ఎన్ని వేల వర్ణాలో…

Archive for the ‘స్వగతం’ Category


ఆయన ఓ అమెరికా వాసి. ఆయన ఉద్యోగం మన భాగ్యనగరంలో ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లో వైస్ కౌన్సెల్ మరియు వీసా అధికారి.

ఆయన పేరు జెరెమి జువిట్ (Jeremy Jewett)

ఈ ఉద్యోగపర్వంలో ఆయన విధి తన మాతృదేశమైన అమెరికాకు చదువు నిమిత్తము ఇక్కడి నుండి వెళ్ళే యోగ్యమైన వాళ్ళను ఎన్నుకుని వాళ్ళకు వీసాలు ఇవ్వడమో ఇవ్వకపోవడమో! అందులోనూ తమ దేశభాష అయిన ఆంగ్లము గురించి ఆలోచించడమో లేదా పరీక్షించడమో తప్ప వేరే ఇతర భాష గురించో సంస్కృతి గురించో అస్సలు ఆలోచించనక్కర్లేదు కూడా!!!

కానీ… ఆయన అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఎంత అమెరికా వాసి అయినా వృత్తి రీత్యా తనకు తెలుగు అవసరం కాకపోయినా ఆయన మమేకమవ్వవలసింది తెలుగు వాళ్ళతో కాబట్టి ఇక్కడి భాషను మాట్లాడగలిగితేనే ఇక్కడి వాళ్ళకు మరింత చేరువ కాగలమన్న తలపుతో ఆయన మన తెలుగు భాషని నేర్చుకోవాలనుకున్నారు! ఆరు నెలలు అక్కడే తెలుగును అభ్యసించారు… చివరికి మన తెలుగువాడిలా మాట్లాడటం మొదలుపెట్టారు!

ఈయన తెలుగు ఉచ్చరణ కూడా మనవాళ్ళలానే ఉంటుందిట! తెలుగు చదవడం కూడా వచ్చట! బొమ్మరిల్లు చిత్రం చూసారట కూడా!!!

కొసమెరుపు: జెరెమి విజిటింగ్ కార్డ్ కూడా తెలుగులోనే ఉంటుందిట! నా మీదొట్టు ఇక్కడ చూడండి

ఈయన గురించి ఈనాడులో వచ్చిన వ్యాసం ఇదిగో…

ఇదంతా ఎందుకు జెపుతున్నానంటే… ఒక సంస్కృతి ఉనికికి భాష ఎంత మఖ్యమైనదో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.

ఈ ఆగష్టు 28, ఆదివారమున జరిగే తెలుగుబాట కార్యక్రమములో తామెల్లరూ తమ తమ ఆశ్చర్యార్థకములను, ఆవేశకార్థములను, అయోమయార్థకములనూ, అవహేళనార్థకములనూ విడనాడి పాల్గొనాలని… మీ ఆలోచనామృతమును, ఆనందోత్సాహమునూ, అభిమానాంజలినీ మాకు సమర్పించాలని ఆకాంక్షిస్తూ… మీ రాక కోసం 28 ఆదివారమున తెలుగు లలిత కళాతోరణం దగ్గర ఎదురు చూస్తూ…

తెలుగుబాట కార్యక్రమ వివరాల లంకె : http://telugubaata.etelugu.org

తెలు’గోడు’

RTS Perm Link

అక్షర దోషాలు; వాక్య నిర్మాణంలో లోపాలు ఉంటే మన్నించండి

అంతవరకు తెలీదు తెలుగులో ఒక విజ్ఞాన భాండాగారం తయారవుతుందని. 2005లో గూగుల్‌లో Telugu అని టైపించి వెతుకుతున్నాను.  వచ్చిన ఫలితాలను తెరచి చూస్తుంటే ఆంగ్ల వికీపీడియా కనిపించింది. అందులో కాస్త ఎక్కువ సమాచారం ఉన్నట్టనిపించి చదువుతున్నాను. చాలా బాగుంది. ఎక్కువ సమాచారాన్నే పొందుపరిచారనిపించి ఆ పేజీ మొత్తాన్ని పరికిస్తున్నాను. వికీపుటకి ఎడమవైపున చాలా భాషలలో లంకెలు కనిపించాయి. అవేమిటో అర్థం కాలేదు. వరుసగా చూసుకుంటూపోతే తెలుగు అన్న పదం లంకెతో దర్శనమిచ్చింది. దాన్ని నొక్కితే ఓ పుట భారంగా తెరుచుకుంది (ఇంటర్‌నెట్ సెంటరు; అందునా ర్యాము, ప్రాసెసర్ వేగం తక్కువ కదా; అందులోనూ యూనీకోడ్ కాబట్టి). దానిలో తెలుగు గురించి సమాచారం బాగానే ఉంది.  దాని వెబ్‌ చిరునామా చూస్తే http://te.wikipedia.org. అప్పుడప్పుడే అంతర్జాలంలో అఆలు నేర్చుకుంటున్న నాకు ఆ చిరునామా ఏమిటో బోదపడలేదు. తర్వాత్తర్వాత తెలిసింది అది తెలుగు వికీపీడియాకు ప్రత్యేకంగా ఉన్న చిరునామా అని.

