది. పెద్దాయన మంచం పట్టినప్పటి నుండి ఇంట్లో పరిస్థితులు ఒక్కసారి మారిపోయాయి.
రామయ్యకు మంచి పేరుంది. ఆయనలాగే ఆయన కొడుకు రాజేశ్ అన్నా ఆ ఊరివాళ్లకు అంతే అభిమానం. తాను రైతైనా తన కొడుకుని మంచి ఇంజనీరుని చెయ్యాలని ఆయన కోరిక. చిన్నప్పటి నుండీ రాజేశ్ చదువులో ముందున్నా ఖాళీ దొరికితే వ్యవసాయం పనులు చూసేవాడు. కొడుకు అగ్రికల్చర్ చదువుతాననేసరికి నోట మాటరాలేదు పెద్దాయనకి. ఇష్టం లేకపోయినా కొడుకు మాటని కాదనలేక అగ్రికల్చర్ లో జాయిన్ చేయించాడు. చదువు బాగానే సాగింది. ఆ ఊరులోనే ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసాడు.

అకస్మాత్తుగా పెద్దాయన ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది. చివరికి క్యాన్సర్ అని డాక్టర్లు తేల్చారు. పెద్దాయన తన చివరి కోరికగా తన కొడుకు పెళ్ళి చూడాలని ఉందని చెప్పారు. రాజేశ్ సరేనన్నాడు. మేమమామ కూతురు పట్నంలో చదువుకుంటుంది. చిన్నప్పుటి నుండీ వాళ్ళ ఇద్దరినీ మొగుడూ పెళ్ళాలు అని పెద్దోళ్ళు ఏడిపించేవారు. మరదలు పెద్ద చదువుకి పట్నం వెళ్ళాకా తనతో చనువు తగ్గిపోయింది. మావయ్య కూతురుకి ఫోన్ చేసి మాట్లాడాడు. పల్లెటూరి బావని చేసుకోవడం తనకి ఇష్టం లేదని చెప్పింది. ఊళ్ళో పరిస్థితి చెప్పి కూతురిని బతిమాలడానికి ప్రయత్నించాడు. కానీ లాభం లేదు.

చిన్నాన ఇక లాభం లేదనుకుని బయట సంబంధాలు చూడటం మెదలెట్టారు. ఊళ్ళో వాళ్ల కులం అమ్మాయిలందరూ పట్నంలో చదువుతున్నారు. కొందరు అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. దగ్గరి బందువులకి సంబంధం గురించి చెబితే వాళ్ళ అమ్మాయిలను కనుక్కుని చెబుతామన్నారు.
ఎవరి దగ్గర నుండీ సమాధానం రావడంలేదు. ఇక ఆలస్యం చెయ్యకూడదని చిన్నాన వెళ్ళి అందరినీ మళ్ళీ కలిసాడు. అందరి నుండీ ఒకేరకమైన సమాధానం. “అమ్మాయికి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అబ్బాయి కావాలంటండి. ఎవరినన్నా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితేనే తనకి చెప్పమంది. ఇప్పుడు పిల్లల సంగతి తెలుసు కదండి. మన మాట వినడంలేదు. ఏమీ అనుకోకండి” లేదా “అమ్మాయికి కంప్యూటర్ ఫీల్డ్‌లో ఉన్నవాడు కావాలని చెప్పింది” . అందరి దగ్గర నుండీ దాదాపు ఇవే సమాధానాలు. చిన్నాన కూడా రాజేశ్ వెళ్ళాడు. తను గుమ్మం బయటే ఉన్నా అన్నీ వింటున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. చివరి రోజులలో పెద్దాయన ఒకసారి రాజేశ్‌ని పిలిచారు. “నాన్నా నీ పెళ్ళి చూసే భాగ్యం లేకుండాపోయిందిరా.” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. అందరి వంక అయోమయంగా చూడటం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాడు. తండ్రి కంట నీటి పొర చూడ్డం అదే మొదటిసారి. తను జీవిత గమనంలో ఎంచుకున్న దారి తప్పా! అన్నం పెట్టే చేయిని ఎవరూ అందుకోరా?! ఇలాంటి ఆలోచనలతో రాజేశ్ మెదడు బలహీనపడిపోతుంది.

రామయ్య గారు చనిపోయాకా రాజేశ్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఎవ్వరితోనూ కలవకుండా తన గదిలోనే ఉండిపోయేవాడు. అప్పుడప్పుడూ చిన్నగా ఏడుపు వినిపించేది. ఒకరోజు  తెల్లవారుజామున రాజేశ్ ఎవ్వరికి చెప్పకుండా మాయమైపోయాడు. ఊరంతా వెతికినా కనిపించలేదు. పెద్దాయన పోవడం, కొడుకు మాయమవ్వడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి ముంచేసాయి.

***************************
“సార్! రిపోర్టర్ వచ్చాడు. ఆ హత్యల విషయంలో పురోగతి తెలుసుకోవాలంట” అంటూ ప్రవీణ్ చెవిలోకి వార్తను వదిలాడు కానిస్టేబుల్.
“ఇంకేముంది. మనం అప్రమత్తత అయ్యాం కదా. ఓ నెల నుండి వాడు చడీ చప్పుడూ చెయ్యడం లేదు. ఎక్కడికన్నా పారిపోయాడో లేక చచ్చాడో తెలియలేదు. అంతా మన మంచికే జరిగినట్టుంది.”  ప్రవీణ్ నిట్టూరుస్తూ బదులిచ్చాడు.
“మరి రమ్మననా ఆ రిపోర్టర్ని?”
“ఆ రమ్మను!”
వచ్చిన రిపోర్టరుకి ఆ కేసు దాదాపు పూర్తయ్యినట్టు; ఉగ్రవాదులు ఏవో పథకం పన్నినట్టు; తాము సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని అప్రమత్తం చేసినట్టు; ఆ ఉగ్రవాదులు ఇక లాభం లేదనుకుని ఉడాయించినట్టు ప్రవీణ్ చెప్పాడు .

***************************

హైదరాబాద్ నగర శివార్లలో, చెట్లు ఏపుగా పెరిగి అడివిలా ఉన్న ప్రాంతం…
తాటాకులతో కట్టిన చిన్న పాకలో..
నేల మీద పడుకుని మూలుగుతున్నాడు రాజేశ్. పెరిగిన గడ్డంతో చూస్తే అతన్ని ఎవరూ పోల్చుకోలేనంతగా మారిపోయాడు.
నెల క్రితం ఒకడిని చంపుతున్నప్పుడు ఎదురు తిరిగాడు. వాడు బాగా బలంతో ఉన్నాడు; ఆ ప్రయత్నంలో రాజేశ్‌కి బాగా గాయాలయ్యాయి. అప్పటి నుండి ఆ తోపు దాటి భయటకు రావడం లేదు. తను ఎప్పుడు కోలుకుని మేధం మళ్ళీ మొదలు పెడదామా అన్న కసి, కోపం, ద్వేషం ఆ కళ్ళతో కనిపిస్తున్నాయి. ఆవేదనతో పక్కకు చూసాడు. పాకకి ఓ మూల తను పోగుచేసిన ట్యాగ్‌లు పడి ఉన్నాయి. వాటి పక్కనే నెత్తురెండిపోయిన కొడవలి జారబెట్టి ఉంది; దాహం తీర్చే నెత్తుటి వాన చుక్క కోసం ఆబగా చూస్తున్న రాకాసి నాలుకలా…

RTS Perm Link