ఎన్ని వేల వర్ణాలో…

కలగూరగంప-1

Feb 27, 2007 Author: శ్రీనివాస | Filed under: కవితలు

Gampa01.jpgకన్నీటి చెలమలలో కష్టాల నేస్తాలు సేదతీరేలా పొగిలి పొగిలి ఏడ్చేస్తాను…
తిష్టేసి కూర్చున్న బాదల చుట్టాలు పారిపోయేలా పగలబడి నవ్వేస్తాను…

****

నా వెనక గోతులు తీసేవాళ్ళను చూస్తే జాలి…
పడిపోతారేమో వాటిలో పాపం వాళ్ళే ఖర్మకాలి…
నా ముందు నీతులు చెప్పేవాళ్ళను చూసినా జాలే…
ఏమౌతారో వాళ్ళు చెప్పినవి పాటించాల్సి వస్తే వాళ్ళే…

****

మా నాన్న చదివెన్ ఏడో తరగతి…
మా అమ్మ చదివెన్ మూడో తరగతి…
మొత్తానికి ఇద్దరూ కలిసి పూర్తిజేసెన్ పదోతరగతి… 

****

తాత విత్తు నాటి నీరు పోసాడు…
నాన్న కాపు కాసి మొక్క పెంచాడు…
కొడుకు నీడ కోరి చెట్టు చేరాడు…
ఎవడో కబ్జాదారుడు ఆ సరికే సేదతీరుతున్నాడు… 

****

అందరూ వదిలిపోయారు నన్ను…
నేను ఏకాకిని ఇప్పుడు…
తల్లి, తండ్రి, చెల్లి, ఆలి…
హితులూ, స్నేహితులూ, బందువులూ…
నిర్ధాక్షిణ్యంగా, నిర్వేదంగా…మూకుమ్మడిగా…
ఈ ఆరడుగుల సామ్రాజ్యానికి నన్ను రాజుని చేసి వెళ్ళిపోయారు…
నేను ఏకాకిని ఇప్పుడు… 

RTS Perm Link

ఈ మధ్యన దృపాల్‌లోని ఒక అందమైన థీమ్‌ని వర్డ్‌ప్రెస్ వాళ్ళు మక్కికిమక్కి దించేసారు. గార్లాండ్ అనే ఈ థీమ్ చాలా మంది బ్లాగర్లను ఆకట్టుకుంది.  దీనిలో మనకిష్టమైన విధంగా రంగులను మార్చుకోవచ్చు. కానీ ఈ రూపలావణ్యాన్ని ప్రస్తుతానికి వర్డ్‌ప్రెస్  డొమైన్‌లోని బ్లాగులకే పరిమితం చేసారు; ఎక్కడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇవ్వలేదు.

Garland-Theme.jpg

నా పాత బ్లాగులలో ఒక దానిని దీనితో అల‍కరించాను. చాలా బాగుంది. మీరూ ప్రయత్నించి చూడండి. తప్పకుండా నచ్చుతుంది.

 Dhananjaya-Garland.jpg

RTS Perm Link

కాంతా కుంతలం

Dec 4, 2006 Author: శ్రీనివాస | Filed under: గత స్మృతులు


నా స్నేహితుడొకడు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి గ్రాండ్‌బే హోటల్ లో ట్రైనీగా చేరాడు. సాధారణంగా విశాఖపట్నంలో సినిమా షూటింగులేవైనా ఐతే సినీ సిబ్బందిలో ముఖ్యమైనవారు ఏదన్నా ఐదు నక్షత్రాల పూటకూళ్ళ ఇంటిలో దిగుతారు. అలా ఓ సారి నటి సిమ్రాన్ మావాడూ పనిచేసే గ్రాండ్బే లో దిగింది. ఆవిడ లేనప్పుడు మావాడిని ఆమె గదిలోకి వెళ్ళి అన్నీ సర్ది రమ్మని చెప్పాడు మేనేజరు. మావాడు వెళ్ళి చెప్పిన పనులన్నీ చేసి వచ్చేటప్పుడు టేబుల్ మీద కనిపించిన ఒక జడ బ్యాండుని జేబులో వేసుకున్నాడు.



నేను మా వాడిని కలిసినప్పుడు తను చేసిన ఘనకార్యం చెప్పాడు. ఆ బ్యాండులోంచి ఓ వెంట్రుకని తీసి నాకు ఇచ్చాడు. నాకు దాన్ని ఏక్కడ దాచాలో తెలియలేదు. చివరికి నా దగ్గర ఉన్న రేనాల్డ్స్ పెన్ తెరచి ఓ కొసని రీఫిల్‌లో ఉంచి మిగిలిన దాన్ని రీఫిల్ చిట్టూ చుట్టాను.



ఆ మర్నాడు మా క్లాస్‌లో ఏదో బోరు కొట్టించే పాఠం చెబుతున్నారు. నేను సరదాగా మా సహ విద్యార్దులకు ఆ కుంతలాన్ని చూపించాలనుకున్నాను. సిమ్రాన్‌ది అని చెబితే మావాళ్ళు వెటకారమాడతారని దాన్ని నా ప్రేయసి తల వెంట్రుక అని చెప్పి వాళ్ళకి చూపించాను. ఇంతలో మావాడొకడు దాన్ని లాక్కున్నాదు. అది కింద పడిపోయింది. ఇంకెందుకని వాళ్ళతో నిజం చెప్పేసాను. వాళ్ళూ నేల మీద వెతకారు; కనిపించలేదు. క్లాస్ అయిపోగానే ల్యాబ్‌కి వెళ్ళాలి. ఇంక చేసేదిలేక అందరూ ల్యాబ్‌కి వెళ్ళిపోయాం. తర్వాత ఆ సంగతి మర్చిపోయా. నిన్న ఆ గ్రాండ్‌బే స్నేహితుడికి ఫోన్ చేసినప్పుడు ఈ విషయం గుర్తొచ్చి, చాలా రోజులకి మళ్ళీ ఇలా సమయం కలిసొచ్చి ఇది రాస్తున్నాను. మా ఆంధ్రా యూనివర్సిటీ చుట్టుపక్కల ఎక్కడ దాగిపోయెనో ఆ కాంతా కుంతలం.

RTS Perm Link


సాధారణంగా వెబ్ పేజీలలో ఉన్న forms (ఇక్కడ లాగిన్ పేజ్ అని నా ఉధ్దేశ్యం) లో password అనే field లో మనం ఏం టైప్ చేసినా ప్రతీ అక్షరం చుక్కగా కనిపిస్తుంది. అక్కడనుండి ఏదైనా కాపీ చేద్దామన్నా వీలుకాదు. వాటిని చూడాలంటే SeePassword వంటి సాఫ్ట్‌వేర్స్ ని install చేసుకోవాలి. కానీ చిలిపి జావాస్క్రిప్ట్ వెబ్‌బ్రౌజర్‌లలో మాత్రం ఈ పనిని సులభతరం చేస్తుంది. మీరు చేయవలసిందల్లా జావాస్క్రిప్ట్ ని సపోర్ట్ చేసే బ్రౌజర్ దేనిలోనైనా యహూ, జీమెయిల్ పాస్‌వర్డ్‌ fieldలో ఏదన్నా టైప్ చేయండి. తర్వాత బ్రౌజర్ అడ్రస్ బార్ లో ఈ క్రింది జావాస్క్రిప్ట్ ని పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి.

యాహూ మెయిల్ అయితే

javascript:alert(document.getElementById(“passwd”).value)

జీ మెయిల్ అయితే

javascript:alert(document.getElementById(“Passwd”).value)


అందుకే నెట్ కేఫ్స్ నుండి బయటికి వచ్చేముందు అన్నింటినీ శూన్యం చేసి రండి.

———-

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం