ఎన్ని వేల వర్ణాలో…

Archive for the ‘మనోగతం’ Category


మనిషిలా ఆలోచించు

Dec 14, 2008 Author: శ్రీనివాస | Filed under: మనోగతం

వరంగల్‌లో జరిగిన రెండు దుర్ఘటనలకు బ్లాగులలో చాలా మంది బాగానే స్పందించారు.
నట్టడవులు నడివీధికి నడిచొస్తే ఇంతే!
ఇదా పరిష్కారం!!
మీడియా చేయించిన హత్యలు
You oughtta do it స్వప్నికా!
అసలు నేరస్తులు
ఆటవిక న్యాయం అమలైంది!
ఇదేనా న్యాయం అంటే??
ఎన్‌కౌంటర్‌

చంద్రునికో నూలుపోగు అనుకోండి… తిలాపాపం తలాపిడికెడు అనుకోండి… ఇదిగో…

నేను టీవీ చూడడం తక్కువ. పేపరైనా ఏదన్నా బుద్దిపుట్టినప్పుడు మాత్రమే ఆన్లైనో తిరగేస్తుంటాను. నేను ఉదయం ఆఫీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా ఏదన్నా చర్చించుకుంటే తప్ప నాకు నూతి బయట ఏం జరిగిందో తెలియదు. ఈ విషయమూ అలాగే తెలిసింది. ఆఫీసులో చేస్తున్న పని మీద విసుగు కలిగి దగ్గర్లో ఉన్న సహోద్యోగి దగ్గరకు వెళ్ళినప్పుడు గానీ నాకు ఈ యాసిడ్ వార్త తెలియలేదు. ఇలాంటప్పుడు మామూలుగానే మగాడిలా కాకుండా మనిషిలా భాదపడ్డాను. ఆ వ్యక్తి మీద చాలా కోపం వచ్చింది. వేరే దేశాల్లో అమలవుతున్నట్టు కన్నుకి కన్ను పన్నుకి పన్ను శిక్ష వేసెయ్యాలి వీళ్ళకి అన్నంత కోపంవచ్చింది.  ఆ పక్కనే ఒక అమ్మాయి కూర్చుంటుంది.  ఆ విషయమై జరిగిన చర్చలో వీళ్ళని చంపేస్తే గానీ ఇలా చేసేవాళ్ళకు బుద్దిరాదు అన్న మాటలు  వినిపించాయి. కానీ  ఒకరు ఇలా మారడానికి వారు వ్యక్తిగతంగా సగం కారణమైతే వారి తల్లిదండ్రులు, స్నేహితులూ మిగిలిన సగం కారణమవుతారనే భావన ఎప్పటి నుండో నాలో మెదులుతూ ఉంది.

బ్లాగర్ల దినోత్సవం రోజు మధ్యాహ్నం సమావేశానికి వెళ్ళేముందు ఒకసారి కూడలిని తెరచి చూసాను. అక్కడ మొదట కనిపించిన చదువరి గారి జాబు చదివితే గానీ రెండో దుర్ఘటన విషయం తెలియలేదు. అప్పుడే ఈనాడు పత్రిక తెరిచి చదివాను అసలు విషయం. ఇంతకు ముందు ఆ వ్యక్తి మీద కలిగిన కోపం ఇప్పుడు పోలీసుల మీద కలిగింది. ఆ రాత్రి తీరికగా కూర్చుని మిగిలిన బ్లాగరులు రాసిన జాబులను చదివాను. ఇక్కడ ఆ అమ్మాయి అబ్బాయిల వ్యక్తిగత విషయాలు కాదు మనం ఆలోచించాల్సింది. నువ్వు మనిషిగా ఎలా స్పందిస్తున్నావు. తల్లిగానో, తండ్రిగానో, అన్నగానో, అక్కగానో నీ బాద్యత ఏమిటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకునే సమయమిది. మనం ఆలోచించాల్సింది ఏది మంచి ఏది చెడు అని. అంతేగానీ మనలోని అక్కసుని వెల్లగక్కుకునే సమయం కాదిది. ఇగోలని ఇగో అని చూపించే సమయం కాదిది.

నాలో పేరుకుపోయిన బద్ధకాన్ని విదిలించి మరీ ఈ జాబు రాయడానికి రెండు ముఖ్యకారణాలున్నాయి.

