రాసినవారు శ్రీనివాస on Sunday, 20 of January , 2008 at 11:28 am
అందమె ఆనందం అని అంటారు. ముఖ్యంగా ఎవరినన్నా అందమైన ఆడవారిని చూసినప్పుడు ఈ మాట గుర్తుకొస్తుంది. నేనూ ఇలానే అనుకునేవాడిని. కొన్ని సార్లు ఏ టీవీలోనో, సినిమాలోనో అందాలను చూసి దాసోహమైన క్షణాలూ ఉన్నాయి. ఒకసారి ఈ టపాలో స్నేహితుడి మనసులో మాటకి తన అభిప్రాయంగా అమ్మాయిలో చూడాల్సింది వ్యక్తిత్వం, అత్మాభిమానం అని జేప్స్ అనుకుంట రాసారు. అప్పుడు నేను ఇలా సినిమా కబుర్లు చెప్పేవారు తమ ఇళ్ళల్లో పూల మొక్కలకు బదులు బ్రహ్మజెముడు, తుమ్మ చెట్లను పెంచుకుంటారేమోనని సరదాగా అనుకున్నాను. ఏదైనా అనుభవమైతే గానీ విషయం ఒంటబట్టని నాలాంటి వాళ్లకి కాలమే తాయితీగా సమాధానం చెబుతుంటుంది. చెప్పేసింది కూడా.
మనకు పరిచయం కాని వారిని మనం చూసినప్పుడు ముందుగా వాళ్ల రూపం మన మీద ప్రభావం చూపుతుంది. అది సహజాతమైనదని నేననుకుంటాను. వాళ్లతో పరిచయ భాగ్యం కలిగి కాస్త చనువు పెరిగిన తర్వాత గానీ వాళ్ళేంటో మనకు తెలియదు. అప్పుడు మాత్రమే మనం ఓ మామూలు రూపంలో ఒదిగిన అనూహ్య మానసిక సౌందర్యాన్ని చూడగలం (వీళ్ళు మన వ్యక్తిగత జీవితంలో ఒక భాగమైతే ఎంత బాగుండునో అనిపిస్తుంది), అప్పుడు మాత్రమే ఓ కోమలిలో దాగిన కాఠిన్య హృదయాన్నో లేదా పసిడి వన్నెచాటున పొంచి ఉన్న నీలినీడలనో చూడగలం (వీళ్ల గురించి అసలు ఆలోచించకూడదనిపిస్తుంది).
మంచుపొర అడ్డు ఉన్నన్నాళ్ళూ కళ్ళ ముందు ఉన్నది ఎడారో.. పూలవనమో.. సంద్రమో.. తెలియదు కదా! ఇదీ అంతే.
చివరిమాట: ఇంతకు ముందు నేను రాసిన నిజసౌందర్యం ఊహించి రాసింది; కానీ ఇది మాత్రం అనుభవైక వేద్యమైనదే.
RTS Perm Link
వర్గములు: స్వగతం
రాసినవారు శ్రీనివాస on Monday, 5 of March , 2007 at 12:50 pm
ఇంతకు ముందు పనిచేసిన కంపెనీకి రోజూ వెళ్ళే ముందు పంజాగుట్ట జంక్షన్‌లో ఒక హోటల్‌లో ప్లేటు ఇడ్లీ తిని వెళ్ళడం అలవాటు. మనకి గునపాలతోనూ, పారలతోనూ (అంటే ఫోర్క్‌లూ, స్పూన్‌లన్నమాట) తినడం అలవాటు లేదు. ముందు ఏమీ పట్టించుకోకుండా తినేసేవాడిని. తర్వాత ఒక రోజు గబగబా తింటున్న నాకు పక్కనే తింటున్న ముసలతను కనిపించాడు. రెండు స్పూన్లతో ఇడ్లీని చీల్చి చెండాడుతున్నాడు. ఒకసారి చుట్టూ చూసా; ఒకడైతే దోశెని చిన్న చిన్న ముక్కలు చేసి సాంబారులో వేసి నానాకా స్పూన్‌తో లాగించేస్తున్నాడు. ఒకసారి ఆలోచించా. ‘ ఆ బొంగు! మన అలవాటు మనదిలే. వాడ్ని వీడ్ని చూసి మనం బాదపడడం దేనికి . ఓరి భగవంతుడా! కుడిచేతికి ప్రత్యామ్నాయంగా స్పూన్లని, ఫోర్కులని ఇచ్చావా తండ్రి’ అని అనుకుని చాలా రోజులు వెళ్ళబుచ్చా.
ఈ మధ్యే ఓ బజాకంలో ఉద్యోగం వచ్చింది. నా ఒంటికి పడని పనులన్నీ మొదలెట్టడ్డానికి సమయమొచ్చిందనుకున్నా. బూట్లేసుకోవడం, బెల్టు పెట్టుకోవడం, టై కట్టుకోవడం - ఇవి నాకు ఇష్టం లేనివి. కానీ తప్పదు కదా. జాయినయిన రోజు ఆవేశంతో టై కట్టుకెళ్ళిపోయా! అక్కడ నాలా జాయినవడానికి వచ్చిన వాళ్ళెవ్వరూ కట్టుకుని రాలేదు. పైగా వాళ్ళలో చాలా మంది కొంచెం పెద్ద కంపెనీల నుండి వచ్చిన వాళ్ళే. ఇంక అప్పటినుండి ప్రతీ సోమవారం నా పేంటు ఎడమ జేబును ఆ టైకి కేటాయించేసా! ఎప్పుడన్నా అత్యవసర పరిస్తితి వస్తే ఆ నాగులయ్యను మెడనేసుకుని శివయ్యనైపోవచ్చని నా ఆలోచన.
ఇక మధ్యాహ్నం భోజనం విషయానికొస్తే; అసలు ఇబ్బంది మొదలు. నా స్నేహితులనేవారు అలాంటీ బజాకంలలో మన ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించి అక్కడ అట్మాస్ఫియర్‍ని స్పాయిల్ చెయ్యడం దేనికి అని. ఇంక తప్పదు కదా; నెమ్మదిగా అలవాటు చేసుకోవడం మొదలుపెట్టా. నా చుట్టుపక్కల ఎవరన్నా చేత్తో తింటున్నా పట్టించుకోవడం లేదు. ఒకసారి ఓ పెద్దాయన (హోదాలో) చేత్తో కలుపుకుని తింటుంటే నేను ఆవేషపడ్డానని తెలుసుకుని నోరెళ్ళబెట్టా. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని అన్నారిందుకే మరి.
చెక్కభజన అన్న పదానికి అర్ధం ఇక్కడే తెలిసింది. మూడునెళ్ళ నుండి బెంచి మీంచి దించడంలేదు. మొత్తానికి రోజూ కంపెనీ నుండి బయటికిచ్చి టక్ పీకి, స్వైప్ కార్డుని జేబులోకి నెట్టెసి ఒక్కసారి గాలి పీలిస్తే గానీ మళ్ళీ మన లోకంలోకి వచ్చినట్టు ఉండదు.
RTS Perm Link
వర్గములు: స్వగతం