పల్లవి:
నేను నమ్ముకున్నాను చెలియా నిను నీ ప్రేమకోసం
కానీ అమ్ముకున్నావు నువు నీ మనసుని పెళ్ళికోసం
రెండు కన్నీటి చుక్కలొదిలి మరచిపోదామని అనుకుంటే పదేపదే గుర్తుకు వస్తున్నావే
గొంతు మండేటి మందు తాగి మత్తులోపడి ఉందామంటే కలలోకీ నువ్వే వచ్చేస్తున్నావే
చరణం1:
నేను నీతో గడిపిన మధురక్షణములను నిండుగుండెలో నిధిలాగ తలచి దాచుకున్నానే
నువ్వు నవ్వే వేళల్లో వెన్నెలను చూసి కవిగా మారి కవితలెన్నిటినో రాసుకున్నానే
ఇపుడు ఇలా జరిగిందే… నీ మనసు శిలై పోయిందే…
నీ జ్ఞాపకాలే శిలువ భారమైపోయెనే, నీ లేత నవ్వులు కటిక చీకటై పోయెనే
ఈ ప్రేమెపుడూ ప్రతీ మనసుని హింసపెట్టేనని నేడు తెలిసిందిలే…
చరణం2:
మనము జంటగా నడిచిన వేల అడుగులను నువ్వు వేరొకరితో ఏడు అడుగులేసి చెరిపివేసావే
మూడుముళ్ళకై పొందికగా నీ మెడను వంచి నువ్వు నాతో చేసిన బాసలన్నిటినీ కాలరాసావే
ఇపుడు ఇలా జరిగిందే… నా బ్రతుకు బలై పోయిందే…
ఆ అగ్నిసాక్షిని నువ్వు నమ్ముకున్నావులే, నీ మనస్సాక్షిని అయ్యో చంపుకున్నావులే
నా రేపటికి చితిని పేర్చి మంట పెట్టావని మనసు పొగిలిందిలే…
మరుపు రాదేల ఈవేళ! ఇంతకు ముందు వరకూ ఏదన్నా గుర్తుకుతెచ్చుకున్నప్పుడల్లా మరుపు లేకపోవడం ఒక వరమనే అనుకునే వాడిని. ఇప్పుడు అదే ఎందుకు శాపమయ్యింది?
జీవితంలో ఒకరిని మరిచిపోవడం ఎంత కష్టమో ఇప్పుడర్థం అవుతుంది. ఎప్పుడూ కళ్ళ ముందు మెదిలే నువ్వు, గలగలమంటున్న నీ నవ్వు ఒక్కసారిగా స్మృతిపథంలో కనబడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మెదడులో ఎక్కడ నీ ఆనవాళ్ళు నిక్షిప్తమయి ఉన్నాయో తెలిసేదెలా? ఏ పరాకులో ఉన్నప్పుడు ఎడబాటుని తలచానో గానీ పై నుండి తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు?! అందుకే ఈ గుండె కోత.
నిన్ను మరచిపోలేకపోతున్నందుకు నా మీద నాకే కోపం. ఎవరెన్ని చెప్పినా ఈ మనసుకు పట్టడం లేదు. ఏకాంతంలో నీ ఆలోచనలు వైతరిణీ ఒడ్డుకు తీసుకెళ్ళి వదిలేస్తున్నాయి.
బంధాలను తెంచుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు తెలిసింది. నీలా ఒక్క క్షణంలో తనవారిని పరాయివారిలా మార్చెయ్యడం నాకు చేతకావడం లేదు. శిలని శిల్పంగా మలచింది ఎవరికో పణంగా పెట్టడం కోసమని నీకోసం కాదని తెలుసుకోలేకపోయిన అజ్ఞానిని నేను. నీ తలపుల నుండి తప్పించుకోవాలని శతవిధాల వృధా ప్రయత్నం. ఏదో ఆశ; ఒక్క నిమిషమైనా నీ ఆలోచనల నుండి దూరంగా పోవాలని.
మధుపాత్రలు ఒంటిని చిధ్రం చేస్తున్నాయి గానీ మనసును శాంతింపజెయ్యడం లేదు.
కళ్ళుమూసుకున్నంత మాత్రాన నిదుర కౌగిలించుకోదుగా!
ఇక ఈ అజాత శత్రువుకు ఈ ప్రపంచంలో ముగ్గురు శత్రువులు…
కంటి ముందు మెదిలే నీ రూపు
చెవిలో ఇల్లు కట్టుకున్న నీ మాట
ఎదలో కదలాడుతున్న నీ తలపు
వాటిని జయించగలుగుతానో… వాటి చేతిలో దహించబడతానో వేచి చూడాలంటావా!
గత నెలలో వైజాగ్ వెళ్దామని అనుకోగానే ఫ్రెండ్ దగ్గరున్న కెమెరా, ఎప్పుడో పదేళ్ళ క్రితం వెళ్ళిన తొట్లకొండ గుర్తొచ్చాయి. అప్పుడే వికీపీడియాలో ఒక కొత్త వ్యాసానికి కొబ్బరికాయ కొట్టాను. ఇంటికి వళ్ళిన మర్నాడే ( 29/04/2008 ) స్నేహితుడు నరేశ్‌కి ఫోన్ చేసి మధ్యాహ్నం అక్కడకు వెళ్దామని చెప్పాను. మావాడు చినవాల్తేరులో ఉంటున్నాడు. అక్కడి నుండి వాడి బైక్ మీద వెళ్ళాలి. కైలాసగిరి దాటగానే అది ఉంటుందని అనుకున్నాను. చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది.
బీచ్ తీరం వెంబడి భీమిలికి వెళ్ళే దారిలో కైలాసగిరి, ఋషికొండ సాగర్‌నగర్, గీతమ్స్, రిసార్ట్లు, కొత్తగా కడుతున్న రామానాయుడు స్టూడియో దాటాకా తొట్లకొండ వస్తుంది. కొండ దిగువలో ప్రవేశ ద్వారానికి కొంచెం పక్కగా టూరిజం వాళ్ళు చేసిన హడావిడి తప్ప వాళ్ల మార్కు ఎక్కడా కనిపించదు. ప్రవేశద్వారం దగ్గర ఒక సెక్యూరిటీ వ్రవేశ రుసుము తీసుకుని సంచిలో వేసుకుంటున్నడు తప్ప టిక్కెట్టు ఇవ్వడం లాంటి సంప్రదాయం లేనట్టుంది. అప్పుడు సమయం నాలుగు గంటలు దాటింది. కొంత దూరం పైకి వెళ్ళగానే కుడిపక్కన మనవాళ్ళు నిర్మించిన ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడి విగ్రహం, దాని ముందు చిన్న ఫౌంటేను కనిపిస్తాయి. దూరంగా రాతిబల్లల మీద ఏకాంతంలో మమేకమైన రెండు జంటలు తప్ప సందర్శనకు వచ్చిన వాళ్ళెవరూ కనిపించలేదు.
కోండపైకి వెళితే అక్కడ ఒక హోర్డింగ్ కనిపిస్తుంది. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం ఈ పురాతన ఆనవాళ్ళు కనిపించినప్పుడు నిర్మించినట్టు ఉన్నారు; పాతబడిపోయి ఉంది. అయినా దాని మీద ఈ ప్రదేశం గురించిన వివరాలు సరిపడా ఉన్నాయి మ్యాప్‌తో సహా. ఆ మ్యాపులో చూపించిన చైత్యాలు, స్తూపాలు, సముదాయాలు అన్నీ (అంటే శిథిలాలు) కనిపించవు. ఓ పావు భాగం మాత్రమే మనం చూడగలుగుతాం. ఇక మిగిలిన భాగంలో కొంత గార్డెనింగ్ పనులు చేస్తున్నట్టున్నారు; మిగతాదంతా చిన్నగా పెరిగిన గడ్డి, మొక్కలతో నిండి ఉంటుంది.
తీయదగిన అన్నింటినీ ఫొటోలు తీసి బీచ్ ముఖం పట్టాము.
ఇంతా చెప్పినావురా డింభకా; మరి తొట్లకొండ గురించిన చారిత్రక వివరాలు చెప్పలేదేమిరా! అని అడిగితే మాత్రం నా సమాధానం ఒకటే
ఇంగ్లీష్ వికీపీడియాలో దీని గురించి రాయడం పూర్తయ్యింది (వ్యాసం చాలా చిన్నదే అనుకోండి). దాన్ని తెలుగులోకి అనువదించి రాయడం మిగిలింది. వీలుంటే మీరే అనువదించెయ్యండి







తెలుగుబ్లాగు గుంపులో చావాకిరణ్ ఇచ్చిన ఈ వారం బ్లాగ్ విషయం మీ దగ్గరలోని గ్రంథాలయాలు కు నా స్పందన
మా కాలనీలో ఒక గ్రంథాలయం ఉండేది. అన్ని తెలుగు నవలలూ అక్కడ ఉండేవి. అవే కాకుండా అన్ని ప్రముఖ వీక్లీలు మంత్లీలు ఉండేవి. ఏదన్నా పుస్తకంలో గడి కనిపిస్తే సాధ్యమైనంతవరకూ నింపెయ్యడం అలవాటు. స్వాతి, మయీరి అక్కడ ఎక్కువ తిరగేసేవాడిని. ముఖ్యంగా తెలుగుకు సంభందించినవి కనిపిస్తే వదిలేవాడిని కాదు. రీడర్స్ డైజెస్ట్‌ని అప్పుడప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని.
ఇక మా ఇంట్లో విషయం చెప్పాలి. మా నాన్న ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెచ్చేవారు. మా కోసం చందమామ తెచ్చేవారు. నేను పత్రికను కూడా చదివేవాడిని. దానిలో నేను పూర్తిగా చదివిన సీరియల్ రావినూతల సువర్ణాకన్నన్ రాసిన మంజీరనాదం. అది నాకు ఫ్యాంటసీగా అనిపించి చివరిదాకా చదివేసాను. ఏదన్నా సీరియల్ పూర్తైతే ఆ సీరియల్ ఉన్న అన్ని వారాల పేజీలనీ మా నాన్న ఒక పుస్తకంగా బైండ్ చేసేవారు ( ఆయన పనిచేసే కంపేనీలో మన చేపలను, రొయ్యలను, మామిడిపండ్లను విదేశాలకు ఎగుమతి చెయ్యడానికి మైనపు పూత పూసిన అట్టపెట్టెలు తయారయ్యేవి; మా పుస్తకాలకు అట్టలు వేసుకోవడం మాకు అప్పుడు బాగా సులువు అయ్యేది ). దాదాపు ఓ పాతిక దాకా పోగయ్యాయి. వాటిని మా కాలనీలో ఉండేవాళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు. వాటిలో చివరికి ఏమీ మిగలలేదనుకోండి!
చందమామ చదివీ చదివి బోర్ కొట్టింది. ఎక్కడో బాలమిత్ర, బాలజ్యోతి, బొమ్మరిల్లు కనిపించాయి. అన్నీ నచ్చేసాయి. ఇక నేనే పుస్తకం కొనుక్కుంటానని చెప్పి డబ్బులు అడిగి తీసుకుని మరికొంత పోగేసి బాలమిత్ర, బాలజ్యోతి కొనేవాడిని. కొనడానికి దూరం వెళ్ళవలసి వచ్చినా ఆలోచించేవాడిని కాదు. ఒకచోట లేకపోతే ఇంకోచోట వెతికి కొనుక్కునేవాడిని.
అంతే కాకుండా ప్రతీ ఆదివారం ఈనాడు తెచ్చేవారు. ఈనాడు మేగజైన్‌లో పదకేళీ నింపడం అప్పుడు ఓ సరదా. మేగజైన్ చివర కనిపించే బూదరాజు గారి తెలుగు పదాలకి సంభందించిన శీర్షికని వదిలేవాడిని కాదు. ఇంట్లో పుస్తకాలు ఎక్కువై అమ్మెయ్యవలసి వస్తే ఆ పేజీలు చింపి దాచేవాడిని. ఇప్పటికీ అవి నా దగ్గర ఉన్నాయి.
మా పక్కింట్లో ఉండే ఆంటీ ఎంతెలా నవళ్ళు చదువుతారంటే; పవర్ పోయినా కొవ్వొత్తి ముందు చేతిలో పుస్తకంతో కనిపించేవారు. ఆవిడ దగ్గరనుండి కాంచనద్వీపం, కీర్తికిరీటాలు, దాంపత్యవనం, కన్యాశుల్కం ఉంటే దసరా సెలవులకి తెచ్చుకుని చదివాను.
నర్శిపట్నంలో డిప్లొమా చదివే రోజుల్లో లైబ్రరీకి వెళ్ళడం తక్కువే కానీ విపులని మాత్రం క్రమం తప్పకుండా కొని చదివేవాడిని. ఇంజనీరింగ్‌లో అది కూడా లేదు.
నేను చివరిసారిగా చదివిన పూర్తి నవల ది డావిన్సీ కోడ్.
స్మృతిలో మెదిలినవి ఇలా రాసేసాను…