ఆమె ఓ యువరాణి; యువ హృదయాలనేలు మహరాణి,
ఆమె పరిచారికల్ బ్రహ్మ ముహుర్తాన్నే బృందావనమున జొచ్చి…
లేసోయగాల పూబాలలన్ సేకరింతురే; యువరాణీ మదభీష్టమున్ నెరవేర్చి ఆమె కృపన్ పొందగా
ఆమె లేచునే మధువుల్ని పోసి పెంచిన పెరటి కోయిలల్ తొలిజాము ఆగమన వేళ కూయంగనే
ఆ మేనివిరుపుతో గగనాన సూరీడు రేనివురును దులిపి మేలుకొంటాడులే;
ఆ సైగ ఓ జోలపాటగా జాబిల్లిని నిద్దరోమని సెలవిచ్చినట్టుండులే…

స్నానవాటికకు తాను చేరంగనే తొట్టెలన్నీ పూబోడి జలమాయలే
మందారములతో తల అంటుకుని… తాను మల్లెపూరేకులతో జలకాలాడులే
తామరాకుల తుండు చేయందగా తాను మేనంత సున్నితముగా ఒత్తెలే
వేల సీతాకోకచిలుకల్ ముక్తినొందగా తమ రెక్కలన్నీ పోజేసి ఓణిగా నేసెలే!
రతియె ఆమె పాల పొంగును జూచి రవికెలా ఒదిగి ఒప్పారెలే

పద్మాలు చేరి తన పాదాన్ని తడమగా పాదుకలుగ అలంకృతమాయెలే!
నెమిలిభామలు వంతులేసుకుని మరీ తన పల్లకిగా పాదాల దరివాలెనే!
తెలిమంచు కరుగంగ పయనంబు సాగించి చేరుకొన్నాది తను నా ఇంటినే,
నేలేచు వేళ తాను నా ముందు నిలిచె నా పొద్దులన్నీ తన వశమవ్వగా…
….
….
….
….
ఇంతలో… గడియారం గంట కొట్టింది 🙂

RTS Perm Link