గత నెలలో వైజాగ్ వెళ్దామని అనుకోగానే ఫ్రెండ్ దగ్గరున్న కెమెరా, ఎప్పుడో పదేళ్ళ క్రితం వెళ్ళిన తొట్లకొండ గుర్తొచ్చాయి. అప్పుడే వికీపీడియాలో ఒక కొత్త వ్యాసానికి కొబ్బరికాయ కొట్టాను. ఇంటికి వళ్ళిన మర్నాడే ( 29/04/2008 ) స్నేహితుడు నరేశ్‌కి ఫోన్ చేసి మధ్యాహ్నం అక్కడకు వెళ్దామని చెప్పాను. మావాడు చినవాల్తేరులో ఉంటున్నాడు. అక్కడి నుండి వాడి బైక్ మీద వెళ్ళాలి. కైలాసగిరి దాటగానే అది ఉంటుందని అనుకున్నాను. చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది.

బీచ్ తీరం వెంబడి భీమిలికి వెళ్ళే దారిలో కైలాసగిరి, ఋషికొండ సాగర్‌నగర్, గీతమ్స్, రిసార్ట్లు, కొత్తగా కడుతున్న రామానాయుడు స్టూడియో దాటాకా తొట్లకొండ వస్తుంది. కొండ దిగువలో ప్రవేశ ద్వారానికి కొంచెం పక్కగా టూరిజం వాళ్ళు చేసిన హడావిడి తప్ప వాళ్ల మార్కు ఎక్కడా కనిపించదు. ప్రవేశద్వారం దగ్గర ఒక సెక్యూరిటీ వ్రవేశ రుసుము తీసుకుని సంచిలో వేసుకుంటున్నడు తప్ప టిక్కెట్టు ఇవ్వడం లాంటి సంప్రదాయం లేనట్టుంది. అప్పుడు సమయం నాలుగు గంటలు దాటింది. కొంత దూరం పైకి వెళ్ళగానే కుడిపక్కన మనవాళ్ళు నిర్మించిన ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడి విగ్రహం, దాని ముందు చిన్న ఫౌంటేను కనిపిస్తాయి. దూరంగా రాతిబల్లల మీద ఏకాంతంలో మమేకమైన రెండు జంటలు తప్ప సందర్శనకు వచ్చిన వాళ్ళెవరూ కనిపించలేదు.

కోండపైకి వెళితే అక్కడ ఒక హోర్డింగ్ కనిపిస్తుంది. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం ఈ పురాతన ఆనవాళ్ళు కనిపించినప్పుడు నిర్మించినట్టు ఉన్నారు; పాతబడిపోయి ఉంది. అయినా దాని మీద ఈ ప్రదేశం గురించిన వివరాలు సరిపడా ఉన్నాయి మ్యాప్‌తో సహా. ఆ మ్యాపులో చూపించిన చైత్యాలు, స్తూపాలు, సముదాయాలు అన్నీ (అంటే శిథిలాలు) కనిపించవు. ఓ పావు భాగం మాత్రమే మనం చూడగలుగుతాం. ఇక మిగిలిన భాగంలో కొంత గార్డెనింగ్ పనులు చేస్తున్నట్టున్నారు; మిగతాదంతా చిన్నగా పెరిగిన గడ్డి, మొక్కలతో నిండి ఉంటుంది.
తీయదగిన అన్నింటినీ ఫొటోలు తీసి బీచ్ ముఖం పట్టాము.

ఇంతా చెప్పినావురా డింభకా; మరి తొట్లకొండ గురించిన చారిత్రక వివరాలు చెప్పలేదేమిరా! అని అడిగితే మాత్రం నా సమాధానం ఒకటే

ఇంగ్లీష్ వికీపీడియాలో దీని గురించి రాయడం పూర్తయ్యింది (వ్యాసం చాలా చిన్నదే అనుకోండి). దాన్ని తెలుగులోకి అనువదించి రాయడం మిగిలింది. వీలుంటే మీరే అనువదించెయ్యండి 🙂

RTS Perm Link