
అనుభూతి…
మాటలకందదు… కానీ తలపుల్లో ఊపిరోసుకుంటుంది…
నువ్వెవరో నేనెవరో…
అసలు నువ్వు ఉన్నావో లేదో కదా!
అయినా ఇద్దరినీ మమేకం చేసేస్తుంది…
అథ్వైతానికి అర్థం చెబుతుంది.
వానైపోతున్నావా ఓ మేఘమా!
నీ చినుకుల చెణకులతో చెలిని తడమవా…
మా లోగిలిలోకి రెక్కలు కట్టుకుని వాలుతావా…
మా ఇంటి చూరుని పట్టుకుని వేలాడుతూ ఉండిపోతావా…
పోనీ పసిరికను చుంబిస్తూ ఉండిపో నేనొచ్చేదాకా…
నీ తడి స్పర్శలో నే వెతుక్కుంటాను… నేనిన్నాళ్ళూ పోగొట్టుకున్న సాంగత్యాన్ని…
కొవ్వొత్తి…
నిరాడంబరంగా చుట్టూ వెలుగుల్ని గుప్పిస్తుంది…
తనలో రగులుతున్న అగ్నిపర్వతాన్ని గుర్తించలేదు…
మరిగే ఒక్కో మైనపు బొట్టునూ స్పర్శించేదాకా…
నవ్వుతున్నప్పుడల్లా… ఒకటే భాద…
నవ్వలేని వాళ్ళని ఎలా నవ్వించాలా అని!
భాదలో ఉన్నవారిని చూస్తుంటే తెలిసొచ్చింది…
అయ్యొ! నేనెలా నవ్వగలుగుతున్నానా అని?
కాయితం…
రంగు పులుముకుని, పరిమళాన్ని పూసుకుని,
పువ్వులా ముస్తాబయ్యింది!!
ఎన్ని రోజులైనా వాడిపోలేని ఆయుష్షు తనది…
కానీ ఆ గడ్డిపువ్వులో తొణికిసలాడే తేజం కనిపించదేం?
వెన్నెల…
సూర్యుడిదా? చంద్రుడిదా?
ఏమో తెలీడం లేదు…
నువ్వున్నప్పుడు చల్లగా ఉంటుంది…
నువ్వెళ్ళినప్పుడు వెచ్చగా ఉంటుంది…
ఈ అజ్ఞానికి చెప్పేదెవరు?
అక్కా చెల్లీ తమ్ముడూ అన్నా మరదలూ వదినా బావా బామ్మరిదీ..
ఇంకొకటే చుట్టరికం మిగిలింది…
నువ్వౌతావా మరి
పెరట్లో గోరింట…
చెల్లి అరచేత చందమామైపోయింది…
నా తళ్ళో పిడకలా మారింది…
నేనిప్పుడు తన కన్నా పదేళ్ల చిన్నవాడిని….
చిత్రగుప్తుడు చిట్టా తిరగేసాడు…
నా నూకలింక చెల్లవని చెప్పేసాడు…
యముడేమో పాశమిదిలిస్తున్నాడు…
సఖీ సావిత్రీ నువ్వెక్కడ?
చిన్నపుడు చదివినట్టే…
ఇప్పుడూ చందమామనే చదువుతున్నాను…
పక్కాంటీ కూతురు చేసే సైగలందుకే అర్థం కావడం లేదట!
వారం వారం స్వాతి చదివే మా బామ్మ అంటుంది !!!
వరంగల్‌లో జరిగిన రెండు దుర్ఘటనలకు బ్లాగులలో చాలా మంది బాగానే స్పందించారు.
నట్టడవులు నడివీధికి నడిచొస్తే ఇంతే!
ఇదా పరిష్కారం!!
మీడియా చేయించిన హత్యలు
You oughtta do it స్వప్నికా!
అసలు నేరస్తులు
ఆటవిక న్యాయం అమలైంది!
ఇదేనా న్యాయం అంటే??
