ఎన్ని వేల వర్ణాలో…

Archive for the ‘కథలు’ Category


ట్యాగ్ కలెక్టర్

Jul 10, 2008 Author: శ్రీనివాస | Filed under: కథలు

ముందుమాట:
ఒక పెద్దాయన ఓ గంటసేపు చేసిన హితబోధ, ఓ స్నేహితురాలితో జరిగిన చిన్న సంభాషణ ఈ ఊహకి కారణాలు…
చదివి మర్చిపోండే :-)

రాత్రి పది దాటింది..
నిర్మానుష్యంగా ఉన్న రాదారి…
అప్పుడే క్యాబ్ దిగి సందులో ఉన్న తన రూం వైపు అడుగులు వేస్తున్నాడు మధు.
జేబులోంచి సిగరెట్ తీసి వెలిగిస్తున్నాడు… అకస్మాత్తుగా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యింది ఓ రూపం.
పెరిగిన గడ్డంతో ఆకలితో ఉన్న పులిలా ఉన్నాడు.
“ఏరా నువ్వు సాఫ్ట్‌వేర్ ఉద్యోగివా?” గంభీరమైన స్వరం గద్దిస్తూ అడిగింది.
“అవును! ఎవరు నువ్వు? ఏం?” చిన్నగా వణుకుతూ వచ్చింది సమాధానం.
“ఏదీ ఐడీ కార్డు చూపించు?”
మఫ్టీలో ఉన్న పోలీసేమోనని వెంటనే జేబులో నుండి తీసి చూపించాడు మధు.
ఆ ఐడీ కార్డు చూసాకా అతను చుట్టూ చూసాడు. కనుచూపు మేరలో ఎవరూ కనిపించడం లేదు.  వెంటనే చేతిలో ఉన్న సంచిలోంచి నెలవంక లాంటి వస్తువేదో బయటకు లాగాడు…
అది కొడవలిలా అనిపించి తేరుకునే లోపే మధు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఆ అపరిచితుడు ఆ ట్యాగ్‌ని లాక్కుని చీకటిలో కలిసిపోయాడు.

***************************

“ఈ పేపర్ వాళ్ళని, టీవీ వాళ్ళని తట్టుకోలేకపోతున్నాం సార్! సందు ఇవ్వకపోయినా దూసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు అంత ప్రముఖమైన వార్తలేమీ లేకపోవడంతో మన చుట్టూ తిరుగుతున్నారు” అసహనంగా అన్నాడు కానిస్టేబుల్ కనకయ్య ఎదురుగా ఉన్న ఎస్‌ఐ ప్రవీణ్‌తో.
“వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే బురదలో రాయేసినట్టు అవుతుంది.” కూల్‌గా చెప్పాడు ప్రవీణ్
“ఇంతకీ ఎవడయ్యా వీడు. ఒకడా లేక ఏదన్నా ముఠానా?! ఓన్లీ సాఫ్ట్‌వేర్ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు.” ఫైల్‌ని చేతిలోకి తీసుకుని చూడటం మొదలుపెట్టాడు.
ఇంతకు ముందు ఎస్‌ఐ బదిలీ అయ్యి ఆ స్థానంలోకి ప్రవీణ్ వచ్చాడు.
“అందరూ కంఠాలు తెగి చచ్చిపోయినవాళ్ళే. వాళ్ల దగ్గర ఉన్న డబ్బు, విలువైన వస్తువులు ఏమీ మాయమవ్వడం లేదు. ఆఫీస్ ట్యాగ్‌లు మాత్రం మాయమవుతున్నాయి…” అంటూ ఫైల్లోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు.
“ఓ మై గాడ్! ఒకవేళ ఐటీ ఇండస్ట్రీస్‌ని టార్గెట్ చెయ్యడానికి ఏ పాకిస్తాన్ వాళ్ళో పన్నాగం పన్నారేమో? ఎందుకన్నా మంచిది మాయమైన అన్ని ట్యాగ్‌లను ఆ కంపెనీలకు చెప్పి నిర్వీర్యం చెయ్యించండి” గట్టిగా అరిచాడు ఏదో సాధించేసానన్న ఉత్సాహంలో.

