ఎన్ని వేల వర్ణాలో…


అక్షర దోషాలు; వాక్య నిర్మాణంలో లోపాలు ఉంటే మన్నించండి

అంతవరకు తెలీదు తెలుగులో ఒక విజ్ఞాన భాండాగారం తయారవుతుందని. 2005లో గూగుల్‌లో Telugu అని టైపించి వెతుకుతున్నాను.  వచ్చిన ఫలితాలను తెరచి చూస్తుంటే ఆంగ్ల వికీపీడియా కనిపించింది. అందులో కాస్త ఎక్కువ సమాచారం ఉన్నట్టనిపించి చదువుతున్నాను. చాలా బాగుంది. ఎక్కువ సమాచారాన్నే పొందుపరిచారనిపించి ఆ పేజీ మొత్తాన్ని పరికిస్తున్నాను. వికీపుటకి ఎడమవైపున చాలా భాషలలో లంకెలు కనిపించాయి. అవేమిటో అర్థం కాలేదు. వరుసగా చూసుకుంటూపోతే తెలుగు అన్న పదం లంకెతో దర్శనమిచ్చింది. దాన్ని నొక్కితే ఓ పుట భారంగా తెరుచుకుంది (ఇంటర్‌నెట్ సెంటరు; అందునా ర్యాము, ప్రాసెసర్ వేగం తక్కువ కదా; అందులోనూ యూనీకోడ్ కాబట్టి). దానిలో తెలుగు గురించి సమాచారం బాగానే ఉంది.  దాని వెబ్‌ చిరునామా చూస్తే http://te.wikipedia.org. అప్పుడప్పుడే అంతర్జాలంలో అఆలు నేర్చుకుంటున్న నాకు ఆ చిరునామా ఏమిటో బోదపడలేదు. తర్వాత్తర్వాత తెలిసింది అది తెలుగు వికీపీడియాకు ప్రత్యేకంగా ఉన్న చిరునామా అని.

ఆపై నాకు ఉద్యోగమొచ్చిన తర్వాత కార్యాలయంలో ఖాళీ దొరికినప్పుడు మొదటగా సిరివెన్నెల సీతారామశాస్రి గురించిన వ్యాసం మొదలెట్టాను. అప్పటికి నాకు వికీపీడియా అంటే తెలుగులో సమాచారాన్ని పొందుపరిచేది అని మాత్రమే తెలుసు. అప్పటికే అంతర్జాలంలో మన పైత్యాన్ని పాండిత్యాన్నీ తెలుగు బ్లాగు రూపేణా వెళ్లగక్కుకోవచ్చని తెలిసి బ్లాగ్‌స్పాట్‌లో కొన్ని టపాలు రాసిన అనుభవముంది. ఆ అనుభవంతోనే వికీపీడియాలో నా మొదటి వ్యాసాన్ని రాసాను నా దృక్కోణంలో . అప్పటికే వికీపీడియాలో అనుభవమున్న చదువరి, వైజాసత్యలు నా వ్యాసాన్ని వికీకి అనుగుణంగా ఎలా రాయాలో సరిదిద్దుతూ సూచనలిచ్చారు. అప్పటినుండి ఏదో ఇతోధికంగా ఓ మూడేళ్ళు అదీఇదీ రాసాననుకోండి. నాకు మాత్రం బ్లాగులో రాసేకన్నా వికీపీడియాలో రాయడం ఎక్కువ సంతృప్తినిచ్చింది. అది వేరే సంగతి.

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే…

ఈ నెల అంటే జనవరి 23వ తారీఖున వికీపీడియా దశాబ్ది వేడుకను జరపాలనుకుంటున్నారు.  ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం పది గంటలకు లకడీ-కా-పూల్ లో ఉన్న హనీపాట్ కార్యాలయంలో వికీపీడియా దశాబ్ది వేడుక మరియు తెవికీ అవగాహనా సదస్సు అన్న కార్యక్రమం జరుగుతోంది. తెలుగు భాషాభిమానులు, ఔత్సాహికులు పాల్గొనాలని ఆకాంక్ష.

మరిన్ని వివరాలు e-తెలుగు సైటులో త్వరలో ప్రకటిస్తారట

RTS Perm Link

రాజీవ్ రైతు బజార్

Nov 19, 2010 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప

ఈ మధ్యనే అగౌ.శ్రీ సుబ్బిరామిరెడ్డిగారు అధిష్టానంలో అమ్మగారిని ప్రసన్నం చేసుకోడానికి తెలుగు లలిత కళాతోరణం పేరు ముందు రాజీవ్‌గాంధీ అన్న పదాన్ని తగిలిస్తే (తర్వాత ఊడిపోయిందనుకోండి) దాన్ని నూతనంగా తీర్చి దిద్దడానికి విరాళాలిస్తానని అగౌ.శ్రీ రోషయ్య గారికి విన్నవించుకున్నారు. ఆయన ఇంకేం ఆలోచించకుండా కళ్ళుమూసుకుని సై అన్నారు జీవో రూపంలో. ఈ విషయం మీడియాకెక్కడంతో గోతికాడ నక్కల్లా కాచుక్కుర్చున్న అసమ్మతులు కయ్‌కయ్‌మన్నాయి. సగటు తెలుగువాడికి తెలుగువాడినన్న ఆత్మగౌరవం గుర్తుకొచ్చినా ఈ నాయకులతో వేగలేక నిమ్మకున్నారు. ఇలా భవనాల పేర్ల నుండి జిల్లాల పేర్ల వరకూ తమతమ నాయకుల పేర్లను పెట్టుకుంటూపోతే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అందరూ ఊహించగలరు్. ఈ సంధర్భంలో నాకు స్ఫురించిన చిన్న కత…

ఒక అరాచకీయ నాయకుడు ఇలానే అధిష్టానంలో అమ్మగారిని మెప్పించి ఓ కుర్చీని సంపాదిచడం కోసం, కొండకి వెంట్రుకేస్తే ఏముందిలే అనుకుని రాష్ట్రంలో ఉన్న అన్ని రైతుబజార్‌ల పేర్లను “రాజీవ్ రైతు బజార్” అని మార్పించేసాడు. రోజులు గడుస్తున్నా ఆ యమ్మనుండి వర్తమానం రాలే! ఇంకా బాగా ఆలోచించి వెంట్రుకలన్నీ కుదించి కట్టి మరీ లాగాలనుకున్నాడు. ఈ సారి మొత్తం రైతుబజార్ లో అమ్మే అన్ని కూరగాయలకు కూడా రాజీవ్ అన్న పదాన్ని తగిలించాలని ఆదేశించాడు. ఆ జీవోని అనుసరించి అన్ని రాజీవ్ రైతు బజార్‌ల ధరల పట్టికలలో కూరగాయల పేర్ల ముందు రాజీవ్‌ని తగిలించారు. అక్కడికొచ్చే జనాలూ అలానే పిలవడం మొదలెట్టారు. ఆ రోజు రాత్రి ఆయమ్మ కలలోకి కూరగాయలన్నీ వచ్చి సంత పెట్టాయి. వాటి ఆర్తిని విన్న ఆ ఆయమ్మ మర్నాటి ఉదయాన్నే ఇక ముందు ఎవ్వరూ తన వారి పేరుని ఇలా వాడుకోవద్దని శాసించింది. ఆ దెబ్బకి ఆ నాయకుడుకి బోడి గుండు మిగిలింది అది వేరే సంగతిలెండి. ఇంతకీ ఆ కూరగాయల లబోదిబో ఎలా ఉందో తెలుసా! ఇలా….

రాజీవ్ వంకాయ్:
ఏరా బెండకాయ్! అనాదిగా కూరగాయలుగా గౌరవంగా బ్రతుకుతున్నాం కదా. ఏంటి ఈ దౌర్భాగ్యం ఇప్పుడు?!?!
రాజీవ్ బెండకాయ్: ఏంచేస్తాం చెప్పు. ఈ మాయదారి ప్రభుత్వం మట్టిగరుచుకుపోయి ఎవరన్నా మళ్ళీ మన పేర్లు మారిస్తే బాగుండు. అంత వరకు ఈ బాధ భరించాల్సిందే !!!
రాజీవ్ దోండకాయ్: మీకేం పర్లేదు. ఈ జనాలు నన్ను ఈ పేరుతో పిలిచినప్పుడల్లా ఎందుకు దొండకాయలా పుట్టానురా దేవుడా అని సిగ్గుతో చచ్చిపోతున్నాను 🙁

RTS Perm Link

ఈ రోజు (e-)తెలుగు వెలుగులు

Dec 20, 2008 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప

ఈ రోజు హైదరాబాదులో జరిగిన పుస్తక ప్రదర్శనలో e-తెలుగు ఏర్పాటుచేసిన స్టాలులో మధ్యాహ్నం నుండి నేను కూడా ఉన్నాను. మేము కరపత్రాలు పంచాము. చాలా మంది ఆశక్తి చూపించారు. వాళ్లలో కొందరు కంప్యూటర్‌లో తెలుగు కనిపించాలంటే డబ్బిచ్చి ఏదన్నా సాఫ్ట్‌వేర్ కొనుక్కోవాలేమో, దానికోసమే మేము అక్కడ ఉన్నామేమో అనే అపోహలో ఉన్నారు. మేము వాళ్ల సందేహాలు తీరుస్తూవచ్చాం. తెలుగు బ్లాగరులు కూడా ఎక్కువే వచ్చారు (అంటే నా దృష్టిలో ప్రతినెలా సమావేశానికి వచ్చేవారికన్నా ఎక్కువ అని). సాయంత్రం ఆరు గంటలు దాటాకా e-తెలుగు సంఘం ప్రదర్శన ప్రారంభమయ్యింది. ప్రదర్శనలో భాగంగా కంప్యూటర్‌లో తెలుగు ఎనేబుల్ చెయ్యడం ఎలా? బ్లాగంటే ఏమిటీ? బ్లాగుని ఎలా సృష్టించుకోవాలి? ప్రస్తుతం ఉన్న కొన్ని బ్లాగుల వివరాలు, వికీపీడియా గురించి, ఈమాట, పొద్దు లాంటి వెబ్ పత్రికల గురించి, వివిధ వెబ్‌సైట్ల స్థానికీకరణ గురించి చెప్పి ఆ విషయాలనే వీడియో రూపంలో చూపించడం జరిగింది. ఒకటో రెండో టీవీ ఛానళ్ల వాళ్ళు కార్యక్రమాన్ని వీడియో తీసుకున్నారు. పత్రికల వాళ్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పనుల హడావిడిలో పడి అక్కడకు వచ్చిన మిగిలిన బ్లాగరులతో మాట్లాడటం కుదరలేదు. ముఖ్యంగా అక్కడకు వచ్చిన కొందరు మహిళా బ్లాగరుల పేర్లు తెలియదు 🙁 . అందుకే ఈ జాబులో ఎవరి పేరూ ప్రస్తావించకుండా కేవలం బ్లాగర్లు అని సంభోదిస్తున్నాను. ఎవరూ ఏమీ అనుకోకండేం. ఇక్కడ నా అనుభవాలను, అనుభూతులను ఒక బ్లాగరుగా రాసున్నానంతే. మరిన్ని వివరాలకు త్వరలో e-తెలుగు నుండి వచ్చే టపాలో చూడండి.

మరో రెండు ముఖ్య విశయాలు:

* నిన్ననే రావు వేమూరి గారి బ్లాగులో తెలుగు ఎందుకు? అన్న టపాలో “మనకి నిజానికి కావలసినది ప్రాచీన హోదా కాదు – ఆధునిక హోదా కావాలి” అన్న మరువమ్ము*ని చదివాను.  e-తెలుగు ప్రదర్శనలో మాట్లాడుతూ ఈ మాటని కూడా  మనవాళ్లు ప్రస్తావించారు. కార్యక్రమం అయ్య్యాక స్టాలు వద్దకి సినీరచయిత జే.కే భారవి గారు వచ్చి “ఆధునిక హోదా రావాలి అని మీరన్న మాట అదిరింది” అని సంతోషిస్తూ వెళ్ళారు.

* ప్రముఖ ఇంద్రజాలకులు, మానసిక వైద్య నిపుణులు బీవీ పట్టాభిరాం గారు వచ్చారు. ఆయనకి e-తెలుగు గురించి, ఇంటర్నెట్లో తెలుగు గురించి తోటి బ్లాగరులు వివరించారు.

కొసమెరుపు:స్టాలుకి వచ్చిన ఒకాయనకి కరపత్రం ఇచ్చాను. ఆయన కూడా ఉన్న ( ఆరు సంవత్సరాలు ఉండొచ్చు ) పిల్లాడికి కూడా ఇచ్చాను. ఆ పిల్లాడు పత్రంలోని తెలుగుని చూసి “డాడీ నాకు తమిళ్ రాదు” అంటూ తన తండ్రి వంక అయోయంగా చూసాడు. నాకప్పుడు తలని గోడకేసి “పేడ పేడ” అంటూ కొట్టుకోవాలనిపించింది.

మరువమ్ము: ఎవరన్నా ఏదన్నా ఒకమాట చెప్పారనుకోండి; ఆ మాట మనకి చాలా నచ్చిందనుకోండి; ఆకట్టుకున్నదనుకోండి; బాగా గుర్తుండేలా ఉందనుకోండి, ఆ మాటకి మరువమ్ము అని నా సొంత ప్రయోగం.

వేదిక మీద e-తెలుగు సభ్యులు/బ్లాగరులు
వేదిక మీద e-తెలుగు సభ్యులు/బ్లాగరులు

e-తెలుగు స్టాలు ముందర సభ్యులు/బ్లాగర్లు
e-తెలుగు స్టాలు ముందర సభ్యులు/బ్లాగర్లు

e-తెలుగు స్టాలులో సభ్యులు/బ్లాగర్లు
e-తెలుగు స్టాలులో సభ్యులు/బ్లాగర్లు

e-తెలుగు బ్యానరు
e-తెలుగు బ్యానరు

e-తెలుగు బ్యానరు
e-తెలుగు బ్యానరు

బీవీ పట్టాభిరాం గారికి వివరిస్తున్న సభ్యులు/బ్లాగర్లు
బీవీ పట్టాభిరాం గారికి వివరిస్తున్న సభ్యులు/బ్లాగర్లు

స్టాలు బయట సభ్యులు/బ్లాగర్లు
స్టాలు బయట సభ్యులు/బ్లాగర్లు

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం


Warning: fsockopen(): php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: fsockopen(): unable to connect to udp://whois.happyarts.net:8000 (php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known) in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: stream_set_timeout() expects parameter 1 to be resource, boolean given in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 125