ఎన్ని వేల వర్ణాలో…
ఆయన ఓ అమెరికా వాసి. ఆయన ఉద్యోగం మన భాగ్యనగరంలో ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లో వైస్ కౌన్సెల్ మరియు వీసా అధికారి.
ఆయన పేరు జెరెమి జువిట్ (Jeremy Jewett)
ఈ ఉద్యోగపర్వంలో ఆయన విధి తన మాతృదేశమైన అమెరికాకు చదువు నిమిత్తము ఇక్కడి నుండి వెళ్ళే యోగ్యమైన వాళ్ళను ఎన్నుకుని వాళ్ళకు వీసాలు ఇవ్వడమో ఇవ్వకపోవడమో! అందులోనూ తమ దేశభాష అయిన ఆంగ్లము గురించి ఆలోచించడమో లేదా పరీక్షించడమో తప్ప వేరే ఇతర భాష గురించో సంస్కృతి గురించో అస్సలు ఆలోచించనక్కర్లేదు కూడా!!!
కానీ… ఆయన అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఎంత అమెరికా వాసి అయినా వృత్తి రీత్యా తనకు తెలుగు అవసరం కాకపోయినా ఆయన మమేకమవ్వవలసింది తెలుగు వాళ్ళతో కాబట్టి ఇక్కడి భాషను మాట్లాడగలిగితేనే ఇక్కడి వాళ్ళకు మరింత చేరువ కాగలమన్న తలపుతో ఆయన మన తెలుగు భాషని నేర్చుకోవాలనుకున్నారు! ఆరు నెలలు అక్కడే తెలుగును అభ్యసించారు… చివరికి మన తెలుగువాడిలా మాట్లాడటం మొదలుపెట్టారు!
ఈయన తెలుగు ఉచ్చరణ కూడా మనవాళ్ళలానే ఉంటుందిట! తెలుగు చదవడం కూడా వచ్చట! బొమ్మరిల్లు చిత్రం చూసారట కూడా!!!
కొసమెరుపు: జెరెమి విజిటింగ్ కార్డ్ కూడా తెలుగులోనే ఉంటుందిట! నా మీదొట్టు ఇక్కడ చూడండి
ఈయన గురించి ఈనాడులో వచ్చిన వ్యాసం ఇదిగో…
ఇదంతా ఎందుకు జెపుతున్నానంటే… ఒక సంస్కృతి ఉనికికి భాష ఎంత మఖ్యమైనదో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.

ఈ ఆగష్టు 28, ఆదివారమున జరిగే తెలుగుబాట కార్యక్రమములో తామెల్లరూ తమ తమ ఆశ్చర్యార్థకములను, ఆవేశకార్థములను, అయోమయార్థకములనూ, అవహేళనార్థకములనూ విడనాడి పాల్గొనాలని… మీ ఆలోచనామృతమును, ఆనందోత్సాహమునూ, అభిమానాంజలినీ మాకు సమర్పించాలని ఆకాంక్షిస్తూ… మీ రాక కోసం 28 ఆదివారమున తెలుగు లలిత కళాతోరణం దగ్గర ఎదురు చూస్తూ…
తెలుగుబాట కార్యక్రమ వివరాల లంకె : http://telugubaata.etelugu.org
ఓ తెలు’గోడు’
5 Responses for "అచ్చతెలుగు మాటకారియట!"
నాకు తెలుగు రాదని చెప్పి అదో సంకరజాతి భాషలో మాట్లాడుతూ మనకు చెవిలో కాలీఫ్లవర్ పెడుతున్న మంచు లక్స్మీ కి చూపించాలి ఈ వార్త…
రవిచంద్ర గారు, నేను అదే మాట రాద్దామనుకున్నా!
రవిచంద్ర గారు ఈ వార్తను ఆంగ్లం లోకి మార్చి ఇస్తే ఆవిడ చదువుతారు, లేక పొతే మీరు అన్నట్లుగా అచ్ టేల్గు మాట్కరి అనే సంకర బాష లోకి మార్చితే ఒక పని అవుతాది .
తెలుగు భాషనూ ఎవరూ ఉద్ధరించక పాయినా ఫరవాలేదు. ఆ అద్భుత జీవ ధార ప్రవహిస్తూనే ఉంటుంది. కాని కేవలం భేషజం కోసమో, స్టైల్ కోసమో తెలుగు రాదనీ ఆంగ్ల భాషో మరో పరభాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించే వారిని ఉప్పు పాతర వేసినా తప్పు లేదు. అది వారి భావ దారిద్ర్యానికి భావ దాస్యానికి నిదర్శనమని భావించాలి మనం.
తెలుగు భాష, సంస్కృతీ, సాహితీ సంపదలకు శత సహస్ర ప్రనామాలర్పిస్తూ…
భుధజన విధేయుడు,
కే.ఎస్. మూర్తి.
చాలా సంతోషం
Leave a reply