***************************

నర్సాపురంలో చిట్టివరం గ్రామం. సర్పంచ్ రామయ్య గారి ఇంటిని విషాదం ఆవరించింది. పెద్దాయన మంచం పట్టినప్పటి నుండి ఇంట్లో పరిస్థితులు ఒక్కసారి మారిపోయాయి.
రామయ్యకు మంచి పేరుంది. ఆయనలాగే ఆయన కొడుకు రాజేశ్ అన్నా ఆ ఊరివాళ్లకు అంతే అభిమానం. తాను రైతైనా తన కొడుకుని మంచి ఇంజనీరుని చెయ్యాలని ఆయన కోరిక. చిన్నప్పటి నుండీ రాజేశ్ చదువులో ముందున్నా ఖాళీ దొరికితే వ్యవసాయం పనులు చూసేవాడు. కొడుకు అగ్రికల్చర్ చదువుతాననేసరికి నోట మాటరాలేదు పెద్దాయనకి. ఇష్టం లేకపోయినా కొడుకు మాటని కాదనలేక అగ్రికల్చర్ లో జాయిన్ చేయించాడు. చదువు బాగానే సాగింది. ఆ ఊరులోనే ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసాడు.

అకస్మాత్తుగా పెద్దాయన ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది. చివరికి క్యాన్సర్ అని డాక్టర్లు తేల్చారు. పెద్దాయన తన చివరి కోరికగా తన కొడుకు పెళ్ళి చూడాలని ఉందని చెప్పారు. రాజేశ్ సరేనన్నాడు. మేమమామ కూతురు పట్నంలో చదువుకుంటుంది. చిన్నప్పుటి నుండీ వాళ్ళ ఇద్దరినీ మొగుడూ పెళ్ళాలు అని పెద్దోళ్ళు ఏడిపించేవారు. మరదలు పెద్ద చదువుకి పట్నం వెళ్ళాకా తనతో చనువు తగ్గిపోయింది. మావయ్య కూతురుకి ఫోన్ చేసి మాట్లాడాడు. పల్లెటూరి బావని చేసుకోవడం తనకి ఇష్టం లేదని చెప్పింది. ఊళ్ళో పరిస్థితి చెప్పి కూతురిని బతిమాలడానికి ప్రయత్నించాడు. కానీ లాభం లేదు.

చిన్నాన ఇక లాభం లేదనుకుని బయట సంబంధాలు చూడటం మెదలెట్టారు. ఊళ్ళో వాళ్ల కులం అమ్మాయిలందరూ పట్నంలో చదువుతున్నారు. కొందరు అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. దగ్గరి బందువులకి సంబంధం గురించి చెబితే వాళ్ళ అమ్మాయిలను కనుక్కుని చెబుతామన్నారు.
ఎవరి దగ్గర నుండీ సమాధానం రావడంలేదు. ఇక ఆలస్యం చెయ్యకూడదని చిన్నాన వెళ్ళి అందరినీ మళ్ళీ కలిసాడు. అందరి నుండీ ఒకేరకమైన సమాధానం. “అమ్మాయికి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అబ్బాయి కావాలంటండి. ఎవరినన్నా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితేనే తనకి చెప్పమంది. ఇప్పుడు పిల్లల సంగతి తెలుసు కదండి. మన మాట వినడంలేదు. ఏమీ అనుకోకండి” లేదా “అమ్మాయికి కంప్యూటర్ ఫీల్డ్‌లో ఉన్నవాడు కావాలని చెప్పింది” . అందరి దగ్గర నుండీ దాదాపు ఇవే సమాధానాలు. చిన్నాన కూడా రాజేశ్ వెళ్ళాడు. తను గుమ్మం బయటే ఉన్నా అన్నీ వింటున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. చివరి రోజులలో పెద్దాయన ఒకసారి రాజేశ్‌ని పిలిచారు. “నాన్నా నీ పెళ్ళి చూసే భాగ్యం లేకుండాపోయిందిరా.” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. అందరి వంక అయోమయంగా చూడటం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాడు. తండ్రి కంట నీటి పొర చూడ్డం అదే మొదటిసారి. తను జీవిత గమనంలో ఎంచుకున్న దారి తప్పా! అన్నం పెట్టే చేయిని ఎవరూ అందుకోరా?! ఇలాంటి ఆలోచనలతో రాజేశ్ మెదడు బలహీనపడిపోతుంది.

