అందమె ఆనందం అని అంటారు. ముఖ్యంగా ఎవరినన్నా అందమైన ఆడవారిని చూసినప్పుడు ఈ మాట గుర్తుకొస్తుంది. నేనూ ఇలానే అనుకునేవాడిని. కొన్ని సార్లు ఏ టీవీలోనో, సినిమాలోనో అందాలను చూసి దాసోహమైన క్షణాలూ ఉన్నాయి. ఒకసారి ఈ టపాలో స్నేహితుడి మనసులో మాటకి తన అభిప్రాయంగా అమ్మాయిలో చూడాల్సింది వ్యక్తిత్వం, అత్మాభిమానం అని జేప్స్ అనుకుంట రాసారు. అప్పుడు నేను ఇలా సినిమా కబుర్లు చెప్పేవారు తమ ఇళ్ళల్లో పూల మొక్కలకు బదులు బ్రహ్మజెముడు, తుమ్మ చెట్లను పెంచుకుంటారేమోనని సరదాగా అనుకున్నాను. ఏదైనా అనుభవమైతే గానీ విషయం ఒంటబట్టని నాలాంటి వాళ్లకి కాలమే తాయితీగా సమాధానం చెబుతుంటుంది. చెప్పేసింది కూడా.
మనకు పరిచయం కాని వారిని మనం చూసినప్పుడు ముందుగా వాళ్ల రూపం మన మీద ప్రభావం చూపుతుంది. అది సహజాతమైనదని నేననుకుంటాను. వాళ్లతో పరిచయ భాగ్యం కలిగి కాస్త చనువు పెరిగిన తర్వాత గానీ వాళ్ళేంటో మనకు తెలియదు. అప్పుడు మాత్రమే మనం ఓ మామూలు రూపంలో ఒదిగిన అనూహ్య మానసిక సౌందర్యాన్ని చూడగలం (వీళ్ళు మన వ్యక్తిగత జీవితంలో ఒక భాగమైతే ఎంత బాగుండునో అనిపిస్తుంది), అప్పుడు మాత్రమే ఓ కోమలిలో దాగిన కాఠిన్య హృదయాన్నో లేదా పసిడి వన్నెచాటున పొంచి ఉన్న నీలినీడలనో చూడగలం (వీళ్ల గురించి అసలు ఆలోచించకూడదనిపిస్తుంది).
మంచుపొర అడ్డు ఉన్నన్నాళ్ళూ కళ్ళ ముందు ఉన్నది ఎడారో.. పూలవనమో.. సంద్రమో.. తెలియదు కదా! ఇదీ అంతే.
చివరిమాట: ఇంతకు ముందు నేను రాసిన నిజసౌందర్యం ఊహించి రాసింది; కానీ ఇది మాత్రం అనుభవైక వేద్యమైనదే.