ఆపై నాకు ఉద్యోగమొచ్చిన తర్వాత కార్యాలయంలో ఖాళీ దొరికినప్పుడు మొదటగా సిరివెన్నెల సీతారామశాస్రి గురించిన వ్యాసం మొదలెట్టాను. అప్పటికి నాకు వికీపీడియా అంటే తెలుగులో సమాచారాన్ని పొందుపరిచేది అని మాత్రమే తెలుసు. అప్పటికే అంతర్జాలంలో మన పైత్యాన్ని పాండిత్యాన్నీ తెలుగు బ్లాగు రూపేణా వెళ్లగక్కుకోవచ్చని తెలిసి బ్లాగ్‌స్పాట్‌లో కొన్ని టపాలు రాసిన అనుభవముంది. ఆ అనుభవంతోనే వికీపీడియాలో నా మొదటి వ్యాసాన్ని రాసాను నా దృక్కోణంలో . అప్పటికే వికీపీడియాలో అనుభవమున్న చదువరి, వైజాసత్యలు నా వ్యాసాన్ని వికీకి అనుగుణంగా ఎలా రాయాలో సరిదిద్దుతూ సూచనలిచ్చారు. అప్పటినుండి ఏదో ఇతోధికంగా ఓ మూడేళ్ళు అదీఇదీ రాసాననుకోండి. నాకు మాత్రం బ్లాగులో రాసేకన్నా వికీపీడియాలో రాయడం ఎక్కువ సంతృప్తినిచ్చింది. అది వేరే సంగతి.

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే…

ఈ నెల అంటే జనవరి 23వ తారీఖున వికీపీడియా దశాబ్ది వేడుకను జరపాలనుకుంటున్నారు.  ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం పది గంటలకు లకడీ-కా-పూల్ లో ఉన్న హనీపాట్ కార్యాలయంలో వికీపీడియా దశాబ్ది వేడుక మరియు తెవికీ అవగాహనా సదస్సు అన్న కార్యక్రమం జరుగుతోంది. తెలుగు భాషాభిమానులు, ఔత్సాహికులు పాల్గొనాలని ఆకాంక్ష.

మరిన్ని వివరాలు e-తెలుగు సైటులో త్వరలో ప్రకటిస్తారట

RTS Perm Link

srinivaseeyam2
అనుభూతి…
మాటలకందదు… కానీ తలపుల్లో ఊపిరోసుకుంటుంది…
నువ్వెవరో నేనెవరో…
అసలు నువ్వు ఉన్నావో లేదో కదా!
అయినా ఇద్దరినీ మమేకం చేసేస్తుంది…
అథ్వైతానికి అర్థం చెబుతుంది.

వానైపోతున్నావా ఓ మేఘమా!
నీ చినుకుల చెణకులతో చెలిని తడమవా…
మా లోగిలిలోకి రెక్కలు కట్టుకుని వాలుతావా…
మా ఇంటి చూరుని పట్టుకుని వేలాడుతూ ఉండిపోతావా…
పోనీ పసిరికను చుంబిస్తూ ఉండిపో నేనొచ్చేదాకా…
నీ తడి స్పర్శలో నే వెతుక్కుంటాను… నేనిన్నాళ్ళూ పోగొట్టుకున్న సాంగత్యాన్ని…

కొవ్వొత్తి…
నిరాడంబరంగా చుట్టూ వెలుగుల్ని గుప్పిస్తుంది…
తనలో రగులుతున్న అగ్నిపర్వతాన్ని గుర్తించలేదు…
మరిగే ఒక్కో మైనపు బొట్టునూ స్పర్శించేదాకా…

నవ్వుతున్నప్పుడల్లా… ఒకటే భాద…
నవ్వలేని వాళ్ళని ఎలా నవ్వించాలా అని!
భాదలో ఉన్నవారిని చూస్తుంటే తెలిసొచ్చింది…
అయ్యొ! నేనెలా నవ్వగలుగుతున్నానా అని?

కాయితం…
రంగు పులుముకుని, పరిమళాన్ని పూసుకుని,
పువ్వులా ముస్తాబయ్యింది!!
ఎన్ని రోజులైనా వాడిపోలేని ఆయుష్షు తనది…
కానీ ఆ గడ్డిపువ్వులో తొణికిసలాడే తేజం కనిపించదేం?

వెన్నెల…
సూర్యుడిదా? చంద్రుడిదా?
ఏమో తెలీడం లేదు…
నువ్వున్నప్పుడు చల్లగా ఉంటుంది…
నువ్వెళ్ళినప్పుడు వెచ్చగా ఉంటుంది…
ఈ అజ్ఞానికి చెప్పేదెవరు?

అక్కా చెల్లీ తమ్ముడూ అన్నా మరదలూ వదినా బావా బామ్మరిదీ..
ఇంకొకటే చుట్టరికం మిగిలింది…
నువ్వౌతావా మరి 🙂

పెరట్లో గోరింట…
చెల్లి అరచేత చందమామైపోయింది…
నా తళ్ళో పిడకలా మారింది…
నేనిప్పుడు తన కన్నా పదేళ్ల చిన్నవాడిని….

చిత్రగుప్తుడు చిట్టా తిరగేసాడు…
నా నూకలింక చెల్లవని చెప్పేసాడు…
యముడేమో పాశమిదిలిస్తున్నాడు…
సఖీ సావిత్రీ నువ్వెక్కడ?

చిన్నపుడు చదివినట్టే…
ఇప్పుడూ చందమామనే చదువుతున్నాను…
పక్కాంటీ కూతురు చేసే సైగలందుకే అర్థం కావడం లేదట!
వారం వారం స్వాతి చదివే మా బామ్మ అంటుంది !!!

RTS Perm Link

నిన్నలా… నేడిలా…

Feb 21, 2008 Author: శ్రీనివాస | Filed under: స్వగతం

గతమది… వర్తమానమిది…అవి విజయవాడ కృష్ణవేణిలో ECET కోచింగ్ తీసుకుంటున్న చివరి రోజులు… ఆ సంస్థకు అంత మంచి పేరుంది అప్పట్లో… జనాలు కూడా అలానే ఉండేవారు… అక్కడ ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిర్వహించే పరీక్ష కన్నా ముందు వీళ్ళు ఒక పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మంచి ర్యాంకు వస్తే అసలు పరీక్షలోనూ అలానే వస్తుందని అందరి నమ్మకం. ఆ సంవత్సరమూ జనం బాగానే రాసారు. ఫలితాలు చెబుతునప్పుడు క్యాంపస్ మధ్యలో ఉన్న ఖాళీ స్థలం నిండిపోయింది. కార్యక్రమమంతా అయిపోయాకా పెద్దాయన వరప్రసాద్ గారు అబ్బాయిలని మాత్రమే ఉండమని చెప్పి అమ్మాయిలని బయటికి పంపించి గేట్లు మూయించేసారు. ఎందుకు ఉండమన్నారో అర్థం కాలేదు మాకు.

పెద్దాయన చెప్పడం మొదలుపెట్టారు. అందరూ బాగా చదివి పరీక్ష బాగా రాయాలని చెప్పారు. ఇలా చెబితే ఎవరి బుర్రకెక్కుతుందన్నట్టు ఆయన ధోరణిలో విషయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు చదువులోను ఉద్యోగాలలోను అమ్మాయిలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకన్నా వాళ్ళు చలాకీగా చదువుతున్నారు. వాళ్ళకీ రేపు ఇంజనీరింగ్ పూర్తి చేస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి. మీరూ పెద్ద చదువులు చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకోకపోతే మిమ్మల్ని ఏ అమ్మాయీ పెళ్ళి చేసుకోదు. తర్వాత బాధ పడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. బాగా చదవండి అని హితభోద చేసారు. ఆ సంగతి ఎప్పటిదో…. అప్పుటికి IT పరిశ్రమ దేశాన్ని అంతగా కబళించలేదు. అంతే కాకుండా మనవాళ్ళకి విదేశాలలో ఇంతిలా ఉద్యోగాలూ లేవు. అప్పుడు ఉద్యోగమంటే గవర్నమెంటు ఉద్యోగమే. డబ్బుంటే ఓ లక్షో రెండు లక్షలో పాడేస్తే జీవితంలో సెటిలైపోవచ్చు; ఆ రాజకుమారుడికి ఇక యువరాణి దొరకడం ఎంతసేపు చెప్పండి :-).

ఇక ఇప్పటి విషయానికొస్తే మొన్న పేపరులో ఒక వార్త చదివాను. అమ్మాయిలెవరూ గవర్నమెంటు ఉద్యోగులని పెళ్ళిచేసుకోవడానికి ఇష్టపడడం లేదట పాపం. దాని గురించి అంత ఆలోచించలేదు గానీ, ఈ మధ్య నా స్నేహితురాలి ఆలోచనా విధానాన్ని తెలుసుకుని జీర్ణించుకోలేకపోయాను. ఇక్కడ తనను ఇష్టపడేవాళ్ళున్నా ఇంట్లో వాళ్ళు చూస్తున్న అమెరికా ( వాళ్ళు ముద్దుగా Aliens అంటుంటారు) వాడి కోసం ఎదురు చూస్తున్నాదట. బహుశా అందరూ అలా ఉండకపోవచ్చు; కానీ అలా ఉండరనుకునేవాళ్ళు కూడా అలా ఆలోచిస్తుంటేనే కాస్త బాదగా ఉంటుంది. ఇప్పుడు మా పెద్దాయన మాటలు పాతబడిపోయాయని అనిపిస్తుంది. రాజ్యాంగాన్ని సవరించినట్టు మనమే సవరించుకోవాలి.

నిన్నలా… నేడిలా… మరి రేపెలా ఉంటుందో… (మూన్ మీదకి హనీమూన్‌కి తీసుకెళ్ళేవాడి కోసం వెతుకుతారేమో…)

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం


Warning: fsockopen(): php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: fsockopen(): unable to connect to udp://whois.happyarts.net:8000 (php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known) in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: stream_set_timeout() expects parameter 1 to be resource, boolean given in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 125