రామయ్య గారు చనిపోయాకా రాజేశ్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఎవ్వరితోనూ కలవకుండా తన గదిలోనే ఉండిపోయేవాడు. అప్పుడప్పుడూ చిన్నగా ఏడుపు వినిపించేది. ఒకరోజు  తెల్లవారుజామున రాజేశ్ ఎవ్వరికి చెప్పకుండా మాయమైపోయాడు. ఊరంతా వెతికినా కనిపించలేదు. పెద్దాయన పోవడం, కొడుకు మాయమవ్వడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి ముంచేసాయి.

***************************
“సార్! రిపోర్టర్ వచ్చాడు. ఆ హత్యల విషయంలో పురోగతి తెలుసుకోవాలంట” అంటూ ప్రవీణ్ చెవిలోకి వార్తను వదిలాడు కానిస్టేబుల్.
“ఇంకేముంది. మనం అప్రమత్తత అయ్యాం కదా. ఓ నెల నుండి వాడు చడీ చప్పుడూ చెయ్యడం లేదు. ఎక్కడికన్నా పారిపోయాడో లేక చచ్చాడో తెలియలేదు. అంతా మన మంచికే జరిగినట్టుంది.”  ప్రవీణ్ నిట్టూరుస్తూ బదులిచ్చాడు.
“మరి రమ్మననా ఆ రిపోర్టర్ని?”
“ఆ రమ్మను!”
వచ్చిన రిపోర్టరుకి ఆ కేసు దాదాపు పూర్తయ్యినట్టు; ఉగ్రవాదులు ఏవో పథకం పన్నినట్టు; తాము సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని అప్రమత్తం చేసినట్టు; ఆ ఉగ్రవాదులు ఇక లాభం లేదనుకుని ఉడాయించినట్టు ప్రవీణ్ చెప్పాడు .

***************************

హైదరాబాద్ నగర శివార్లలో, చెట్లు ఏపుగా పెరిగి అడివిలా ఉన్న ప్రాంతం…
తాటాకులతో కట్టిన చిన్న పాకలో..
నేల మీద పడుకుని మూలుగుతున్నాడు రాజేశ్. పెరిగిన గడ్డంతో చూస్తే అతన్ని ఎవరూ పోల్చుకోలేనంతగా మారిపోయాడు.
నెల క్రితం ఒకడిని చంపుతున్నప్పుడు ఎదురు తిరిగాడు. వాడు బాగా బలంతో ఉన్నాడు; ఆ ప్రయత్నంలో రాజేశ్‌కి బాగా గాయాలయ్యాయి. అప్పటి నుండి ఆ తోపు దాటి భయటకు రావడం లేదు. తను ఎప్పుడు కోలుకుని మేధం మళ్ళీ మొదలు పెడదామా అన్న కసి, కోపం, ద్వేషం ఆ కళ్ళతో కనిపిస్తున్నాయి. ఆవేదనతో పక్కకు చూసాడు. పాకకి ఓ మూల తను పోగుచేసిన ట్యాగ్‌లు పడి ఉన్నాయి. వాటి పక్కనే నెత్తురెండిపోయిన కొడవలి జారబెట్టి ఉంది; దాహం తీర్చే నెత్తుటి వాన చుక్క కోసం ఆబగా చూస్తున్న రాకాసి నాలుకలా…

RTS Perm Link

తమసోమా…

Apr 15, 2008 Author: శ్రీనివాస | Filed under: కథలు, స్వగతం

తమసోమాబారులో లీలగా సంగీతం వినబడుతుంది… చాలా మంది గుంపుగా మందు కొడుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు… వేణు మాత్రం ఒంటరిగా తాగుతున్నాడు. జీవితంలో చివరిసారి మనసారా తాగుతున్నాడు. వెయిటర్ వచ్చి టైమ్ అయ్యిందని చెప్పేదాకా ఏవో ఆలోచనలు…  నెమ్మదిగా బయటికి వచ్చి చుట్టూ చూసాడు. దగ్గరగా డబ్బా ఫోన్ కనిపించింది. జేబులో తడిమితే  రెండు రూపాయి కాసులు తగిలాయి. ఇంటి నెంబరు గుర్తుకు తెచ్చుకుంటూ డయల్ చేస్తున్నాడు…  తన ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నట్టు ఎవరో ఫోన్ ఎత్తారు.

“హలో”  అంటూ వేణూ మౌనంగా ఉండిపోయాడు.

“ఆ నాన్నా చెప్పరా ఎక్కడున్నావు. ఫోను ఇంట్లో వదిలేసి వెళ్ళావు. అర్థరాత్రయ్యింది… ఇంటికి రావచ్చు కదరా… ఇంట్లో అందరూ నీ కోసమే చూస్తున్నారు… ఈ టైంలో ఎక్కడున్నావురా. ” పెద్దాయన గొంతులో కొడుకు మీద ఉన్న దిగులు స్పష్టంగా వినిపిస్తుంది.

“నాకు ఏమీ కాదు నాన్నా. అమ్మకి ఫోనివ్వు.”

“వేణూ ఎక్కడున్నావమ్మా. ఇంటికిరా. నువ్వేమీ ఆలోచించకమ్మా, నీకోసం మంచి సంభందాలొస్తున్నాయి; అంతకన్నా మంచి అమ్మాయి నీకు వస్తుందమ్మా. ఇంటికొచ్చెయ్యమ్మా.” అంటూ అమ్మ మాటలు వినేసరికి ఏడుపొచ్చేసింది వేణుకి.

“అమ్మా, నాకేమన్నా జరగకూడనిది జరిగితే, నువ్వూ నాన్నా చెల్లి దగ్గరకి వెళ్ళిపోండి” అంటూ ఇంకేదో చెప్పబోయాడు. రెండో నిమిషమూ పూర్తయ్యి ఫోన్ కట్టయ్యింది.
పద్దూకి ఫోన్ చేద్దామంటే డబ్బులు లేవు; చివరిసారి తనతో మాట్లాడాలన్న కోరిక కూడా తీరలేదు. ‘ ఛీ ఏంటీ బతుకు’  అని అనుకుంటూ వెనుతిరిగాడు.
అప్పుడే వానజల్లు మొదలయ్యింది.

*********************************************
వేణు, పద్మ ఇద్దరూ ఒకే డీటీపీ సెంటర్‌లో పనిచేసేవారు. పక్కపక్కనే కూర్చోవడం వలన ఇద్దరి మధ్యా చనువు కాస్త పెరిగింది. మామూలుగా అమ్మాయిలకి దూరంగా ఉండే వేణుకి ఇప్పుడు పద్దూ చాలా దగ్గరైపోయింది. ఒకరోజు కనిపించకపోతే చాలు ఏమీ తోచదు వేణుకి. ఆ అనుభూతికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియనితనం. ఓ సంవత్సరం అలా గడిచిపోయింది.
పద్దూ అంత అందగత్తేం కాదు; కాని ఆమెలో తనకు నచ్చిన గుణాలున్నాయి.  ‘తనని పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది కదా!’  అని అనుకున్నాడు. ఒకసారి ఆమె తనకు కులం పట్టింపు లేదని చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు. తనకీ ఇంట్లో సంభందాలు చూస్తున్నట్టు ఒకసారి చెప్పింది కూడా. వేణుకి కూడా ఇంట్లో ఓ రెండు మంచి సంభందాలు చూస్తే ఏదో కారణం చెప్పి దాటేసాడు. ఇక ఆలస్యం చెస్తే లాభం ఉండదని ఆ విషయం పద్దూ దగ్గర ప్రస్తావనకు తెచ్చాడు.

“పద్దూ, నేను నీలాంటి గుణాలున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళూ నువ్వూ నేను ఒకరికి గురించి ఒకరం తెలుసుకున్నాం. నేనూ నీకు బాగానే అర్థం అయ్యుంటాను. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటి?” సంశయిస్తూ అడిగాడు.

“వద్దు వేణు” తడుముకోకుండా సమాధానమిచ్చింది పద్దూ.

“పద్దూ నేను నేను నీకు నచ్చలేదా?” నిర్వేదంగా పలికింది వేణు గొంతు.

“నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు వేణూ…” చెప్పాలా వద్దా అన్నట్టు సమాధానమిచ్చింది పద్దూ.

“నాకు మంచి అమ్మాయి వస్తుందని నువ్వనేదానివి. ఆ అమ్మాయివి నువ్వే ఎందుకు కాకూడదు. నీకు కేస్ట్ ఫీలింగ్ కూడా లేదన్నావు. నీకు ఇంట్లో గానీ పర్సనల్‌గా గానీ ఏమన్నా ప్రాబ్లంస్ ఉన్నాయా పద్దూ?”

“ఏమీ లేవు వేణు… కొన్ని వాటి గురించి మనం ఆలోచించకూడదు… నువ్వు మీ ఇంట్లో చూసే అమ్మాయిని చేసుకో…”

“సరే నా మీద ఏ ఫీలింగ్ లేదంటున్నావు. నీకు ఇంట్లో ఎవరో ముక్కూ మొకం తెలియనోడిని తీసుకొస్తే మరి చేసేసుకుంటావా? ఇది చెప్పు…”

“ఆ… నువ్వు స్నేహితుడివి మాత్రమే వేణు; నిన్ను పెళ్ళి చేసుకోవడమంటే కష్టం…” నిర్భయంగా వచ్చింది జవాబు.

“అంటే నేను భర్తగా పనికిరానా… పద్దూ”

“అది నేను చెప్పలేను వేణు”

గుండెల్లో రానురాను బరువు పెరిగిపోతుంది వేణుకి… ఇక అక్కడ ఉంటే నిలబడే ఓపిక కూడా పోతుంది… ఆ జవాబులకి.

“మంచిది పద్దూ; నేను స్నేహితుడిగా మాత్రమే పనికొస్తానని తేల్చేసావ్. నువ్వు జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకు మంచిదే జరగేలా కోరుకుంటున్నాను… బై” అంటూ ఇంటికి బయలుదేరాడు.

*********************************************
“ఏరా అన్నం తినరా, ఇప్పటికే చాలా టైం అయ్యింది” అంటూ పళ్ళెంతో అమ్మ గదిలోకొచ్చింది.

వేణు రెండురోజుల నుండి సరిగ్గా భోంచెయ్యడం లేదు. ఎప్పుడు మనసుకి భాద కలిగినా ఆకలీ ఓపికా చచ్చిపోతాయి. పద్దూ ఆఫీసుకి రావడం మానేసింది. ఎవరికీ కారణం చెప్పలేదు. ఆమెకి ఇంట్లో అమెరికా సంభందం చూస్తున్నట్టు ఎవరో చెప్పారు.

మనసు ముక్కలైతే మగాడు ఆడదాని కన్నా ఎక్కువ భాదపడతాడని వేణుని చూస్తే ఎవరికైనా  తెలుస్తుంది.

అమ్మను భాద పెట్టడం ఇష్టం లేక ఓ నాలుగు ముద్దలు తిన్నాడు. మళ్ళీ పద్దూ ఆలోచనలు… పద్దూతో మళ్ళీ మాట్లాడాలనిపించింది.

“హలో పద్దూ.. నీతో మాట్లాడవచ్చా…”

“మొన్న మాట్లాడినవి కాకుండా ఏవైనా మాట్లాడు వేణు”

ఇక మౌనమే సమాధానమయ్యింది… ఏం మాట్లాడలేక ఫోన్ పెట్టేసాడు.

*********************************************

పార్కులో ఫ్రెండ్స్‌తో తిరుగుతున్న రవికి ఓ పక్కగా సెక్యూరిటీ నిద్రపోతున్న ఎవరినో లేపడానికి తడుతున్నట్టు కనిపించింది. ఎవడో మనవాడిలా ఉన్నాడే అనుకుంటూ అటు వెళ్ళాడు. వెనక్కి తిరిగి తన ఫ్రెండ్స్‌తో “మీరు వెళ్ళండి… నేను తర్వాత వస్తాను…” అని అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాకా సెక్యూరిటీతో  “అతను నా ఫ్రెండే,  మీరెళ్ళండి. నేను చూసుకుంటాను” అని వేణు పక్కన కూర్చుని చేతిలో ఉన్న బాటిల్ నీళ్ళని ముఖం మీద చిలకరించాడు.

ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళుతెరిచాడు వేణు. అంతా అయోమయంగా ఉంది. అంతలోనే తేరుకుని లేచి మౌనంగా కుర్చుండిపోయాడు. ” ఏరా మీ ఆఫీసుకి ఉదయం వచ్చాను;  నువ్వు రావడంలేదని చెప్పారు. మీ ఇంటికి ఫోన్ చేస్తే బయటికి వచ్చేసావని అమ్మ చెప్పింది. ఇక్కడేం చేస్తున్నావ్రా” ఓ పక్క కనిపిస్తున్న విస్కీ బాటిల్‌ని చూస్తూ అడిగాడు.  ఏం చెప్పాలో తెలియడం లేదు వేణుకి.

“ఏరా నేను విన్నది నిజమేననిపిస్తుంది… నిన్నిలా చూస్తుంటే, ఇలా మందుకొట్టి పడుకుంటే నీ భాధలు తీరిపోతాయ” మీద చెయ్యివేస్తూ అడిగాడు రవి.

“నీకు తెలుసు కదరా; నేను ఏ విషయాన్నీ అంత పట్టించుకోను. కానీ నా జీవితంలో ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా కావాలనుకున్నాను. తను నా మనసుని పూచిక పుల్లలా విరిచేసింది. నేను ఫ్రెండులా మాత్రమే పనికొస్తానని చెప్పింది. ఎవడో ముక్కూమొహం తెలియనోడిని తెస్తే ఇష్టపడుతుందంట గానీ నన్ను ఇష్టపడదట.”  వేణు కళ్ళలో నీళ్ళ మెరుపు కనిపించింది రవికి.

“అలా పిల్లోడిలా ఏడుస్తున్నావేంట్రా.  ఎవత్తో మనసు లేని దాని కోసం; నీ గురించి ఆలోచించని దాని కోసం, ఇక్కడ కుర్చుని భాదపడుతున్నావా. ఏరా! మేము, మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోయామురా! ఇన్నాళూ చెప్పలేదు కనీసం. ఆ విషయాలు మర్చిపో. ఇంటికెళదాం పద” సముదాయిస్తూ అన్నాడు రవి.

“నేను దాని అందం చూసి ముచ్చట పడితే అంతకన్నా అందమైన దాన్ని చూసి  దీన్ని మరచిపోవచ్చేమో అని అనుకోవచ్చురా. నువ్వూ చూసావు కదా దాన్ని. ఎందుకో దానిలో కొన్ని గుణాలు నచ్చాయిరా. నేను తనని ఎంతలా ఇష్టపడుతున్నానో దానికి తెలుసురా; నేను తనతో తప్ప ఏ అమ్మాయితోనూ అంత చనువుగా లేను కదరా. ఎవరైనా తనని సరదాగా కొడుతున్నా కూడా నేను వాళ్ళని మందలించేవాడిని. దాన్ని ఎవరూ ఏ మాటా అననిచ్చేవాడిని కాదు. నేను కూడా కనీసం ఎప్పుడూ దాన్ని తాకను కూడా తాకలేదు. అన్ని విషయాలూ దానికి తెలుసు. నేను ఏం తప్పు చేసానో నాకు తెలియడం లేదు;   అసలు ఏ అమ్మాయి కనిపించినా తనే గుర్తుకొచ్చి ఒళ్ళు పట్టుతప్పిపోతుందిరా “  నీరసంగా చెప్పాడు వేణు.

“లేదు మామా. ఎప్పటి నుండో నీకు చెబుతున్నా. అలా సత్తెకాలమోడిలా ఉండకురా అని. అలా ఉంటే ఈ కాలమమ్మాయిలెలా ఇష్టపడతార్రా. అదిగో అటు చూడు; వాళ్లకి చిలిపివంశీకృష్ణలు, మన్మథులు కావాలి. పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళు వీళ్ళ కంటికి ఆనరు. నీ చుట్టు ఉన్న ప్రెండ్స్ కూడా ఈ అమ్మాయిల దగ్గర గుడ్‌విల్ కొట్టెయ్యడానికి చూస్తుంటారు; నీతో అన్ని విషయాలూ చెప్పరు. ఎవర్ని పడితే వాళ్లని గుడ్డిగా నమ్మెయ్యకూడదురా. నువ్వు ఇలా రామానుజంలా ఉంటే ఎప్పటికీ ఫ్రెండులానే ఉండాల్సొస్తుంది.  నువ్వు తనని అంత జాగ్రత్తగా చూసినందుకే నువ్వు అలుసైపోయావు. రఫ్పాడించాలి;  రెమోలా మారాలి మామా; అప్పుడే జింకలు కావాలని వచ్చి చేతికి చిక్కుతాయి.  అయినా నీకేంటిరా! దాని బ్యాడ్‌లక్: వదిలెయ్ ఇంక ఆ విషయాన్ని…” గీతలా భోదన ముగించాడు రవి.

రవి చెప్పింది వింటున్నా పద్దూ తన కళ్ళల్లో మెదులుతూనే ఉంది వేణుకి.

వేణుకి నచ్చచెప్పి నెమ్మదిగా ఇంటికి తీసుకు వచ్చాడు. ఎందుకన్నా మంచిదని అమ్మకి విషయం చెప్పాడు. “జాగ్రత్త ఆంటీ; వాడ్ని నేను ఎప్పుడూ అలా చూడలేదు; మళ్ళీ రేపు వస్తాను” అంటూ వెళ్ళిపోయాడు రవి.

ఓ వారం రోజులు ఎలా గడిచాయో తెలియదు… మెదడుని తొలిచేస్తున్న ఆలోచనలు… గుండెను మెలిపెడుతున్న పద్దూ ఊహలు… జీవితం మీద నిరాశ… ఒక క్షణం తనవాళ్ళు గుర్తొస్తుంటే కాస్త ఊరడింపుగా ఉంటుంది… మరుక్షణం పద్దూ గుర్తుకొచ్చి ఈ లోకంలో తన  ఉనికిని ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంది…

గడియారం వంక చూసాడు. పది దాటింది.  ఇంట్లో అందరూ పెళ్ళికి వెళ్ళారు. ఇంకేం ఆలోచించకుండా ఇంట్లోంచి బయటకొచ్చాడు. ఇప్పుడు ఎక్కడికెళ్ళాలో తనకు బాగా తెలుసు…

*********************************************
దూరంగా రైలు వెళుతున్న శబ్ధం వినిపిస్తుంది. వడివడిగా నడవడం మొదలు పెట్టాడు.

వాన ఎక్కువైంది. దారి పక్కన ఉన్న చెట్టు కిందకి చేరాడు. చేతులు తుడుచుకుని జేబులో చెయ్యిపెట్టాడు. ‘హమ్మయ్య ఇంకా తడిసిపోలేదు’ అనుకుంటూ నెమ్మదిగా సిగరెట్టు పెట్టె తీసి ఒకటి వెలిగించాడు. ఇప్పుడు కాస్త చలి తగ్గినట్టనిపించింది. జేబులో నుండి ఈసారి పద్దూ ఫొటో తీసి అలా చూస్తూ ఉండిపోయాడు.

కుక్కలు మొరగడంతో ఈ లోకానికొచ్చాడు వేణు. వాన తగ్గినట్టనిపించింది. ఈసారి కుక్కపిల్ల మూలుగు వినిపించింది. దూరంగా ఓ గోతి చుట్టూ ఓ కుక్క ఏమీ చేయలేక లోపలికి చూస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. వేణు అటుగా వెళ్తూ అనుమానం వచ్చి లోపలికి చూసాడు. కుక్కపిల్ల ఒకటి లోపల సగం వరకు మునిగిపోయి మూలుగుతూ  కనిపించింది. వెంటనే లోపలికి దిగి దాన్ని పైకి తీసి చెట్టు కిందకి తెచ్చాడు. కొంతసేపు అక్కడే ఉండి ఆ కుక్కపిల్ల తేరుకున్నాకా దాన్ని వదిలి బయటికొచ్చాడు.

మొత్తానికి  రైలుపట్టాలను చేరుకున్నాడు. అంతా తడితడిగా ఉంది. తాకి చూస్తే జిల్లుమంటుంది. వస్తున్న వణుకును అదుపుచేసుకుంటూ పట్టామీద మెడపెట్టి పడుకున్నాడు. తన వాళ్లందరూ ఒక్కసారి కళ్ళ ముందు కదులుతున్నారు. అందరికీ క్షమాపణలు చెప్పుకున్నాడు. ఆకాశంలో చంద్రుడు మబ్బుల మధ్య నుండి అప్పుడే భయటకొచ్చాడు. ఆ వెలుగులో పద్దూ ఫొటోని తనివి తీరా చూడటం మొదలుపెట్టాడు. ‘వచ్చే జన్మలోనైనా నీకు నచ్చేలా ఉండలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’  అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. మెదడులోకి ఇంకేం ఆలోచనలు రానివ్వకుండా రైలు కోసం ఎదురు చూస్తున్నాడు.

ఏదో తన పక్కకొచ్చినట్టు అనిపించి అటు తిరిగిచూసాడు. ఇందాకా తను కాపాడిన కుక్కపిల్ల తన పక్కకు వచ్చి షర్టుని పట్టుకు లాగుతుంది. దాని తలని సుతారంగా నిమిరి పట్టాల పక్కన నిలబడ్డ కుక్కపిల్ల తల్లి పక్కన ఉంచాడు. తోక ఊపుతూ అది వేణుని చూస్తూ నిలబడింది.

దూరంగా రైలు వస్తున్న శబ్ధం…

వేణు ఇంకేం ఆలోచించకుండా పట్టాల మీద మళ్ళీ తలపెట్టి పడుకుని కళ్ళుమూసుకున్నాడు.

రైలు దగ్గరకొస్తుంది… తన పక్క ఎవరో పడుకున్నట్టు అనిపించింది… మనసాగక పక్కకు చూసాడు… ఆ కుక్కపిల్లే తనలా పట్టాపై తలపెట్టి పడుకుంది… తల్లి పాపం దాన్ని లేపటానికి మొరుగుతుంది.

రైలు దగ్గరకొచ్చేయడంతో ఇంకేం చెయ్యలేక ఆ కుక్కపిల్లని పట్టుకుని పట్టాల పక్కకి దొర్లిపోయాడు. ఎక్కడలేనీ ఆవేశం… ఆ కుక్కపిల్ల మీద చెప్పలేనంత కోపం వచ్చేస్తుంది…

“ఏం బుద్దిలేదా! ఎందుకు నన్ను చావనివ్వడం లేదు. నేనేం చేసాను; నిన్ను గోతిలోంచి బయటకు తీసాను అంతే కదా! ఈ మాత్రం దానికే నాతో చావాలనుకుంటున్నావా. అక్కడ నీ అమ్మ ఉంది చూసావా అది ఏమైపోతుంది…” మనిషితో మాట్లాడుతున్నట్టు మాటలు బయటకొచ్చేసాయి. ఒక్కసారిగా అంతరంగంలో ఏదో చైతన్యం… ఒక్కసారి మనస్సాక్షి ప్రశ్నించింది… నువ్వు చేస్తున్నది ఏంటి?…’

కళ్ళ ముందు తెరలు కట్టిన మబ్బులేవో కరిగిపోతున్న అనుభూతి…  తన దగ్గర జవాబు ఉంది… అది తలచుకుంటే తన మీద తనకే సిగ్గూ జాలీ కలిగాయి. ‘ఒక మనసులేని దాని కోసం నా జీవితాన్ని నాశనం చేసుకుందామనుకున్నానా?!! నా వాళ్లను కన్నీట ముంచుదామనుకున్నానా?!! నన్నింత కష్టపడి పెంచిన అమ్మానాన్న గురించి నేనెందుకాలోచించలేకపోయాను?!! ‘  తనలో చీకటిని చీల్చుకుంటూ ఏవో ఆలోచనలు…

పద్దూ ఫొటో వేణు చేతి వేళ్ల నుండి జారిపోయి పక్కనున్న ముళ్ళపొదల్లోకి ఎగిరిపోయింది…

ఆకాశం ఇప్పుడు ప్రశాంతంగా… నిర్మలంగా… నిండు చంద్రుడితో కనిపిస్తుంది…

వేణు ఇంటి వైపు వడివడిగా నడవడం మొదలు పెట్టాడు… గాయపడ్డ మనసు ఇప్పుడు బాదంటే ఏంటో మర్చిపోయింది… ఈ ఘడియలో వేణు మళ్ళీ పుట్టాడు…

బ్రహ్మ ముహూర్తం అప్పుడే మొదలయ్యింది.

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం