May 12, 2006
Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
————- శ్రీనివాస స్వీయ రచన ————-
ఓ ప్రియా…
వెన్నెల వాకిట నిలచిన నన్ను చీకటి మాటుకు చేర్చావు
నందనవనమున వేచిన నన్ను శిశిరపుజ్వాలై కమ్మావు
నీ తనువువిరికి హృదయతావి లేనప్పుడు నువ్వు అప్సరసవు కాదు
నీ కంటిచూపులో కరుణకాంతి లేనప్పుడు నువ్వు దేవతవూ కాదు
మరి నువ్వెవరివి ; నువ్వెవరివి…
నా జీవనరాగంలో దేవుడు పలికించిన అపశృతివి నీవు
నా ప్రణయయాగంలో ఎదను బలిగా కోరిన క్షుద్రిణివి నీవు
నా యవ్వనరాజ్యంలో నిశ్శబ్దమేలే మరుభూమివి నీవు
నా ఆశలసంద్రంలో కల్లోలిత సుడిగుండానివి నీవు
నా ఆశయమార్గంలో నీడనివ్వని టేకు చెట్టువు నీవు
నా ఊహలఊయలలో నిదురనివ్వని జోలపాటవు నీవు.
RTS Perm Link
May 10, 2006
Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
————- శ్రీనివాస స్వీయ రచన ————-
కన్నీటిచుక్క కన్నీటిచుక్క ఎక్కడ ఉంటావమ్మా నువ్వెక్కడ ఉంటావమ్మా…
కంటిపాపల చాటునా… గుండెలోయల మాటునా…
ఎక్కడ ఉంటావమ్మా… నువ్వెక్కడ ఉంటావమ్మా…
నువు తాకని కనుపాప ఉలి తగలని శిల కాదా…
నీ వెచ్చని కౌగిలితో ఓదార్పే జత కాదా…
ఎక్కడ ఉంటావమ్మా… నువ్వెక్కడ ఉంటావమ్మా…
ఈ మనసు మురిసే వేళలో ఆనంద బాష్పానివై…
ఇదే మనసు పొగిలే వేళలో వడగళ్ల వర్షానివై…
తడుపుతావే నిలువెల్లా; అణువు అణువు తడిసేలా…
ఎక్కడ ఉంటావమ్మా… నువ్వెక్కడ ఉంటావమ్మా…
RTS Perm Link
Apr 27, 2006
Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
————- శ్రీనివాస స్వీయ రచన ————-
నేనో బాటసారిని…
వెళ్తూ వెళ్తూ ఆగిపోయాను… ఒకటే దాహం…
నీటి కోసం వెతికీ వెతికీ అలుపొచ్చి నేల ఒడిలో వాలిపోయాను…
ఆకాశం ఉరుముతున్న శబ్ధం…
లీలగా ముఖంపై ఏవరో తడుముతున్న భావన…
అరకళ్ళతో చూడగా పురివిప్పి నెమలి నాట్యమాడుతుంది…
నా కోసం నేలతల్లి ఆకాశాన్ని బ్రతిమలాడిందట గుక్కెడు నీళ్ళివ్వమని…
తనలో కలుపుకునే వరకూ మనల్ని ఇలాగే కాపాడుతుంటుంది ఈ జనని.
RTS Perm Link