ఆ రోజు దసరా కావడం వలన వచ్చిన సెలవును వినియోగించుకుంటున్న ఓ బద్దకస్తుడిని నేను. ఉదయం పదిన్నరవుతుంది. నిద్ర మత్తులోంచి కొంచెం కొంచెం బయట పడుతుంటే; ఫోను మోగడం మొదలుపెట్టింది. ఈ రోజూ ఏకాంతంగా గడుపుదాం అనుకుని ఫోను స్విచ్చాఫ్ చేద్దాం అనుకునేలోగానే అది మోగడం మొదలెట్టింది. అదేదో తెలియని నెంబరు. కట్టేద్దామనుకుంటూనే అప్రయత్నంగా పచ్చ బటను నొక్కేసాను. అది నా డిప్లొమో క్లాస్‌మేట్ భాస్కర్ నుండి వచ్చింది. వాడూ నేనూ ఎప్పుడన్నా ఫోనులోనే మాట్లాడుకుంటున్నాం కానీ చూసి చాలా రోజులయ్యింది. “ఏరా, మన డిప్లొమో క్లాస్‌మేట్స్ ఓ పది మందిమి ఇప్పుడు లుంబినీ పార్క్‌లో కలుసుకున్నాము. నువ్వు వస్తావా” అని అడిగాడు. వస్తానని చెప్పాను వాడితో. ఎప్పుడో 11 ఏళ్ళ క్రితం చూసాను వాళ్ళని. ఎలా ఉంటారో అని ఊహిచుకుంటుంటే ఏవరూ గుర్తుకురావడం లేదు. ఒంటి గంటకు లుంబినీ చేరుకున్నా. దూరం నుండి చూస్తే అక్కడ భాస్కర్ ఒక్కడే గుర్తున్నాడు. దగ్గరకు వెళితే కొంత మందిని పోల్చుకోగలిగాను. వాళ్ళ పేర్లు మాత్రం గుర్తుకు రావడంలేదు. వాళ్ళకి మాత్రం నా పూర్తి పేరూ, నా రోల్ నంబరు కూడా గుర్తుంది. నేనిలా గజనీలా మారిపోయినందుకు నాకే చాలా సిగ్గనిపించింది. అప్పట్లో అందరితోనూ కలివిడిగా ఉండేవాడిని కాదు (ఇప్పుడు కొంచెం నయం). నా రూము, నా క్లాసు అంతే. అక్కడ చదువు ముగిసాకా విడిపోతున్నప్పుడు అందరూ అందరి చిరునామాలు తీసుకున్నాము. ఆ కాయితం కాలక్రమంలో కనిపించకుండా పోయింది. అప్పట్లో ఈమెయిలూ సొల్లుఫోనులూ ఉండేవికావు. ఆ తర్వాత ఓ ఇద్దరితో మాత్రమే పరిచయం కొనసాగింది.

ఇప్పుడు చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పండగ పూట వాళ్లంతా శ్రీమతుల అనుమతితో ఓ రెండు గంటలు బయటికి వచ్చారు. మధ్యాహ్నం దాటిపోతుండడంతో అందరం అమీరుపేటలోని కాకతీయకు చేరుకుని భోంచేసి మాటల్లో పడ్డాము. మళ్ళీ జనవరి 25న కలుద్దామని నిశ్చయించుకున్నాము. వాన మొదలవ్వడంతో కొందరు తడుస్తూనే బయలుదేరిపోయారు. మిగిలినవాళ్లం వాన తగ్గేదాకా పిచ్చాపాటి మాట్లాడుకుని సెలవు తీసుకున్నాం.

RTS Perm Link