ఎన్ని వేల వర్ణాలో…
ఆయన ఓ అమెరికా వాసి. ఆయన ఉద్యోగం మన భాగ్యనగరంలో ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లో వైస్ కౌన్సెల్ మరియు వీసా అధికారి.
ఆయన పేరు జెరెమి జువిట్ (Jeremy Jewett)
ఈ ఉద్యోగపర్వంలో ఆయన విధి తన మాతృదేశమైన అమెరికాకు చదువు నిమిత్తము ఇక్కడి నుండి వెళ్ళే యోగ్యమైన వాళ్ళను ఎన్నుకుని వాళ్ళకు వీసాలు ఇవ్వడమో ఇవ్వకపోవడమో! అందులోనూ తమ దేశభాష అయిన ఆంగ్లము గురించి ఆలోచించడమో లేదా పరీక్షించడమో తప్ప వేరే ఇతర భాష గురించో సంస్కృతి గురించో అస్సలు ఆలోచించనక్కర్లేదు కూడా!!!
కానీ… ఆయన అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఎంత అమెరికా వాసి అయినా వృత్తి రీత్యా తనకు తెలుగు అవసరం కాకపోయినా ఆయన మమేకమవ్వవలసింది తెలుగు వాళ్ళతో కాబట్టి ఇక్కడి భాషను మాట్లాడగలిగితేనే ఇక్కడి వాళ్ళకు మరింత చేరువ కాగలమన్న తలపుతో ఆయన మన తెలుగు భాషని నేర్చుకోవాలనుకున్నారు! ఆరు నెలలు అక్కడే తెలుగును అభ్యసించారు… చివరికి మన తెలుగువాడిలా మాట్లాడటం మొదలుపెట్టారు!
ఈయన తెలుగు ఉచ్చరణ కూడా మనవాళ్ళలానే ఉంటుందిట! తెలుగు చదవడం కూడా వచ్చట! బొమ్మరిల్లు చిత్రం చూసారట కూడా!!!
కొసమెరుపు: జెరెమి విజిటింగ్ కార్డ్ కూడా తెలుగులోనే ఉంటుందిట! నా మీదొట్టు ఇక్కడ చూడండి
ఈయన గురించి ఈనాడులో వచ్చిన వ్యాసం ఇదిగో…
ఇదంతా ఎందుకు జెపుతున్నానంటే… ఒక సంస్కృతి ఉనికికి భాష ఎంత మఖ్యమైనదో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.

ఈ ఆగష్టు 28, ఆదివారమున జరిగే తెలుగుబాట కార్యక్రమములో తామెల్లరూ తమ తమ ఆశ్చర్యార్థకములను, ఆవేశకార్థములను, అయోమయార్థకములనూ, అవహేళనార్థకములనూ విడనాడి పాల్గొనాలని… మీ ఆలోచనామృతమును, ఆనందోత్సాహమునూ, అభిమానాంజలినీ మాకు సమర్పించాలని ఆకాంక్షిస్తూ… మీ రాక కోసం 28 ఆదివారమున తెలుగు లలిత కళాతోరణం దగ్గర ఎదురు చూస్తూ…
తెలుగుబాట కార్యక్రమ వివరాల లంకె : http://telugubaata.etelugu.org
ఓ తెలు’గోడు’
అంతవరకు తెలీదు తెలుగులో ఒక విజ్ఞాన భాండాగారం తయారవుతుందని. 2005లో గూగుల్‌లో Telugu అని టైపించి వెతుకుతున్నాను. వచ్చిన ఫలితాలను తెరచి చూస్తుంటే ఆంగ్ల వికీపీడియా కనిపించింది. అందులో కాస్త ఎక్కువ సమాచారం ఉన్నట్టనిపించి చదువుతున్నాను. చాలా బాగుంది. ఎక్కువ సమాచారాన్నే పొందుపరిచారనిపించి ఆ పేజీ మొత్తాన్ని పరికిస్తున్నాను. వికీపుటకి ఎడమవైపున చాలా భాషలలో లంకెలు కనిపించాయి. అవేమిటో అర్థం కాలేదు. వరుసగా చూసుకుంటూపోతే తెలుగు అన్న పదం లంకెతో దర్శనమిచ్చింది. దాన్ని నొక్కితే ఓ పుట భారంగా తెరుచుకుంది (ఇంటర్‌నెట్ సెంటరు; అందునా ర్యాము, ప్రాసెసర్ వేగం తక్కువ కదా; అందులోనూ యూనీకోడ్ కాబట్టి). దానిలో తెలుగు గురించి సమాచారం బాగానే ఉంది. దాని వెబ్ చిరునామా చూస్తే http://te.wikipedia.org. అప్పుడప్పుడే అంతర్జాలంలో అఆలు నేర్చుకుంటున్న నాకు ఆ చిరునామా ఏమిటో బోదపడలేదు. తర్వాత్తర్వాత తెలిసింది అది తెలుగు వికీపీడియాకు ప్రత్యేకంగా ఉన్న చిరునామా అని.