ఎన్‌కౌంటర్
చంద్రునికో నూలుపోగు అనుకోండి… తిలాపాపం తలాపిడికెడు అనుకోండి… ఇదిగో…
నేను టీవీ చూడడం తక్కువ. పేపరైనా ఏదన్నా బుద్దిపుట్టినప్పుడు మాత్రమే ఆన్లైనో తిరగేస్తుంటాను. నేను ఉదయం ఆఫీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా ఏదన్నా చర్చించుకుంటే తప్ప నాకు నూతి బయట ఏం జరిగిందో తెలియదు. ఈ విషయమూ అలాగే తెలిసింది. ఆఫీసులో చేస్తున్న పని మీద విసుగు కలిగి దగ్గర్లో ఉన్న సహోద్యోగి దగ్గరకు వెళ్ళినప్పుడు గానీ నాకు ఈ యాసిడ్ వార్త తెలియలేదు. ఇలాంటప్పుడు మామూలుగానే మగాడిలా కాకుండా మనిషిలా భాదపడ్డాను. ఆ వ్యక్తి మీద చాలా కోపం వచ్చింది. వేరే దేశాల్లో అమలవుతున్నట్టు కన్నుకి కన్ను పన్నుకి పన్ను శిక్ష వేసెయ్యాలి వీళ్ళకి అన్నంత కోపంవచ్చింది. ఆ పక్కనే ఒక అమ్మాయి కూర్చుంటుంది. ఆ విషయమై జరిగిన చర్చలో వీళ్ళని చంపేస్తే గానీ ఇలా చేసేవాళ్ళకు బుద్దిరాదు అన్న మాటలు వినిపించాయి. కానీ ఒకరు ఇలా మారడానికి వారు వ్యక్తిగతంగా సగం కారణమైతే వారి తల్లిదండ్రులు, స్నేహితులూ మిగిలిన సగం కారణమవుతారనే భావన ఎప్పటి నుండో నాలో మెదులుతూ ఉంది.
బ్లాగర్ల దినోత్సవం రోజు మధ్యాహ్నం సమావేశానికి వెళ్ళేముందు ఒకసారి కూడలిని తెరచి చూసాను. అక్కడ మొదట కనిపించిన చదువరి గారి జాబు చదివితే గానీ రెండో దుర్ఘటన విషయం తెలియలేదు. అప్పుడే ఈనాడు పత్రిక తెరిచి చదివాను అసలు విషయం. ఇంతకు ముందు ఆ వ్యక్తి మీద కలిగిన కోపం ఇప్పుడు పోలీసుల మీద కలిగింది. ఆ రాత్రి తీరికగా కూర్చుని మిగిలిన బ్లాగరులు రాసిన జాబులను చదివాను. ఇక్కడ ఆ అమ్మాయి అబ్బాయిల వ్యక్తిగత విషయాలు కాదు మనం ఆలోచించాల్సింది. నువ్వు మనిషిగా ఎలా స్పందిస్తున్నావు. తల్లిగానో, తండ్రిగానో, అన్నగానో, అక్కగానో నీ బాద్యత ఏమిటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకునే సమయమిది. మనం ఆలోచించాల్సింది ఏది మంచి ఏది చెడు అని. అంతేగానీ మనలోని అక్కసుని వెల్లగక్కుకునే సమయం కాదిది. ఇగోలని ఇగో అని చూపించే సమయం కాదిది.
నాలో పేరుకుపోయిన బద్ధకాన్ని విదిలించి మరీ ఈ జాబు రాయడానికి రెండు ముఖ్యకారణాలున్నాయి.
1) ఈ ఆదివారం ఈ విషయం మీద పేపర్లో వార్త చదువుతున్నప్పుడు “శనివారం వరంగల్‌లో ఎస్పీ సజ్జనార్‌కు విద్యార్థినుల అభినందనలు” అన్న ఛాయాచిత్రం
2) విశాఖ డైలీ బ్లాగులో ఒకాయన రాసిన వ్యాఖ్య మరీ బాదపెట్టింది.
నేను ఆ దాడి చేసిన వాళ్ళను సమర్థించను. అలా అని పోలీసుల ఎన్‌కౌంటర్‌నూ సమర్థించలేను! చదువరిగారన్నట్టు ఇలాంటి సంఘటనల వల్లనైనా కనీసం రిహార్సల్స్ చేసి మరీ ఇలాంటి అకృత్యాలకు పాల్పడేవాళ్ళు ఆలోచించగలిగితే/భయపడితే నా తమ్ముడో, చెల్లో, కూతురో, కొడుకో, స్నేహితుడో, స్నేహితురాలో ఇలా మన బ్లాగుల్లో చర్చనీయాంశానికి పావులుగా కాకుండా ఉండగలరు.
మరుపు రాదేల ఈవేళ! ఇంతకు ముందు వరకూ ఏదన్నా గుర్తుకుతెచ్చుకున్నప్పుడల్లా మరుపు లేకపోవడం ఒక వరమనే అనుకునే వాడిని. ఇప్పుడు అదే ఎందుకు శాపమయ్యింది?
