ఈ రోజు హైదరాబాదులో జరిగిన పుస్తక ప్రదర్శనలో e-తెలుగు ఏర్పాటుచేసిన స్టాలులో మధ్యాహ్నం నుండి నేను కూడా ఉన్నాను. మేము కరపత్రాలు పంచాము. చాలా మంది ఆశక్తి చూపించారు. వాళ్లలో కొందరు కంప్యూటర్‌లో తెలుగు కనిపించాలంటే డబ్బిచ్చి ఏదన్నా సాఫ్ట్‌వేర్ కొనుక్కోవాలేమో, దానికోసమే మేము అక్కడ ఉన్నామేమో అనే అపోహలో ఉన్నారు. మేము వాళ్ల సందేహాలు తీరుస్తూవచ్చాం. తెలుగు బ్లాగరులు కూడా ఎక్కువే వచ్చారు (అంటే నా దృష్టిలో ప్రతినెలా సమావేశానికి వచ్చేవారికన్నా ఎక్కువ అని). సాయంత్రం ఆరు గంటలు దాటాకా e-తెలుగు సంఘం ప్రదర్శన ప్రారంభమయ్యింది. ప్రదర్శనలో భాగంగా కంప్యూటర్‌లో తెలుగు ఎనేబుల్ చెయ్యడం ఎలా? బ్లాగంటే ఏమిటీ? బ్లాగుని ఎలా సృష్టించుకోవాలి? ప్రస్తుతం ఉన్న కొన్ని బ్లాగుల వివరాలు, వికీపీడియా గురించి, ఈమాట, పొద్దు లాంటి వెబ్ పత్రికల గురించి, వివిధ వెబ్‌సైట్ల స్థానికీకరణ గురించి చెప్పి ఆ విషయాలనే వీడియో రూపంలో చూపించడం జరిగింది. ఒకటో రెండో టీవీ ఛానళ్ల వాళ్ళు కార్యక్రమాన్ని వీడియో తీసుకున్నారు. పత్రికల వాళ్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పనుల హడావిడిలో పడి అక్కడకు వచ్చిన మిగిలిన బ్లాగరులతో మాట్లాడటం కుదరలేదు. ముఖ్యంగా అక్కడకు వచ్చిన కొందరు మహిళా బ్లాగరుల పేర్లు తెలియదు 🙁 . అందుకే ఈ జాబులో ఎవరి పేరూ ప్రస్తావించకుండా కేవలం బ్లాగర్లు అని సంభోదిస్తున్నాను. ఎవరూ ఏమీ అనుకోకండేం. ఇక్కడ నా అనుభవాలను, అనుభూతులను ఒక బ్లాగరుగా రాసున్నానంతే. మరిన్ని వివరాలకు త్వరలో e-తెలుగు నుండి వచ్చే టపాలో చూడండి.

మరో రెండు ముఖ్య విశయాలు:

* నిన్ననే రావు వేమూరి గారి బ్లాగులో తెలుగు ఎందుకు? అన్న టపాలో “మనకి నిజానికి కావలసినది ప్రాచీన హోదా కాదు – ఆధునిక హోదా కావాలి” అన్న మరువమ్ము*ని చదివాను.  e-తెలుగు ప్రదర్శనలో మాట్లాడుతూ ఈ మాటని కూడా  మనవాళ్లు ప్రస్తావించారు. కార్యక్రమం అయ్య్యాక స్టాలు వద్దకి సినీరచయిత జే.కే భారవి గారు వచ్చి “ఆధునిక హోదా రావాలి అని మీరన్న మాట అదిరింది” అని సంతోషిస్తూ వెళ్ళారు.

* ప్రముఖ ఇంద్రజాలకులు, మానసిక వైద్య నిపుణులు బీవీ పట్టాభిరాం గారు వచ్చారు. ఆయనకి e-తెలుగు గురించి, ఇంటర్నెట్లో తెలుగు గురించి తోటి బ్లాగరులు వివరించారు.

కొసమెరుపు:స్టాలుకి వచ్చిన ఒకాయనకి కరపత్రం ఇచ్చాను. ఆయన కూడా ఉన్న ( ఆరు సంవత్సరాలు ఉండొచ్చు ) పిల్లాడికి కూడా ఇచ్చాను. ఆ పిల్లాడు పత్రంలోని తెలుగుని చూసి “డాడీ నాకు తమిళ్ రాదు” అంటూ తన తండ్రి వంక అయోయంగా చూసాడు. నాకప్పుడు తలని గోడకేసి “పేడ పేడ” అంటూ కొట్టుకోవాలనిపించింది.

మరువమ్ము: ఎవరన్నా ఏదన్నా ఒకమాట చెప్పారనుకోండి; ఆ మాట మనకి చాలా నచ్చిందనుకోండి; ఆకట్టుకున్నదనుకోండి; బాగా గుర్తుండేలా ఉందనుకోండి, ఆ మాటకి మరువమ్ము అని నా సొంత ప్రయోగం.

వేదిక మీద e-తెలుగు సభ్యులు/బ్లాగరులు
వేదిక మీద e-తెలుగు సభ్యులు/బ్లాగరులు

e-తెలుగు స్టాలు ముందర సభ్యులు/బ్లాగర్లు
e-తెలుగు స్టాలు ముందర సభ్యులు/బ్లాగర్లు

e-తెలుగు స్టాలులో సభ్యులు/బ్లాగర్లు
e-తెలుగు స్టాలులో సభ్యులు/బ్లాగర్లు

e-తెలుగు బ్యానరు
e-తెలుగు బ్యానరు

e-తెలుగు బ్యానరు
e-తెలుగు బ్యానరు

బీవీ పట్టాభిరాం గారికి వివరిస్తున్న సభ్యులు/బ్లాగర్లు
బీవీ పట్టాభిరాం గారికి వివరిస్తున్న సభ్యులు/బ్లాగర్లు

స్టాలు బయట సభ్యులు/బ్లాగర్లు
స్టాలు బయట సభ్యులు/బ్లాగర్లు

RTS Perm Link