మరుపు రాదేల ఈవేళ! ఇంతకు ముందు వరకూ ఏదన్నా గుర్తుకుతెచ్చుకున్నప్పుడల్లా మరుపు లేకపోవడం ఒక వరమనే అనుకునే వాడిని. ఇప్పుడు అదే ఎందుకు శాపమయ్యింది?
జీవితంలో ఒకరిని మరిచిపోవడం ఎంత కష్టమో ఇప్పుడర్థం అవుతుంది. ఎప్పుడూ కళ్ళ ముందు మెదిలే నువ్వు, గలగలమంటున్న నీ నవ్వు ఒక్కసారిగా స్మృతిపథంలో కనబడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మెదడులో ఎక్కడ నీ ఆనవాళ్ళు నిక్షిప్తమయి ఉన్నాయో తెలిసేదెలా? ఏ పరాకులో ఉన్నప్పుడు ఎడబాటుని తలచానో గానీ పై నుండి తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు?! అందుకే ఈ గుండె కోత.
నిన్ను మరచిపోలేకపోతున్నందుకు నా మీద నాకే కోపం. ఎవరెన్ని చెప్పినా ఈ మనసుకు పట్టడం లేదు. ఏకాంతంలో నీ ఆలోచనలు వైతరిణీ ఒడ్డుకు తీసుకెళ్ళి వదిలేస్తున్నాయి.
బంధాలను తెంచుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు తెలిసింది. నీలా ఒక్క క్షణంలో తనవారిని పరాయివారిలా మార్చెయ్యడం నాకు చేతకావడం లేదు. శిలని శిల్పంగా మలచింది ఎవరికో పణంగా పెట్టడం కోసమని నీకోసం కాదని తెలుసుకోలేకపోయిన అజ్ఞానిని నేను. నీ తలపుల నుండి తప్పించుకోవాలని శతవిధాల వృధా ప్రయత్నం. ఏదో ఆశ; ఒక్క నిమిషమైనా నీ ఆలోచనల నుండి దూరంగా పోవాలని.
మధుపాత్రలు ఒంటిని చిధ్రం చేస్తున్నాయి గానీ మనసును శాంతింపజెయ్యడం లేదు.
కళ్ళుమూసుకున్నంత మాత్రాన నిదుర కౌగిలించుకోదుగా!
ఇక ఈ అజాత శత్రువుకు ఈ ప్రపంచంలో ముగ్గురు శత్రువులు…
కంటి ముందు మెదిలే నీ రూపు
చెవిలో ఇల్లు కట్టుకున్న నీ మాట
ఎదలో కదలాడుతున్న నీ తలపు
వాటిని జయించగలుగుతానో… వాటి చేతిలో దహించబడతానో వేచి చూడాలంటావా!