1) ఈ ఆదివారం ఈ విషయం మీద పేపర్లో వార్త చదువుతున్నప్పుడు “శనివారం వరంగల్‌లో ఎస్పీ సజ్జనార్‌కు విద్యార్థినుల అభినందనలు” అన్న ఛాయాచిత్రం

  • ఎన్‌కౌంట్ర్‌లో చనిపోయిన ఆ వ్యక్తి స్వప్నిక మీద దాడి చేసి పారిపోతున్నపుడు పోలీసుల వెంటపడి ఎన్‌కౌంటర్ చేసినప్పుడు ఇలా ఆ అమ్మాయిలు ఫుష్పగుచ్చం ఇస్తే బాగుండేదేమో!.
  • ఆ కేసుని కోర్టులో నాన్చకుండా ఇలా దాడి చేసి హింసపెట్టే వాళ్ళను, అలాంటి వాళ్ళను కన్న తల్లిదండ్రులను ఆలోచించేసే విధంగా చారిత్రాత్మక తీర్పు చెప్పిన జడ్జిగారికో పూలగుచ్చం ఇచ్చుంటే బాగుండేది.

2) విశాఖ డైలీ బ్లాగులో ఒకాయన రాసిన వ్యాఖ్య మరీ బాదపెట్టింది.

  • “పొద్దున్నే ఒక శుభ వార్త. ముగ్గురు నా కొడుకులు కుక్క చావు చచ్చారు. వరంగల్ లో ఈ రోజు పండుగ. నా కొడుకులు ఇంత సుఖమైన చావు చచ్చారు. ఇదే కొంత disappointment. నా కొడుకుల ఆత్మకి అశాంతి repeat అశాంతి కలగాలి. ఈ ముగ్గురు నా కొడుకుల direct గా నరకాని చేరుకోవాలి. వారి కుటుంబ సభ్యులకు నా సంతోశాని, ఆనందాని తెలియ చేస్తున్నాను చేస్తున్నాను.”

నేను ఆ దాడి చేసిన వాళ్ళను సమర్థించను. అలా అని పోలీసుల ఎన్‌కౌంటర్‌నూ సమర్థించలేను! చదువరిగారన్నట్టు ఇలాంటి సంఘటనల వల్లనైనా కనీసం రిహార్సల్స్ చేసి మరీ ఇలాంటి అకృత్యాలకు పాల్పడేవాళ్ళు ఆలోచించగలిగితే/భయపడితే నా తమ్ముడో, చెల్లో, కూతురో, కొడుకో, స్నేహితుడో, స్నేహితురాలో ఇలా మన బ్లాగుల్లో చర్చనీయాంశానికి పావులుగా కాకుండా ఉండగలరు.

RTS Perm Link

బ్రాండ్ అంబాసిడర్లు

Mar 31, 2008 Author: శ్రీనివాస | Filed under: పాటలు, మనోగతం

బ్రాండ్ 01దీని ముందు టపాలోని నేను రాసిన విషయం ఒకటి; అక్కడ జరిగిన చర్చ మరోకటి. నేను కేవలం నాకు నచ్చిన హకూనా మటాటా పదం గురించి ఇంకా కొన్ని వాక్యాల గురించి రాస్తే ఆ ప్రస్తావన కాస్తా పక్కదోవ పట్టి ఆ రచయిత మీదకి మళ్ళింది. అక్కడే అభిప్రాయం రాద్దామనుకుని విరమించి ఇక్కడ రాస్తున్నాను.

మనం సినిమాలో ప్రతీ అంశానికీ బ్రాండ్ అంబాసిడర్స్‌ని ఊహించుకుంటున్నాం. మిగిలిన విభాగాల గురించి ఏమోగానీ పాటల రచయితల విషయంలో ఇలాంటి పాట ఈయనే రాయాలి; అలాంటి పాట ఆయనే రాయాలి అని రచయిత సృజనాత్మకతని ఒక అంశానికే పరిమితం చేస్తున్నాం. మిగిలిన వాళ్ళ సంగతి ఏమో గానీ ఇది మంచి పద్దతి కాదని నా అభిప్రాయం. “నువ్వొస్తావని” సినిమాలో “కలలోనైన కలగనలేదే…” పాటను వేరొకరు రాసుంటే ఇంకా బాగుంటుందో లేదో అన్న సంగతి పక్కన పెడితే; చంద్రబోస్ ఆ పాటకు న్యాయం చేకూర్చారనే అనిపిస్తుంది కదా!  “ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి…“, “ఎదిగేకొద్దీ ఒదగమని…” సంగతీ అంతే కదా. వీటిని ఏ సిరివెన్నెలకో వేటూరికో ఇస్తే ఎలా ఉంటుంది అని అనుకోకూడదు. అలాగే ఏదన్నా యూత్ సాంగ్‌ని చంద్రబోస్ తప్ప వేరెవరైనా రాస్తే  అది వాళ్ళ తప్పిదంలా భావిస్తారు.  భువనచంద్ర ద్వందార్థం స్ఫురించే పాటలు ఎన్ని రాసినా, వినగలిగే కొన్ని ట్యూన్లకు బాగానే రాసారు. ఆయన రాసే అనువాదపాటల్లో కూడా మాతృకలోని అర్థం మనకు నప్పకపోతే కొన్ని లైన్లు తెలుగులో మార్చి రాసినట్టు గుర్తు. వెన్నెలకంటి “తపస్సు”లో పాటలు బానే ఉంటాయి కదా!.  ఈ మధ్యన వెలుగులీనిన వనమాలి “ఇక సెకనుకెన్ని నిమిషాలో…” అని అంటే ఆ ట్యూనుకి ఎంత బాగా ఒదిగిపోయిందది. ఇంతకు ముందు చాలా మంది “యుగమొక క్షణములా… క్షణమొక యుగములా…”  అని అర్థం వచ్చేలా రాసినా, ఇప్పుడు వనమాలి రాసింది ఎంత ఫ్రెష్‌గా ఉంది అని అనిపించింది!

సుద్దాల అశోక్‌తేజ గురించి చెప్పుకునే ముందు విప్లవ సాహిత్యం గురించి చెప్పుకోవాలి. ఈ విప్లవ గీతాలు, సినిమా పాటలకు కొంచెం విభిన్నం. వీటిని కొందరు అనుభవైకవెద్యమైన వాళ్ళో, ఆ వాతావరణాంలో పెరిగిన వాళ్ళూ ఆ మాండలికం ఎరిగిన వాళ్ళో తప్ప మిగిలిన వాళ్ళు రాసినా మట్టి వాసనలోని కమ్మదనం, చెమట బొట్టులోని ఉప్పదనం కనిపించవు. అశోక్‌తేజ అటు ఆ పాటలు రాస్తూ మిగిలిన రకాల పాటలు కూడా బాగానే రాస్తున్నారు. ఇక భక్తి పాటల విషయానికొస్తే ఇవి రాసేవాళ్ళకు పురాణాలతో, సంస్కృత భాషతో కాస్త పరిచయం ఉండాలి. ముఖ్యంగా బ్రాహ్మణ కవులు (కవులకి కులం అంటగడుతున్నానని అనుకోకండి; ఇక్కడ పురాణాలతో బాగా పరిచయం ఉన్నవాళ్ళుగా అర్థం చేసుకోండి) వీటికి సరిపోతారు. వేటూరి, సిరివెన్నెలని పక్కన పెడితే, జొన్నవిత్తులని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అందుకే పాట రాయడంలో కవికి ఉన్న సృజనాత్మకత విషయంలో విప్లవ గీతాలు, భక్తి గీతాలను మినహాయించాలి. ఇక భాస్కరభట్ల, కందికొండ, రామజోగయ్య శాస్రి, అనంత శ్రీరాం, పెద్దాడ మూర్తి తదితరుల గురించి నాకు అంత తెలియదు.

నేను సినిమా పాటకు దాసోహం అయ్యింది వేటూరి చలవ వలనే గానీ, సిరివెన్నెల సినిమాతో మాత్రం సినిమా పాటలలోనూ మనకు అర్థం అయ్యే సాహిత్యం ఉందనే అభిప్రాయం బలపడింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబోస్ లాంటి వారి పాటలూ ఏమీ తీసిపోవు. ఉగాది పచ్చడిలో వివిధ రుచులున్నాట్లు సినీపాటలలో కూడా వివిధ నేపథ్యాలకు తగ్గట్టు పాటలు కావాల్సొస్తాయి. అది యుగళమో మెలోడీనో కావొచ్చు; మాస్, మషాలా కావొచ్చు; విషాదమో విప్లవమో కావచ్చు. మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుందో గానీ నేను మాత్రం ఎవ్వరు రాసినా ఎవ్వరు పాడినా ఏ భేషజాలూ లేకుండా ప్రతీ పదాన్ని ఆస్వాదిస్తాను.  ప్రతీ పాటా ఏ శంకరాభరణంలానో ఏ సిరివెన్నెలలానో ఉండాలని ఆశ పడను. ప్రతీదీ ఏ వేటూరో, సిరివెన్నెలో రాయలేదని భాదపడను. ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. నాకు గుర్తుకొచ్చిన వ్యక్తులను/పాటలను మాత్రమే ఇక్కడ ఉదహరించాను, ఏమన్నా వదిలేసి ఉంటే అన్యదా భావించకండి.  మరీ మాస్‌గా చెప్పాలంటే నాకు బ్రాండ్‌తో పనిలేదు; కిక్కెక్కాలంతే 🙂

RTS Perm Link

ప్రేమికుల దినం

Feb 13, 2008 Author: శ్రీనివాస | Filed under: మనోగతం, వ్యంగ్యం

ప్రేమికుల దినంఅంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం…
పూల మనసులని తుంచెయ్యడానికి ఒక రోజు దొరికింది మనకు
రంగు కార్డులను పంచుకోడానికి ఒక రోజు వచ్చింది మనకు
అంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం…
పార్కులన్నిటిని పావనం చెయ్యడానికి ఒక రోజు దొరికింది మనకు
కుర్ర హార్మోన్లు పండగ చేసుకోడానికి ఒక రోజు వచ్చింది మనకు
అంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం
ఏడాదిలో ఒక రోజుని బూజు పట్టకుండా చూసుకుందాం

వేలంటైన్‌కు సంబంధించిన తత్ దినాన్ని గుర్తుచేసుకునే ఈ దినాన ఎందుకో ఇది రాయాలనిపించింది నాకు.
ఇన్నాళ్ళూ కుర్రకారే అనుకున్నాను ఇప్పుడు ముసలోళ్ళూ ఈ జపమే చెయ్యడం చూస్తుంటే నవ్వొస్తుంది.

ఈ సమయంలో సీతారామశాస్త్రి “చిరునవ్వుతో” సినిమాకు రాసిన పాటను గుర్తుచేసుకోవడం సముచితం. నేను, నా స్నేహితుల స్వానుభవాలు ఇందులో చాలావరకు నిజమేనని నిరూపించాయి.

( ఈ పాట కాపీరైటు హక్కులు అన్నిన్నూ ఆ సినిమాకు సంభందించిన వాళ్ళకే చెందుతాయని ఈ బ్లాగ్ ముఖంగా తెలియజేసుకుంటున్నాను 🙂 )

నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ కాలమే స్పీడుగ ఉందిరా
అన్నిట అంతటా తొందర; రొమాన్సు పద్దతే మారిపోయిందిరా
ఇల్లు చూసి సెల్లుఫోను బిల్లు చూస్తేనే భామ చూసి నవ్వుతుందిరా
ఇంగిలీషు భాషలోనే ప్రేమిస్తేనే ఆమె నిన్ను మెచ్చుతుందిరా
ప్రేమంటే అర్థం అంతా ఐలవ్యూలో లేదయ్యో
గుండెల్లో భావం మొత్తం గ్రీటింగ్ కార్డే కాదయ్యో

మనసంటూ మరోటంటూ అతిగా ఫీలైపోకమ్మా
మజునూలా ఇదైపోతూ ఫోజెందుకు మామా
విరహాలు వియోగాలు బీసీనాటి సరంజామా
వీ ఛానల్ రోజుల్లో అవి నీకవసరమా
లవ్వుకూ లైఫుకీ లింకు పెట్టుకుందుకీ దేవదాసు రోజులా ఇవీ
రోమియో జూలియట్ లాగ చావడానికి సిద్దపడ్డ ప్రేమలా ఇవీ

కేషుంటే ఖరీదైన బహుమానాలే కొనిపెట్టు
క్లుప్తంగా పనైపోయే మార్గం కనిపెట్టు
టైముంటే అదేపనిగా మాటల్తో మతిపోగొట్టు
లేకుంటే అయామ్‌సారీ మంత్రం సరిపెట్టు
కాగితం పూలకి అంటుకున్న సెంటురా నేటి కొత్త ప్రేమ ఫార్మ్యులా
జీవితం స్కేలులో చిన్న సెంటిమెంటురా అంతకన్న సీనులేదురా

RTS Perm Link

ఎద లోతుల్లో ఒక మాటుంది…
నిన్ను కలుసుకుంటున్నప్పుడు… నీ నుండి విడిపోతున్నప్పుడు…
గుండెలో చెప్పలేని బరువు…
కళ్ళలో ఉప్పునీటి చెరువు…

(మరింత పెద్ద బొమ్మ కోసం ఈ బొమ్మ మీద క్లిక్ చెయ్యండి)

ఎద లోతుల్లో 01 (చిన్నది)

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం


Warning: fsockopen(): php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: fsockopen(): unable to connect to udp://whois.happyarts.net:8000 (php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known) in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: stream_set_timeout() expects parameter 1 to be resource, boolean given in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 125