ఆపై నాకు ఉద్యోగమొచ్చిన తర్వాత కార్యాలయంలో ఖాళీ దొరికినప్పుడు మొదటగా సిరివెన్నెల సీతారామశాస్రి గురించిన వ్యాసం మొదలెట్టాను. అప్పటికి నాకు వికీపీడియా అంటే తెలుగులో సమాచారాన్ని పొందుపరిచేది అని మాత్రమే తెలుసు. అప్పటికే అంతర్జాలంలో మన పైత్యాన్ని పాండిత్యాన్నీ తెలుగు బ్లాగు రూపేణా వెళ్లగక్కుకోవచ్చని తెలిసి బ్లాగ్‌స్పాట్‌లో కొన్ని టపాలు రాసిన అనుభవముంది. ఆ అనుభవంతోనే వికీపీడియాలో నా మొదటి వ్యాసాన్ని రాసాను నా దృక్కోణంలో . అప్పటికే వికీపీడియాలో అనుభవమున్న చదువరి, వైజాసత్యలు నా వ్యాసాన్ని వికీకి అనుగుణంగా ఎలా రాయాలో సరిదిద్దుతూ సూచనలిచ్చారు. అప్పటినుండి ఏదో ఇతోధికంగా ఓ మూడేళ్ళు అదీఇదీ రాసాననుకోండి. నాకు మాత్రం బ్లాగులో రాసేకన్నా వికీపీడియాలో రాయడం ఎక్కువ సంతృప్తినిచ్చింది. అది వేరే సంగతి.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే…

(వీవెన్ తన బ్లాగలో పేర్కొన్న చేతనత్వమున్న బ్లాగుల జాబితాలో నన్నూ చేర్చడం వలన ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న సంకల్పంతో మళ్ళీ…)
తెలుగు పీపుల్ డాట్ కామ్ లో తెలుగు ప్రాచీనతపై కొన్ని వ్యాసాలు చదివిన తర్వాత గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడూ గూగుల్‌లో నేను “proto-dravidian” , “proto-telugu origin” కోసం వెతుకుతున్నాను. చాలా ఆసక్తికరమైన అంశాలు తెలుస్తున్నాయి. ఇలా వెతుకుతున్నప్పుడు ఆంగ్ల వికీపీడియాలో కన్నడ నటుడు రాజ్‌కుమార్ మాతృభాషపై జరిగిన చర్చ కనిపించింది. ఒక ఈ-పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయనే తను తెలుగువాడినని చెప్పుకున్నట్టు ఒక సభ్యుడు ప్రస్తావించాడు. ఆ చర్చని కావాలంటే ఇక్కడ చదవండి…
http://en.wikipedia.org/wiki/User_talk:Taprobanus/archive_1#Rajkumar.27s_mothertongue