ఎన్ని వేల వర్ణాలో…

Archive for the ‘కలగూరగంప’ Category


ఓ చూపు చూడండి – 2

Sep 26, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
స్విష్ మాక్స్ ఉపయోగించి టెక్స్ట్ అఫెక్ట్స్‌ను చాలా సులభంగా చెయ్యొచ్చు. అదే మేక్రోమీడియా ఫ్లాష్ లో అయితే చాలా సమయం తీసుకుంటుంది. ఇక్కడ నేను రూపోందించినది స్విష్ లో సిద్ధంగా ఉన్న, నాకు నచ్చిన అఫెక్ట్స్ తో చేసినది. ఇది చూడడానికి తప్ప చదవడానికి ఇందులో పెద్ద విషయమేమీ లేదనుకోండి! ఓ చూపు చూడండి. ఓ సారి రాయి విసిరి చూడండి.

గమనిక: దీనిని కూడలిలో మీరు చూడలేకపోతే నేరుగా నా బ్లాగ్ లో చూడండి.

codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=5,0,42,0" id="LoveStory_Img" width="450" height="200" > type="application/x-shockwave-flash"
pluginspage="http://www.macromedia.com/go/getflashplayer"
name="LoveStory_Img"
width="450" height="200"
src="http://srinivasaraju.datla.googlepages.com/LoveStory-Img.swf"
bgcolor="#000000"
quality="high"
swliveconnect="true"
allowscriptaccess="samedomain" >
<br />

RTS Perm Link

జై జన్మభూమి

Sep 6, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప

ఆపాత మధుర జ్ఞాపకాల నెమరు; ఆరిపోబోయే గతస్మృతీదీపాలకు పోసే చమురు


నాకు దినచర్యలు రాసే అలవాటు లేదు. జరిగిన సంఘటనలు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోతాయి; కొన్ని మస్తిష్కంలో నిలిచిపోతాయి; మరి కొన్ని నా గుండెల్లో ఒదిగిపోతాయి. అలా గుర్తున్న వాటిలో కొన్ని ఇలా మీతో…


అవి నేను నర్సీపట్నంలో డిప్లోమో చదువుతున్న రోజులు. జనవరి నెలలో మా కళాశాలలోని అబ్బాయిలను కొంతమందిని జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చిన్నచిన్న పల్లెలకు పంపించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మేము ఎనిమిది మంది ముందుకు రావడంతో ఓ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని మూడు ప్రదేశాలకు పంపించడానికి సిద్ధపడ్డారు. నర్సీపట్నం అంటేనే ఏజెన్సీ ప్రదేశం; మరి అక్కడకు 10 కిలోమీటర్లు లోపలి పల్లెలు అంటే ఎలాగుంటాయో మీరే ఊహించుకోండి ఒకసారి! మమ్మల్ని అందరినీ ఓ జీపులో అక్కడ దించి మళ్ళీ వెళ్ళేటప్పుడు వస్తామంటూ అన్ని జాగ్రత్తలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ కాలక్షేపానికి ఓ పేకల కట్ట, ఓ టేప్ రికార్డర, ఓ బేటు-బాలు తీసుకెళ్ళాం.


మొదటి పల్లెలో మా బస ఓ ప్రాధమిక పాఠశాలలో. మాకోసం పాపం వాళ్ళు బాగా శుభ్రం చేసి ఇచ్చారు. తీరా చూస్తే ఆ గదికి విద్యుత్ సౌకర్యం లేదు. మా స్నేహితుడొకడు ఓ రెండు తీగలు సంపాదించి గది పక్కనే ఉన్న స్తంభం నుండి ఎలాగోలా విద్యుత్ ని రప్పించి గదిని సంగీతమయం చేసాడు. అప్పుడప్పుడు పేకాట ఆడేవాళ్ళం; ఇంకా బోర్ కొడితే అక్కడి పిల్లలను పోగుచేసి క్రికెట్ ఆడేవాళ్ళం. ఓ రెండు గంటల పాటు వెళ్ళిన పని చేసే వాళ్ళం. ఇళ్ళిల్లూ తిరుగుతూ వాళ్ళ వివరాలను – అంటే ఇంటి జనాభా; వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని మా దగ్గర ఉన్న ఫారంలో నింపేవాళ్ళం. ఉదయం నిద్రలేచి బయటకు వస్తే అంతా మంచు. ఓ ఐదడుగులు ఆవల ఏముందో కనిపించేది కాదు. అక్కడ పుట్టిన వణుకు నాకు మరెక్కడా అనుభవంలోకి రాలేదు! నాకేమో సాయంత్రం టీ తాగడం అలవాటు; కానీ అక్కడ 6 గంటలకే స్మశాన నిశ్శబ్దం. గుడ్డి దీపం రెపరెపలాడుతూ ఓ పాక మాత్రమే తెరచి ఉండేది ఆ సమయంలో. అదే నాకప్పుడు 5 నక్షత్రాల పూటకూళ్ళమ్మ ఇల్లు.



