Oct 3, 2006
Author: శ్రీనివాస | Filed under: చిట్టిబాబు
చిట్టిబాబు కాలేజీలో చేరాడు. తను చిన్నప్పటి నుండీ తెలుగు మీడియమే. ఇప్పుడేమో ఇంగ్లీష్ మీడియమాయె! అదో పెద్ద తలనొప్పి. కాలేజీ తొలి రోజులలో ఎదో ఓ మూల నక్కి నక్కి కూర్చునేవాడు. కొన్ని రోజులకు తన లాంటి వాళ్ళు అక్కడ కొంత మంది ఉన్నారని తెలుసాకా కాస్త ధైర్యం వచ్చింది చిట్టిబాబుకి. నెమ్మది నమ్మదిగా అందరూ పరిచయం అయ్యారు. ఇక విజృంభించడం మొదలుపెట్టాడు. ఖాళీ దొరికినప్పుడల్లా కేంటిన్ లో ఓ గుంపుతో కనిపించేవాడు. అసలే అందగాడు; పైగా మాటకారి. అందరినీ మాటలతో మైమరిపించేవాడు. అందుకే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు అతడికి స్నేహితులైపోయారు.
అందరి ముందు తనకున్న తెలుగు పాండిత్యాన్నంతా చూపించేవాడు. ఎవరన్నా ఏదైనా మాట్లాడితే చాలు, వెంటనే అక్కడి సన్నివేశానికి తగ్గ వేమన పద్యమో, మరేదైనా సెటైరో వేసేస్తాడు. ఎవరితో ఎలా ఉన్నా రజనితో మాత్రం చాలా అణకువగా ఉండేవాడు.తన స్నేహితులు కొందరికి రజనిని తను తెగ ప్రేమించేస్తున్నట్టు గొప్పగా చెప్పేవాడు . కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. రజని మాట్లాడితే చాలు అన్నీ ఇంగ్లీషు ముక్కలే. అందుకే భయపడి ఆమె ముందు ఏమీ మాట్లాడడని అందరూ లోపల అనుకుంటారు.
ఇలా అందరూ కూర్చుని ఉన్నప్పుడు రజని కోసం ఒకడు వచ్చేవాడు . కొత్తలో ఒకసారి ‘హి ఈజ్ మై కజిన్‘ అని పరిచయం చేసింది అందరికీ. మనోడు ఎప్పుడూ బైక్ మీద వచ్చేవాడు. అందరి వంక చూసి ‘మై కజిన్ హేజ్ కం; అయామ్ లీవింగ్. బై‘ అంటూ వెళ్ళిపోయేది. చిట్టిబాబు మాత్రం ‘ఎంటో బామ్మరిది ఎప్పుడూ సీరియస్ గా ఉంటాడు. మనికిలాంటివి పడవు కదా, అందుకే తనకి పరిచయం చెయ్యడం లేదేమో‘ అని మనసులో అనుకునేవాడు. ఎప్పుడు రజనికి తన ప్రేమ సంగతి చెబుదామా అని తెగ ఆలోచించేవాడు
వేలంటైన్స్ డే వచ్చింది. రజనితో ఆ విషయం చెప్పడానికి చిట్టిబాబు ముహూర్తం పెట్టాడు. ఆ రోజు సాయంత్రం అందరూ క్లాస్ బయటకు రాగానే జంట కుదురిన వాళ్ళు బై చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇక టైమ్ వేస్ట్ చెయ్యడం ఎందుకని చిట్టిబాబు రజనితో ‘నీతో పర్సనల్ గా మాట్లాడాలి; ఇప్పుడు మాట్లాడుకుందామా‘ అని అన్నాడు. ‘ఆ‘ అని రజని అన్నాదో లేదో గానీ, ఓ బైక్ వచ్చి పక్కనే సడన్ బ్రేక్ వేస్తూ ఆగింది. కజిన్ ని చూడగానే రజని ముఖం వెలిగిపోయింది. ‘వీడొకడు పానకంలో పుడకలాగ. బామ్మరిదిని వెళ్ళిపొమ్మను. నేను డ్రాప్ చేస్తాలే‘ అని విసుక్కున్నాడు చిట్టిబాబు. ‘బామ్మరిది కాదు ఆయన మా బావ‘ అంటూ బైక్ మీద కుర్చుని బావని (కజిన్) గట్టిగా పట్టుకుంది. వాడు గేర్ మార్చి వెళ్ళిపోయాడు. ఒక్కసారి చిట్టిబాబు గుండె గుబేలుమంది. అయినా అందరి ముందు గంభీరంగా కనిపించాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఓ మూలన బూజు పట్టి ఉన్న డిక్షనరీలో కజినంటే ఏంటో వెదికడు. తను ఇప్పటి వరకు కజిన్ అంటే అన్నో తమ్ముడో లేక అక్కో చెల్లో అవుతారని అనుకున్నాడు. ‘వార్ని! పిల్ల జెల్ల కొట్టి పోయిందని అనుకున్నాను. ఇప్పుడు నేను ఎదవనయ్యాను. ప్చ్. నేను తెలుగులో అందరినీ అదరగొడుతుంటే ఇది నన్నే ఇంగ్లీషుతో బురిడీ కొట్టించింది. ఈ ఇంగ్లీష్ వరసలేంటో‘ అంటూ మంచంమీద కూలబడ్డాడు. పాపం చిట్టిబాబు!
ఈ రోజే తెలిసింది బ్లాగూ నీ విలువ… అని పాడుకోవాలనిపిస్తుంది.
సాధారణంగా నేను రాసేవాటిని నా బ్లాగులో ప్రచురిస్తాను. వేరే ఏ సైటుకి పంపను. క్రిందటి ఆదివారం తెలుగుబ్లాగ్ సభ్యులతో కలిసి తెలుగు సాహితీ ప్రేమికుల సమావేశానికి వెళ్ళాను. అక్కడ తెలుగు పీపుల్ డాట్ కామ్ గురించి విన్నాను. అక్కడ సమావేశమైన వాళ్ళు చాలా మంది అందులో సభ్యులట. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఆలోచించాను; సరదాగా ఏదన్నా తెలుగుపీపుల్స్ లో ప్రచురించడానికి పంపించాలనుకున్నాను. అసలు టీపీ ఎలా ఉందోనని చూసా; చిన్న కథలని, నవలలని, కవితలని రకరకాలు. అమ్మో ఎన్ని విభాగాలో! మనం బ్లాగులో రాసేవి మనకు ఇష్టం వచ్చినట్టు రాస్తాం. ఏదన్నా అనుభవం గానీ, అనుభూతి గానీ పొందినప్పుడు లేదా పాతది ఏదన్నా గుర్తుకు వచ్చినప్పుడు, దానిని మనకి ఏ రూపంలో వీలుగా ఉంటే అలా రాసి బ్లాగులో పెట్టేస్తాం. దానికి పరిమితులు ఉండవు. కానీ ఏవైనా సైట్స్ కి పంపాలంటే కొన్ని పాటించాల్సి వస్తుంది. నా బ్లాగులో నుండి పాతది ఏదైనా తీసుకుని పంపిద్దామని వెతికా. కానీ ఏ విభాగానికి పంపించాలో సందిగ్ధత. చివరికి చిన్నకధల విభాగంకి నా నిజ సౌందర్యం ని పంపిచాను. అది వెళ్ళిందో లేదో అని ఒక చిన్న సందేహం. ఈసారి నా రాతి హృదయం ని పంపించాను. ఓ రెండు రోజుల తర్వాత నిజ సౌందర్యం ప్రచురించామని టీపీ నుండి మెయిల్ వచ్చింది. http://telugupeople.com/discussion/article.asp?id=45793 .
దాన్ని చూసాను, పరవాలేదు ఏదీ మార్చకుండా ఉన్నది ఉన్నట్టే దించేసారు. ఓ రోజు తర్వాత ఎవరో తమ అభిప్రాయాన్ని రాసారు అని మెయిల్ వచ్చింది. వెంటనే వెళ్ళీ చూసా. సాదారణంగా బ్లాగులో అయితే బాగుందనో లేక బాగోలేదనో తెలుపుతారు. అక్కడ రాసింది చూస్తే నాకు నవ్వొచ్చింది. నేను రాసింది చాలా చిన్నదన్నారు గానీ అసలు బాగుందో లేదో చెప్పలేదు. ఇంకా మిగిలినవారు రాసింది చూస్తే అబ్బో వెటకారం. ఇంకా సంతోషం ఏదన్నా కవితని పంపించలేదు; అది కవిత కాదని పచ్చిగా తిట్టినా తిట్టగలరు. బతికిపోయా!
ఇలాంటి అనుభవమే నాకొకసారి ఇంతకు ముందు ఎదురైంది. రెండు సంవత్సరాల క్రితం ఓ రెండు రోజులు ఫిల్మ్ నగర్ లో తిరిగి తిరిగి ఓ నిర్మాతను పట్టుకున్నాం. ఓ రెండు కధలు వినిపించాను. అబ్బే తనకి ఇవి నచ్చలేదన్నాడు ఆ నిర్మాత. ఏదన్నా యాక్షన్ కధని వెంకటేష్ కి రాసి తీసుకురమ్మన్నాడు. మళ్ళీ నేను అటు వైపు చూడలేదు. పాపం మా బావ(ఆర్కుట్ బంధం) ఇందుకూరికి కూడా అలానే జరిగింది. తాను రాసింది ఈనాడుకి పంపిస్తే 50 శాతం కి పైగా మార్చేసారంట! ఎదేమైనా బ్లాగు బాగేనండీ. మనసారా రెండు ముక్కలు రాయొచ్చు, లేదా వ్యాసాలకు వ్యాసాలు రాయొచ్చుస్వేచ్ఛగా.
ఇహ ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ఇక ఏది రాసినా నా మానసపుత్రిక అయిన బ్లాగులోనే రాద్దామని.
స్విష్ మాక్స్ ఉపయోగించి టెక్స్ట్ అఫెక్ట్స్‌ను చాలా సులభంగా చెయ్యొచ్చు. అదే మేక్రోమీడియా ఫ్లాష్ లో అయితే చాలా సమయం తీసుకుంటుంది. ఇక్కడ నేను రూపోందించినది స్విష్ లో సిద్ధంగా ఉన్న, నాకు నచ్చిన అఫెక్ట్స్ తో చేసినది. ఇది చూడడానికి తప్ప చదవడానికి ఇందులో పెద్ద విషయమేమీ లేదనుకోండి! ఓ చూపు చూడండి. ఓ సారి రాయి విసిరి చూడండి.
గమనిక: దీనిని కూడలిలో మీరు చూడలేకపోతే నేరుగా నా బ్లాగ్ లో చూడండి.