జీవితంలో ఒకరిని మరిచిపోవడం ఎంత కష్టమో ఇప్పుడర్థం అవుతుంది. ఎప్పుడూ కళ్ళ ముందు మెదిలే నువ్వు, గలగలమంటున్న నీ నవ్వు ఒక్కసారిగా స్మృతిపథంలో కనబడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మెదడులో ఎక్కడ నీ ఆనవాళ్ళు నిక్షిప్తమయి ఉన్నాయో తెలిసేదెలా? ఏ పరాకులో ఉన్నప్పుడు ఎడబాటుని తలచానో గానీ పై నుండి తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు?! అందుకే ఈ గుండె కోత.
నిన్ను మరచిపోలేకపోతున్నందుకు నా మీద నాకే కోపం. ఎవరెన్ని చెప్పినా ఈ మనసుకు పట్టడం లేదు. ఏకాంతంలో నీ ఆలోచనలు వైతరిణీ ఒడ్డుకు తీసుకెళ్ళి వదిలేస్తున్నాయి.
బంధాలను తెంచుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు తెలిసింది. నీలా ఒక్క క్షణంలో తనవారిని పరాయివారిలా మార్చెయ్యడం నాకు చేతకావడం లేదు. శిలని శిల్పంగా మలచింది ఎవరికో పణంగా పెట్టడం కోసమని నీకోసం కాదని తెలుసుకోలేకపోయిన అజ్ఞానిని నేను. నీ తలపుల నుండి తప్పించుకోవాలని శతవిధాల వృధా ప్రయత్నం. ఏదో ఆశ; ఒక్క నిమిషమైనా నీ ఆలోచనల నుండి దూరంగా పోవాలని.
మధుపాత్రలు ఒంటిని చిధ్రం చేస్తున్నాయి గానీ మనసును శాంతింపజెయ్యడం లేదు.
కళ్ళుమూసుకున్నంత మాత్రాన నిదుర కౌగిలించుకోదుగా!
ఇక ఈ అజాత శత్రువుకు ఈ ప్రపంచంలో ముగ్గురు శత్రువులు…
కంటి ముందు మెదిలే నీ రూపు
చెవిలో ఇల్లు కట్టుకున్న నీ మాట
ఎదలో కదలాడుతున్న నీ తలపు
వాటిని జయించగలుగుతానో… వాటి చేతిలో దహించబడతానో వేచి చూడాలంటావా!
దీని ముందు టపాలోని నేను రాసిన విషయం ఒకటి; అక్కడ జరిగిన చర్చ మరోకటి. నేను కేవలం నాకు నచ్చిన హకూనా మటాటా పదం గురించి ఇంకా కొన్ని వాక్యాల గురించి రాస్తే ఆ ప్రస్తావన కాస్తా పక్కదోవ పట్టి ఆ రచయిత మీదకి మళ్ళింది. అక్కడే అభిప్రాయం రాద్దామనుకుని విరమించి ఇక్కడ రాస్తున్నాను.
మనం సినిమాలో ప్రతీ అంశానికీ బ్రాండ్ అంబాసిడర్స్‌ని ఊహించుకుంటున్నాం. మిగిలిన విభాగాల గురించి ఏమోగానీ పాటల రచయితల విషయంలో ఇలాంటి పాట ఈయనే రాయాలి; అలాంటి పాట ఆయనే రాయాలి అని రచయిత సృజనాత్మకతని ఒక అంశానికే పరిమితం చేస్తున్నాం. మిగిలిన వాళ్ళ సంగతి ఏమో గానీ ఇది మంచి పద్దతి కాదని నా అభిప్రాయం. “నువ్వొస్తావని” సినిమాలో “కలలోనైన కలగనలేదే…” పాటను వేరొకరు రాసుంటే ఇంకా బాగుంటుందో లేదో అన్న సంగతి పక్కన పెడితే; చంద్రబోస్ ఆ పాటకు న్యాయం చేకూర్చారనే అనిపిస్తుంది కదా! “ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి…“, “ఎదిగేకొద్దీ ఒదగమని…” సంగతీ అంతే కదా. వీటిని ఏ సిరివెన్నెలకో వేటూరికో ఇస్తే ఎలా ఉంటుంది అని అనుకోకూడదు. అలాగే ఏదన్నా యూత్ సాంగ్‌ని చంద్రబోస్ తప్ప వేరెవరైనా రాస్తే అది వాళ్ళ తప్పిదంలా భావిస్తారు. భువనచంద్ర ద్వందార్థం స్ఫురించే పాటలు ఎన్ని రాసినా, వినగలిగే కొన్ని ట్యూన్లకు బాగానే రాసారు. ఆయన రాసే అనువాదపాటల్లో కూడా మాతృకలోని అర్థం మనకు నప్పకపోతే కొన్ని లైన్లు తెలుగులో మార్చి రాసినట్టు గుర్తు. వెన్నెలకంటి “తపస్సు”లో పాటలు బానే ఉంటాయి కదా!. ఈ మధ్యన వెలుగులీనిన వనమాలి “ఇక సెకనుకెన్ని నిమిషాలో…” అని అంటే ఆ ట్యూనుకి ఎంత బాగా ఒదిగిపోయిందది. ఇంతకు ముందు చాలా మంది “యుగమొక క్షణములా… క్షణమొక యుగములా…” అని అర్థం వచ్చేలా రాసినా, ఇప్పుడు వనమాలి రాసింది ఎంత ఫ్రెష్‌గా ఉంది అని అనిపించింది!
సుద్దాల అశోక్‌తేజ గురించి చెప్పుకునే ముందు విప్లవ సాహిత్యం గురించి చెప్పుకోవాలి. ఈ విప్లవ గీతాలు, సినిమా పాటలకు కొంచెం విభిన్నం. వీటిని కొందరు అనుభవైకవెద్యమైన వాళ్ళో, ఆ వాతావరణాంలో పెరిగిన వాళ్ళూ ఆ మాండలికం ఎరిగిన వాళ్ళో తప్ప మిగిలిన వాళ్ళు రాసినా మట్టి వాసనలోని కమ్మదనం, చెమట బొట్టులోని ఉప్పదనం కనిపించవు. అశోక్‌తేజ అటు ఆ పాటలు రాస్తూ మిగిలిన రకాల పాటలు కూడా బాగానే రాస్తున్నారు. ఇక భక్తి పాటల విషయానికొస్తే ఇవి రాసేవాళ్ళకు పురాణాలతో, సంస్కృత భాషతో కాస్త పరిచయం ఉండాలి. ముఖ్యంగా బ్రాహ్మణ కవులు (కవులకి కులం అంటగడుతున్నానని అనుకోకండి; ఇక్కడ పురాణాలతో బాగా పరిచయం ఉన్నవాళ్ళుగా అర్థం చేసుకోండి) వీటికి సరిపోతారు. వేటూరి, సిరివెన్నెలని పక్కన పెడితే, జొన్నవిత్తులని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అందుకే పాట రాయడంలో కవికి ఉన్న సృజనాత్మకత విషయంలో విప్లవ గీతాలు, భక్తి గీతాలను మినహాయించాలి. ఇక భాస్కరభట్ల, కందికొండ, రామజోగయ్య శాస్రి, అనంత శ్రీరాం, పెద్దాడ మూర్తి తదితరుల గురించి నాకు అంత తెలియదు.
నేను సినిమా పాటకు దాసోహం అయ్యింది వేటూరి చలవ వలనే గానీ, సిరివెన్నెల సినిమాతో మాత్రం సినిమా పాటలలోనూ మనకు అర్థం అయ్యే సాహిత్యం ఉందనే అభిప్రాయం బలపడింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబోస్ లాంటి వారి పాటలూ ఏమీ తీసిపోవు. ఉగాది పచ్చడిలో వివిధ రుచులున్నాట్లు సినీపాటలలో కూడా వివిధ నేపథ్యాలకు తగ్గట్టు పాటలు కావాల్సొస్తాయి. అది యుగళమో మెలోడీనో కావొచ్చు; మాస్, మషాలా కావొచ్చు; విషాదమో విప్లవమో కావచ్చు. మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుందో గానీ నేను మాత్రం ఎవ్వరు రాసినా ఎవ్వరు పాడినా ఏ భేషజాలూ లేకుండా ప్రతీ పదాన్ని ఆస్వాదిస్తాను. ప్రతీ పాటా ఏ శంకరాభరణంలానో ఏ సిరివెన్నెలలానో ఉండాలని ఆశ పడను. ప్రతీదీ ఏ వేటూరో, సిరివెన్నెలో రాయలేదని భాదపడను. ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. నాకు గుర్తుకొచ్చిన వ్యక్తులను/పాటలను మాత్రమే ఇక్కడ ఉదహరించాను, ఏమన్నా వదిలేసి ఉంటే అన్యదా భావించకండి. మరీ మాస్‌గా చెప్పాలంటే నాకు బ్రాండ్‌తో పనిలేదు; కిక్కెక్కాలంతే