ఈ రోజు హైదరాబాదులో జరిగిన పుస్తక ప్రదర్శనలో e-తెలుగు ఏర్పాటుచేసిన స్టాలులో మధ్యాహ్నం నుండి నేను కూడా ఉన్నాను. మేము కరపత్రాలు పంచాము. చాలా మంది ఆశక్తి చూపించారు. వాళ్లలో కొందరు కంప్యూటర్‌లో తెలుగు కనిపించాలంటే డబ్బిచ్చి ఏదన్నా సాఫ్ట్‌వేర్ కొనుక్కోవాలేమో, దానికోసమే మేము అక్కడ ఉన్నామేమో అనే అపోహలో ఉన్నారు. మేము వాళ్ల సందేహాలు తీరుస్తూవచ్చాం. తెలుగు బ్లాగరులు కూడా ఎక్కువే వచ్చారు (అంటే నా దృష్టిలో ప్రతినెలా సమావేశానికి వచ్చేవారికన్నా ఎక్కువ అని). సాయంత్రం ఆరు గంటలు దాటాకా e-తెలుగు సంఘం ప్రదర్శన ప్రారంభమయ్యింది. ప్రదర్శనలో భాగంగా కంప్యూటర్‌లో తెలుగు ఎనేబుల్ చెయ్యడం ఎలా? బ్లాగంటే ఏమిటీ? బ్లాగుని ఎలా సృష్టించుకోవాలి? ప్రస్తుతం ఉన్న కొన్ని బ్లాగుల వివరాలు, వికీపీడియా గురించి, ఈమాట, పొద్దు లాంటి వెబ్ పత్రికల గురించి, వివిధ వెబ్‌సైట్ల స్థానికీకరణ గురించి చెప్పి ఆ విషయాలనే వీడియో రూపంలో చూపించడం జరిగింది. ఒకటో రెండో టీవీ ఛానళ్ల వాళ్ళు కార్యక్రమాన్ని వీడియో తీసుకున్నారు. పత్రికల వాళ్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పనుల హడావిడిలో పడి అక్కడకు వచ్చిన మిగిలిన బ్లాగరులతో మాట్లాడటం కుదరలేదు. ముఖ్యంగా అక్కడకు వచ్చిన కొందరు మహిళా బ్లాగరుల పేర్లు తెలియదు
. అందుకే ఈ జాబులో ఎవరి పేరూ ప్రస్తావించకుండా కేవలం బ్లాగర్లు అని సంభోదిస్తున్నాను. ఎవరూ ఏమీ అనుకోకండేం. ఇక్కడ నా అనుభవాలను, అనుభూతులను ఒక బ్లాగరుగా రాసున్నానంతే. మరిన్ని వివరాలకు త్వరలో e-తెలుగు నుండి వచ్చే టపాలో చూడండి.
మరో రెండు ముఖ్య విశయాలు:
* నిన్ననే రావు వేమూరి గారి బ్లాగులో తెలుగు ఎందుకు? అన్న టపాలో “మనకి నిజానికి కావలసినది ప్రాచీన హోదా కాదు – ఆధునిక హోదా కావాలి” అన్న మరువమ్ము*ని చదివాను. e-తెలుగు ప్రదర్శనలో మాట్లాడుతూ ఈ మాటని కూడా మనవాళ్లు ప్రస్తావించారు. కార్యక్రమం అయ్య్యాక స్టాలు వద్దకి సినీరచయిత జే.కే భారవి గారు వచ్చి “ఆధునిక హోదా రావాలి అని మీరన్న మాట అదిరింది” అని సంతోషిస్తూ వెళ్ళారు.
* ప్రముఖ ఇంద్రజాలకులు, మానసిక వైద్య నిపుణులు బీవీ పట్టాభిరాం గారు వచ్చారు. ఆయనకి e-తెలుగు గురించి, ఇంటర్నెట్లో తెలుగు గురించి తోటి బ్లాగరులు వివరించారు.
కొసమెరుపు:స్టాలుకి వచ్చిన ఒకాయనకి కరపత్రం ఇచ్చాను. ఆయన కూడా ఉన్న ( ఆరు సంవత్సరాలు ఉండొచ్చు ) పిల్లాడికి కూడా ఇచ్చాను. ఆ పిల్లాడు పత్రంలోని తెలుగుని చూసి “డాడీ నాకు తమిళ్ రాదు” అంటూ తన తండ్రి వంక అయోయంగా చూసాడు. నాకప్పుడు తలని గోడకేసి “పేడ పేడ” అంటూ కొట్టుకోవాలనిపించింది.
మరువమ్ము: ఎవరన్నా ఏదన్నా ఒకమాట చెప్పారనుకోండి; ఆ మాట మనకి చాలా నచ్చిందనుకోండి; ఆకట్టుకున్నదనుకోండి; బాగా గుర్తుండేలా ఉందనుకోండి, ఆ మాటకి మరువమ్ము అని నా సొంత ప్రయోగం.

వేదిక మీద e-తెలుగు సభ్యులు/బ్లాగరులు

e-తెలుగు స్టాలు ముందర సభ్యులు/బ్లాగర్లు

e-తెలుగు స్టాలులో సభ్యులు/బ్లాగర్లు
వరంగల్‌లో జరిగిన రెండు దుర్ఘటనలకు బ్లాగులలో చాలా మంది బాగానే స్పందించారు.
నట్టడవులు నడివీధికి నడిచొస్తే ఇంతే!
ఇదా పరిష్కారం!!
మీడియా చేయించిన హత్యలు
You oughtta do it స్వప్నికా!
అసలు నేరస్తులు
ఆటవిక న్యాయం అమలైంది!
ఇదేనా న్యాయం అంటే??
ఎన్‌కౌంటర్
చంద్రునికో నూలుపోగు అనుకోండి… తిలాపాపం తలాపిడికెడు అనుకోండి… ఇదిగో…
నేను టీవీ చూడడం తక్కువ. పేపరైనా ఏదన్నా బుద్దిపుట్టినప్పుడు మాత్రమే ఆన్లైనో తిరగేస్తుంటాను. నేను ఉదయం ఆఫీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా ఏదన్నా చర్చించుకుంటే తప్ప నాకు నూతి బయట ఏం జరిగిందో తెలియదు. ఈ విషయమూ అలాగే తెలిసింది. ఆఫీసులో చేస్తున్న పని మీద విసుగు కలిగి దగ్గర్లో ఉన్న సహోద్యోగి దగ్గరకు వెళ్ళినప్పుడు గానీ నాకు ఈ యాసిడ్ వార్త తెలియలేదు. ఇలాంటప్పుడు మామూలుగానే మగాడిలా కాకుండా మనిషిలా భాదపడ్డాను. ఆ వ్యక్తి మీద చాలా కోపం వచ్చింది. వేరే దేశాల్లో అమలవుతున్నట్టు కన్నుకి కన్ను పన్నుకి పన్ను శిక్ష వేసెయ్యాలి వీళ్ళకి అన్నంత కోపంవచ్చింది. ఆ పక్కనే ఒక అమ్మాయి కూర్చుంటుంది. ఆ విషయమై జరిగిన చర్చలో వీళ్ళని చంపేస్తే గానీ ఇలా చేసేవాళ్ళకు బుద్దిరాదు అన్న మాటలు వినిపించాయి. కానీ ఒకరు ఇలా మారడానికి వారు వ్యక్తిగతంగా సగం కారణమైతే వారి తల్లిదండ్రులు, స్నేహితులూ మిగిలిన సగం కారణమవుతారనే భావన ఎప్పటి నుండో నాలో మెదులుతూ ఉంది.
బ్లాగర్ల దినోత్సవం రోజు మధ్యాహ్నం సమావేశానికి వెళ్ళేముందు ఒకసారి కూడలిని తెరచి చూసాను. అక్కడ మొదట కనిపించిన చదువరి గారి జాబు చదివితే గానీ రెండో దుర్ఘటన విషయం తెలియలేదు. అప్పుడే ఈనాడు పత్రిక తెరిచి చదివాను అసలు విషయం. ఇంతకు ముందు ఆ వ్యక్తి మీద కలిగిన కోపం ఇప్పుడు పోలీసుల మీద కలిగింది. ఆ రాత్రి తీరికగా కూర్చుని మిగిలిన బ్లాగరులు రాసిన జాబులను చదివాను. ఇక్కడ ఆ అమ్మాయి అబ్బాయిల వ్యక్తిగత విషయాలు కాదు మనం ఆలోచించాల్సింది. నువ్వు మనిషిగా ఎలా స్పందిస్తున్నావు. తల్లిగానో, తండ్రిగానో, అన్నగానో, అక్కగానో నీ బాద్యత ఏమిటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకునే సమయమిది. మనం ఆలోచించాల్సింది ఏది మంచి ఏది చెడు అని. అంతేగానీ మనలోని అక్కసుని వెల్లగక్కుకునే సమయం కాదిది. ఇగోలని ఇగో అని చూపించే సమయం కాదిది.
నాలో పేరుకుపోయిన బద్ధకాన్ని విదిలించి మరీ ఈ జాబు రాయడానికి రెండు ముఖ్యకారణాలున్నాయి.
1) ఈ ఆదివారం ఈ విషయం మీద పేపర్లో వార్త చదువుతున్నప్పుడు “శనివారం వరంగల్‌లో ఎస్పీ సజ్జనార్‌కు విద్యార్థినుల అభినందనలు” అన్న ఛాయాచిత్రం
2) విశాఖ డైలీ బ్లాగులో ఒకాయన రాసిన వ్యాఖ్య మరీ బాదపెట్టింది.
నేను ఆ దాడి చేసిన వాళ్ళను సమర్థించను. అలా అని పోలీసుల ఎన్‌కౌంటర్‌నూ సమర్థించలేను! చదువరిగారన్నట్టు ఇలాంటి సంఘటనల వల్లనైనా కనీసం రిహార్సల్స్ చేసి మరీ ఇలాంటి అకృత్యాలకు పాల్పడేవాళ్ళు ఆలోచించగలిగితే/భయపడితే నా తమ్ముడో, చెల్లో, కూతురో, కొడుకో, స్నేహితుడో, స్నేహితురాలో ఇలా మన బ్లాగుల్లో చర్చనీయాంశానికి పావులుగా కాకుండా ఉండగలరు.
“నీ స్మృతుల గజ్జెలు కరాళనృత్యం చేసే వేళ, ఓ ప్రాత:జ్ఞాపకం కపోతమై తన రెక్కల చప్పుడు వినిపించింది…
కొన్ని ఘడియలు నన్ను నీనుండి విముక్తుడిని చేసింది”
ఆ రోజు దసరా కావడం వలన వచ్చిన సెలవును వినియోగించుకుంటున్న ఓ బద్దకస్తుడిని నేను. ఉదయం పదిన్నరవుతుంది. నిద్ర మత్తులోంచి కొంచెం కొంచెం బయట పడుతుంటే; గుర్తుకు రాకూడని వారెవరో తలపుకొచ్చి సతమతమవుతుంటే; ఫోను మోగడం మొదలుపెట్టింది. ఈ రోజూ ఏకాంతంగా గడుపుదాం అనుకుని ఫోను స్విచ్చాఫ్ చేద్దాం అనుకునేలోగానే అది మోగడం మొదలెట్టింది. అదేదో తెలియని నెంబరు. కట్టేద్దామనుకుంటూనే అప్రయత్నంగా పచ్చ బటను నొక్కేసాను. అది నా డిప్లొమో క్లాస్‌మేట్ భాస్కర్ నుండి వచ్చింది. వాడూ నేనూ ఎప్పుడన్నా ఫోనులోనే మాట్లాడుకుంటున్నాం కానీ చూసి చాలా రోజులయ్యింది. “ఏరా, మన డిప్లొమో క్లాస్‌మేట్స్ ఓ పది మందిమి ఇప్పుడు లుంబినీ పార్క్‌లో కలుసుకున్నాము. నువ్వు వస్తావా” అని అడిగాడు. వస్తానని చెప్పాను వాడితో. ఎప్పుడో 11 ఏళ్ళ క్రితం చూసాను వాళ్ళని. ఎలా ఉంటారో అని ఊహిచుకుంటుంటే ఏవరూ గుర్తుకురావడం లేదు. ఒంటి గంటకు లుంబినీ చేరుకున్నా. దూరం నుండి చూస్తే అక్కడ భాస్కర్ ఒక్కడే గుర్తున్నాడు. దగ్గరకు వెళితే కొంత మందిని పోల్చుకోగలిగాను. వాళ్ళ పేర్లు మాత్రం గుర్తుకు రావడంలేదు. వాళ్ళకి మాత్రం నా పూర్తి పేరూ, నా రోల్ నంబరు కూడా గుర్తుంది. నేనిలా గజనీలా మారిపోయినందుకు నాకే చాలా సిగ్గనిపించింది. అప్పట్లో అందరితోనూ కలివిడిగా ఉండేవాడిని కాదు (ఇప్పుడు కొంచెం నయం). నా రూము, నా క్లాసు అంతే. అక్కడ చదువు ముగిసాకా విడిపోతున్నప్పుడు అందరూ అందరి చిరునామాలు తీసుకున్నాము. ఆ కాయితం కాలక్రమంలో కనిపించకుండా పోయింది. అప్పట్లో ఈమెయిలూ సొల్లుఫోనులూ ఉండేవికావు. ఆ తర్వాత ఓ ఇద్దరితో మాత్రమే పరిచయం కొనసాగింది.
ఇప్పుడు చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పండగ పూట వాళ్లంతా శ్రీమతుల అనుమతితో ఓ రెండు గంటలు బయటికి వచ్చారు. మధ్యాహ్నం దాటిపోతుండడంతో అందరం అమీరుపేటలోని కాకతీయకు చేరుకుని భోంచేసి మాటల్లో పడ్డాము. మళ్ళీ జనవరి 25న కలుద్దామని నిశ్చయించుకున్నాము. వాన మొదలవ్వడంతో కొందరు తడుస్తూనే బయలుదేరిపోయారు. మిగిలినవాళ్లం వాన తగ్గేదాకా పిచ్చాపాటి మాట్లాడుకుని సెలవు తీసుకున్నాం.



రాత్రి పది దాటింది..
నిర్మానుష్యంగా ఉన్న రాదారి…
అప్పుడే క్యాబ్ దిగి సందులో ఉన్న తన రూం వైపు అడుగులు వేస్తున్నాడు మధు.
జేబులోంచి సిగరెట్ తీసి వెలిగిస్తున్నాడు… అకస్మాత్తుగా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యింది ఓ రూపం.
పెరిగిన గడ్డంతో ఆకలితో ఉన్న పులిలా ఉన్నాడు.
“ఏరా నువ్వు సాఫ్ట్‌వేర్ ఉద్యోగివా?” గంభీరమైన స్వరం గద్దిస్తూ అడిగింది.
“అవును! ఎవరు నువ్వు? ఏం?” చిన్నగా వణుకుతూ వచ్చింది సమాధానం.
“ఏదీ ఐడీ కార్డు చూపించు?”
మఫ్టీలో ఉన్న పోలీసేమోనని వెంటనే జేబులో నుండి తీసి చూపించాడు మధు.
ఆ ఐడీ కార్డు చూసాకా అతను చుట్టూ చూసాడు. కనుచూపు మేరలో ఎవరూ కనిపించడం లేదు. వెంటనే చేతిలో ఉన్న సంచిలోంచి నెలవంక లాంటి వస్తువేదో బయటకు లాగాడు…
అది కొడవలిలా అనిపించి తేరుకునే లోపే మధు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఆ అపరిచితుడు ఆ ట్యాగ్‌ని లాక్కుని చీకటిలో కలిసిపోయాడు.
***************************
“ఈ పేపర్ వాళ్ళని, టీవీ వాళ్ళని తట్టుకోలేకపోతున్నాం సార్! సందు ఇవ్వకపోయినా దూసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు అంత ప్రముఖమైన వార్తలేమీ లేకపోవడంతో మన చుట్టూ తిరుగుతున్నారు” అసహనంగా అన్నాడు కానిస్టేబుల్ కనకయ్య ఎదురుగా ఉన్న ఎస్‌ఐ ప్రవీణ్‌తో.
“వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే బురదలో రాయేసినట్టు అవుతుంది.” కూల్‌గా చెప్పాడు ప్రవీణ్
“ఇంతకీ ఎవడయ్యా వీడు. ఒకడా లేక ఏదన్నా ముఠానా?! ఓన్లీ సాఫ్ట్‌వేర్ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు.” ఫైల్‌ని చేతిలోకి తీసుకుని చూడటం మొదలుపెట్టాడు.
ఇంతకు ముందు ఎస్‌ఐ బదిలీ అయ్యి ఆ స్థానంలోకి ప్రవీణ్ వచ్చాడు.
“అందరూ కంఠాలు తెగి చచ్చిపోయినవాళ్ళే. వాళ్ల దగ్గర ఉన్న డబ్బు, విలువైన వస్తువులు ఏమీ మాయమవ్వడం లేదు. ఆఫీస్ ట్యాగ్‌లు మాత్రం మాయమవుతున్నాయి…” అంటూ ఫైల్లోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు.
“ఓ మై గాడ్! ఒకవేళ ఐటీ ఇండస్ట్రీస్‌ని టార్గెట్ చెయ్యడానికి ఏ పాకిస్తాన్ వాళ్ళో పన్నాగం పన్నారేమో? ఎందుకన్నా మంచిది మాయమైన అన్ని ట్యాగ్‌లను ఆ కంపెనీలకు చెప్పి నిర్వీర్యం చెయ్యించండి” గట్టిగా అరిచాడు ఏదో సాధించేసానన్న ఉత్సాహంలో.
***************************
నర్సాపురంలో చిట్టివరం గ్రామం. సర్పంచ్ రామయ్య గారి ఇంటిని విషాదం ఆవరించింది. పెద్దాయన మంచం పట్టినప్పటి నుండి ఇంట్లో పరిస్థితులు ఒక్కసారి మారిపోయాయి.
రామయ్యకు మంచి పేరుంది. ఆయనలాగే ఆయన కొడుకు రాజేశ్ అన్నా ఆ ఊరివాళ్లకు అంతే అభిమానం. తాను రైతైనా తన కొడుకుని మంచి ఇంజనీరుని చెయ్యాలని ఆయన కోరిక. చిన్నప్పటి నుండీ రాజేశ్ చదువులో ముందున్నా ఖాళీ దొరికితే వ్యవసాయం పనులు చూసేవాడు. కొడుకు అగ్రికల్చర్ చదువుతాననేసరికి నోట మాటరాలేదు పెద్దాయనకి. ఇష్టం లేకపోయినా కొడుకు మాటని కాదనలేక అగ్రికల్చర్ లో జాయిన్ చేయించాడు. చదువు బాగానే సాగింది. ఆ ఊరులోనే ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసాడు.
అకస్మాత్తుగా పెద్దాయన ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది. చివరికి క్యాన్సర్ అని డాక్టర్లు తేల్చారు. పెద్దాయన తన చివరి కోరికగా తన కొడుకు పెళ్ళి చూడాలని ఉందని చెప్పారు. రాజేశ్ సరేనన్నాడు. మేమమామ కూతురు పట్నంలో చదువుకుంటుంది. చిన్నప్పుటి నుండీ వాళ్ళ ఇద్దరినీ మొగుడూ పెళ్ళాలు అని పెద్దోళ్ళు ఏడిపించేవారు. మరదలు పెద్ద చదువుకి పట్నం వెళ్ళాకా తనతో చనువు తగ్గిపోయింది. మావయ్య కూతురుకి ఫోన్ చేసి మాట్లాడాడు. పల్లెటూరి బావని చేసుకోవడం తనకి ఇష్టం లేదని చెప్పింది. ఊళ్ళో పరిస్థితి చెప్పి కూతురిని బతిమాలడానికి ప్రయత్నించాడు. కానీ లాభం లేదు.
చిన్నాన ఇక లాభం లేదనుకుని బయట సంబంధాలు చూడటం మెదలెట్టారు. ఊళ్ళో వాళ్ల కులం అమ్మాయిలందరూ పట్నంలో చదువుతున్నారు. కొందరు అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. దగ్గరి బందువులకి సంబంధం గురించి చెబితే వాళ్ళ అమ్మాయిలను కనుక్కుని చెబుతామన్నారు.
ఎవరి దగ్గర నుండీ సమాధానం రావడంలేదు. ఇక ఆలస్యం చెయ్యకూడదని చిన్నాన వెళ్ళి అందరినీ మళ్ళీ కలిసాడు. అందరి నుండీ ఒకేరకమైన సమాధానం. “అమ్మాయికి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అబ్బాయి కావాలంటండి. ఎవరినన్నా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితేనే తనకి చెప్పమంది. ఇప్పుడు పిల్లల సంగతి తెలుసు కదండి. మన మాట వినడంలేదు. ఏమీ అనుకోకండి” లేదా “అమ్మాయికి కంప్యూటర్ ఫీల్డ్‌లో ఉన్నవాడు కావాలని చెప్పింది” . అందరి దగ్గర నుండీ దాదాపు ఇవే సమాధానాలు. చిన్నాన కూడా రాజేశ్ వెళ్ళాడు. తను గుమ్మం బయటే ఉన్నా అన్నీ వింటున్నాడు.
రోజులు గడుస్తున్నాయి. చివరి రోజులలో పెద్దాయన ఒకసారి రాజేశ్‌ని పిలిచారు. “నాన్నా నీ పెళ్ళి చూసే భాగ్యం లేకుండాపోయిందిరా.” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. అందరి వంక అయోమయంగా చూడటం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాడు. తండ్రి కంట నీటి పొర చూడ్డం అదే మొదటిసారి. తను జీవిత గమనంలో ఎంచుకున్న దారి తప్పా! అన్నం పెట్టే చేయిని ఎవరూ అందుకోరా?! ఇలాంటి ఆలోచనలతో రాజేశ్ మెదడు బలహీనపడిపోతుంది.
రామయ్య గారు చనిపోయాకా రాజేశ్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఎవ్వరితోనూ కలవకుండా తన గదిలోనే ఉండిపోయేవాడు. అప్పుడప్పుడూ చిన్నగా ఏడుపు వినిపించేది. ఒకరోజు తెల్లవారుజామున రాజేశ్ ఎవ్వరికి చెప్పకుండా మాయమైపోయాడు. ఊరంతా వెతికినా కనిపించలేదు. పెద్దాయన పోవడం, కొడుకు మాయమవ్వడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి ముంచేసాయి.
***************************
“సార్! రిపోర్టర్ వచ్చాడు. ఆ హత్యల విషయంలో పురోగతి తెలుసుకోవాలంట” అంటూ ప్రవీణ్ చెవిలోకి వార్తను వదిలాడు కానిస్టేబుల్.
“ఇంకేముంది. మనం అప్రమత్తత అయ్యాం కదా. ఓ నెల నుండి వాడు చడీ చప్పుడూ చెయ్యడం లేదు. ఎక్కడికన్నా పారిపోయాడో లేక చచ్చాడో తెలియలేదు. అంతా మన మంచికే జరిగినట్టుంది.” ప్రవీణ్ నిట్టూరుస్తూ బదులిచ్చాడు.
“మరి రమ్మననా ఆ రిపోర్టర్ని?”
“ఆ రమ్మను!”
వచ్చిన రిపోర్టరుకి ఆ కేసు దాదాపు పూర్తయ్యినట్టు; ఉగ్రవాదులు ఏవో పథకం పన్నినట్టు; తాము సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని అప్రమత్తం చేసినట్టు; ఆ ఉగ్రవాదులు ఇక లాభం లేదనుకుని ఉడాయించినట్టు ప్రవీణ్ చెప్పాడు .
***************************
హైదరాబాద్ నగర శివార్లలో, చెట్లు ఏపుగా పెరిగి అడివిలా ఉన్న ప్రాంతం…
తాటాకులతో కట్టిన చిన్న పాకలో..
నేల మీద పడుకుని మూలుగుతున్నాడు రాజేశ్. పెరిగిన గడ్డంతో చూస్తే అతన్ని ఎవరూ పోల్చుకోలేనంతగా మారిపోయాడు.
నెల క్రితం ఒకడిని చంపుతున్నప్పుడు ఎదురు తిరిగాడు. వాడు బాగా బలంతో ఉన్నాడు; ఆ ప్రయత్నంలో రాజేశ్‌కి బాగా గాయాలయ్యాయి. అప్పటి నుండి ఆ తోపు దాటి భయటకు రావడం లేదు. తను ఎప్పుడు కోలుకుని మేధం మళ్ళీ మొదలు పెడదామా అన్న కసి, కోపం, ద్వేషం ఆ కళ్ళతో కనిపిస్తున్నాయి. ఆవేదనతో పక్కకు చూసాడు. పాకకి ఓ మూల తను పోగుచేసిన ట్యాగ్‌లు పడి ఉన్నాయి. వాటి పక్కనే నెత్తురెండిపోయిన కొడవలి జారబెట్టి ఉంది; దాహం తీర్చే నెత్తుటి వాన చుక్క కోసం ఆబగా చూస్తున్న రాకాసి నాలుకలా…