మూడు రోజులు సరదాగా గడిచిపోయాయి. మళ్ళీ వేరే పల్లెకు ప్రయాణం. ఉదయమే ఆ ఊళ్ళోకి అడుగుపెట్టాము. ఓ అరకిలోమీటరు నడక. మా గుంపులో దాదాపు అందరూ చమత్కారులే.అప్పుడు మేము కాలవ గట్టు మీదుగా వెళుతున్నాము. ఒకరు చెంబు పట్టుకుని మా పక్క నుండి వెళుతున్నాడు. నేను వెంటనే ‘అదేంటో తెలుసా’ అని అన్నాను. మా వాళ్ళు వెటకారంగా నవ్వారు. నేను వెంటనే ‘దాన్ని చెంబు షికార్ అంటారు’ అని అన్నాను. అందరూ నవ్వుకున్నారు. మావాడు మాలో ఒకడిని ‘నీకు ఈత వచ్చురా?’ అను అడిగాడు. దానికి వెంటనే వాడు ‘ఆ గునపం ఈత వచ్చురా’ అని అన్నాడు. ‘అదేం రకం ఈత’ అని అడిగేసరికి వాడు వెంటనే ‘గునపాన్ని ఈ కాలువలో పాడేస్తే అది ఎలా ఈత కొడతాదో అలగే నాకు వచ్చు’ అన్నాడు. ( పడ్డ వెంటనే మునిగిపోవడం అన్న మాట! ). ఈ సారి మాకు అక్కడి యమ్.పీ.టీ.సీ ఇంట్లో విడిది. అక్కడ చెప్పుకోవడానికి ఏమీలేవు గానీ ఓ ఎండు చేప కథ మాత్రం ఉంది.



అక్కడ మాకు తయారు చేసే భోజనాలు గురించి మేము ముందుగానే అడిగి తెలుసుకునే వాళ్ళం. ఎందుకంటే మాలో ఒకడు బ్రాహ్మణుడు; మరో ఇద్దరు విశ్వబ్రాహ్మణులు. కానీ మా శుద్ధ బ్రాహ్మణుడు మాత్రం మాంశాహారమంటే పడి చస్తాడు. మిగిలిన ఇద్దరూ కనీసం గ్రుడ్డును కూడా తినరు. అందుకే చాలా జాగ్రత్త తీసుకునేవాళ్ళం. కానీ ఒకసారి తేడా జరిగిపోయింది. ఓ పూట వేరే వాళ్ళు వంట చేసారు. వంకాయ కూర వండుతామంటే సరే అన్నాము. ఆ తర్వాత అందరూ కూర్చుని భోంచేస్తున్నాము. నేను తింటున్న కొంతసేపటికి నాకు ఎండుచేప ముక్క ఒకటి నోటికి తగిలింది. నేను తల పైకెత్తి చూసాను. అందరూ కుమ్మేస్తున్నారు. అప్పుడు ఆలోచిస్తే ఒక విషయం గుర్తుకు వచ్చింది; కొంత మంది వంకాయ కూరలో రుచి కోసం ఎండుచేప ముక్కలు వేస్తారని. ఇంకెవరికీ ఆ ముక్కలు రాకూడదని అనుకుని గుట్టుగా తినసాగాను. ఇంతలో మా శుద్ధ బ్రహ్మణుడు గట్టిగా అరిచాడు. ‘నాకు చేప దొరికింది, నాకు చేప దొరికింది’ అని. అంతే మిగిలిన ఇద్దరు విశ్వబ్రాహ్మణులు ఒక్కసారిగా అందరి వంక చూసారు.పాపం వెంటనే లేచి వెళ్ళి చెయ్యి కడిగేసుకున్నారు. ఇది తలచుకున్నప్పుడల్లా నవ్వొస్తూ ఉంటుంది.
ఆరో రోజుకల్లా ఓ ముగ్గురు అనారోగ్యంతో తిరిగి వెళ్ళిపోయారు. చివరిరోజు మానవహారం అనే కార్యక్రమం ఉంటుంది దానికి నాయకులొస్తారు ఉండమని కబురు పంపారు మా ఉపాద్యాయుడు. కానీ మాకు ఎవరూ సహకరంచకపోవడంతో మూడో పల్లెకు వెళ్ళకుండానే మా ఊరుకి తిరిగి వెళ్ళిపోయాం.

RTS Perm Link

నాలో నేను

Aug 31, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప

నన్ను బ్రతికిస్తున్నది ఎవరు? నన్ను నడిపిస్తున్నది ఎవరు? ఆ భగవంతుడి దీవెనలా ; నా తండ్రి అనురాగమా; నా తల్లి మమకారమా; నా స్నేహితుల అభిమానమా! ఏమో నాకివేమీ తెలియవు అప్పటి వరకు. నాలోని నాతో ఎప్పుడూ తర్జన భర్జనలే. నేను ఒకటి మంచిగా తలిస్తే వాడు చెడు అంటూ వెనుకాడతాడు; అదే నా మనసు కీడు ఉందని వెనుకాడుతుంటే వాడు మేలు ఉందని ముందుకు తోస్తుంటాడు. అనునిత్యం పెద్ద చిక్కొచ్చింది వాడితో. ఇక తట్టుకోలేక పోయాను. ఒక నిర్ణయానికి వచ్చాను. ఓ ప్రభాత వేళ వాడి కన్నా ముందే నేను మేల్కొన్నాను. వాడు గాఢ నిద్రలో ఉన్నాడు; బహుశా నాతో కలలో గొడవపడుతున్నట్టున్నాడు. వాడు లేవక ముందే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ ముందురోజు రాత్రే నిర్ణయించుకున్నాను. నాలో ధైర్యాన్ని మొత్తం కూడగట్టాను. నాలోని దృడ నిశ్చయాన్ని కత్తిగా మలచుకున్నాను. అంతే మనసారా కసాకసా నరికి పాడేసాను నాలోని వాడిని. రక్తం చిందించకుండా వాడిని పరలోకానికి పంపించేసాను.


అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. నాకప్పుడు లోకం అంతా కొత్తగా కనిపించసాగింది. అందరూ నవ్వుతూ పలకరిస్తున్నారు. నా జీవితమెందుకో నాకర్దమైంది. అమావాస్య రాతిరిలో కూడా వెలుగుని కాంచే చిత్తం నా వశమైంది.నా ప్రశ్నలకు జవాబు దొరికింది. నన్ను ముందుకు నడిపించేది నా ఆశయమని… రేపటి దారుల వైపు ఆశతో పయనం సాగించాలని… పక్కవాడితో కాకుండా నాతో నేనే పోటీ పడాలని… ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పాలంటే! ఈ జవాబులకి ప్రతిరూపాలేనేమో ఆ భగవంతుడి దీవెనలు; నా తండ్రి మమకారం; నా తల్లి అనురాగం; నా స్నేహితుల అభిమానం.
- శ్రీనివాస స్వీయరచన

RTS Perm Link

అమరజీవి

Aug 28, 2006 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప

అతన్ని మృత్యువు తరుముతుంది. ఎంత దూరం పరిగెడుతున్నా ఒక్క క్షణమైనా ఆపకుండా తరుముతూనే ఉంది. తనవాళ్ళకు దూరమైపోతున్నాననే దిగులు ఒకవైపు… జీవితంలో ఎంతో సాధించాల్సింది ఉందే అనే బాద మరోవైపు… తనలాగే ఎందరినో అదే మృత్యువు తరుముకుంటూ వస్తోంది… తనలాగే పాపం ఎంతో మంది యవ్వనంలోనే బలైపోతున్నారు… తన ఒంటిని ఇప్పుడిప్పుడే నిస్సత్తువ ఆక్రమించుకుంటుంది… ఎక్కడో దూరంగా ఉంటూ శోకిస్తున్న తనవాళ్ళని ఒక్కసారి తనివితీరా చూసాడు… ఏ క్షణంలోనైనా తన మెడకి యమపాశం చుట్టుకోవచ్చని అతను తెలుసుకున్నాడు… ఇంతలో కళ్ళ ముందు మరో దృశ్యం ప్రత్యక్షమయ్యింది… ఎందరో అభాగ్యులు కళ్ళులేక, గుండె సరిగ్గా కొట్టుకోలేక, ఎన్నో అవయవాలు సరిగ్గా పనిచేయలేక… భవిష్యత్తు వైపు నిస్తేజంగా కదులుతున్నారు…అకస్మాత్తుగా అతనిలో ఏదో మార్పు… పరిగెడుతూనే తన దేహంలో ఒక్కో భాగాన్ని త్యజించడం మొదలుపెట్టాడు… చివరికి చిధ్రమైన దేహాన్ని మృత్యువుకు అర్పించుకున్నాడు. ఆకాశంలో కలిసిపోతూ ఒకసారి నేలవైపు చూసాడు… ఒకరి కళ్ళలో, వేరొకరి గుండెలో మరొకరి రుధిరంలో అతను సజీవుడై కనిపించాడు… వాళ్ళ తల్లిదండ్రుల దీవెనలతో వర్ధిల్లుతూ కనిపించాడు… ఇంతకీ అతడిని మృత్యువు జయించలేకపోయింది కదూ!
- శ్రీనివాస స్వీయరచన

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం