అక్షర దోషాలు; వాక్య నిర్మాణంలో లోపాలు ఉంటే మన్నించండి

అంతవరకు తెలీదు తెలుగులో ఒక విజ్ఞాన భాండాగారం తయారవుతుందని. 2005లో గూగుల్‌లో Telugu అని టైపించి వెతుకుతున్నాను.  వచ్చిన ఫలితాలను తెరచి చూస్తుంటే ఆంగ్ల వికీపీడియా కనిపించింది. అందులో కాస్త ఎక్కువ సమాచారం ఉన్నట్టనిపించి చదువుతున్నాను. చాలా బాగుంది. ఎక్కువ సమాచారాన్నే పొందుపరిచారనిపించి ఆ పేజీ మొత్తాన్ని పరికిస్తున్నాను. వికీపుటకి ఎడమవైపున చాలా భాషలలో లంకెలు కనిపించాయి. అవేమిటో అర్థం కాలేదు. వరుసగా చూసుకుంటూపోతే తెలుగు అన్న పదం లంకెతో దర్శనమిచ్చింది. దాన్ని నొక్కితే ఓ పుట భారంగా తెరుచుకుంది (ఇంటర్‌నెట్ సెంటరు; అందునా ర్యాము, ప్రాసెసర్ వేగం తక్కువ కదా; అందులోనూ యూనీకోడ్ కాబట్టి). దానిలో తెలుగు గురించి సమాచారం బాగానే ఉంది.  దాని వెబ్‌ చిరునామా చూస్తే http://te.wikipedia.org. అప్పుడప్పుడే అంతర్జాలంలో అఆలు నేర్చుకుంటున్న నాకు ఆ చిరునామా ఏమిటో బోదపడలేదు. తర్వాత్తర్వాత తెలిసింది అది తెలుగు వికీపీడియాకు ప్రత్యేకంగా ఉన్న చిరునామా అని.

ఆపై నాకు ఉద్యోగమొచ్చిన తర్వాత కార్యాలయంలో ఖాళీ దొరికినప్పుడు మొదటగా సిరివెన్నెల సీతారామశాస్రి గురించిన వ్యాసం మొదలెట్టాను. అప్పటికి నాకు వికీపీడియా అంటే తెలుగులో సమాచారాన్ని పొందుపరిచేది అని మాత్రమే తెలుసు. అప్పటికే అంతర్జాలంలో మన పైత్యాన్ని పాండిత్యాన్నీ తెలుగు బ్లాగు రూపేణా వెళ్లగక్కుకోవచ్చని తెలిసి బ్లాగ్‌స్పాట్‌లో కొన్ని టపాలు రాసిన అనుభవముంది. ఆ అనుభవంతోనే వికీపీడియాలో నా మొదటి వ్యాసాన్ని రాసాను నా దృక్కోణంలో . అప్పటికే వికీపీడియాలో అనుభవమున్న చదువరి, వైజాసత్యలు నా వ్యాసాన్ని వికీకి అనుగుణంగా ఎలా రాయాలో సరిదిద్దుతూ సూచనలిచ్చారు. అప్పటినుండి ఏదో ఇతోధికంగా ఓ మూడేళ్ళు అదీఇదీ రాసాననుకోండి. నాకు మాత్రం బ్లాగులో రాసేకన్నా వికీపీడియాలో రాయడం ఎక్కువ సంతృప్తినిచ్చింది. అది వేరే సంగతి.

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే…

ఈ నెల అంటే జనవరి 23వ తారీఖున వికీపీడియా దశాబ్ది వేడుకను జరపాలనుకుంటున్నారు.  ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం పది గంటలకు లకడీ-కా-పూల్ లో ఉన్న హనీపాట్ కార్యాలయంలో వికీపీడియా దశాబ్ది వేడుక మరియు తెవికీ అవగాహనా సదస్సు అన్న కార్యక్రమం జరుగుతోంది. తెలుగు భాషాభిమానులు, ఔత్సాహికులు పాల్గొనాలని ఆకాంక్ష.

మరిన్ని వివరాలు e-తెలుగు సైటులో త్వరలో ప్రకటిస్తారట

RTS Perm Link