పుస్తకాలు 01

తెలుగుబ్లాగు గుంపులో చావాకిరణ్ ఇచ్చిన ఈ వారం బ్లాగ్ విషయం మీ దగ్గరలోని గ్రంథాలయాలు కు నా స్పందన

మా కాలనీలో ఒక గ్రంథాలయం ఉండేది. అన్ని తెలుగు నవలలూ అక్కడ ఉండేవి. అవే కాకుండా అన్ని ప్రముఖ వీక్లీలు మంత్లీలు ఉండేవి. ఏదన్నా పుస్తకంలో గడి కనిపిస్తే సాధ్యమైనంతవరకూ నింపెయ్యడం అలవాటు. స్వాతి, మయీరి అక్కడ ఎక్కువ తిరగేసేవాడిని. ముఖ్యంగా తెలుగుకు సంభందించినవి కనిపిస్తే వదిలేవాడిని కాదు. రీడర్స్ డైజెస్ట్‌ని అప్పుడప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని.

ఇక మా ఇంట్లో విషయం చెప్పాలి. మా నాన్న ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెచ్చేవారు. మా కోసం చందమామ తెచ్చేవారు. నేను పత్రికను కూడా చదివేవాడిని. దానిలో నేను పూర్తిగా చదివిన సీరియల్ రావినూతల సువర్ణాకన్నన్ రాసిన మంజీరనాదం. అది నాకు ఫ్యాంటసీగా అనిపించి చివరిదాకా చదివేసాను. ఏదన్నా సీరియల్ పూర్తైతే ఆ సీరియల్ ఉన్న అన్ని వారాల పేజీలనీ మా నాన్న ఒక పుస్తకంగా బైండ్ చేసేవారు ( ఆయన పనిచేసే కంపేనీలో మన చేపలను, రొయ్యలను, మామిడిపండ్లను విదేశాలకు ఎగుమతి చెయ్యడానికి మైనపు పూత పూసిన అట్టపెట్టెలు తయారయ్యేవి; మా పుస్తకాలకు అట్టలు వేసుకోవడం మాకు అప్పుడు బాగా సులువు అయ్యేది ). దాదాపు ఓ పాతిక దాకా పోగయ్యాయి. వాటిని మా కాలనీలో ఉండేవాళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు. వాటిలో చివరికి ఏమీ మిగలలేదనుకోండి!

చందమామ చదివీ చదివి బోర్ కొట్టింది. ఎక్కడో బాలమిత్ర, బాలజ్యోతి, బొమ్మరిల్లు కనిపించాయి. అన్నీ నచ్చేసాయి. ఇక నేనే పుస్తకం కొనుక్కుంటానని చెప్పి డబ్బులు అడిగి తీసుకుని మరికొంత పోగేసి బాలమిత్ర, బాలజ్యోతి కొనేవాడిని. కొనడానికి దూరం వెళ్ళవలసి వచ్చినా ఆలోచించేవాడిని కాదు. ఒకచోట లేకపోతే ఇంకోచోట వెతికి కొనుక్కునేవాడిని.
అంతే కాకుండా ప్రతీ ఆదివారం ఈనాడు తెచ్చేవారు. ఈనాడు మేగజైన్‌లో పదకేళీ నింపడం అప్పుడు ఓ సరదా. మేగజైన్ చివర కనిపించే బూదరాజు గారి తెలుగు పదాలకి సంభందించిన శీర్షికని వదిలేవాడిని కాదు. ఇంట్లో పుస్తకాలు ఎక్కువై అమ్మెయ్యవలసి వస్తే ఆ పేజీలు చింపి దాచేవాడిని. ఇప్పటికీ అవి నా దగ్గర ఉన్నాయి.

మా పక్కింట్లో ఉండే ఆంటీ ఎంతెలా నవళ్ళు చదువుతారంటే; పవర్ పోయినా కొవ్వొత్తి ముందు చేతిలో పుస్తకంతో కనిపించేవారు. ఆవిడ దగ్గరనుండి కాంచనద్వీపం, కీర్తికిరీటాలు, దాంపత్యవనం, కన్యాశుల్కం ఉంటే దసరా సెలవులకి తెచ్చుకుని చదివాను.
నర్శిపట్నంలో డిప్లొమా చదివే రోజుల్లో లైబ్రరీకి వెళ్ళడం తక్కువే కానీ విపులని మాత్రం క్రమం తప్పకుండా కొని చదివేవాడిని. ఇంజనీరింగ్‌లో అది కూడా లేదు.
నేను చివరిసారిగా చదివిన పూర్తి నవల ది డావిన్సీ కోడ్.
స్మృతిలో మెదిలినవి ఇలా రాసేసాను…

RTS Perm Link